Infrastructure
విద్యుత్(సవరణ) బిల్లు-2025: విద్యుత్ రంగ సంస్కరణ
Posted On:
22 NOV 2025 5:09PM
కీలకాంశాలు
- విద్యుత్ ధరల హేతుబద్ధీకరణ, రహస్య క్రాస్-సబ్సిడీలను తగ్గించడం ద్వారా భారతీయ పరిశ్రమ, లాజిస్టిక్స్‌ను మరింత పోటీతత్వంగా మార్చడం ఈ బిల్లు లక్ష్యం.
- రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల సబ్సిడీ టారిఫ్‌లను పూర్తిగా పరిరక్షిస్తూనే విద్యుత్ రంగ ఆర్థిక ఆచరణ సాధ్యత కోసం ఖర్చుకు తగిన టారిఫ్‌లను ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది.
- ఈ రంగంలో ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి, స్థిరమైన పెట్టుబడి-అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి నియంత్రణ జవాబుదారీతనాన్ని ఈ బిల్లు బలోపేతం చేస్తుంది.
- వృథాను నివారించడానికి, వ్యవస్థ ఖర్చులు తగ్గించడానికి, సరఫరా మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించేందుకు సహకరించడానికి ఈ బిల్లు నెట్‌వర్క్ భాగస్వామ్య వినియోగానికి అవకాశం కల్పిస్తుంది.
- సరఫరా నాణ్యత, విశ్వసనీయతను మెరుగుపర్చడంపై దృష్టి సారిస్తుంది. విధాన అమలులో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.
స్థూలదృష్టి
వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేలా భారతీయ విద్యుత్ వ్యవస్థను మార్చే దిశగా వేసిన కీలక అడుగు విద్యుత్(సవరణ) బిల్లు-2025. రైతులు, గృహాలు, దుకాణాలు, పరిశ్రమలు, ఇలా ప్రతి వినియోగదారునికీ విశ్వసనీయమైన, సరసమైన, అధిక నాణ్యత గల విద్యుత్తును అందించేలా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యుత్ రంగాన్ని తయారుచేయడం ఈ బిల్లు లక్ష్యం. పాత గుత్తాధిపత్య సరఫరా నమూనా నుంచి దూరం జరిగి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు న్యాయంగా పోటీపడే పనితీరు ఆధారిత విధానాన్ని ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఈ బిల్లు ప్రస్తుతం ఉన్న విద్యుత్ వ్యవస్థను పారదర్శకంగా, జవాబుదారీతనంతో మెరుగ్గా వినియోగించేలా ప్రోత్సహిస్తుంది. దీంతో ప్రజలు వెచ్చంచే ప్రతీ రూపాయికి ఎక్కువ విలువను పొందగలరు.

ముఖ్యంగా, రైతులు, తక్కువ ఆదాయ కుటుంబాలు పొందుతున్న సబ్సిడీ టారిఫ్‌లను ఈ సంస్కరణలు పూర్తిగా పరిరక్షిస్తాయి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేసే వేదికను అందించడం ద్వారా విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు కీలక పాత్రను అందిస్తుంది. కేవలం ఒక నవీకరణ అనే దానికంటే ఎక్కువగా, అధునాతన, సమర్థవంతమైన, దృఢమైన విద్యుత్ రంగానికి ఒక బ్లూప్రింట్‌గా ఉంటుంది. రైతుల నుంచి పరిశ్రమల వరకు భారతదేశ అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఉంటుంది. భారతదేశ వికసిత్ భారత్ 2047 సంకల్పానికి, దేశ దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి ఈ బిల్లు మద్దతునిస్తుంది.
విద్యుత్తు రంగాన్ని సరిచేయడం: సవరణ వెనుక ఉద్దేశం
విద్యుత్ రంగంలో లోపాలను పరిష్కరించడానికి, ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి, పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశ విద్యుత్ సరఫరా రంగంలో నెట్‌వర్క్ ఖర్చును తగ్గించడానికి విద్యుత్(సవరణ) బిల్లు-2025 తీసుకురావడమైంది.
- పేలవమైన బిల్లింగ్ సామర్థ్యం, అధిక మొత్తంలో సాకేతిక, వాణిజ్య(ఏటీ&సీ) నష్టాల కారణంగా సరఫరా సంస్థలు(డిస్కమ్) నిరంతరం ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి.
- వినియోగదారులు ఒకే డిస్కమ్‌తో ముడిపడి ఉండటం వల్ల విద్యుత్ సరఫరాలో పోటీతత్వం లేకుండా పోతోంది. సేవల నాణ్యత, ఆవిష్కరణ పరిమితంగా ఉంటోంది.
- క్రాస్-సబ్సిడీ లోపాలు-ఇతర విభాగాల్లో సబ్సిడీల కోసం పారిశ్రామిక వినియోగదారులు అధిక టారిఫ్‌లు చెల్లించాల్సి వస్తోంది.
క్రాస్ సబ్సిడీలను హేతుబద్ధీకరించడం, ఖర్చుకు తగ్గ టారిఫ్‌లను ప్రోత్సహించడం, పారిశ్రామిక వినియోగదారులు నేరుగా విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా ప్రస్తుత మార్కెట్ నిర్మాణంలో మార్పు తీసుకురావడం విద్యుత్(సవరణ) బిల్లు-2025 లక్ష్యం. భారతదేశ తయారీరంగ పోటీతత్వానికి ఉన్న సుదీర్ఘకాల అడ్డంకులు తొలగించడం, పారిశ్రామిక విద్యుత్తు మరింత సరసమైనదిగా, విశ్వసనీయమైనదిగా, మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా ప్రతిస్పందించేలా మార్చడం ఈ బిల్లు లక్ష్యాలు. ఇదే సమయంలో రైతులు, అర్హత కలిగిన ఇతర వినియోగదారుల సబ్సిడీ టారిఫ్‌లు రక్షిస్తుంది.
విద్యుత్ సరఫరా లైసెన్సు కలిగిన అన్ని సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లు(ఎస్ఈఆర్‌సీ) ఏర్పాటుచేసిన చట్రం మేరకు నెట్‌వర్క్ అభివృద్ధి చేసేలా చూసేందుకు ఖర్చుకు తగ్గ వీలింగ్ చార్జీలను నిర్ణయించే అధికారాన్ని ఎస్ఈఆర్‌సీలకు ఈ బిల్లు ఇస్తోంది. ఈ చార్జీలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా సరఫరా వ్యవస్థ వినియోగదారులందరికీ ఒకే రకంగా ఉంటాయి. సిబ్బంది వేతనాలు, నిర్వహణ, భవిష్యత్తు నెట్‌వర్క్ అభివృద్ధి కోసం విద్యుత్ సరఫరా సంస్థలకు సరిపడా ఆర్థిక వనరులు ఉండేలా ఈ వ్యవస్థ భరోసానిస్తుంది.
ఐఎస్‌టీఎస్ విధానం: సమర్థత, పారదర్శకత, విశ్వసనీయత
భాగస్వామ్య మౌళిక సదుపాయాలపై నిర్మించిన అంతర్‌రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ(ఐఎస్‌టీఎస్)ను భారత్ ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఈఆర్‌సీ) పర్యవేక్షణలో ఐఎస్‌టీఎస్ ఆస్తుల అభివృద్ధికి పవర్‌గ్రిడ్(సీపీఎస్‌యూ) సహా ప్రభుత్వ, ప్రైవేటు ట్రాన్స్‌మిషన్ సర్వీస్ ప్రొవైడర్లు(టీఎస్‌పీ) పోటీపడుతున్నాయి. వినియోగదారులు చేసే నెలవారీ చెల్లింపులను టీఎస్‌పీలకు పారదర్శకంగా పునఃపంపిణీ చేయడం జరుగుతోంది. ఈ విధానం అధిక విశ్వసనీయతను కొనసాగిస్తూనే, ఐఎస్‌టీఎస్ ప్రాజెక్టు ఖర్చులు, నిర్మాణ సమయంలో తగ్గించడానికి ఉపయోగపడింది.
సంస్కరణలకు శక్తి: బిల్లు ప్రధాన అంశాలు
విద్యుత్(సవరణ) బిల్లు-2025 మరింత సమర్థవంతమైన, పర్యావరణ, ఆర్థిక సుస్థిరత కలిగిన, పారదర్శకమైన, వినియోగదారు దృష్టితో కూడిన విద్యుత్ రంగానికి వేదికను ఏర్పాటుచేస్తోంది. భారతదేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను ఆధునికీకరించడానికి ఈ బిల్లు నియంత్రణ స్పష్టతతో కూడిన నిర్మాణాత్మక సంస్కరణలను మిళితం చేస్తోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా విధానాన్ని మార్చడం ద్వారా నాణ్యమైన సేవలు అందించడం, ఆర్థిక క్రమశిక్షణ, సుస్థిర వృద్ధిని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లు(ఎస్ఈఆర్‌సీ)ల పర్యవేక్షణలో విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ, ప్రైవేటు సరఫరా సంస్థల మధ్య పారదర్శకమైన పోటీని ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఈ విధానం సేవల నాణ్యత, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పారిశ్రామిక రంగానికి సహేతుకమైన ధరకు విద్యుత్ సరఫరాను అందిస్తుంది. గుత్తాధిపత్య ఆధారిత సరఫరా నుంచి పనితీరు ఆధారిత సరఫరాకు మార్చడం ద్వారా ఈ బిల్లు రైతులు, ఇతర వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే మరింత జవాబుదారీతనాన్ని తీసుకురావడంతో పాటు వినియోగదారుల ఆధారిత విద్యుత్ రంగానికి దోహదపడుతుంది.
నిర్మాణాత్మక సంస్కరణలు
భాగస్వామ్య సదుపాయాల వినియోగం ద్వారా ఒకే ప్రాంతంలో బహుళ సంస్థలు ఆపరేట్ చేసేందుకు అనుమతించడం ద్వారా విద్యుత్ సరఫరాలో నియంత్రిత పోటీని నెలకొల్పుతుంది.
లైసెన్స్ కలిగిన సంస్థలు అన్నింటికీ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్(యూఎస్ఓ) తప్పనిసరి చేయడం ద్వారా వినియోగదారులందరికీ వివక్ష లేని సరఫరా, ప్రాప్యతకు భరోసానిస్తుంది. నేరుగా విద్యుత్ సరఫరాకు అర్హత కలిగిన పెద్ద వినియోగదారులకు(1 ఎండబ్ల్యూ కంటే ఎక్కువ) రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా ఎస్ఈఆర్‌సీలు సరఫరా లైసెన్సీలను యూఎస్ఓ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.
టారిఫ్, క్రాస్-సబ్సిడీల హేతుబద్ధీకరణ
సెక్షన్ 65 కింద పారదర్శకమైన సబ్సిడీల ద్వారా సబ్సిడీలు పొందుతున్న వినియోగదారులను(ఉదాహరణకు రైతులు, పేద గృహాలు) ప్రయోజనాలు కాపాడుతూనే ఖర్చుకు తగ్గ టారిఫ్‌లను ప్రోత్సహిస్తుంది.
ఐదేళ్లలో తయారీ పరిశ్రమ, రైల్వేలు, మెట్రో రైల్వేలకు క్రాస్-సబ్సిడీలను తొలగించాలని చెప్తోంది.
మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ సామర్థ్యం
వీలింగ్ చార్జీల నియంత్రణ, సరఫరా వ్యవస్థల్లో వ్యర్థాన్ని నివారించే అధికారాన్ని సంబంధిత కమిషన్లకు ఇస్తుంది.
ఇంధన నిల్వ వ్యవస్థలకు(ఈఎస్ఎస్) నిబంధనలను పరిచయం చేయడంతో పాటు విద్యుత్ వ్యవస్థలో వీటి పాత్రను నిర్వచిస్తుంది.
పరిపాలన, నియంత్రణ బలోపేతం
కేంద్ర-రాష్ట్ర విధాన సమన్వయానికి, ఏకాభిప్రాయ సాధనకు విద్యుత్ మండలి ఏర్పాటు
ప్రమాణాలు అమలు చేయడానికి, పాటించనప్పుడు జరిమానా విధించడానికి దరఖాస్తులు ఆలస్యమైనప్పుడు సుమోటోగా టారిఫ్‌లను నిర్ణయించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లకు(ఎస్ఈఆర్‌సీ) అధికారం.
సుస్థిరత, మార్కెట్ అభివృద్ధి
శిలాజేతర ఇంధన సేకరణ నిబంధనలను బలోపేతం చేస్తుంది. పాటించకపోతే జరిమానా విధించవచ్చు.
కొత్త సాధనాలు, వాణిజ్య వేదికలు సహా విద్యుత్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
న్యాయపరమైన, నిర్వహణ స్పష్టత
నిర్వచనాలు, రిఫరెన్సీల నవీకరణ(ఉదాహరణకు కంపెనీల చట్టం-2013)
ఎలక్ట్రిక్ లైన్ అథారిటీకి పరిహారం, వివాద పరిష్కారం, స్థానిక సంస్థలతో సమన్వయం వంటి అంశాలతో కూడిన సవివరణ నిబంధనలు పరిచయం చేస్తోంది. భారత టెలిగ్రాఫ్ చట్టం-1885 కింద టెలిగ్రాఫ్ అథారిటీకి ఉండే అధికారాలే ఎలక్ట్రిక్ లైన్ అథారిటీకి ఉంటాయి.
ముగింపు:
భారతదేశ విద్యుత్ రంగాన్ని ఆధునికీకరించేందుకు కీలక సంస్కరణలను విద్యుత్(సవరణ) బిల్లు-2025 తీసుకువస్తుంది. విద్యుత్ సరఫరాలో పోటీని ప్రోత్సహించడంతో పాటు నియంత్రణను బలోపేతం చేస్తుంది. పారదర్శకమైన ధరల యంత్రాంగాలకు సహకరిస్తుంది. ఈ బిల్లు వెనుకబడిన వర్గాల వినియోగదారుల సబ్సిడీలను కాపాడుతూనే పరిశ్రమలు నేరుగా విద్యుత్ పొందే అవకాశాన్ని ఇస్తుంది. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన, భవిష్యత్తుకు తగ్గట్టుగా విద్యుత్ వ్యవస్థను నిర్మించడం ఈ చర్యల లక్ష్యం.
References:
Ministry of Power:
https://powermin.gov.in/sites/default/files/webform/notices/Seeking_comments_on_Draft_Electricity_Amendment_Bill_2025.pdf
Press Information Bureau:
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150442
Click here to see pdf
***
(Backgrounder ID: 156213)
आगंतुक पटल : 20
Provide suggestions / comments