Technology
సంచార్ సాధీ యాప్: పౌరుల చేతివేళ్లపై టెలికాం సాధికారత
పారదర్శకమైన, సురక్షితమైన మొబైల్ సేవలు పెంపొందించేందుకు 2025 జనవరిలో ప్రారంభం
Posted On:
02 DEC 2025 8:12PM
కీలకాంశాలు
- 2025 జనవరి 17న ప్రారంభమైన నాటి నుంచి సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను 1.4 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
- దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న దాదాపు 42 లక్షల మొబైల్‌లను విజయవంతంగా బ్లాక్ చేయడమైంది.
- దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న దాదాపు 26 లక్షల మొబైల్ ఫోన్‌లను గుర్తించి 7.23 లక్షల ఫోన్‌లను తిరిగి అప్పగించడమైంది.
- ఇది ప్రజాస్వామ్యయుతమైన, పూర్తిగా స్వచ్ఛందమైన, వినియోగదారుల ఆధారిత, గోప్యతకు ప్రాధాన్యతను ఇచ్చే యాప్. వినియోగదారుల అనుమతితో మాత్రమే యాప్ యాక్టివేట్ అవుతుంది.
సంచార్ సాథీ: భారత్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలకు సకాలంలో ప్రతిస్పందన
100 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం వ్యవస్థగా ఆవిర్భవించింది. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు బ్యాంకింగ్, వినోదం, ఈ-అభ్యాసం, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు పొందడానికి ప్రవేశమార్గాలుగా పనిచేస్తున్నాయి. తద్వారా ఇప్పుడు మొబైల్ భద్రత అనేది అత్యంత ముఖ్యమైనదిగా మారింది.

పెరుగుతున్న సైబర్ ముప్పులు మొబైల్ వినియోగదారుల రక్షణను కీలకమైన జాతీయ ఆందోళనగా మార్చాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ప్రకారం.. సైబర్ నేరాల ఘటనలు 2023లో 15,92,917 ఉండగా, 2024లో 20,41,360కు పెరిగాయి. జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో డిజిటల్ అరెస్ట్‌లు, వాటికి సంబంధించిన సైబర్ నేరాలే 2024లో మొత్తం 1,23,672 నమోదయ్యాయి. 2025లో ఫిబ్రవరి నాటికే 17,718 కేసులు నమోదయ్యాయి.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) సంచార్ సాథి మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. బలమైన భద్రతా లక్షణాలు, మోసాల గురించి నివేదించే సామర్థ్యాలను నేరుగా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు అందించగలిగే పౌరుల కోసం రూపొందిన సాధనం ఇది. ఐడెంటిటీ చోరీ, నకిలీ కేవైసీ, పరికరాల దొంగతనం, బ్యాంకింగ్ మోసం, ఇతర సైబర్ నేరాల నుంచి మరింత అనుకూలమైన, ప్రయాణంలో రక్షణను అందించడం ద్వారా ఈ యాప్ ఇప్పటికే ఉన్న సంచార్ సాథి పోర్టల్‌కు అదనపు బలాన్ని అందిస్తుంది. ఈ ప్రయత్నాన్ని బలోపేతం చేసేందుకు గానూ భారత్‌లోని వినియోగదారుల మొబైల్‌లలో సంచార్ సాథీ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మొబైల్ తయారీదారులు, దిగుమతిదారులకు 2025 నవంబర్ 28న డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాలు జారీ చేసింది.
పౌరులకు ప్రాధాన్యతను ఇచ్చే, గోప్యతను రక్షణ కల్పించే వేదిక
సంచార్ సాథీ యాప్ పౌరులకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ప్రతి అడుగులో వారి గోప్యతను రక్షిస్తుంది. వినియోగదారుల అనుమతితోనే పనిచేస్తుంది. యాక్టివేషన్, వినియోగంపై వినియోగదారులకు పూర్తి నియంత్రణను ఇస్తుంది.
- వినియోగదారు రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే యాక్టివేట్ అవుతుంది.
- వినియోగదారు ఎప్పుడైనా ఈ యాప్‌ను యాక్టివేట్, డీయాక్టివేట్ లేదా డిలీట్ చేసుకోవచ్చు.
- గోప్యత విషయంలో రాజీ పడకుండా భారతదేశ సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు రూపొందిన యాప్ ఇది.
సంచార్ సాథీ: ప్రభావం, స్పష్టమైన ఫలితాలు
సంచార్ సాథీ ప్రారంభించినప్పటి నుంచి స్పష్టమైన, స్థిరమైన ప్రభావాన్ని చూపించింది. ఈ వేదిక దేశవ్యాప్తంగా వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ మోసాలను తగ్గించింది.
ఈ వేదిక సాధించిన కీలక విజయాలు:
- పోర్టల్‌కు(https://sancharsaathi.gov.in/) 21.5 కోట్లకు పైగా విజిట్స్ ఉన్నాయి.
- యాప్ 1.4 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి.
- దాదాపు 42 లక్షల దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లు విజయవంతంగా బ్లాక్ అయ్యాయి.
- పౌరులు “నా నెంబర్ కాదు” అని తెలిపిన తర్వాత 1.43 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ చేయడమైంది.
- 26 లక్షల దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను గుర్తించి, 7.23 లక్షల ఫోన్లను యజమానులకు తిరిగి ఇవ్వడమైంది.
- పౌరుల ఫిర్యాదుల మేరకు 40.96 మోసపూరిత కనెక్షన్లను తొలగించడమైంది.
- మోసాలకు సంబంధించిన 6.2 ఐఎంఈఐ(ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ)లను బ్లాక్ చేయడమైంది.
- రూ.475 కోట్ల మేర నష్టాలను ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ నివారించింది.
ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్(ఎఫ్ఆర్ఐ)
ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్(ఎఫ్ఆర్ఐ)ను టెలికమ్యూనికేషన్ శాఖ(డీఓటీ) అభివృద్ధి చేసింది. ఇది ఆర్థిక నేరాల ముప్పు స్థాయిని బట్టి మొబైల్ నెంబర్లను మధ్యస్థ, అధిక, అత్యధిక ముప్పు ఉండే వాటిగా వర్గీకరిస్తుంది. అధిక ముప్పు ఉండే నెంబర్లకు సంబంధించి వినియోగదారుల రక్షణ చర్యలను అదనంగా తీసుకునేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సహాయపడుతుంది.
నిర్దిష్ట చర్యల ద్వారా టెలికాం మోసాలను సంచార్ సాథీ మరింత తగ్గించింది. అనేక వేదికలలో ప్రత్యక్ష ఫలితాలను అందించింది. ఎఫ్ఆర్ఐ ద్వారా 3 కోట్లకుపైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లను రద్దయ్యాయి. 3.19 లక్షల మొబైల్‌లు బ్లాక్ అయ్యాయి. 16.97 లక్షల వాట్సాప్ ఖాతాలు డిజేబుల్ అయ్యాయి. 20 వేలకు పైగా బల్క్ ఎంఎస్ఎస్‌లు పంపే వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడమైంది. ఈ చర్యలు టెలికాం సంబంధిత మోసాలను గణనీయంగా అరికట్టడంతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల భద్రతను పెంచాయి.

సులభంగా ఉపయోగించగల సాధనాలు, ముఖ్యమైన భద్రతా ఫీచర్‌లను తక్షణం వినియోగించగల సౌలభ్యాన్ని పౌరులకు అందించడం ద్వారా సంచార్ సాథీ మొబైల్ యాప్ భారత్‌లో పెరుగుతున్న సైబర్ నేరాల సవాళ్లకు సమయానుకూలమైన, ప్రభావవంతమైన ప్రతిస్పందనగా నిలుస్తోంది. ఈ యాప్ దేశవ్యాప్తంగా అందరికీ హిందీతో పాటు 21 ఇతర ప్రాంతీయ భాషలలో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 1.4 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటింది.
సంచార్ సాథీ అందించే పౌర-కేంద్రీకృత సేవలు
సంచార్ సాథీ మొబైల్ యాప్ పోర్టల్ అందించే భద్రత, ధ్రువీకరణ, మోసాలపై ఫిర్యాదు చేసే ఫీచర్లు అన్ని పౌర-కేంద్రీకృత సేవలను నేరుగా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు తీసుకువస్తుంది.

సంచార్ సాథీలో ఉండే ఫీచర్లు -
చక్షు - కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్లను - ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్ స్కామ్‌లపై ఫిర్యాదు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ముందస్తు ఫిర్యాదు సాధనం డీఓటీకి నకిలీ కేవైసీ, ఐడెంటిటీ - థెఫ్ట్ కేసులను పర్యవేక్షించడానికి, వేగంగా చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే అయాచిత వాణిజ్య కమ్యూనికేషన్(యూసీసీ)పై ఫిర్యాదు చేయడానికి పౌరులను ప్రోత్సహిస్తుంది.

ఐఎంఈఐ ట్రాకింగ్, బ్లాకింగ్ - భారతదేశంలో ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన ఫోన్‌లను ట్రాక్ చేయడానికి, బ్లాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న ఫోన్‌లను గుర్తించడానికి పోలీసులకు సహాయపడుతుంది. ఈ ఫోన్‌లు బ్లాక్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడంతో పాటు క్లోనింగ్ ప్రయత్నాలను అడ్డుకుంటుంది.
మొబైల్ కనెక్షన్ల సంఖ్యను తెలుసుకునే అవకాశం - ఇది సంచార్ సాథీ యాప్‌లోని మరో ముఖ్యమైన ఫీచర్. ఏవైనా అనుమానాస్పద కనెక్షన్‌లు, నకిలీ కేవైసీ వివరాలను ఉపయోగించి సృష్టించే వాటిని గుర్తించినప్పుడు వినియోగదారులు ఫిర్యాదు చేసి, బ్లాక్ చేయించవచ్చు.
నో యువర్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ జెన్యూన్‌నెస్ - కొనుగోలు చేసిన మొబైల్ సరైనదేనా అని గుర్తించేందుకు సులువైన మార్గాన్ని అందిస్తుంది.
భారతీయ నెంబర్లతో వచ్చే అంతర్జాతీయ కాల్స్‌పై ఫిర్యాదు - +91(కంట్రీ కోడ్ తర్వాత 10 అంకెలు)తో భారతదేశ కాల్స్‌గా మారువేషంలో వచ్చే అంతర్జాతీయ కాల్స్‌పై ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి కాల్స్ విదేశాల్లోని అక్రమ టెలికాం ఏర్పాట్ల నుంచి వస్తాయి.
నో యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ - పిన్ కోడ్, చిరునామా లేదా ఐఎస్ఎపీ పేరు ద్వారా దేశవ్యాప్తంగా వైర్‌లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను తెలుసుకోవడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది.
డిజిటల్ ఐడెంటిటీని సురక్షితం చేసుకోవడానికి, టెలికాం మోసాలను ఎదుర్కోవడానికి పౌరులకు శక్తిని ఇవ్వడం ద్వారా టెలికాం భద్రతను సంచార్ సాథీ బలోపేతం చేస్తోంది. వినియోగదారులు స్పామ్, మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను ఒకే క్లిక్ ద్వారా ఫిర్యాదు చేసే వీలు కల్పించడం ద్వారా ట్రాయ్ టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫెరెన్స్ రెగ్యులేషన్స్(టీసీసీసీపీఆర్) అమలుకు కూడా సంచార్ సాథీ సహాయపడుతుంది.
సైబర్ క్రైమ్ అంటే "కంప్యూటర్, కమ్యూనికేషన్ సాధనం లేదా కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి నేరం చేయడం లేదా నేరానికి సహకరించే ఏదైనా చట్టవిరుద్ధమైన చర్య".
వినియోగదారుకు సాధికారత
పాలనలో ప్రజల భాగస్వామ్యం అనే జన్ భాగీదారీ ఆలోచనకు సంచార్ సాథీ యాప్ ఉదాహరణగా నిలుస్తోంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నివారించడంలో వినియోగదారుల ఫిర్యాదులు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ఫిర్యాదులపై డీఓటీ వేగంగా స్పందిస్తోంది. పోర్టల్‌లోని స్టేటస్ డ్యాష్‌బోర్డులు ప్రజలకు పారదర్శకతను అందిస్తున్నాయి.
గోప్యత, భద్రత
వినియోగదారుల డేటా, గోప్యతను కాపాడుతూనే టెలికాం భద్రతను బలోపేతం చేయడానికి ఈ యాప్ రూపొందించడమైంది. ఇది భారత్‌లో సైబర్ నేరాలు, ఈ-కామర్స్, డేటా ప్రైవసీకి సంబంధించి ప్రాథమిక చట్టంగా ఉన్న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000(ఐటీ) చట్టానికి అనుగుణంగా పనిచేస్తుంది. హ్యాకింగ్, డేటా చోరీ వంటి నేరాలకు శిక్ష విధించే చట్టపరమైన వ్యవస్థ ఉంది.

వినియోగదారు గోప్యతకు సంచార్ సాథీ యాప్ ప్రాధాన్యత ఇస్తుంది. సేవలు అందించడానికి అవసరమయ్యే కనీస వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే ఈ యాప్ సేకరిస్తుంది. ఇది వాణిజ్య మార్కెటింగ్ కోసం ప్రొఫైల్‌లను సృష్టించదు. వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీలతో పంచుకోదు. అనధికారిక యాక్సెస్, డేటా దుర్వినియోగం నుంచి రక్షణ కల్పిస్తుంది. చట్టబద్ధంగా అవసరమైనప్పుడు మాత్రమే చట్టాన్ని అమలు చేసే సంస్థలతో పరిమితంగా మాత్రమే డేటా పంచుకోవడం జరుగుతుంది.
సంచార్ సాథీ గోప్యతా పద్ధతులు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం-2023(డీపీడీపీ చట్టం)కి అనుగుణంగా ఉంటాయి. ఇది వ్యక్తిగత నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నొక్కి చెబుతుంది. డేటా సేకరణను చట్టబద్ధమైన ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేస్తుంది. డేటా సేకరణను తగ్గించడంతో పాటు స్పష్టమైన అనుమతి అవసరమయ్యే విధానాలను అమలు చేస్తుంది.
ముగింపు
భారత్‌లో పెరుగుతున్న టెలికాం వ్యవస్థను సురక్షితంగా మార్చడానికి సంచార్ సాథీ యాప్ ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించింది. చోరీకి గురై, పోగొట్టుకున్న ఫోన్‌లను బ్లాక్ చేయడం, మోసాలను నివేదించడం, మొబైల్ కనెక్షన్‌లను ధ్రువీకరించుకోవడం, వినియోగదారుల గోప్యతను రక్షించడం వంటి సేవలను ఇది ఏకీకృతవం చేస్తుంది. తద్వారా పౌరులు తమ డిజిటల్ ఐడెంటిటీని సులభంగా రక్షించుకునే అవకాశాన్ని ఇది ఇస్తుంది. వివిధ భాషల్లో అందుబాటులో ఉండటం, సైబర్ చట్టాలకు అనుగుణంగా ఉండటం, బలమైన గోప్యతా రక్షణలు దీనిని అందరికీ అందుబాటులో ఉండేలా, విశ్వసనీయమైనది మార్చాయి. సంచార్ సాథీ వినియోగం పెరుగుతుండటంతో ఇది కేవలం టెలికాం మోసాలను తగ్గించడమే కాకుండా డిజిటల్ విశ్వాసాన్ని పెంపొందించేందుకు, భారతీయ మొబైల్ వినియోగదారులకు సురక్షితమైన, పౌర-కేంద్రీకృత భవిష్యత్‌ను రూపొందించడానికి దోహదపడుతోంది.
References
Ministry of Communications
Ministry of Electronics and Information Technology
Ministry of Home Affairs
Ministry of Science and Technology
Ministry of Information and Broadcasting
Click here to see in PDF
(Explainer ID: 156306)
आगंतुक पटल : 50
Provide suggestions / comments