Social Welfare
జాతీయ ఐక్యతా దినోత్సవం: జాతీయ ఐక్యతకు మూలస్తంభం
Posted On:
30 OCT 2025 11:48AM
కీలకాంశాలు
- భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పదనాన్ని గౌరవిస్తూ ప్రతియేటా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రస్తుత జాతీయ సవాళ్ల నేపథ్యంలో దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం.
- 2025వ సంవత్సరం సర్దార్ పటేల్ 150వ జయంతి.
- కెవాడియాలోని ఏక్తానగర్‌లో జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్నారు.
- దేశభక్తి, సామాజిక సామారస్యాన్ని పెంపొందించేలా రన్ ఫర్ యూనిటీ, యూనిటీ మార్చ్ వంటి వార్షిక కార్యక్రమాలు పౌరులు, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేస్తాయి.
పరిచయం
నేషనల్ యూనిటీ డే అని కూడా పిలిచే జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతియేటా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జరుపుకుంటాం. భారతదేశ ఐక్యత కోసం, జాతీయ, రాజకీయ సమైక్యతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించిన సర్దార్ పటేల్‌కు గుర్తుగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దేశ సార్వభౌమత్వం, శాంతి, సమగ్రతను కాపాడాల్సిన ప్రాముఖ్యతను ఐక్యతా దినోత్సవం చాటి చెప్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనే నిబద్ధత పట్ల ప్రజలను ప్రోత్సహిస్తోంది.

దేశ నిర్మాణానికి సర్దార్ పటేల్ చేసిన విశేష కృషిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2014 మొదటిసారి జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ తర్వాతి ఏడాది 2015 అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం రోజుల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సుస్థిర, నిర్మాణాత్మక అనుసంధానం ద్వారా వారి మధ్య బంధాన్ని, అవగాహనను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. అప్పటినుంచి దేశంలోని వివిధ భాగాల ప్రజల మధ్య బంధాన్ని ప్రోత్సహించేలా 10కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు వివిధ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.
ఈ ఏడాది సర్దార్ పటేల్ 150వ జయంతి కావడంతో ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం మరింత ప్రత్యేకమైనది.
దేశ సమగ్రతకు పునాది
1947లో స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత ప్రక్రియలో కీలకపాత్ర పోషించారు. భారత భూభాగం, జనాభాలో దాదాపు 40 శాతం ఉన్న 560 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. సంస్థానాలు భారత్‌లో లేదా పాకిస్తాన్‌లో కలవడమా లేదంటే రెండు దేశాల్లో కలవకుండా ఉండటమా అనేది నిర్ణయించుకునే అవకాశాన్ని సంస్థానాల పాలకులకు భారత స్వాతంత్య్ర చట్టం కల్పించింది. ఈ నేపథ్యంలో విభజన ధోరణిని నివారించేందుకు సర్దార్ పటేల్ దౌత్యపరమైన చర్యలు, ఒప్పించడం, అవసరమైన చోట దృఢమైన పరిపాలనా చర్యల తీసుకోవడం అనే కలయికను పాటించారు. తను నేతృత్వం వహించిన సంస్థానాల శాఖ ద్వారా సర్దార్ పటేల్ 1947 ఆగస్టు 15 నాటికి, ఆ తర్వాత కొంతకాలంలోనే ఈ సంస్థానాలను విజయవంతంగా భారత్‌లో విలీనం చేయగలిగారు. తద్వారా ఆధునిక భారతదేశ భౌగోళిక సమగ్రతను కాపాడారు. ఆయన ప్రయత్నాలు విచ్ఛిన్నమైన అవకాశాలను నివారించడంతో పాటు ఉమ్మడి ప్రజాస్వామ్య గణతంత్రానికి పునాది వేశాయి. గందరగోళ విభజన కాలంలో ఉన్న దేశానికి ఈ 'ఉక్కు మనిషి' తన నిర్ణయాత్మక నాయకత్వంతో అంతర్గత స్థిరత్వాన్ని అందించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతున్న దృఢమైన వ్యవస్థ అయిన అఖిల భారత సర్వీసులను సైతం ఆయన సృష్టించారు.


ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్: సర్దార్ పటేల్ వారసత్వాన్ని కొనసాగించడం
సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”(ఈబీఎస్‌బీ) కార్యక్రమం దేశ సమైక్యత పట్ల సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహనను ప్రోత్సహించడంతో పాటు పరస్పర సంబంధాలు, సహకారం ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని వేడుకగా జరుపుతోంది.
ఈ కార్యక్రమ కీలక లక్ష్యాలు ఇవి:
- పౌరుల మధ్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడం.
- నిర్మాణాత్మక అంతర్రాష్ట్ర కార్యక్రమాల ద్వారా జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం.
- భారతదేశ విభిన్నమైన సంస్కృతులను ప్రదర్శించడం, ప్రశంసించడం.
- దీర్ఘకాల భాగస్వామ్యాలను నిర్మించడం
- ప్రాంతాలు పరస్పర అవగాహన, ఉత్తమ పద్ధతులను పంచుకోవడాన్ని ప్రోత్సహించడం.
భాషాపరమైన, సాంస్కృతిక, విద్యాపరమైన అంశాలను పరస్పరం పంచుకోవడం ద్వారా భావోద్వేగ బంధాలను బలోపేతం చేసేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జత చేయడంతో ఈ కార్యక్రమం “భిన్నత్వంలో ఏకత్వం” అనే ఆలోచనను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం జాతీయ ఐక్యతా దినోత్సవం సందేశం ఒక రోజుకే కాకుండా జాతి సమైక్యత కోసం సుస్థిర ఉద్యమంగా మారుస్తుంది.
ఐక్యతా దినోత్సవ స్ఫూర్తితో ఈబీఎస్‌బీ వేడుకలు, కార్యక్రమాలు:
- 22 అధికారిక భారతీయ భాషల్లో నిత్యజీవితంలో వాడే 100కు పైగా వాక్యాలను నేర్చుకోవడానికి భాషా సంఘం యాప్.
- సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహార ఉత్సవాలు.
- విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు - “యువ సంఘం”
- పరస్పర అవగాహనను పెంపొందించుకునేందుకు జత కలిసిన రాష్ట్రాల యువత చర్చించుకునేలా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈబీఎస్‌బీ క్లబ్బుల ఏర్పాటు.
- కాశీ తమిళ సంగమం - కాశీ, తమిళనాడు మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని ఉత్సవంగా జరుపుకునే కార్యక్రమం. కళ, భాష, సంప్రదాయాలను పంచుకోవడం ద్వారా సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమం.
- డిజిటల్, ప్రజలకు చేరువయ్యే ప్రచారాలు - సమైక్యత, దేశభక్తిని ప్రోత్సహించడానికి, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంపై జ్ఞానాన్ని పెంచడానికి ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా మై భారత్ డిజిటల్ పోర్టల్, ఈబీఎస్‌బీ క్విజ్ పోటీలు.
- జాతీయ ఐక్యతా దినోత్సవం వెనుక సంకల్పానికి డిజిటల్ విస్తరణలా ఈబీఎస్‌బీ పోర్టల్ పనిచేస్తుంది. జాతీయ సమగ్రతను బలోపేతం చేసేందుకు కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు వేదికగా నిలుస్తోంది. ఐక్యతా దినోత్సవం రోజుల ప్రారంభించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన ప్రచారాలు, అంతర్రాష్ట్ర పరస్పర సాంస్కృతిక మార్పిడి, యువత కోసం నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు ఈ పోర్టల్‌లో ఉంటాయి. లక్షల మంది సందర్శకులతో ఈ పోర్టల్ డిజిటల్ కోశాగారంగా సంవత్సరం పడవునా దేశ ఐక్యతా స్ఫూర్తిని సజీవంగా ఉంచుతోంది. ఈబీఎస్‌బీ వాల్ ద్వారా దేఖో అప్నా దేశ్(పర్యాటకం), దేశీయ క్రీడా లక్షణాలను ప్రదర్శించడం ద్వారా నెలవారీ కార్యకలాపాలను ప్రత్యేకంగా చూపించడం భారతదేశ వైవిధ్యం, సామూహిక గుర్తింపును ప్రతిబింబిస్తోంది.
2025 ప్రాముఖ్యత: 150వ జయంతి
ఈ కార్యక్రమం ఏడాది పొడవునా, దేశవ్యాప్తంగా జ్ఞాపకార్థంగా జరిగింది. ఆధునిక భారతదేశంలో, ముఖ్యంగా సమైక్యత, సామాజిక ఐక్యతలో ప్రపంచవ్యాప్త సవాళ్ల నేపథ్యంలో సర్దార్ పటేల్ నిరంతర ప్రాముఖ్యతను ఈ మైలురాయి ప్రతిబింబిస్తోంది. జాతీయ ఐక్యతా దినోత్సవ స్ఫూర్తి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్(ఈబీఎస్‌బీ) సూత్రాలతో లోతుగా ముడిపడి ఉంది. జతపరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన, సాంస్కృతిక మార్పిడి, భాషా ప్రశంసల ద్వారా పౌరుల మధ్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను బలోపేతం చేయడం ద్వారా జాతీయ సమైక్యతను ఒక ఉత్సవ ఆచారంగా కాకుండా నిరంతరం కొనసాగే ప్రజా ఉద్యమంగా మారుస్తాయి.
అక్టోబర్ 31న ఉదయం 8 గంటల సమయంలో ఐక్యతా మూర్తి దగ్గర ప్రధాననమంత్రి పుష్పాంజలి సమర్పిస్తారు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం జరుగుతుంది. సర్దార్ పటేల్ 150 జయంతి కార్యక్రమాలు ఇలా జరుగుతాయి:
విభాగం వివరాలు
ప్రధాన కార్యక్రమ తేదీ
అక్టోబర్ 31(వార్షికంగా) - జాతీయ ఐక్యతా దినోత్సవం
ప్రధాన పరేడ్‌కు వేదిక/ఉత్సవం(ఈ ఏడాది)
- గుజరాత్ నర్మదా జిల్లాలోని ఏక్తానగర్(గతంలో యూనిటీ టౌన్)
- భారత వాయుసేకు చెందిన సూర్యకిరణ్ బృందం చేత ఎయిర్ షో.
పరేడ్ - పాల్గొనే విభాగాలు
- 9 రాష్ట్రాలు + 1 కేంద్రపాలిత ప్రాంత పోలీసు శాఖల నుంచి 16 కవాతు దళాలు.
- 4 కేంద్ర సాయుధ పోలీపు బలగాలు(సీఏపీఎఫ్)
- ఎన్‌సీసీ క్యాడెట్లు
- ప్రత్యేక విభాగాలు: ఉదా., బీఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్, అస్సాం పోలీస్ మోటార్‌సైకిల్ ప్రదర్శన, బీఎస్ఎఫ్ ఒంటెల బృందం, బ్యాండ్.
మహిళా అధికారుల పాత్ర/ప్రత్యేకం
ప్రధానమంత్రికి గౌరవ వందనం సమర్పించే దళానికి మహిళా అధికారి నేతృత్వం వహిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమం & శకటాలు
- “భిన్నత్వంలో ఏకత్వం”(యూనిటీ ఇన్ డైవర్సిటీ) ఇతివృత్తంతో వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన
- దాదాపు 900 మంది కళాకారులు భారతీయ శాస్త్రీయ, జానపద రూపాలను ప్రదర్శించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారీ సాంస్కృతిక కార్యక్రమం.
విస్తృత ఉత్సవం / “భారత్ పర్వ్”
2025 నవంబర్ 1 నుంచి 15 వరకు ఏక్తానగర్‌లో భారత్ పర్వ్ కార్యక్రమం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహార ఉత్సవాలు జరుగుతాయి. నవంబర్ 15న గిరిజన తెగల అద్భుతమైన సంస్కృతి, దృఢమైన స్ఫూర్తిని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలతో భగవాన్ బిర్సా ముండా జయంతిని జరుపుకోవడం ద్వారా ఈ వేడుక ముగుస్తుంది.
ఇతర విశేషాలు
- దివ్యాంగులు, విద్యార్థులు, సీఏపీఎఫ్ దళాలు వంటి వారితో ఢిల్లీలో రన్ ఫర్ యూనిటీ(రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోట వరకు) మారథాన్.
- ఏక్తానగర్‌లో రూ.280 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన.
భారతీయ జాతి శునకాల ప్రత్యేక కవాతు
2025 జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో భారతీయ జాతికి చెందిన శునకాలు, ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన రాంపూర్ హౌండ్స్, ముధోల్ హౌండ్స్‌తో ప్రత్యేక కవాతు బృందం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతింబించేలా ఈ దేశీయ జాతులు తమ అసాధారణమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి. అఖిల భారత పోలీస్ శునకాల పోటీల్లో మొదటి స్థానాన్ని సాధించిన ముధోల్ హౌండ్ "రియా" ఈ బృందానికి నేతృత్వం వహించనుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరగనున్న పరేడ్ జాతీయ భద్రతలో వాటి పాత్రను చాటుతుంది. భారతదేశ స్థానిక శునకాల వారసత్వాన్ని ప్రదర్శించడం భిన్నత్వంలో ఏకత్వం అనే ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది.

సర్దార్@150 ఐక్యతా మార్చ్
ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సూత్రాలకు అనుగుణంగా యువతలో ఐక్యత, దేశభక్తి, పౌర బాధ్యతను పెంపొందించడానికి కేంద్ర యుజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఐక్యతా మార్చ్‌ను నిర్వహించింది. 2025 అక్టోబర్ 6న కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా మై భారత్ పోర్టల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా రీల్స్ పోటీ, వ్యాసరచన పోటీ, సర్దార్@150 యువ నేతల కార్యక్రమం వంటివి జరిగింది. వీటిల్లో విజేతలుగా నిలిచిన 150 మంది జాతీయ పాదయాత్రలో పాల్గొంటారు.


ఐక్యతా మార్చ్ రెండు దశల్లో జరుగుతుంది. 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు మొదటి దశలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని జిల్లాస్థాయి పాదయాత్రలు జరుగుతాయి. ఈ పాదయాత్రలకు ముందు వ్యాసరచన పోటీలు, చర్చా పోటీలు, సర్దార్ పటేల్ జీవితం, ఆయన చేసిన కృషిపై సెమినార్లు, పాఠశాలలు, కళాశాలల్లో వీధినాటకాలు వంటి కార్యక్రమాలు సహా అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పాదయాత్రతో పాటు జిల్లాల వ్యాప్తంగా నీటి వనరుల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు, “సర్దార్ ఉప్వాన్” కార్యక్రమం కింద మొక్కలు నాటడం, మహిళా సంక్షేమ, యోగా, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, “వోకల్ ఫర్ లోకల్” ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. జాతీయ పాదయాత్ర 2025 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు 152 కిలోమీటర్ల మేర జరుగుతుంది. కరంసద్(గుజరాత్‌లోని సర్దార్ పటేల్ జన్మస్థలం) నుంచి కెవాడియాలోని ఐక్యతా మూర్తి వరకు పాదయాత్ర జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు, యువ నేతల భాగస్వామ్యంతో మార్గమధ్యలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. భారతదేశ వైవిధ్య సాంస్కృతి, సర్దార్ పటేల్ జీవితాన్ని చూపించే ప్రదర్శన జరుగుతుంది.
రన్ ఫర్ యూనిటీ
జాతీయ ఐక్యతా దినోత్సవం కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రచార కార్యక్రమాల్లో "రన్ ఫర్ యూనిటీ"
జాతీయ ఐక్యత వైపు సమిష్టిగా అడుగులు వేసేందుకు ఉద్దేశించిన దేశవ్యాప్త మారథాన్ కార్యక్రమం ఇది. 2025కి సంబంధించి అక్టోబర్ 31న రన్ ఫర్ యూనిటీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ముఖ్యనగరాల్లో వేలాది మంది ఈ పరుగులో పాల్గొంటారని అంచనా. న్యూఢిల్లీలో కేంద్రమంత్రులు జెండా ఊపి పరుగును ప్రారంభిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు పాల్గొనాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ముగింపు
అనేక సంస్థానాల నుంచి సమైక్య భారతదేశంగా నిర్మించిన సర్దార్ పటేల్ దార్శనిక నాయకత్వాన్ని ఎప్పటికీ స్మరించుకునేందుకు శాశ్వత చిహ్నంగా జాతీయ ఐక్యతా దినోత్సవం జరుగుతోంది. ఆయన వేసిన పునాది నేటికీ దేశ పురోగతికి ఆధారంగా నిలుస్తోంది. చారిత్రక గౌరవాన్ని ఆధునిక చైతన్యంతో కలిపి ప్రతిజ్ఞలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ కార్యక్రమం గత విజయాలను గుర్తు చేయడమే కాకుండా ఆధునిక విభజన శక్తులకు చురుగ్గా ఎదుర్కంటుంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ భావనను బలోపేతం చేస్తుంది. జాతీయ సమైక్యతకు జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతీకగా నిలిచే రోజు అవుతుంది. జాతీయ భాషా సమారోహాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువ పరివర్తన్ కార్యక్రమాలు వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం ఏడాదంతా కొనసాగుతుంది. ఈ నిరంతర ప్రయత్నాలు భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని వార్షిక కార్యక్రమంలా కాకుండా ప్రతిరోజూ ప్రతిధ్వనింజేలా చేస్తాయి.
References
Press Information Bureau:
Ministry of Youth Affairs & Sports
Government of India
Click here to see PDF
***
(Backgrounder ID: 155825)
Visitor Counter : 3
Provide suggestions / comments