• Skip to Content
  • Sitemap
  • Advance Search
Social Welfare

సార్వ‌జ‌నిక ఆరోగ్య సంర‌క్ష‌ణ దిశ‌గా..

ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధానమంత్రి-జ‌న్ ఆరోగ్య యోజ‌న‌

Posted On: 01 NOV 2025 11:27AM

కీల‌కాంశాలు
- ఆయుష్మాన్ భార‌త్-ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం. అర్హ‌త క‌లిగిన ప్ర‌తి కుటుంబానికి వార్షికంగా రూ.5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా క‌ల్పించ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యం.
- ఏబీ-పీఎంజేఏవై ప‌థ‌కం ఏడేళ్ల క్రితం 2018 సెప్టెంబ‌ర్ 23న ప్రారంభ‌మైంది.
- దాదాపు 12 కోట్ల కుటుంబాల‌కు నాణ్య‌మైన ఆరోగ్య‌ సంర‌క్ష‌ణ‌ను ఏబీ-పీఎంజేఏవై అందుబాటులోకి తీసుకొచ్చింది.
- 2025 అక్టోబ‌ర్ 28 నాటికి ఏబీ-పీఎంజేఏవై ల‌బ్ధిదారుల‌కు 42 కోట్ల‌కు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి.
- 86 ల‌క్ష‌ల మందికి పైగా వ‌యో వృద్ధులు ఈ ప‌థకం కింద న‌మోద‌య్యారు.
- బ‌హుళ విభాగాల‌తో కూడిన ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం సార్వ‌జ‌నిక ఆరోగ్యం కోసం అందుబాటులో, నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందిస్తోంది.

ప‌రిచ‌యం
ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా స‌మాజం మ‌రింత దృఢంగా, స‌మ‌ర్థంగా, ఉత్పాద‌కంగా మారుతుంది. సార్వ‌జ‌నిక ఆరోగ్య ప‌థ‌కం అత్యంత పేద కుటుంబాలు స‌హా ప్ర‌తిఒక్క‌రూ అందుబాటులో, నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను పొందేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా వారు ఆరోగ్యంగా, సంతృప్తిక‌ర జీవితాలు గ‌డ‌ప‌డానికి వీలు క‌లుగుతోంది.

భార‌త‌దేశ ఆర్థిక‌ వృద్ధి పెరుగుతున్నందున స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ నినాదానికి అనుగుణంగా అందరికీ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంపై ప్రభుత్వం దృష్టి సారించగ‌లిగింది. త‌ద్వారా ప్ర‌జ‌లు మంచి ఆరోగ్యంగా, సుఖంగా ఉండ‌వ‌చ్చు. విక‌సిత్ భార‌త్‌@2047ను నిర్మించ‌వచ్చు.

సార్వ‌జ‌నిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను సాధించేందుకు భార‌త ప్ర‌భుత్వం 2018 సెప్టెంబ‌ర్ 23న ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి ఆరోగ్య యోజ‌న‌(పీఎంజేఏవై)ను ప్రారంభించింది. కోట్లాది భార‌తీయ కుటుంబాలు న‌మోదు కావ‌డం ద్వారా ఈ ప‌థ‌కం ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కంగా మారింది.

సాంకేతికత‌లో పురోగ‌తి, సామాజిక‌-ఆర్థిక ప‌రిస్థితులు మార‌డం, సంప్ర‌దాయ అంటువ్యాధుల‌తో పాటు అసాంక్ర‌మిక వ్యాధుల్లాంటి జీవ‌న‌శైలి వ్యాధులు పెర‌గ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో భార‌త్‌లో మారుతున్న ఆరోగ్య‌సంర‌క్ష‌ణ స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్ర‌య‌త్నిస్తోంది. ఈ విధానానికి అనుగుణంగా 2018లో ప్రారంభ‌మైన‌ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంలో ఏబీ-పీఎంజేఏవై ఒక స్తంభం. అంద‌రికీ స‌మాన ఆరోగ్య బీమా క‌ల్పిచేందుకు, ముఖ్యంగా గ్రామీణ‌, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల కోసం రూపొందించిన వైద్య ప‌థ‌కం ఇది.

ఆయుష్మాన్ భార‌త్‌లోని ఇత‌ర విభాగాలు:
- ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు(ఏఏఎం) ఫోన్‌కాల్ లేదా ఇంటి ద‌గ్గ‌ర‌నే ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక ఆరోగ్య సేవ‌లు అందిస్తున్నాయి.
- ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్‌(ఏబీడీఎం) కార్య‌క్ర‌మం గ్రామీణ క్లినిక్‌ల‌ నుంచి పెద్ద ఆసుప‌త్రుల వ‌ర‌కు అన్ని ఆరోగ్య కేంద్రాల‌ను డిజిట‌ల్‌గా అనుసంధానం చేస్తోంది. దేశంలో స‌మీకృత డిజిట‌ల్ ఆరోగ్య మౌలిక స‌దుపాయాలను అభివృద్ధి చేయ‌డం దీని ల‌క్ష్యం. ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంలోని వివిధ భాగ‌స్వాముల‌ను డిజిట‌ల్ మార్గాల ద్వారా ఈ కార్య‌క్ర‌మం అనుసంధానం చేస్తుంది.
- పీఎం-ఆయుష్మాన్ భార‌త్ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్‌(పీఎం-అభిమ్‌) 2021లో ప్రారంభ‌మైంది. గ్రామ ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు దృఢ‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ సామ‌ర్థ్యాన్ని ఈ కార్య‌క్ర‌మం నిర్మిస్తోంది.

ప్రాథ‌మిక‌, ద్వితీయ‌, తృతీయ స్థాయిల‌లో నాణ్య‌మైన వైద్య సంర‌క్ష‌ణ‌ను ఆయుష్మాన్ భార‌త్ అందుబాటులోకి తీసుకొస్తోంది.



ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న‌
ఏబీ-పీఎంజేఏఐ ప‌థ‌కం సామాజిక‌-ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబాల‌కు ఏడాదికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ద్వితీయ‌, తృతీయ సంర‌క్ష‌ణ సేవ‌లు, ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను అందిస్తూ భారీ వైద్య బిల్లుల నుంచి కాపాడుతోంది. ఈ ప‌థ‌కం న‌మోదిత ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దుర‌హిత చికిత్స అందిస్తోంది.



ఏబీ-పీఎంజేఏవై ప‌థ‌కం పురోగ‌తి
తాజా భార‌త ఆర్థిక స‌ర్వే(2024-25) ప్రకారం ఏబీ-పీఎంజేఏవై ప‌థ‌కం ప్రారంభ‌మైన నాటి నుంచి రూ.1.52 ల‌క్ష‌ల కోట్ల వైద్య ఖ‌ర్చుల నుంచి కుటుంబాల‌ను కాపాడింది.

2025 అక్టోబ‌ర్ 1 నాటికి ల‌బ్ధిదారుల‌కు మంజూరైన ఆయుష్మాన్ కార్డుల ప్ర‌కారం ఏబీ-పీఎంజేఏవైలో దాదాపు 42 కోట్ల మంది న‌మోద‌య్యారు. 86.51 ల‌క్ష‌ల‌కు పైగా 70 ఏళ్లు పైబ‌డిన 86.51 ల‌క్ష‌ల మంది వ‌యో వృద్ధుల‌కు ఆయుష్మాన్ వ‌య వంద‌న‌(వీవీఎస్‌) కార్డులు మంజూర‌య్యాయి. ఏబీ-పీఎంజేఏవై కింద దేశ‌వ్యాప్తంగా దాదాపు 33,000 ఆసుప‌త్రులు ఎన్‌ప్యానెల్ అయ్యాయి. వీటిలో 17,685 ప్ర‌భుత్వ‌, 15,380 ప్రైవేటు ఆసుప‌త్రులు.

ఈ ప‌థ‌కం కింద ప్ర‌జ‌లు పొందిన వివిధ ర‌కాల ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లు(2025 అక్టోబ‌ర్ 28 నాటికి)

 

వైద్య విభాగం పేరు

సంఖ్య‌

రూపాయ‌ల‌లో మొత్తం డ‌బ్బు

జ‌న‌ర‌ల్ మెడిసిన్

21741389

183725535263

నేత్ర వైద్యం

4499544

25218529234

మెడిక‌ల్ ఆంకాల‌జీ

4141188

45971190452

ప్ర‌సూతి, గైన‌కాల‌జీ

3564071

26921505469

సాధార‌ణ శస్త్ర‌చికిత్స‌

3334123

51359883676

ఎముక‌లు, కీళ్ల వైద్యం

2445678

81185282099

యూరాల‌జీ

1995470

36603974579

అత్య‌వ‌స‌ర గ‌ది(12 గంట‌ల కంటే త‌క్కువ వ‌స‌తి అవ‌స‌ర‌మైన సేవ‌లు)

1976059

3097080136

కార్డియాల‌జీ

1282206

86730606349

నియో-నాట‌ల్ కేర్‌

1104752

23200653194


ఏబీ-పీఎంజేఏవై బ‌డ్జెట్‌
ఈ ప‌థ‌కానికి పూర్తిగా భార‌త ప్ర‌భుత్వం, సంబంధిత రాష్ట్ర, కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు నిధులు ఇస్తాయి. ప‌థ‌కం ఖ‌ర్చును స‌మ‌నంగా పంచుకుంటాయి. ఈ ప‌థ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్ అంచ‌నాలు గ‌త కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. 2025-26 బ‌డ్జెట్‌లో రూ.9,406 కోట్లుగా అంచ‌నా.

గ‌త కొన్నేళ్లుగా ఏబీ-పీఎంజేఏవై కోసం కేంద్ర బ‌డ్జెట్‌:


 

ఆర్థిక సంవ‌త్స‌రం

బ‌డ్జెట్ అంచ‌నా(రూ.కోట్ల‌లో)

2019-20

6,556

2020-21

6,429

2021-22

6,401

2022-23

7,857

2023-24

7,200

2024-25

7,500

2025-26

9,406


ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు
ఆయుష్మాన్ భార‌త్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు(ఏఏఎం) రెండో కీల‌క విభాగం. ఇవి ప్ర‌జ‌ల నివాసాల ద‌గ్గ‌ర‌కే ప్రాథమిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. కేవ‌లం మాతృ, శిశు ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌కే ప‌రిమితం కాకుండా అసాంక్ర‌మిక వ్యాధులు, ఉప‌శ‌మన, రిహాబిలిటేష‌న్, నోటి, కంటి, ఈఎన్‌టీ, మానసిక వైద్యం, అత్య‌వ‌స‌ర‌, గాయాల‌కు ప్రాథ‌మిక చికిత్స‌, ఉచితంగా అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, రోగ నిర్ధార‌ణ సేవ‌లు వంటి విస్తృత శ్రేణి సేవ‌ల‌ను ఇవి అందిస్తాయి.

ప్రాథ‌మిక‌, ఉప‌-ఆరోగ్య సంర‌క్ష‌ణ కేంద్రాలతో కూడిన ఏఏఎంలో అవ‌స‌ర‌మైన ఈ కింది వ‌న‌రులు ఉంటాయి:
న‌వీక‌రించిన మౌలిక వ‌స‌తులు
అద‌న‌పు మాన‌వ‌వ‌న‌రులు
అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, రోగనిర్ధార‌ణ ప‌రిక‌రాలు
ఐటీ వ్య‌వ‌స్థ‌లు, మొద‌లైన‌వి.

గ్రామీణ ప్రాంతాలు స‌హా దేశ‌వ్యాప్తంగా అన్ని ఏఏఎంల‌లో టెలీక‌న్స‌ల్టేష‌న్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ఏఏఎంల‌లో 39.61 కోట్ల‌కు పైగా టెలీక‌న్స‌ల్టేష‌న్లు జ‌రిగాయి.(2025 సెప్టెంబ‌ర్ నాటికి).

ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్‌
ఆరోగ్య‌సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లోని ప్ర‌జ‌ల‌కు అభా(ఏబీహెచ్ఏ) విశిష్ఠ ఆరోగ్య గుర్తింపు సంఖ్య‌ల‌ను ఇస్తుంది. ఇది వివిధ స్థాయిలో వైద్య సేవ‌ల్లో అంత‌రాయం లేకుండా చూసేందుకు, గ్రామీణ‌, మారుమూల ప్రాంతాలు స‌హా అన్ని చోట్లా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉంచుతాయి.

ప‌థ‌కం పురోగ‌తి(2025 ఆగ‌స్టు 5 నాటికి):
79,91,18,072 అభా అకౌంట్ల ఏర్పాటు
హెచ్ఎఫ్ఆర్‌లో 4,18,964 ఆరోగ్య కేంద్రాల న‌మోదు
హెచ్‌పీఆర్‌లో 6,79,692 ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణుల న‌మోదు
అభాతో 67,19,65,690 ఆరోగ్య రికార్డుల అనుసంధానం

ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్‌
కొవిడ్‌-19 వేళ భార‌త ప్ర‌భుత్వం స‌మ‌గ్ర‌-ప్ర‌భుత్వ విధానాన్ని అవ‌లంభించి త్వ‌రిత‌గ‌తిన స్పందించింది. స్థానిక క్లినిక్‌ల నుంచి ప్ర‌ధాన ఆసుప‌త్రుల వ‌ర‌కు భార‌త‌దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల్లో మెరుగైన వ‌స‌తుల అవ‌స‌రాన్ని ఈ మ‌హ‌మ్మారి చూపించింది. ఈ అంత‌రాల‌ను పూడ్చేందుకు 2021-22 బ‌డ్జెట్‌లో భాగంగా పీఎం-ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్‌(పీఎం-అభిమ్‌) 2021 అక్టోబ‌ర్ 25న ప్రారంభ‌మైంది.

గ్రామాలు, న‌గ‌రాల్లో వైద్య‌ప‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, వ్యాధి ప‌ర్య‌వేక్ష‌ణ‌, వైద్య ప‌రిశోధ‌న‌లో ఉన్న అంత‌రాల‌ను ప‌రిష్క‌రించ‌డం పీఎం-అభిమ్ ప్ర‌ధాన ల‌క్ష్యం. త‌ద్వారా భ‌విష్య‌త్ మ‌హ‌మ్మారుల‌ను భార‌త్ స్వ‌తంత్య్రంగా ఎదుర్కోగ‌ల‌దు. 2005 నుంచి ఇది భార‌త్‌లో అతిపెద్ద ప్ర‌జారోగ్య మౌలిక వ‌స‌తుల ప‌థ‌కం. ఈ ప‌థ‌కం కోసం 2021-2026 మ‌ధ్య‌కాలంలో రూ.64,180 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. ఈ మొత్తంలో రూ.54,205 కోట్ల‌ను రాష్ట్ర‌స్థాయి కార్య‌క్ర‌మాల‌కు కేటాయించ‌గా, రూ.9,340 కోట్ల‌ను కేంద్ర కార్య‌క్ర‌మాల‌కు కేటాయించారు. భార‌త‌దేశ ఆసుప‌త్రులు, క్లినిక్‌లు, దేశ‌వ్యాప్తంగా వైద్య ప‌రిశోధ‌నా కేంద్రాల‌ను న‌వీక‌రించి భ‌విష్య‌త్ ఆరోగ్య అత్య‌వ‌స‌ర స్థితుల‌ను మెరుగ్గా ఎదుర్కొనేలా దేశాన్ని మార్చ‌డానికి చేప‌ట్టిన‌ భారీ ఐదేళ్ల ప్ర‌ణాళిక ఇది.

ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం: ప‌నితీరు అవ‌లోక‌నం
2025 నాటికి ప‌థ‌కం పురోగ‌తి:

2022-23, 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రాల మ‌ధ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల అభివృద్ధి, నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంయుక్తంగా రూ.5,000 కోట్లు వెచ్చించాయి.



ముగింపు
స‌మాజంలోని బ‌ల‌హీన వ‌ర్గాలకు నాణ్య‌మైన‌, స‌ర‌స‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను ఏబీ-పీఎంజేఏవై అందిస్తోంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను ప్ర‌జ‌ల నివాసాల‌కు చేరువ చేస్తోంది. అభా(ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ అకౌంట్‌) ప‌థ‌కం ప్ర‌తి పౌరుడికి విశిష్ట డిజిటిల్ ఆరోగ్య ఐడీ అందిస్తోంది. త‌ద్వారా నిరాటంకంగా వైద్య రికార్డుల‌ను నిర్వ‌హించ‌డానికి వీలు క‌లుగుతోంది. నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు స్పందించేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం ద్వారా ఆరోగ్యసంర‌క్ష‌ణ వ‌స‌తుల‌ను పీఎం-అభిమ్ బ‌లోపేతం చేస్తోంది.

ఆయుష్మాన్ భార‌త్‌, కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ మూడు ప‌థ‌కాలు అందుబాటులో, నాణ్య‌మైన‌, స‌మ‌గ్ర‌మైన ఆరోగ్య‌సంర‌క్ష‌ణ‌ను అందిస్తూ అందరికీ సార్వ‌జనిక ఆరోగ్య భ‌రోసాని కల్పిస్తున్నాయి.

 

 

References       

Click here for pdf file

 

***

(Backgrounder ID: 155882) Visitor Counter : 11
Provide suggestions / comments
Link mygov.in
National Portal Of India
STQC Certificate