Infrastructure
భారతీయ రహదారుల పునర్నిర్వచనం
నవీనత దిశగా నడిపిస్తూ, అనుసంధానతను అందిస్తూ..
Posted On:
11 NOV 2025 1:47PM
కీలకాంశాలు
- ప్రణాళిక నుంచి టోల్ వరకు ప్రతి దశలో డిజిటలీకరణతో భారతదేశ హైవేలు మారిపోతున్నాయి. తద్వారా హైవేలు భౌతిక, డేటా ఆధారిత ఆస్తులు అవుతున్నాయి.
- 8 కోట్ల మందికి పైగా వినియోగదారులు, 98% వ్యాప్తితో దేశ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఫాస్టాగ్ విప్లవాత్మకంగా మారింది.
- 15 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లతో రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ భారతదేశ అగ్రశ్రేణి హైవే ట్రావెల్ యాప్‌గా మారింది. ఇది ప్రయాణికుల అనుభూతిని పెంపొందిస్తోంది.
నవయుగ హైవేలకు మార్గం
డిజిటల్ విప్లవ యుగంలో భారతీయ హైవేలు ఇక కేవలం తారు, కాంక్రీట్ మార్గాలు మాత్రమే కావు. ఇప్పుడు హైవేలు రవాణా, డేటాకు తెలివైన వెన్నెముకలుగా మారుతున్నాయి. అంతరాయం లేని ప్రయాణం, తక్షణ సమాచార సేకరణకు అవకాశం కల్పిస్తున్నాయి. మన ప్రయాణం, వస్తువుల రవాణా, టోల్ నిర్వహణ, ప్రయాణంలో ఇంటర్నెట్ సౌలభ్యం పొందండం వంటి వాటిని స్మార్ట్ నెట్‌వర్క్‌ల సంకల్పం పునర్నిర్మిస్తోంది. ఒకప్పుడు కేవలం నగరాలు, రాష్ట్రాల నడుమ భౌతిక అనుసంధానాన్ని కల్పించేవిగా మాత్రమే ఉన్న దేశ రహదారులు ఇప్పుడు అనుసంధానత, నియంత్రణతో కూడిన స్మార్ట్ కారిడార్లుగా పునర్నిర్మాణమవుతున్నాయి. ఇవి వాహనాల కోసం మాత్రమే కాకుండా డేటా, కమ్యునికేషన్, తక్షణ నిర్ణయం తీసుకోవడానికి వీలుగా రూపొందుతున్నాయి.

రహదారుల వ్యవస్థలాగానే వ్యవస్థలో వస్తున్న మార్పు కూడా అందే విస్తారమైనది. 2025 మార్చి నాటికి 63 లక్షల కిలోమీటర్లతో కూడి భారతదేశ రహదారి వ్యవస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ. 2013-14లో దేశంలో 91,287 కిలోమీటర్ల జాతీయ రహదారి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు దాదాపు 60% పెరిగి 1,46,204 కిలోమీటర్లకు చేరుకుంది. 2014 నుంచి 2025 మధ్య దేశంలో కొత్తగా 54,917 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఇది నిర్మాణ ప్రక్రియను మాత్రమే కాకుండా ఇంత పెద్ద ఆస్తి నిర్వహణ, పర్యవేక్షణలో డిజిటల్ వినియోగ అవసరాన్ని చాటుతోంది. సామర్థ్యాన్ని పెంచడానికి, కార్యలాపాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం రహదారి ప్రాజెక్టుల జీవితకాలంలోని అన్ని ప్రధాన దశల్లోనూ సమగ్ర 360-డిగ్రీల డిజిటల్ మార్పును అమలుచేస్తోంది. ప్రణాళిక, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్(డీపీఆర్) నుంచి నిర్మాణం, నిర్వహణ, టోలింగ్, వ్యవస్థ ఆధునికీకరణ,కీలక ప్రక్రియలన్నీ వ్యవస్థ పనితీరు పెంపొందించడానికి, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి క్రమబద్ధీకరణ జరుగుతున్నాయి.
డిజిటల్ టోలింగ్, చెల్లింపుల సంస్కరణలు
పేపర్ టికెట్లు, నగదు బూత్‌ల నుంచి సులభమైన, సెన్సార్ ఆధారిత ప్రయాణం వరకు భారతీయ జాతీయ రహదారులు ఒక నిశబ్ద విప్లవంగా మారుతున్నాయి. నిరీక్షణ సమయం, ఇంధన వృథాను తగ్గించేందుకు, ఆదాయంలో నష్టాలను నివారించేందుకు దేశం క్రమంగా టోల్ వసూలు వ్యవస్థను డిజిటల్ ప్రథమ పరిష్కారాల ద్వారా మార్చుకుంది.
అన్ని రోడ్లకు ఒకే ట్యాగ్: ఫాస్టాగ్, ఎన్ఈటీసీతో టోల్ చెల్లింపులు
భారతీయ రహదారులపై టోల్ వసూలును క్రమబద్ధీకరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఎన్ఈటీసీ) కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఇది ఏకీకృత, అంతర్‌కార్యనిర్వహణ వేదిక. కేంద్రీకృత సర్దుబాటు, వివాద పరిష్కార విధానం ద్వారీ ఈ వ్యవస్థ లావాదేవీలను సులభతరం చేస్తోంది.
ఎన్ఈటీసీలో వాహన విండ్‌షీల్డ్‌పై అమర్చే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత ఫాస్టాగ్ కీలకం. టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు అనుసంధానమై ఉండే ఖాతా నుంచి నేరుగా చెల్లింపులు జరిగేందుకు ఇది అనుమతిస్తుంది. ప్రమాణిక ప్రక్రియలు, ప్రత్యేకతలతో కూడిన ఫాస్టాగ్‌ను వినియోగదారులు దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాను ఎవరు నిర్వహిస్తున్నారనేది సంబంధం లేకుండా ఏ టోల్ బూత్‌లోనైనా వినియోగించవచ్చు. 98% పెనెట్రేషన్ రేటు, 8 కోట్లకు పైగా వినియోగదారులతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను ఫాస్టాగ్ సమూలంగా మార్చేసింది.
భారతదేశ హైవేల్లో ఎక్కడైనా ఇబ్బంది లేని ప్రయాణం చేసేందుకు వీలుగా ఫాస్టాగ్ వార్షిక పాస్ సదుపాయం ప్రారంభమైంది. నాన్-కమర్షియల్ వాహనాల కోసం రూ.3 వేలు చెల్లిస్తే ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాలను దాటవచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఇది పనిచేస్తుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్, ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా రెండు గంటల్లోపే ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది. తరచూ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ పాస్ తప్పిస్తుంది. హైవే వినియోగదారులకు నిరంతరాయ, సమర్థ ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది.
దేశవ్యాప్తంగా అక్టోబర్ 15న ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రారంభించిన రెండు నెలల్లోనే 25 లక్షలకు పైగా వినియోగదారులు ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందారు. 5.67 కోట్లకు పైగా టోల్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది అవాంతరాలు లేని టోల్ చెల్లింపుల కోసం ఉన్న బలమైన డిమాండ్‌ను చాటుతోంది.

టోల్ ప్లాజాల దగ్గర డిజిటల్ చెల్లింపులు పెంచి, నగదు లావాదేవీలు తగ్గించేందుకు ప్రభుత్వం 2025 నవంబర్ 15 నుంచి అమలయ్యేలా జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 2008ను సవరించింది. ఈ సవరించిన నిబంధనల కింద నగదు చెల్లించే ఫాస్టాగ్ లేని వినియోగదారులు ప్రామాణిక ఫీజు కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపులు చేసే వారు 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. టోల్ వసూలును క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం, పారదర్శకతను ప్రోత్సహించడం, జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ మార్పుల లక్ష్యం.
2025 ఆగస్టులో దేశంలో తొలి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థ గుజరాత్‌లో ఎన్‌హెచ్-48పై చోర్‌యాసీ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేశారు. ఇది బారియర్-ఫ్రీ, కెమెరా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థ. వాహనం వెళ్తుండగానే ఫాస్టాగ్, వాహన నెంబరును ఇది నమోదు చేస్తుంది. వాహనాలను ఆపకుండానే సులభంగా టోల్ వసూలు చేయొచ్చు. తద్వారా రద్దీని తగ్గించవచ్చు. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
రాజ్‌మార్గ్‌యాత్ర: రహదారులపై స్మార్ట్‌గా, సాఫీగా ప్రయాణం
దేశవ్యాప్తంగా రహదారుల పునర్నిర్వచనలో భాగంగా ప్రభుత్వం రాజ్‌మార్గ్‌యాత్రను ప్రారంభించింది. ఇది పౌర-కేంద్రీకృత మొబైల్ అప్లికేషన్. హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, ప్రయాణ అనుభవాన్ని ఇది మెరుగుపరుస్తుంది. వినియోగదారుల సౌలభ్యమే కీలకంగా అభివృద్ధి చేసిన ఈ యాప్ తక్షణ సమాచారం అందేందుకు, సమర్థంగా సమస్యలను పరిష్కరించేందుకు వెబ్ ఆధారిత వ్యవస్థతో కూడి ఉంటుంది.

రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ప్రయాణంలో డిజిటల్ సహచరిగా ఉంటుంది. హైవేలు, టోల్ ప్లాజాలు, సమీపంలో ఉండే పెట్రోల్ పంప్‌లు, ఆసుపత్రులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి సౌకర్యాల వివరాలతో పాటు వాతావరణ సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈ సమగ్ర సమాచారంపౌరులు మరింత సమర్థంగా ప్రయాణ నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రణాళిక రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది.
ప్రయాణ అనుభవాన్ని సాఫీగా మార్చేందుకు సులువుగా టోల్ చెల్లింపులు చేసేలా ఫాస్టాగ్ సేవలు కూడా ఈ యాప్‌లో చేర్చారు. బహుభాషల్లో ఈ యాప్ ఉంటుంది. తద్వారా విస్తృతంగా అందుబాటులో ఉంటంది. వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్పీడ్ లిమిట్ అలెర్ట్స్ కూడా ఈ యాప్‌లు వస్తుంటాయి. తద్వారా సుదూర మార్గాల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహిస్తోంది. హైవేలకు సంబంధించి రోడ్డుపై గుంతలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఆక్రమణలు, భద్రతా సంబంధించిన అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జియో-ట్యాగ్‌డ్ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదుల పురోగతిని ట్రాక్ చేయవచ్చు. ఇది జవాబుదారీతనంతో పాటు రహదారి సదుపాయాల నిర్వహణలో పారదర్శకతను పెంపొందిస్తుంది.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ విశేష ఆదరణ పొందింది. గూగుల్ ప్లే స్టోర్ ఓవరాల్ ర్యాంకింగ్‌లలో 23వ స్థానం, ట్రావెల్ విభాగంలో 2వ స్థానంలో ఉంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌నకు ప్లేస్టోర్‌లో 4.5 స్టార్స్ రేటింగ్ ఉంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వ యాప్‌గా మారింది.
ఎన్‌హెచ్ఏఐ వన్: రహదారులకు డిజిటల్ వెన్నెముక
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమయానికి పూర్తయ్యేలా చూసేందుకు, అంతర్గత ప్రక్రియలను, సమన్వయాన్ని సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ వన్ పేరుతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ సమగ్ర వేదిక అంతర్గత ప్రక్రియలు క్రమబద్ధీకరించడంతో పాటు జాతీయ రహదారుల వ్యవస్థ వ్యాప్తంగా క్షేత్రస్థాయి సమన్వయాన్ని మెరుగుపరుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు, హైవేల నిర్వహణ, రహదారి భద్రతా తనిఖీలు(రోడ్ సేఫ్టీ ఆడిట్స్), మరుగుదొడ్ల నిర్వహణ, రిక్వెస్ట్ ఫర్ ఇన్‌స్పెక్షన్స్(ఆర్ఎఫ్ఐ) ద్వారా రోజువారీ నిర్మాణ తనిఖీలు వంటివి ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఈ అన్ని పనులను ఒకే డిజిటల్ వేదికపైకి చేర్చడం ద్వారా క్షేత్రస్థాయి బృందాలు, పర్యవేక్షణ అధికారులు వారి పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఈ యాప్ అవకాశం కల్పిస్తోంది.
ప్రాంతీయ అధికారులు(ఆర్వో), ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)ల నుంచి కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సేఫ్టీ ఆడిటర్లు, టోల్ ప్లాజాల దగ్గర మరుగుదొడ్ల పర్యవేక్షణ సిబ్బంది వరకు క్షేత్రస్థాయి నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలకు సంబంధించి నివేదించేందుకు, సమాచారం అందించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తోంది. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్ వంటి ఫీచర్లతో ఈ యాప్ జవాబుదారీతనాన్ని పెంచడంతో, కచ్చితమైన డాక్యుముంటేషన్ ప్రక్రియ పాటించేలా చేస్తుంది. పనితీరును మెరుగుపర్చడంతో పాటు ప్రాజెక్టు అమలు, పూర్తి చేయడం మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడంలో ఈ యాప్ కీలకపాత్ర పోషిస్తోంది. రహదారుల అభివృద్ధి ప్రణాళికల్లో వేగంగా స్పందించడం, సాఫీగా అమలయ్యేలా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.
భారతదేశ రహదారుల మ్యాపింగ్: జీఐఎస్, పీఎం గతిశక్తి పాత్ర
రహదారులు ఎలా ఉండాలి, ఎలా నిర్మించాలనే అంశాన్ని డిజిటల్ పటాలు, అంతరిక్ష మేధస్సు పునర్నిర్వచిస్తోంది. ఈ మార్పు వెనుక జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో పాటు ప్రభుత్వ మానసపుత్రిక అయిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక(ఎన్ఎంపీ) మధ్య శక్తివంతమైన సమన్వయం ఉంది. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రత్యేకంగా రహదారులకు డిజిటల్ పర్యవేక్షణ కేంద్రంగా మారిన ఎన్ఎంపీ పోర్టల్ సమీకృత, బహుళవిధ అనుసంధానానికి సమగ్ర డిజిటల్ అట్లాస్‌గా పనిచేస్తోంది. ఆర్థిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ కేంద్రాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ లక్షణాలు సహా మరెన్నో అంశాలకు సంబంధించి 550 లేయర్ల లైవ్ డేటాతో కూడిన శక్తివంతమైన జీఐఎస్-ఆధారిత వేదిక ఇది. ఈ స్పష్టతతో రోడ్డు అమరికలను తక్కువ అంతరాయం, అధిక సామర్థ్యంతో, వేగంగా అనుమతులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించవచ్చు.

దాదాపు 1.46 లక్షల కిలోమీటర్ల మొత్తం జాతీయ రహదారుల వ్యవస్థను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జీఐఎస్-ఆధారిత ఎన్ఎంపీ పోర్టల్‌లో చేర్చి, ధ్రువీకరించడం కీలక మైలురాయి. వివిధ భాగాలుగా, పేపర్ ఆధారిత ప్రక్రియలతో ఉండే భారతీయ రహదారుల ప్రణాళిక, అమలు ప్రక్రియ ఇప్పుడు జాతీయస్థాయి విజిబిలిటీతో జియో-ఇంటెలిజెంట్ ప్రణాళికగా మార్పు చెందడంలో ఇది కీలకంగా పనిచేసింది.
తెలివైన రవాణా వ్యవస్థకు చోదకశక్తిగా సాంకేతికత
మనం సాంకేతికతతో నడిచే కారిడార్ల గురించి మాట్లాడినప్పుడు రహదారి కథలో సగం మాత్రమే మాట్లాడతాం. మిగతా సగం గ్రహించే, విశ్లేషించే, అమలు చేసే, ప్రతిస్పందించే వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. వీటిని సమిష్టిగా తెలివైన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్(ఐటీఎస్) అంటాం. భారత్‌లో ఐటీఎస్‌ను ప్రాథమికంగా అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) ద్వారా అమలయ్యింది. ఇప్పుడు క్రమంగా వెహికిల్-టు-ఎవిరీథింగ్(వీ2ఎక్స్) వ్యవస్థలోకి చేరుస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి, అత్యవసర ప్రతిస్పందనను వేగవంతం చేసేలా ఈ వ్యవస్థలను రూపొందించారు.
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ట్రాన్స్-హర్యానా ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే లాంటి కీలక ఎక్స్‌ప్రెస్‌వేలో ఏటీఎంఎస్‌ను ఏర్పాటుచేశారు. ప్రమాదాన్ని వేగంగా గుర్తించేందుకు, వెంటనే స్పందించేందుకు ఇది ఉపయోగపడుతోంది. కొత్తగా నిర్మిస్తున్న హై-స్పీడ్ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఏటీఎంఎస్ వ్యవస్థను నిర్మాణంతో పాటే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కారిడార్‌లలో క్రమంగా అమలులోకి తీసుకొస్తున్నారు. భారతీయ రోడ్లు మేధస్సు వైపు మళ్లుతున్నాయనే దానికి ఇది స్పష్టమైన సంకేతం. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే వంటి కారిడార్‌లలో 2024 జులైలో ఏటీఎంఎస్ అమలు చేస్తున్న తర్వాత రోడ్డుప్రమాద మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రమాదాల డేటా చెప్తోంది. తద్వారా ఈ విధానం ప్రాణాలను కాపాడే తెలివైన విధానంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌లతో కూడిన ప్రాజెక్ట్ ఇన్‌ఫర్మేషన్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా రహదారుల పారదర్శకత, భద్రతను మెరుగుపరుస్తోంది. ప్రాజెక్టు వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌లు, సమీపంలో ఉండే ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి వివరాలను వీటి ద్వారా పొందవచ్చు. కాగా, నెట్‌వర్క్ సర్వే వెహికిల్స్(ఎన్ఎస్‌వీ)ను ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటుచేస్తోంది. ఈ వాహనాలకు 3డీ లేజర్ వ్యవస్థలు, 360 డిగ్రీల కెమెరాలు వంటి పరికరాలు ఉంటాయి. 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల మేర ఇవి పనిచేస్తాయి. ఇవి రోడ్డు సమస్యలను ఆటోమెటిక్‌గా గుర్తిస్తాయి. తద్వారా సున్నితమైన, సురక్షితమైన, మరింత సమాచారంతో కూడిన ప్రయాణ అనుభవాలను అందిస్తున్నాయి.
గ్రీన్ హైవేస్ మిషన్: సుస్థిర మౌలిక సదుపాయాల పట్ల నిబద్ధత
సుస్థిర మౌలిక సదుపాయాల పట్ల భారతదేశ నిబద్ధత గ్రీన్ హైవేస్ మిషన్ ద్వారా ప్రతిబింబిస్తోంది. గ్రీన్ హైవేస్(ప్లాంటేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ అండ్ మెయిన్‌టెనెన్స్) పాలసీ-2015 ప్రకారం గ్రీన్ హైవేస్ మిషన్ ప్రారంభమైంది. కాలుష్యాన్ని, శబ్దాన్ని తగ్గించడం, నేల కోతను నివారించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమం కింద 2023-24లో ఎన్‌హెచ్ఏఐ 56 లక్షలు, 2024-25లో 67.47 లక్షల మొక్కలు నాటింది. - ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు హైవేల పొడవునా 4.69 కోట్ల మొక్కలు నాటింది. హరిత పరివర్తన కేవలం మొక్కలు నాటడంతోనే ఆగిపోలేదు.
రహదారుల పొడవునా నీటి వనరుల పునరుద్ధరణపైనా ఎన్‌హెచ్ఏఐ దృష్టి సారించింది. భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించే ఆలోచనతో 2022 ఏప్రిల్‌లో ప్రారంభించిన మిషన్ అమృత్ సరోవర్ కింద ఎన్‌హెచ్ఏఐ దేశవ్యాప్తంగా 467 నీటి వనరులను అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం వల్ల స్థానిక పర్యావరణాన్ని పునరుద్ధరించడంతో పాటు హైవేల నిర్మాణానికి దాదాపు 2.4 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లభించింది. తద్వారా రూ.16,690 ఖర్చు మిగిలిందని అంచనా. 2023-24లో 631 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఫ్లైయాష్, ప్లాస్టిక్ వ్యర్థాలు, వినియోగించిన తారును రీసైకిల్ చేసి హైవేల నిర్మాణానికి ఎన్‌హెచ్ఏఐ వినియోగించింది. తద్వారా పర్యావరణ అనుకూల, సుస్థిర నిర్మాణ విధానాలను పాటిస్తోంది.
సాంప్రదాయ రహదారులకు మించి..
భారతీయ రహదారులు రవాణాకు చోదశక్తి నుంచి మార్పునకు చొదకశక్తిగా మారుతున్నాయి. నగరాల మధ్య అనుసంధానం కోసం మొదలైన కార్యక్రమం మేధస్సుతో కూడిన, సుస్థిర, డిజిటల్ మౌలిక వసతులతో ప్రజలు, డేటా, నిర్ణయాలను అనుసంధానిస్తూ వ్యవస్థలను కలిపే ప్రతిష్టాత్మక ప్రయత్నంగా మారింది. జీఐఎస్-ఆధారిత ప్రణాళిక, తెలివైన ట్రాఫిక్ వ్యవస్థలు, డిజిటల్ టోలింగ్, పౌర-కేంద్రీకృత యాప్‌ల వినియోగం ద్వారా హైవే వ్యవస్థ తక్షణం గ్రహించే, ప్రతిస్పందించే, నేర్చుకునే నిర్మాణంగా మారింది. ప్రతి ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు అనుసంధాన వ్యవస్థగా, జాతీయ ఇంటెలిజెన్స్‌కు సాధనంగా పనిచేస్తోంది. భారత్‌లో ప్రయాణాన్ని వేగంగా మార్చడంతో పాటు సురక్షిత, శుభ్రమైన, మరింత పారదర్శకంగా మారుతోంది. ప్రతి కిలోమీటరు కేవలం ట్రాఫిక్‌నే కాకుండా విశ్వాసాన్ని, సాంకేతికతను, పరివర్తనను మోస్తోంది.
Ministry of Road Transport & Highways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174761
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174411
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2159700
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2157694
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2156992
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2139029
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2115576
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2100383
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1945405
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122700
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2091508
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2111288
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110972
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081193
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2162163
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122632
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178596
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2144860
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154624&ModuleId=3
National Payments Corporation of India
https://www.npci.org.in/product/netc/about-netc
Click here for pdf file
***
(Explainer ID: 156015)
आगंतुक पटल : 58
Provide suggestions / comments