Farmer's Welfare
సమీకృత కోల్డ్ చైన్, విలువ జోడింపు మౌలిక సదుపాయాలు(ఐసీసీవీఏఐ)
పొలం నుంచి వినియోగదారు వరకు భారతదేశ పంట కోత అనంతర సరఫరా గొలుసు
Posted On:
29 OCT 2025 10:13AM
కీలకాంశాలు
- 2025 జూలైలో కేంద్ర మంత్రివర్గం పీఎంకేఎస్‌వైకి రూ.1,920 కోట్లు అదనంగా కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో 15వ ఆర్థిక సంఘం కాలం(2026 మార్చి)లో మొత్తం వ్యయం రూ.6,520 కోట్లకు పెరిగింది.
- ఇందులో సమీకృత కోల్డ్ చైన్, విలువ జోడింపు మౌలిక సదుపాయాలు(ఐసీసీవీఏఐ) కింద 50 బహుళ ఉత్పత్తుల ఆహార నిల్వ కేంద్రాలకు రూ.1,000 కోట్ల కేటాయింపు
- 2008 నుంచి 395 కోల్డ్ చైన్ ప్రాజెక్టులకు ఆమోదం, వీటిలో 291 పూర్తై పని చేస్తున్నాయి. ఇవి వార్షికంగా 25.52 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ, 114.66 లక్షల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 1.74 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.
- 2016-17 నుంచి 269 ప్రాజెక్టుల కోసం ఆమోదం పొందిన రూ.2,066.33 కోట్లలో రూ.1,535.63 కోట్లు విడుదలయ్యాయి. వీటితో దేశవ్యాప్తంగా 169 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
పరిచయం
భారత్‌లో పంట కోత తర్వాత వచ్చే నష్టాలు కీలక సవాల్‌గా కొనసాగుతోంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, డెయిరీ, మాంసం, పౌల్ట్రీ, చేపలు వంటి పాడైపోయే ఉత్పత్తులతో ఎక్కువగా నష్టం వస్తోంది. పంట కోత నుంచి రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ వరకు మొత్తం సరఫరా గొలుసులో నష్టాలు వస్తున్నాయని పరిశోధనలు తేల్చాయి. ఈ నష్టాల వల్ల రైతుల ఆదాయం తగ్గిపోవడంతో పాటు వినియోగదారులకు ధరలు పెరుగుతున్నాయి. ఆహార భద్రత బలహీనమవుతోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఓఎఫ్‌పీఐ) సమీకృత కోల్డ్ చైన్, విలువ జోడింపు మౌలిక సదుపాయాల పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన(పీఎంకేఎస్‌వై)లో భాగమైన కోల్డ్ చైన్ పథకంగా దీనిని సాధారణంగా పిలుస్తారు. పొలం నుంచి దుకాణం వరకు అవాంతరాలు లేని కోల్డ్ చైన్ వ్యవస్థ నిర్మించడం ద్వారా పంట కోత తర్వాతి నష్టాలను తగ్గించి, రైతులు తమ ఉత్పత్తుల నుంచి మెరుగైన లాభాలు పొందేందుకు సాయపడాలనేది ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం ముందే ప్రారంభమైనప్పటికీ 2016-17లో పునర్వ్యవస్థీకరించి పీఎంకేఎస్‌వై కింద చేర్చారు. పీఎంకేఎస్‌వై అనేది కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పథకం. పొలం నుంచి దుకాణం వరకు సమర్థవంతమైన అనుసంధానాలు, సరఫరా గొలుసు నిర్వహణ ద్వారా అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. రైతులు, ప్రాసెసింగ్ సంస్థలు, మార్కెట్లను కలిపేలా, వృథాను తగ్గించేలా, ఉపాధిని పెంచేలా, త్వరగా పాడయ్యే ఉత్పత్తుల రంగంలో పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు గానూ కోల్డ్ చైన్ పథకాన్ని పీఎంఎస్‌కేవై పరిధిలోకి తీసుకువచ్చి సంపూర్ణ కోల్డ్ చైన్ వ్యవస్థలను రూపొందిస్తున్నారు.
కోల్డ్ చైన్ సదుపాయాల ప్రాధాన్యత కేవలం నిల్వ చేయడానికి మించి విస్తరించింది. పొలాల్లోనే ప్రీ-కూలింగ్ సదుపాయాలు, అధునాతన ప్రాసెసింగ్ కేంద్రాలు, సమర్థమైన పంపిణీ కేంద్రాలు, ఉష్ణోగ్రతను నియంత్రించగలిగే రవాణా వ్యవస్థలు ఇందులో భాగం. ఈ పథకం ఉద్యానవన(పండ్లు, కూరగాయలు మినహాయించి, ఇవి 2022 నుంచి ప్రత్యేక పథకం కిందకు చేరాయి), పాడి పరిశ్రమ, మాంసం, పౌల్ట్రీ, సముద్ర, చేప ఉత్పత్తులు(రోయ్యలు మినహా) వంటి బహుళ రంగాలకు ఈ పథకం వరిస్తోంది. తద్వారా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు కీలకమైన త్వరగా పాడయ్యే ఉత్పత్తుల పెద్ద సమస్య పరిష్కారమవుతోంది. సహాయాన్ని క్రమబద్ధీకరించడం, నకిలీని నిరోధించడం దీని లక్ష్యం. సరఫరా గొలుసుల స్థిరీకరణపై దృష్టి పెడుతూ పండ్లు, కూరగాయలు, రొయ్యలను పీఎంకేఎస్‌వైలోని మరో భాగమైన ఆపరేషన్ గ్రీన్స్ పథకం కిందకు బదిలీ చేయడమైంది.
ఐసీసీవీఏఐ పథకం ద్వారా ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, డెయిరీ, చేపల రంగాల్లో వృథా గణనీయంగా తగ్గిందని 2020లో నాబార్డ్ కన్జల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(నాబ్‌కాన్స్) చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
ఐసీసీవీఏఐ లక్ష్యాలు
కోల్డ్ చైన్ సదుపాయాల సమగ్రాభివృద్ధి ఈ పథకం వ్యవస్థాపక లక్ష్యం:

ఐసీసీవీఏఐలోని కీలక విభాగాలు
సరఫరా గొలుసుల వ్యవస్థ వ్యాప్తంగా సదుపాయాల కల్పనకు ఈ పథకం సహాయాన్ని అందిస్తోంది. పొలం దగ్గర కూడా మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు ఇస్తోంది. ఈ పథకం కింద(22.05.2025 మార్గదర్శకాల ప్రకారం) ఆర్థిక సాయాన్ని పొందాలంటే దరఖాస్తుదారు పొలం సేద్యం చేసే భూమి స్థాయిలోనే మౌలిక సదుపాయాలను(ఎఫ్ఎల్ఐ) ఏర్పాటుచేసుకోవడంతో పాటు పంపిణీ కేంద్రం(డీహెచ్) లేదా శీతలీకరణ సౌకర్యం ఉన్న రవాణా వ్యవస్థకు అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి.

కీలక విభాగాలు ఇవి:
ఆహార ప్రాసెసింగ్ కేంద్రాల స్థాపనకు పీఐఏ అర్హత
ఐసీసీవీఏఐ అనేది డిమాండ్ ఆధారిత పథకం. వివిధ అర్హత గల సంస్థలు(ప్రాజెక్టు అమలు సంస్థలు(పీఐఏలు)) ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలను స్థాపించవచ్చు. పీఏఐ ఈ కింద వారిలో ఎవరైనా కావచ్చు:
వ్యక్తులు(రైతులు సహా) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు(ఎఫ్‌పీవో), ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు(ఎఫ్‌పీసీ), ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జీవో), ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ)లు, సంస్థలు, పరిశ్రములు, కార్పొరేషన్లు, సహకార సంఘాలు, స్వయం సహాయ సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) వంటి సంస్థలు
నిధుల లభ్యతను బట్టి ఆసక్తిని వ్యక్తం చేయాల్సిందిగా(ఈఓఐ) అర్హత గల సంస్థల నుంచి మంత్రిత్వ శాఖ దరఖాస్తులు లేదా ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. ఆహార పదార్థాల నిల్వకు రాష్ట్రాల నుంచి సమ్మతి పొందడం తప్పనిసరి కాకపోయినా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో రాష్ట్రాల సహకారం అవసరం.
ఐసీసీవీఏఐ పథకాన్ని అమలుచేసే ప్రభుత్వ కీలక కార్యక్రమాలు
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్), జాతీయ ఉద్యానవన బోర్డు(ఎన్‌హెచ్‌బీ), వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్) వంటివి ఐసీసీవీఏఐ పథకాన్ని అమలు చేసే కొన్ని ప్రభుత్వ కీలక కార్యక్రమాలు.
- మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్)
ఎంఐడీహెచ్ కింద దేశవ్యాప్తంగా 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణ వంటి ఉద్యానవన పంటలకు సంబంధించిన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందజేసిన వార్షిక కార్యచరణ ప్రణాళికల ఆధారంగా ఈ ప్రాజెక్టులు అమలవుతాయి. డిమాండ్, వ్యవస్థాపకత ఆధారంగా కోల్డ్ స్టోరేజీ పథకం అమలవుతోంది. ఇందుకోసం సాధారణ ప్రాంతాల్లో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం, ఈశాన్య, పర్వత రాష్ట్రాలు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50 శాతం వరకు క్రెడిట్-లింక్డ్ సబ్సిడీలు అందుతాయి. సంబంధిత రాష్ట్ర ఉద్యానవన మిషన్‌ల ద్వారా ఈ పథకం అమలవుతుంది.
- ఆపరేషన్ గ్రీన్స్ పథకం
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 2018-19 నుంచి కేంద్ర ఆహార ప్రాసెసంగ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న మరో కేంద్ర రంగ పథకం ఇది. రైతుల ఉత్పత్తుల విలువ పెంచడం, పంట కోత తర్వాతి నష్టాలను తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం మొదట టమోట, ఉల్లి, అలుగడ్డల కోసం సమీకృత విలువ గొలుసును అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రారంభమైంది. తర్వాత ఇతర కూరగాయలు, పండ్లు, రొయ్యలకు కూడా విస్తరింపజేశారు.
- జాతీయ ఉదన్యావన బోర్డు(ఎన్‌హెచ్‌బీ)
ఉద్యానవన ఉత్పత్తుల గిడ్డంగి, శీతల గిడ్డంగుల నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణ కోసం పెట్టుబడిపై సబ్సిడీ పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. సాధారణ ప్రాంతాల్లో ప్రాజెక్టు పెట్టుబడి వ్యయంలో 35%, ఈశాన్య, పర్వత, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని ఈ పథకం అందిస్తుంది. 5,000 మెట్రిక్ టన్నుల నుంచి 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో శీతల, ఉష్ణోగ్రతను నియంత్రించగలిగే గిడ్డంగుల నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణకు ఈ పథకం సహాయం అందిస్తుంది. తద్వారా శాస్త్రీయంగా నిల్వ సదుపాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉద్యానవన రంగంలో పంట కోత అనంతర నష్టాలను తగ్గిస్తోంది.
- వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులు(ఏఐఎఫ్)
దేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్ల కార్పస్‌తో ఏఐఎఫ్‌ను ప్రారంభించింది. పంట కోత అనంతర నిర్వహణ సదుపాయాలు కల్పించడం, శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు సహా సామాజిక వ్యవసాయ ఆస్తులను సృష్టి సులభతరం చేయడం ఈ నిధి లక్ష్యం. అర్హులైన లబ్ధిదారులు రూ.2 కోట్ల వరకు పుచీకత్తు లేని రుణాన్ని, రుణంపై ఏడాదికి 3% వడ్డీ రాయితీని పొందవచ్చు.
ఆర్థిక సహాయం
పీఎంకేఎస్‌వై(2025) కింద నిధులు పెంపు
పీఎంకేఎస్‌వై పథకం కోసం రూ.1,920 కోట్ల అదనపు వ్యయానికి 2025 జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 15వ ఆర్థిక సంఘం కాలం(మార్చి 31, 2026 వరకు) మొత్తం కేటాయింపు రూ.6,520 కోట్లకు పెరిగింది. సమీకృత కోల్డ్ చైన్, విలువ గొలుసు సదుపాయాల(ఐసీసీవీఏఐ) పథకం కింద 50 బహుళ ఉత్పత్తుల ఇరాడియేషన్ కేంద్రాల స్థాపనకు సహాయం అందించేందుకు కేటాయించిన రూ.1,000 కోట్లు కూడా ఇందులో భాగం. కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల ప్రభావాన్ని విస్తరింపజేయడానికి ప్రభుత్వ బలమైన నిబద్ధతను ఈ బడ్జెట్ పెంపు నిర్ణయం ప్రతిబింబిస్తోంది.
ఈ పథకం సాధారణ ప్రాంతాల్లో సమీకృత కోల్డ్ చైన్ ప్రాజెక్టుల స్థాపనకు 35% సబ్సిడీ అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ బృందాలు, ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీల ప్రతిపాదనలతో పాటు సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లడఖ్, సమీకృత గిరిజనాభివృద్ధి కార్యక్రమం(ఐటీడీపీ) ప్రాంతలు, ద్వీపాల్లో ప్రాజెక్టు వ్యయంపై 50% సబ్సిడీ అందుతుంది. ఒక్కో ప్రాజెక్టు రూ.10 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు.
విజయాలు, పురోగతి
2008లో కోల్డ్ చైన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2025 జూన్ వరకు 395 సమీకృత కోల్డ్ చైన్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిల్లో 291 ప్రాజెక్టులు ఇప్పటివరకు పూర్తై పనిచేస్తున్నాయి. తద్వారా ఏడాదికి 25.52 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) నిల్వ సామర్థ్యం, 114.66 ఎల్ఎంటీ ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగింది. పూర్తై, కార్యకలాపాలు ప్రారంభించిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 1,74,600 ఉద్యోగాల సృష్టికి దోహదపడ్డాయి.
2016-17 తర్వాత గణనీయ పురోగతి కనిపించింది. 2016-17 నుంచి 269 ఆమోదిత ప్రాజెక్టుల కోసం వ్యయం, సబ్సిడీగా రూ.2,066.33 కోట్లకు ఆమోదం లభించగా, రూ.1,535.63 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. తద్వారా దేశవ్యాప్తంగా 169 కోల్డ్ చైన్ ప్రాజెక్టులు పూర్తై కార్యకలాపాలు ప్రారంభించాయి.
ప్రధాన సవరణలు, విధానపరమైన మార్పులు
ఈ పథకం సమర్థత పెంచేందుకు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటానికి అనేక సవరణలు జరిగాయి.
2022 జూన్ సవరణ: 2022 జూన్ 8న ఈ పథకంలో కీలకమైన విధాన మార్పు అమలులోకి వచ్చింది. అప్పటివరకు పండ్లు, కూరగాయల కోల్డ్ చైన్ ప్రాజెక్టులకు సహాయాన్ని నిలిపివేసి, పీఎంకేఎస్‌వైలో మరో భాగంగా ఉన్న ఆపరేషన్ గ్రీన్స్ పథకం కిందకు మార్చడమైంది. ఉద్యానవన రంగంలో ధరల స్థిరీకరణ కోసం ఈ మార్పు జరిగింది. ఈ వ్యూహాత్మక పునఃకేటాయింపు ప్రత్యేక దృష్టి సారించడానికి, నిధులను సమర్థంగా వినియోగించడానికి దోహదపడుతోంది.

2024 ఆగస్టు మార్గదర్శకాలు: కోల్డ్ చైన్ పథకంలో భాగంగా బహుళ ఆహార ఇరాడియేషన్ కేంద్రాల(ఆహారం పాడవకుండా ఉండటానికి, నిల్వ కాలం పెంచడానికి, వివిధ ఉత్పత్తుల పంట కోత అనంతర నష్టాలను తగ్గించడానికి అయోనైజింగ్ రేడియేషన్ వినియోగం) స్థాపనకు 2024 ఆగస్టు 6న పథకం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం పోషకాల నాణ్యతలో రాజీ లేకుండా ఆహార భద్రతను కాపాడుతూ నిల్వ కాలం పెంచేందుకు అధునాతన నిల్వ సాంకేతికతలను వినియోగాన్ని ప్రతిబింబిస్తోంది.
2025 మే సవరణ: పొలం దగ్గరి నుంచి వినియోగదారు వరకు మొత్తం సరఫరా గొలుసులో విలువ జోడింపు మౌలిక సదుపాయాలను, నిల్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టితో 2025 మే 22న తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉద్యానవన ఉత్పత్తులకు సంబంధించి పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడంతో పాటు రైతులు న్యాయమైన, గిట్టుబాటు ధరలు పొందేందుకు, ఆహార ఉత్పత్తులు ఏడాది పొడవునా అందుబాటులో ఉంచడం ద్వారా వినియోగదారులు లబ్ధి పొందేలా చూడటం ఈ చర్యల లక్ష్యం.
ముగింపు
ఈ పథకం పరిణామక్రమం అనుకూల పరిపాలనను ప్రతిబింబిస్తోంది. 2022లో పండ్లు, కూరగాయలను ఆపరేషన్ గ్రీన్స్ పథకానికి మార్చడం వ్యూహాత్మక నిర్ణయం. 2025లో బడ్జెట్‌ను రూ.6,520 కోట్లకు పెంచడం కోల్డ్ చైన్ సదుపాయాల ప్రభావాన్ని విస్తరించడం, బలోపేతం చేయడంపై ప్రభుత్వ దృష్టిని చాటుతోంది. ఇరాడియేషన్ కేంద్రాల ఏర్పాటు, ఎప్పటికప్పుడు మార్గదర్శకాల సవరణ అనేవి సాంకేతికత పురోగతి, క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా ప్రతిస్పందించేతత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
రైతుల నుంచి పెద్దస్థాయి కార్పొరేట్ సంస్థల వరకు ఉన్న విస్తృత భాగస్వామ్యపక్షాలకు కోల్డ్ చైన్ వ్యవస్థ అభివృద్ధి ఆర్థికంగా ఆచరణ యోగ్యంగా ఉండేలా ఈ పథకం ఆర్థిక ఛట్రం భరోసానిస్తోంది. అసలైన మార్గెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులను అమలు చేయడమే ఈ పథకం లక్ష్యం. ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ, సమర్థ ఇంధన వినియోగ వ్యవస్థలు, ఏఐ ఆధారిత రవాణా వ్యవస్థ వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడం నిర్వహణ సామర్థ్యాన్ని భారీగా పెరిగే పెంచుతుంది. వ్యవాసయ మార్కెటింగ్ సంస్కరణల అనుసంధాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.
Ministry of Food Processing Industries (MoFPI)
Press Information Bureau
Sansad
Click here to see PDF
***
(Backgrounder ID: 155844)
आगंतुक पटल : 25
Provide suggestions / comments