Security
రక్షణ ఆత్మనిర్భరత: ఉత్పత్తి, ఎగుమతుల్లో రికార్డు
Posted On:
20 NOV 2025 10:19AM
కీలకాంశాలు
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఇప్పటివరకు రూ.1.54 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తిని నమోదు చేసింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1,27,434 కోట్లుగా నమోదయ్యింది. ఇది 2014-15లో నమోదైన రూ.46,429 కోట్ల కంటే 174% అధికం.
- 16,000 ఎంఎస్ఎంఈలు దేశీయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ గేమ్‌చేంజర్లుగా ఎదుగుతున్నాయి.
- 462 సంస్థలకు 788 పారిశ్రామిక లైసెన్సులు జారీ అయ్యాయి.
- భారతదేశ రక్షణ ఎగుమతులు 2014లో రూ.1,000 కోట్ల లోపే ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.23,622 కోట్లకి పెరిగాయి.
భారత దేశీయ రక్షణ ఉత్పత్తులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,27,434 కోట్లుగా నమోదయ్యాయి. 2014-15లో నమోదైన రూ.46,429 కోట్ల కంటే ఇది 174% అధికం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకువస్తున్న ఆత్మనిర్భరత విధానాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా భారతదేశ సైనిక పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం చేస్తున్న భారీ కేటాయింపులు, ఇస్తున్న విధానపరమైన మద్దతు ఫలితంగా రక్షణరంగ ఉత్పత్తి భారీగా పెరిగింది. 2013-14లో రూ.2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2025-26లో రూ.6.81 లక్షల కోట్లకు పెరగడం దేశ సైనిక మౌలిక సదుపాయాల బలోపేతం పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన విధానపరమైన సంస్కరణలు, సులభతర వాణిజ్య విధానాలు, స్వదేశీయతపై వ్యూహాత్మక దృష్టితో పరిశ్రమలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏటేటా స్థిరంగా వృద్ధిని నమోదు చేశాయి. భారత్ ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా సహా సుమారు 100 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. మొత్తం ఉత్పత్తిలో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు(డీపీఎస్‌యూ), ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వాటా సుమారు 77% కాగా, ప్రైవేటు రంగం వాటా 23%. ప్రైవేటు రంగ వాటా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21% ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23 శాతానికి పెరగడం దేశ రక్షణ వ్యవస్థలో పెరుగుతున్న ప్రైవేటు రంగ పాత్రను ప్రతిబింబిస్తోంది. ఫలితంగా ఎగుమతులు సైతం 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 12.04% లేదా రూ.2,539 కోట్ల వృద్ధి నమోదు చేసింది. 2029 కల్లా రక్షణ రంగ తయారీ రూ.3 లక్షల కోట్లకు పెంచాలని, ఎగుమతులు రూ.50,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతూనే ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశ పాత్రను బలోపేతం చేస్తోంది. దీంతో భారతదేశ రక్షణ ఉత్పత్తుల తయారీ రంగం రానున్న సంవత్సరాల్లో నిరంతర వృద్ధి సాధించేందుకు, దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చేందుకు సిద్ధంగా ఉంది.

విధానపరమైన సంస్కరణలకు ముందు ఉన్న సవాళ్లు
గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు చేపట్టకముందు భారతదేశ రక్షణ రంగం గణనీయంగా అడ్డంకులను ఎదుర్కొంది. కొనుగోలు ప్రక్రియలు చాలా నెమ్మదిగా ఉండటం వల్ల కీలకమైన సామర్థ్య అంతరాలు తలెత్తేవి. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయేవి. ప్రపంచ అంతరాయాల సమయంలో బలహీనతలు బహిర్గతమయ్యేవి. గతంలో పరిమితులతో కూడిన విధానాల వల్ల ప్రైవేటు రంగ భాగస్వామ్యం పరిమితంగా ఉండేది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. సాంకేతికత ప్రాప్యత లోపించేది. రక్షణ ఎగుమతులు కూడా అంతగా ఉండేవి కావు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రూ.686 కోట్లు మాత్రమే. దీంతో ప్రపంచ రక్షణరంగ విపణిలో భారత్ ప్రాథమికంగా తయారీదారుగా కంటే ఎక్కువగా దిగుమతిదారుగానే ఉండేది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి & ఎగుమతి ప్రోత్సాహక విధానం(డీపీఈపీపీ) ముసాయిదా ఆర్ అండ్ డీ, ఆవిష్కరణలు, ఐపీ సృష్టిని ప్రోత్సహించడం, పరిశ్రమ-విద్యా సంబంధాలకు ఊతమివ్వడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, ఎగుమతి లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా భారతదేశాన్ని అగ్రశ్రేణి ప్రపంచ రక్షణ రంగ తయారీదారుగా నిలపడానికి దిక్సూచిగా నిలుస్తోంది. ఈ విధానం ఉత్పత్తి, సాంకేతికత, మార్కెట్ ప్రాప్యతను ఒకే రోడ్‌మ్యాప్‌లో కలుపుతుంది.
సంస్కరణల లక్ష్యాలు
ఆత్మనిర్భరత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా స్వావలంబన, ప్రపంచంతో పోటీపడే రక్షణ రంగ పరిశ్రమను నిర్మించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రారంభించింది. వీటి ముఖ్య లక్ష్యాలు:
డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్(డీఏపీ) క్రమబద్ధీకరణ, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతులతో సేకరణ ప్రక్రియ వేగవంతమైంది.
సానుకూల స్వదేశీకరణ జాబితాల ద్వారా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, ఆటోమెట్ మార్గంలో 74% వరకు, ప్రభుత్వ మార్గంలో 100% వరకు ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకృతం చేయడం, రూ.1 లక్ష కోట్లతో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ(ఆర్‌డీఐ) పథకాన్ని చేపట్టడం, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం.

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, డోర్నియర్ విమానాలు, చేతక్ హెలికాప్టర్లు, ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు, తేలికపాటి టార్పెడోలు వంటి వాటిని ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తూ సరళీకృత లైసెన్స్ జారీ విధానం ద్వారా రక్షణ ఎగుమతులు పెంచడం.
2025ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించడం ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాలు సాయుధ దళాలను సాంకేతికంగా అభివృద్ధి చేస్తూ, మల్టీ-డొమైన్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్‌ల సామర్థ్యం గల పోరాటానికి సిద్ధంగా ఉండే శక్తిని మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదే సమయంలో రక్షణ ఉత్పత్తిని రూ.3 లక్షల కోట్లకు విస్తరించడం, 2029 నాటికి రూ.50,000 కోట్ల ఎగుమతి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ) సంస్కరణలు
ఆత్మనిర్భరత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా రక్షణ సేకరణ వ్యవస్థను మార్చడానికి భారత ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలను చేపట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ) 2020, డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్(డీపీఎం) 2025 జంట చట్రాలు కలిసి ఈ మార్పునకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మూలధనం, ఆదాయ సేకరణలలో వేగం, పారదర్శకత, ఆవిష్కరణ, స్వావలంబనకు దోహదపడతాయి.

డీఏపీ 2020: స్వావలంబనతో కూడిన కొనుగోలుకు వ్యూహాత్మక మార్గదర్శి
డిఫెన్స్ అక్విజీషన్ ప్రొసీజర్(డీఏపీ) 2020 అనేది ఒక పరివర్తనాత్మక విధాన చట్రంగా ఉంటుంది. ప్రపంచంలో పోటీపడేలా దేశీయ రక్షణ పరిశ్రమను పెంపొందించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను ఆధునికీకరించడానికి ఇది నిబంధనల పుస్తకంగా, వ్యూహాత్మక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఆలస్యాలు, దిగుమతులపై ఆధారపడటం వంటి సవాళ్లను అధిగమించేందుకు రూపొందిన ఈ విధానం పూర్తి స్పష్టతతో ఉంటుంది. కొనుగోలు ప్రక్రియలోని ప్రతి దశలో దేశీయ ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది.
పునర్నిర్వచించిన కొనుగోలు ప్రక్రియ కీలక లక్షణాలు:
ఇండియా ఫస్ట్ విధానం: భారత-ఐడీడీఎం(దేశీయంగా డిజైన్ చేసిన, అభివృద్ధి చేసిన, తయారుచేసిన విభాగానికి చెందినవి కొనుగోలు చేయడానికి ఈ విధానం ప్రాధాన్యం ఇస్తుంది. దేశీయంగా డిజైన్ చేసిన, అభివృద్ధి చేసిన, తయారు చేసిన వాటిని ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తోంది.
పారదర్శకతతో కూడిన వేగం: సులభతర అనుమతి విధానాలు, డిజిటల్ పద్ధతులను చేర్చడం కొనుగోలు ప్రక్రియలో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు వేగంగా జరిగేందుకు దోహదపడుతోంది.
రేపటి కోసం సాంకేతికత: బహుళ-రంగాల కార్యకలాపాలకు వీలుగా ఏఐ, రోబోటిక్స్, సైబర్, అంతరిక్ష, అధునాతన యుద్ధ వ్యవస్థ వంటి అధునాతన సాంకేతికతల వినియోగానికి వీలు కల్పించే నిర్దిష్ట నిబంధనలు డీఏపీ 2020లో ఉన్నాయి.
పరిశ్రమ భాగస్వామ్యం: ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సెలెన్స్(ఐడీఈఎక్స్), లైసెన్స్ నిబంధనల సడలింపుల ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలతో కూడిన సహకార వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
సులభతర అనుమతులు: క్రమబద్ధీకరించిన విధానాలు, కొనుగోలు విభాగాలను శక్తివంతం చేయడం ద్వారా విధానపరమైన అడ్డంకులను తొలగించడంతో సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతోంది.
డీపీఎం 2025: రెవెన్యూ సేకరణ క్రమబద్ధీకరణ
డీఏపీ చట్రంపై నిర్మితమైన డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్(డీపీఎం) 2025ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2025 అక్టోబర్‌లో ప్రారంభించారు. విధానాలను సులభతరం చేయడంతో, పనితీరులో ఏకరూపతను తీసుకురావడంలో ఇది కీలక అడుగు. సైనిక బలగాలకు కార్యాచరణ సన్నద్ధత కోసం దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన వస్తువులు, సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. 2025 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన డీపీఎం 2025 పరిశ్రమ అనుకూల సంస్కరణలను పరిచయం చేసింది. దేశీయ సంస్థల నుంచి భాగస్వామ్యం, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడటం ఈ సంస్కరణల లక్ష్యం.
కీలక అంశాలు: సులభతరం వాణిజ్యం, అన్ని సైనిక దళాలు, రక్షణ శాఖ సంస్థల్లో ఆలస్యాలను తగ్గించడానికి అవసరమైన ప్రమాణీకరించిన విధానాలను అందిస్తుంది. పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఆవిష్కరణ, దేశీయతకు సహకరిస్తుంది. నిర్ణయయోగ్యమైన నష్టాలను తగ్గించడం(దేశీయ ప్రాజెక్టులకు వారానికి 0.1%), ఐదేళ్ల వరకు దేశీయ ఉత్పత్తులకు కచ్చితమైన ఆర్డర్లు ఇవ్వడం, గతంలోలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ నుంచి కాలం చెల్లిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరాన్ని తొలగించడం వంటి పరిశ్రమ అనుకూల నిబంధనలు. డిజిటల్ వినియోగం, పారదర్శకత వల్ల ఈ-కొనుగోలు ప్రక్రియలను మెరుగపర్చడంతో పాటు డేటా ఆధారిత పర్యవేక్షణకు వీలవుతుంది.
భవిష్యత్తు కోసం సమీకృత కొనుగోలు చట్రం
డీఏపీ 2020, డీపీఎం 2025 కలిసి ఒక ఏకీకృత, భవిష్యత్-దృక్పథంతో కూడిన కొనుగోలు విధానాన్ని అందిస్తున్నాయి. ఇవి భారతేదశ రక్షణ సేకరణ ప్రక్రియను కార్యచరణ సంసిద్ధత, పారిశ్రామిక స్వయం సమృద్ధి అనే జంట లక్ష్యాలతో అనుసంధానిస్తాయి. మూలధనం, రాబడి సేకరణల ఏకీకరణ, సాయుధ దళాలకు కీలకమైన వ్యవస్థల వేగవంతమైన సరఫరాకు దోహదపడటంతో పాటు ఆవిష్కరణలు, తయారీ, ఎగుమతులను పెంచడానికి భారతీయ పరిశ్రమలను శక్తివంతం చేస్తుంది. ఈ సమగ్ర కొనుగోలు చట్రం భారతదేశాన్ని రక్షణ రంగ ఉత్పత్తి, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి, వ్యూహాత్మక రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తోంది.
దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంచడం
1. ఆధారపడటం నుంచి ఆధిపత్యం వైపు
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యధికంగా రూ.1.54 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులను నిమోదు చేసింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ శక్తికి నిదర్శనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం పయనిస్తోంది. ఇదే సమయంలో 2029 నాటికి రూ.3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రపంచ రక్షణ తయారీకి కేంద్రంగా మారుతోంది.

2. రక్షణ రంగ పారిశ్రామిక కారిడార్లు - కొత్త వృద్ధి మార్గాలు
ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్(యూపీడీఐసీ), తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్(టీఎన్‌డీఐసీ) అనే రెండు కారిడార్లు ఈ మార్పునకు జీవనాధారాలు. ఇవి రెండు కలిపి 2025 అక్టోబర్ నాటికి రూ.9,145 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి. 289 ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా రూ.66,423 కోట్ల అవకాశాలను అందుకున్నాయి.
3. రక్షణ వ్యవస్థ విస్తరణ
భారతదేశ రక్షణ రంగ విప్లవాన్ని నడిపించే అగ్రశ్రేణి సంస్థగా డీఆర్‌డీవో మారింది. డీప్-టెక్, అత్యాధునిక ప్రాజెక్టుల కోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్(టీడీఎఫ్) పథకం, సాంకేతికత బదిలీలు, 15 రక్షణ పరిశ్రమ-విద్యాసంస్థల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(డీఐఏ-సీఓఈ) కింద రూ.500 కోట్ల నిధి ఏర్పాటుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదంచారు. పనితీరులో స్వయం ప్రతిపత్తిని పెంచడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, దేశ రక్షణ సన్నద్ధతలో స్వయం సమృద్ధి పెంచడానికి ఆర్డినెన్స్ కర్మాగారాల పునర్వ్యవస్థీకరణ, ఏడు రక్షణ సంస్థల ఏర్పాటు జరిగింది. ఇకపై ప్రైవేటు రంగం కేవలం ప్రేక్షకపాత్ర పోషించదు. డ్రోన్‌ల నుంచి ఏవియానిక్స్, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వరకు పెద్ద, చిన్న సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఇదే సమయంలో 16,000 ఎంఎస్ఎంఈలు గేమ్ చేంజర్లుగా మారుతున్నాయి. భారతదేశ రక్షణ తయారీ ఇకపై కేవలం దిగ్గజ సంస్థలకే పరిమితం కాదని, ప్రతి ఆవిష్కర్తకు ఇందులో పాత్ర ఉంటుందని నిరూపిస్తున్నాయి.
4. కొత్త పరిధులు తెరవడం - పెట్టుబడి అవకాశాలు
రక్షణ రంగ పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. 462 సంస్థలకు 788 పారిశ్రామిక లైసెన్సులు జారీ చేయడం ద్వారా రక్షణ రంగ ఉత్పత్తిలో భారతీయ పరిశ్రమ భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. ఎగుమతుల అనుమతులకు పూర్తి డిజిటల్ పోర్టల్ ద్వారా రక్షణ రంగ ఉత్పత్తి విభాగం వ్యాపారాన్ని క్రమబద్ధీకరించింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,762 అనుమతులు లభించాయి. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో దక్కిన 1,507 అనుమతులతో పోలిస్తే 16.92% వార్షిక వృద్ధి నమోదుచేసింది. ఎగుమతిదారుల సంఖ్య కూడా 17.4% పెరిగింది. సరళీకృత ఎఫ్‌డీఐ నిబంధనలు, పీఎల్ఐ పథకం, ఆధునిక రక్షణ కారిడార్లు కలిసి దేశీయ ఆవిష్కర్తలకు, ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.
2024-25లో రక్షణ శాఖ రికార్డు స్థాయిలో రూ.2,09,050 కోట్ల విలువైన 193 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో కుదిరిన ఒప్పందాల్లో ఇదే అత్యధికం. వీటిలో రూ.1,68,922 కోట్ల విలువైన 177 ఒప్పందాలు దేశీయ పరిశ్రమలకు ఇచ్చింది. ఇది భారతీయ తయారీదారుల వైపు నిర్ణయాత్మక మార్పును, బలపడిన స్వదేశీ రక్షణ వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. స్థానికంగా కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ రంగంలో ఉపాధి కల్పన, సాంకేతిక ఆవిష్కరణలను సైతం ప్రేరేపించింది.
రక్షణ కొనుగోళ్లు: స్వయంసమృద్ధికి దోహదం

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద భారతదేశ రక్షణ కొనుగోలు ముఖచిత్రం పరివర్తనాత్మక వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయి బడ్జెట్ కేటాయింపులు, సరళీకృత విధానాలు, సేవల్లో స్వదేశీకరణపై దృష్టి సారించడమే ఇందుకు కారణం. ఇప్పుడు కనీసం 65% రక్షణ పరికరాలు దేశీయంగా తయారవుతున్నాయి. గతంలో 65-70% దిగుమతులపై ఆధారపడే పరిస్థితుల నుంచి ఇది గణనీయమైన మార్పు. రక్షణ రంగంలో భారతదేశ స్వయంసమృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది. భారతదేశం అవలంభిస్తున్న విధానంలో ప్రతి కొనుగోలు జాతీయ పరిశ్రమను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కార్యాచరణ సంసిద్ధను పెంపొందిస్తోంది.
పెరుగుతున్న కొనుగోలు బడ్జెట్, దశాబ్దపు వృద్ధి
రక్షణ మంత్రి నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గత కొన్నేళ్లుగా దేశీయంగా రికార్డు స్థాయిలో కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి సాయుధ దళాల ఆధునికీకరణ, స్వదేశీకరణ కీలక ప్రాధాన్యతగా కొనసాగుతోంది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ సేవల కోసం క్యాపిటల్ హెడ్ కింద రూ.1.72 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన వాస్తవ వ్యయం కంటే 20.33% ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాలతో పోలిస్తే 9.40% ఎక్కువ.
2025 మార్చిలో రూ.54,000 కోట్లతో ఎనిమిది క్యాపిటల్ అక్విజిషన్ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది. టీ-90 ట్యాంకులకు 1,350 హెచ్‌పీ ఇంజిన్లు, దేశీయంగా అభివృద్ధి చేసిన వరుణాస్త్ర టార్పెడోలు, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ & కంట్రోల్ (ఏఈడబ్ల్యూ&సీ) వ్యవస్థలు ఇందులో భాగం.
2025 జూలైలో దాదాపు రూ.1.05 లక్షల కోట్లతో 10 క్యాపిటల్ అక్విజిషన్ ప్రతిపాదనలను డీఏసీ ఆమోదించింది. ఆయుధంతో కూడిన రికవరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థ, త్రివిధ దళాలకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్‌వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సర్‌ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు, మూర్డ్ మైన్స్, మైన్ కౌంటర్ మెజర్ వెసెల్స్, సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్, సబ్‌మెర్సిబుల్ అటోనోమస్ వెసెల్స్ వంటివి ఇందులో భాగం. ఆమోదం పొందిన ఇవన్నీ దేశీయంగా తయారైనవి. ఇండియా-ఐబీబీఎం విభాగం కింద కొనుగోలు చేసినవి. ఇది దేశీయంగా రూపొందించిన, అభివృద్ధి చేసిన, తయారుచేసిన వ్యవస్థలను ప్రదర్శిస్తోంది.
2025 ఆగస్టులో సైనిక దళాల కార్యచరణ సామర్థ్యాల పెంపునకు రూ.67,000 కోట్ల విలువైన ప్రతిపాదనలను డీఏసీ ఆమోదించింది. సైన్యంలోని బీఎంపీల కోసం రాత్రిపూట వీక్షణకు థర్మల్ ఇమేజ్ ఆధారిత యంత్రాలు, కాంపాక్ట్ అటోనమస్ సర్ఫేస్ క్రాఫ్ట్, బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థలు, నావికాదళం కోసం బరాక్-1 అధునికీకరణ, వాయుసేన కోసం సాక్షం/స్పైడర్ల ఆధునికీకరణతో కూడిన మౌంటైన్ రాడార్లు ఇందులో భాగం. త్రివిధ దళాలకు దేశీయ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్(ఎంఏఎల్ఈ) ఆర్‌పీఈలను, సీ-17, సీ-130జే, ఎస్-400 వ్యవస్థల నిర్వహణ సహకారానికి డీఏసీ ఆమోదం తెలిపింది.
ఇదే ఊపును కొనసాగిస్తూ 2025 అక్టోబర్‌లో సైన్యం, నావికాదళం, వాయుసేన కోసం దాదాపు రూ.79,000 కోట్లతో కొనుగోలు ప్రతిపాదనలను డీఏసీ ఆమోదించింది. ఇది జాతీయ రక్షణకు సంబంధించి అన్ని విభాగాల్లో సామర్థ్యాలు పెంపొందించుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం కోసం ప్రభుత్వ స్థిర నిబద్ధతను చాటుతోంది. నావికాదళం కోసం డీఆర్డీవోకు చెందిన నావల్ సైన్స్ & టెక్నాలజీ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి టార్పెడోలు(ఏఎల్‌డబ్ల్యూటీ)లు ఇందులో ప్రత్యేకమైనవి. ఆర్మీ కోసం నాగ్ క్షిపణి వ్యవస్థ(ట్రాక్‌డ్) ఎంకే-II (ఎన్ఏఎంఐఎస్), గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలింట్ సిస్టమ్(జీబీఎంఈఎస్), హై మొబిలిటీ వాహనాలు(హెచ్ఎంవీ), నావికాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్‌ఫార్మ్ డాక్‌లు, 30 ఎంఎం నావల్ సర్‌ఫేస్ గన్‌లు, వాయుసేన కోసం కొలాబొరేటీవ్ లాంగ్ రేంజ్ టార్గెట్ శాచురేషన్/డిస్ట్రక్షన్ వ్యవస్థకు డీఏసీ ఆమోదం తెలిపింది.
రక్షణ ఎగుమతుల ప్రోత్సాహం: పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్యత

ఎగుమతుల కొత్త కథ: అంకెలే మాటలు
ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్నవి ఇప్పుడు స్థిరమైన ప్రవాహంగా మారాయి: భారతదేశ రక్షణ ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2023-24 నాటి రూ.21,083 కోట్లతో పోలిస్తే 12.04% వృద్ధిని నమోదు చేసింది. ప్రైవేటు రంగ ఎగుమతులు రూ.15,233 కోట్లు కాగా, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల ఎగుమతులు రూ.8,389 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.15,209 కోట్లు, రూ.5,874 కోట్లు. రక్షణ ఎగుమతులకు భారీ ఊపినిస్తూ 2024-25లో భారత్ మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, ఉప-వ్యవస్థలు, పూర్తి వ్యవస్థలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులను దాదాపు 80 దేశాలకు సరఫరా చేసింది. ప్రపంచ రక్షణ రంగ సరఫరా గొలుసులో విశ్వసనీయ భాగస్వామిగా తన పాత్రను పునరుద్ఘాటించింది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు(డీపీఎస్‌యూ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమ ఎగుమతుల్లో 42.85% గణనీయ పెరుగుదలను నమోదుచేశాయి. ప్రపంచ విపణిలో భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ, ప్రపంచ సరఫరా గొలుసులో భాగం కావడానికి భారతీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
ద్వారాలు తెరిచే వేగవంతమై, సులువైన, డిజిటల్ విధానాలు
ఎగుమతి మార్గాన్ని ప్రభుత్వం సరళీకృతం చేసింది. మందుగుండు సామాగ్రి జాబితాలో ఉన్న వాటి ఎగుమతికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలను హేతుబద్ధీకరించింది. పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇప్పుడు ఎగుమతులకు అనుమతులను కూడా డిజిటల్ ప్రక్రియతో ఇస్తోంది. దీని వల్ల ఎగుమతిదారులకు సమయం, రాతపని తగ్గుతోంది. ఓపెన్ జనరల్ ఎక్స్‌పోర్ట్ లైసెన్సులు(ఓజీఈఎల్), డిజిటల్ ఆథరైజేషన్ సిస్టమ్ సాధారణ ఎగుమతులను మరింత సులభతరం చేశాయి.
దౌత్యంగా రక్షణ ఎగుమతులు
ఎగుమతులు కేవలం వాణిజ్యం మాత్రమే కాదు. ఇవి విశ్వాసాన్ని, పరస్పర కార్యాచరణ, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మిస్తాయి. స్నేహపూర్వక దేశాలకు విస్తృత ఎగుమతులు రక్షణ సహకారం, రవాణా మద్దతు, శిక్షణ, విడిభాగాల ప్యాకేజీలు, అమ్మకాల్లో కనిపించే ఒక సాధనం. పెరుగుతున్న దిగుమతిదారుల జాబితా భారతీయ వేదికల పట్ల పెరుగుతున్న ప్రపంచ విశ్వాసానికి సంకేతాలు.
విజయవంతమైన దేశీయ వేదికలు & ఎగుమతులు
బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, పహారా పడవలు, హెలికాప్టర్ల నుంచి రాడార్లు, తేలికపాటి టార్పెడోల వరకు భారతదేశ ఎగుమతులు ఇప్పుడు విస్తృతంగా, ఆచరణాత్మకంగా మారాయి. ఇవి భారతదేశ రక్షణ తయారీ గంభీరత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తేజస్ వంటి యుద్ధ విమాన కార్యక్రమాలు కార్యాచరణ పరిపక్వత, ఎగుమతి చర్చల మార్గంలో కొనసాగుతున్నాయి. నిరూపితమైన, కార్యాచరణ వ్యవస్థలు, భాగాల విస్తృత శ్రేణిలో ఇప్పుడు భారతదేశ ప్రస్తుత బలం ఉంది.
ముగింపు
భారతదేశ వ్యూహాత్మక సహకారాలు, సాహసోపేత విధానపరమైన నిర్ణయాలు కేవలం సంస్కరణలు మాత్రమే కాదు, ఇవి రక్షణ స్వయం సమృద్ధి, సాంకేతిక సార్వభౌమత్వంలో కొత్త శకానికి పునాదిగా మారుతున్నాయి. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు అద్భుత వృద్ధికి సిద్ధంగా ఉండటం, పారిశ్రామిక వ్యవస్థలో అధునాతన సాంకేతికతలను నిరంతరం భాగం చేయడం ద్వారా ప్రపంచ రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా భారత్ మారాలనే సంక్పలం ఇప్పుడు సుదూర ఆశయం ఏమాత్రం కాదు, ఇది మన కళ్ల ముందే సాకారమవుతోంది.
విలువ ప్రకారం దేశీయ రక్షణ ఉత్పత్తిలో భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, సానుకూల స్వదేశీయత జాబితాలు, ప్రైవేటు రంగంతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు వంటి ప్రభుత్వ చర్యల విజయాన్ని ప్రతిబింబిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, దృఢమైన ఆర్ & డీ, అంకుర సంస్థల వ్యవస్థ సృష్టించడం పట్ల ప్రాధాన్యత ఈ మార్పు దిశగా మరింత దోహదపడింది.
రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు నుంచి ఎగుమతి సదుపాయాన్ని విస్తరించడం వరకు ప్రతి చర్య దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, దేశీయ సామర్థ్యాలను ప్రోత్సహించాలనే భారతదేశ నిబద్ధతను చాటుతున్నాయి. ఇవన్నీ కలిసి జాతీయ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలో భారత్‌ను విశ్వసనీయమైన భాగస్వామిగా నిలబెట్టే దృఢమైన, సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నాయి.
PIB:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2116612
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2117348
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1809577
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154617&ModuleId=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2154551
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098431
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148335
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2114546
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1764148
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2086347
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181894
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795537
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1795540
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1819937
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1848671
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2113268
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2141130
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2089184
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=149238
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/mar/doc2025324525601.pdf
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/apr/doc202543531401.pdf
DD News:
https://ddnews.gov.in/en/rajnath-singh-clears-defence-procurement-manual-2025-to-speed-up-revenue-procurement-boost-aatmanirbharta/
https://ddnews.gov.in/en/defence-minister-rajnath-singh-launches-defence-procurement-manual-2025-to-boost-operational-readiness/
https://ddnews.gov.in/en/modernising-armed-forces-defence-ministry-declares-2025-as-year-of-reforms/
Ministry of Defence (MoD)
https://mod.gov.in/sites/default/files/DPM-2025%20VOLUME-I.pdf
DRDO
https://drdo.gov.in/drdo/en/offerings/schemes-and-services/dia-coes/Academia
Download in PDF
***
(Explainer ID: 156273)
आगंतुक पटल : 28
Provide suggestions / comments