• Sitemap
  • Advance Search
Farmer's Welfare

పీకేవీవై: భార‌త్‌లో సేంద్రీయ వ్య‌వ‌సాయానికి ప్రోత్సాహం

సేంద్రీయ వ్య‌వ‌సాయానికి ఊతం, రైతుల‌కు సాధికార‌త‌, గ్రామీణ భార‌త్‌ బ‌లోపేతం

Posted On: 06 OCT 2025 11:03AM

కీల‌కాంశాలు
- 30.01.2025 నాటికి పీకేవీవై(2015-25) కింద రూ.2,265.86 కోట్లు విడుద‌ల‌
- ఆర్‌కేవీవై కింద పీకేవీవై కోసం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.205.46 కోట్లు విడుద‌ల‌
- దాదాపు 15 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సేంద్రీయ వ్య‌వ‌సాయం; 52,289 క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు; 25.30 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి(2025 ఫిబ్ర‌వ‌రి నాటికి)
- 2024 డిసెంబ‌ర్ నాటికి 6.23 ల‌క్ష‌ల మంది రైతులు, 19,016 స్థానిక బృందాలు, 89 స‌ర‌ఫ‌రాదారులు, 8,676 కొనుగోలుదారులు జైవిక్ ఖేతి పోర్ట‌ల్‌లో న‌మోద‌య్యారు.

ప‌రిచ‌యం
భార‌తీయ వ్య‌వ‌సాయం నిరంత‌రం సంప్ర‌దాయ జ్ఞానం, సుస్థిర ప‌ద్ధతుల ద్వారా శ‌క్తిని పొందుతోంది. అయితే, అధిక దిగుబ‌డి అందించే వ్య‌వ‌సాయం గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం వ‌ల్ల భూసార క్షీణ‌త‌, నీటి నాణ్య‌త‌, ఆహార భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. దీంతో రైతుల జీవ‌నోపాధిని మెరుగుప‌ర్చ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యాన్ని పున‌రుద్ధ‌రించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తూ భార‌త ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మిష‌న్ ఫ‌ర్ స‌స్టైన‌బుల్ అగ్రిక‌ల్చ‌ర్ కింద 2015లో ప‌రంప‌రాగ‌త్ కృషి వికాస్ యోజ‌న‌(పీకేవీవై) అనే ప‌థ‌కాన్ని ప్రారంభించింది.

గ‌త ద‌శాబ్దకాలంగా భార‌తీయ సేంద్రీయ వ్య‌వ‌సాయ ఉద్య‌మంలో పీకేవీవై కీల‌కంగా మారింది. రైతులు ప‌ర్యావ‌ర‌ణ అనుకూల విధానాలు పాటించేందుకు, సేంద్రీయ ధ్రువీక‌ర‌ణ పొందేందుకు, మార్కెట్‌ల‌తో అనుసంధానించే ఒక వ్య‌వ‌స్థీకృత వేదిక‌ను పీకేవీవై అందిస్తోంది. క్ల‌స్ట‌ర్‌-ఆధారిత కార్య‌క్ర‌మంగా ప్రారంభ‌మైన పీకేవీవై ఇప్పుడు శిక్ష‌ణ‌, ధ్రువీక‌ర‌ణ‌, మార్కెట్ అభివృద్ధి క‌ల్పించే వ్య‌వ‌స్థ‌గా మారింది. త‌ద్వారా ఆటుపోట్ల‌కు త‌ట్టుకోగ‌ల వ్య‌వ‌సాయ రంగాన్ని త‌యారుచేయాల‌నే భార‌త‌దేశ దీర్ఘ‌కాల సంక‌ల్పానికి రూపమిస్తోంది.

క్ల‌స్ట‌ర్-ఆధారిత సేంద్రీయ వ్య‌వ‌సాయంతో పునాది
పీకేవీవై మొద‌ట క్ల‌స్ట‌ర్ ప‌ద్ధ‌తిను అవ‌లంభించింది. రైతులు సంయుక్తంగా సేంద్రీయ వ్య‌వసాయ విధానాల‌ను పాటించేందుకు 20 హెక్టార్ల చొప్పున బృందాలుగా ఏర్ప‌డ్డారు. ఈ విధానం ఒకేర‌క‌మైన ప్ర‌మాణాలు పాటించ‌డంతో పాటు వ‌న‌రుల‌ను పంచుకోవ‌డం ద్వారా ఖ‌ర్చుల‌ను కూడా త‌గ్గించింది.

ఈ విధానం ప్రారంభ‌మైన నాటి నుంచి వివిధ రాష్ట్రాల్లో వేలాది బృందాలు ఏర్ప‌డ్డాయి. సేంద్రీయ, భిన్నమైన‌ వ్య‌వ‌సాయ విధానాలు అవ‌లంభించ‌డం ద్వారా రైతులు ర‌సాయ‌నాలపై ఆధార‌ప‌డ‌టాన్ని ఇది త‌గ్గించ‌డంతో పాటు భూసారాన్ని మెరుగుప‌రుచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ ప్ర‌క్రియ‌లో శిక్ష‌ణ‌, సామ‌ర్థ్య నిర్మాణ కార్య‌క్ర‌మాలు కీల‌కం. ఈ కార్య‌క్ర‌మాలు సేంద్రీయ వ్య‌వ‌సాయం దిశ‌గా రైతుల‌ను మ‌ళ్లించ‌డానికి వారిలో నైపుణ్యాలు, విశ్వాసాన్ని క‌లిగిస్తాయి.

రైతుల నేతృత్వంలో త‌క్కువ ఖ‌ర్చు, ర‌సాయ‌న ర‌హిత విధానాలతో కూడిన ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వ్య‌వ‌సాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్ల‌డం, ఆహార భ‌ద్ర‌త‌ను మెరుగుప‌ర్చ‌డం, ఆదాయాన్ని క‌ల్పించ‌డం, ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త సాధించ‌డం పీకేవీవై ల‌క్ష్యాలు.

- భూసారాన్ని మెరుగుప‌రిచే, స‌హ‌జ వ‌న‌రుల‌ను ప‌రిర‌క్షించే ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం.
- ర‌సాయ‌నాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని తగ్గించి, స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో పంట‌ల సాగుకు రైతుల‌ను ప్రోత్స‌హించ‌డం
- సేంద్రీయ విధానాల ద్వారా పెట్టుబ‌డి ఖ‌ర్చులు త‌గ్గించి, ఆదాయాన్ని పెంచ‌డం
- వినియోగ‌దారుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన‌, ర‌సాయ‌న ర‌హిత ఆహారాన్ని అందించ‌డం
- వ్య‌వ‌సాయం, ప్రాసెసింగ్‌, ధ్రువీక‌ర‌ణ‌లో రైతు బృందాల‌కు స‌హ‌క‌రించ‌డం
- రైతుల‌ను నేరుగా స్థానిక‌, జాతీయ మార్కెట్ల‌కు అనుసంధానించ‌డం ద్వారా వ్యాపార దృక్ప‌థాన్ని పెంచ‌డం

ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు
ప‌రంప‌రాగ‌త్ కృషి వికాస్ యోజ‌న‌(పీకేవీవై) కింద సేంద్రీయ వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు మూడేళ్ల పాటు రూ.31,500 సాయంగా అందుతోంది. ఈ సాయం కింది విధంగా అందుతుంది:
ఆన్‌ఫార్మ్‌ & ఆఫ్‌-ఫార్మ్‌ సేంద్రీయ ఉత్పాద‌కాలకు: రూ.15,000(డీబీటీ)
మార్కెటింగ్‌, ప్యాకేజింగ్ & బ్రాండింగ్‌కు: రూ.4,500
ధ్రువీక‌ర‌ణ‌, దిగుబ‌డుల విశ్లేష‌ణ‌కు: రూ.3,000
శిక్ష‌ణ‌, సామ‌ర్థ్య నిర్మాణానికి: రూ.9,000



ఈ ప‌థ‌కం ద్వారా రైతులు కేవ‌లం సేంద్రీయ ప‌ద్ధ‌తుల‌ను పాటించేలా చూడ‌ట‌మే కాకుండా, వారికి మెరుగైన ఆదాయం క‌ల్పించేందుకు ధ్రువీక‌ర‌ణ‌, బ్రాండింగ్‌, మార్కెట్ అనుసంధానం కోసం కూడా స‌హ‌కారం అందుతోంది.

అమ‌లు విధానం
నిర్మాణాత్మ‌క‌, రైతు కేంద్రీకృత విధానం ద్వారా ప‌రంప‌రాగ‌త్ కృషి వికాస్ యోజ‌న‌(పీకేవీవై) అమ‌ల‌వుతోంది. గ‌రిష్టంగా రెండు హెక్టార్ల భూక‌మ‌తానికి రైతులంద‌రికీ, సంస్థ‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌త ఉంటుంది.

రైతులు ప్రాంతీయ మండ‌ళ్ల‌ను సంప్ర‌దించాలి. రైతుల‌కు న‌మోదు, ధ్రువీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు స‌హ‌కరించే బాధ్య‌త ప్రాంతీయ మండ‌ళ్ల‌దే. వ్య‌క్తిగ‌త ద‌ర‌ఖాస్తుల‌ను క‌లిపి ఈ మండ‌ళ్లు వార్షిక కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌గా రూపొందించి కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్విత్వ శాఖ ఆమోదం కోసం పంపిస్తాయి.



వార్షిక కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక ఆమోదం పొందిన త‌ర్వాత‌ కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నిధులు విడుద‌ల చేస్తాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాల ద్వారా నిధులు ప్రాంతీయ మండ‌ళ్ల‌కు వెళ్తాయి. నేరుగా న‌గ‌దు బ‌దిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతుల‌కు ప్రాంతీయ మండ‌ళ్లు స‌హాయాన్ని అంద‌జేస్తాయి. పీకేవీవై కింద అంద‌జేస్తున్న ఆర్థిక సాయం ల‌బ్ధిదారుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, స‌మ‌యానుగుణంగా వెళ్తుంది. ఈ డ‌బ్బులు వారికి పెట్టుబ‌డి, ధ్రువీక‌ర‌ణ‌, మార్కెటింగ్‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప్ర‌తి ద‌శ‌లో జవాబుదారీత‌నంతో పీకేవీవై అమ‌ల‌వుతోంది. నిర్మాణాత్మ‌క విధానంలో ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా భార‌త్‌లోని చిన్న‌, స‌న్న‌కారు రైతులు సేంద్రీయ వ్య‌వ‌సాయానికి సుల‌భంగా స‌హ‌కారాన్ని పొందగ‌ల‌రు.

సేంద్రీయ ధ్రువీక‌ర‌ణ‌
విశ్వస‌నీయ‌మైన ధ్రువీక‌ర‌ణ విధానం లేక‌పోవ‌డం సేంద్రీయ రైతుల‌కు గ‌తంలో ప్ర‌ధాన ఆటంకంగా ఉండేది. రెండు వ్య‌వ‌స్థ‌ల ద్వారా ఈ స‌మ‌స్య‌ను పీకేవీవై ప‌రిష్క‌రించింది.

1. థ‌ర్డ్ పార్టీ ధ్రువీక‌ర‌ణ‌(ఎన్‌పీఓపీ): కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ప్రోగ్రామ్ ఫ‌ర్ ఆర్గానిక్ ప్రొడ‌క్ష‌న్‌(ఎన్‌పీఈపీ) కింద గుర్తింపు పొందిన స‌ర్టిఫికేష‌న్ ఏజెన్సీ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల మేర‌కు ఆర్గానిక్ ఉత్ప‌త్తుల‌ను ధ్రువీక‌రిస్తోంది. ఉత్ప‌త్తి, ప్రాసెసింగ్ నుంచి వ‌ర్త‌కం, ఎగుమ‌తుల వ‌ర‌కు మొత్తం వాల్యూ చైన్ దీని ప‌రిధిలోకి వ‌స్తుంది. త‌ద్వారా భార‌తీయ రైతులు ప్ర‌పంచ సేంద్రీయ మార్కెట్‌కు ఎగుమ‌తి చేసే అవ‌కాశం క‌లుగుతుంది.

2. పార్టిసిపేట‌రీ గ్యారెంటీ సిస్ట‌మ్ ఫ‌ర్ ఇండియా(పీజీఎస్‌-ఇండియా): కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ ఆధ్వ‌ర్యంలో ఇది ప‌ని చేస్తుంది. రైతు కేంద్రీకృతంగా, బృంద ఆధారితంగా ప‌నిచేస్తుంది. నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, త‌నిఖీలు, ప‌ర‌స్ప‌ర పంట ప‌రిశీల‌న‌లో రైతులు, ఉత్ప‌త్తిదారులు స‌మ‌ష్టిగా పాల్గొని చివ‌ర‌గా సేంద్రీయ ఉత్ప‌త్తిగా ప్ర‌క‌టిస్తారు. పీజీఎస్‌-ఇండియా ప్ర‌ధానంగా దేశీయ మార్కెట్ కోసం చిన్న, స‌న్న‌కారు రైతుల‌కు స‌ర‌స‌మైన‌, స‌మ్మిళిత ధ్రువీక‌ర‌ణ సౌక‌ర్యాన్ని అందిస్తోంది.



గ‌తంలో ఎప్పుడూ ర‌సాయ‌నాల‌తో సాగు జ‌ర‌గ‌ని ప్రాంతాల్లో(గిరిజ‌న ప్రాంతాలు, ద్వీపాలు, ప‌ర్యావ‌ర‌ణాన్ని సంర‌క్షించిన ప్రాంతాలు) వేగంగా ధ్రువీక‌ర‌ణ పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం 2020-21లో లార్జ్ ఏరియా స‌ర్టిఫికేష‌న్‌(ఎల్ఏసీ) కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఇది మార్పిడి కాలాన్ని(క‌న్వ‌ర్ష‌న్ పీరియ‌డ్‌)ను ఎల్ఏసీ 2-3 ఏళ్ల నుంచి నెల‌ల వ్య‌వ‌ధికి త‌గ్గించింది. త‌ద్వారా వేగంగా ధ్రువీక‌ర‌ణ పూర్తి కావడంతో పాటు రైతులకు ఎక్కువ ఆదాయం ద‌క్కుతోంది. భార‌తీయ సేంద్రీయ రంగం ప్ర‌పంచ పోటీత‌త్వంలో రాణించే అవ‌కాశాలు పెరిగాయి.

ఈ వ్య‌వ‌స్థ‌ల ద్వారా దేశీయ‌, అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో భార‌తీయ సేంద్రీయ ఉత్ప‌త్తుల‌పై పీకేవీవై ఒక విశ్వాసాన్ని క‌ల్పించింది. దీంతో ఇప్పుడు రైతులు స‌రైన ధ‌ర‌ల‌ను అందుకోవ‌డం, స‌రైన వినియోగ‌దారుల‌ను పొందే స్థితిలో ఉన్నారు. దీంతో పాటు సేంద్రీయ గుర్తింపుతో ఉన్న స్థానిక బ్రాండ్లు బ‌లోపేతం అవుతున్నాయి.


సాధించిన విజ‌యాలు(2015-25)
గ‌త దశాబ్దకాలంగా పీకేవీవై సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని ప్ర‌ధాన వ్య‌వ‌సాయ ఉద్య‌మంగా మార్చింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, డిజిట‌ల్ ఇండియా ల‌క్ష్యాల‌కు అనుగుణంగా సుస్థిర వ్య‌వ‌సాయం, గ్రామీణ డిజిట‌లీక‌ర‌ణ‌, స‌మ్మిళిత మార్కెట్ సౌల‌భ్యానికి దోహ‌ద‌పడింది.

- 30.01.2025 వ‌ర‌కు పీకేవీవై(2015-25) కింద రూ.2,265.86 కోట్లు విడుద‌ల‌య్యాయి.
- 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆర్‌కేవీవై కింద పీకేవీవై కోసం రూ.205.46 కోట్లు విడుద‌ల‌య్యాయి.
- 2025 ఫిబ్ర‌వ‌రి నాటికి దాదాపు 15 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సేంద్రీయ వ్య‌వ‌సాయం జ‌రుగుతోంది. 52,289 క్ల‌స్ట‌ర్లు ఏర్ప‌డ్డాయి. 25.30 ల‌క్ష‌ల మంది రైతులు ల‌బ్ధి పొందారు.
- 2023-24లో ఎల్ఏసీ కింద‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ‌లో 50,279 హెక్టార్లు, ప‌శ్చిమ బెంగాల్‌లో 4,000 హెక్టార్ల‌లో వ్య‌వ‌సాయం సేంద్రీయంగా గుర్తింపు పొందింది.
- 31.12.2024 నాటికి కేంద్ర ప్ర‌భుత్వ “10,000 ఎఫ్‌పీవోల స్థాపన ప్రోత్సాహ ప‌థ‌కం”లో భాగంగా 9,268 ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్‌(ఎఫ్‌పీవో)లు న‌మోద‌య్యాయి.
- ఎల్ఏసీ కింద కార్ అండ‌మాన్ & నాన్‌కావ్‌రీ ద్వీపాల్లో 14,491 హెక్టార్ల భూమి సేంద్రీయంగా ధ్రువీక‌ర‌ణ పొందింది.
- ల‌క్ష్య‌ద్వీప్‌లోని మొత్తం 2,700 హెక్టార్ల సాగు యోగ్య‌మైన భూమి సేంద్రీయంగా ధ్రువీక‌ర‌ణ పొందింది.
- ఎల్ఏసీ కింద సిక్కింలోని 60,000 హెక్టార్లకు రూ.96,39 ల‌క్ష‌ల సాయం అందింది. ఇప్పుడు ప్ర‌పంచంలో 100% పూర్తి సేంద్రీయ సాగు జ‌రుగుతున్న రాష్ట్రంగా సిక్కిం గుర్తింపు పొందింది.
- ల‌డ‌ఖ్‌లో ఎల్ఏసీ కింద 5,000 హెక్టార్ల భూమికి రూ.11.475 సాయం అందింది.
- 2024 డిసెంబ‌ర్ నాటికి 6.23 ల‌క్ష‌ల మంది రైతులు, 19,016 స్థానిక బృందాలు, 89 మంది ఇన్‌పుట్ స‌ర‌ఫ‌రాదారులు, 8,676 మంది కొనుగోలుదారులు జైవిక్ ఖేతి పోర్ట‌ల్‌లో న‌మోద‌య్యారు.

* సేంద్రీయ ఉత్ప‌త్తుల‌ను రైతులు నేరుగా వినియోగదారుల‌కే విక్ర‌యించేందుకు వీలుగా జైవిక్ ఖేతి పోర్ట‌ల్‌ అనే ప్ర‌త్యేక ఆన్‌లైన్ వేదిక‌ను అభివృద్ధి చేశారు.

ముగింపు
భార‌త్‌లో సుస్థిత వ్య‌వ‌సాయాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు గ‌త ద‌శాబ్ద కాలంగా ప‌రంప‌రాగ‌త్ కృషి వికాస్ యోజ‌న‌(పీకేవీవై) కీల‌క ప‌థ‌కంగా మారింది. క్ల‌స్ట‌ర్ ఆధారిత విధానం ద్వారా సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా ర‌సాయ‌నాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించ‌డానికి ల‌క్ష‌లాది మంది రైతుల‌కు సాయం అందించింది. భూసారాన్ని మెరుగుప‌ర్చ‌డంలో, సుర‌క్షిత‌మై, అధిక నాణ్య‌త క‌లిగిన ఆహార ఉత్ప‌త్తికి దోహ‌ద‌ప‌డింది. ధ్రువీక‌రించే వ్య‌వ‌స్థ‌లు, జైవిక్ ఖేతీ పోర్ట‌ల్ వంటి డిజిట‌ల్ వేదిక‌లు, మార్కెట్ లింకేజీల ద్వారా ఆర్గానిక్ ఉత్ప‌త్తుల‌కు దేశీయ వినియోగం, అంత‌ర్జాతీయ వాణిజ్యానికి అవ‌స‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ను పీకేవీవై సృష్టిస్తోంది.

లార్జ్ ఏరియా స‌ర్టిఫికేష‌న్‌(ఎల్ఏసీ)కి విస్త‌రించ‌డం, నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ నాచుర‌ల్ ఫార్మింగ్‌(ఎన్ఎంకేఎఫ్‌)తో అనుసంధానం చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌, త‌క్కువ ఖ‌ర్చుతో వ్య‌వ‌సాయం చేసే విధానాల ప‌ట్ల ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌తిబింబిస్తోంది. శిక్ష‌ణ‌, ధ్రువీక‌ర‌ణ, వ్యాపార దృక్ప‌థాన్ని ప్రోత్స‌హించ‌డంపై నిరంత‌ర దృష్టి ద్వారా పీకేవీవై కేవ‌లం గ్రామీణ ఆదాయాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, మంచి వాతావ‌ర‌ణం, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ సంక‌ల్పానికి దోహ‌ద‌ప‌డుతోంది.

వ్య‌వ‌సాయ ప‌రివ‌ర్త‌న‌లో భార‌త్ త‌దుప‌రి ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తున్న నేప‌థ్యంలో సంప్ర‌దాయ విధానాల‌ను ఆధునిక వ్య‌వ‌స్థ‌లు, డిజిట‌ల్ సాధ‌నాల‌తో జ‌త‌క‌ల్పితే హ‌రిత‌, ఆరోగ్య‌క‌ర‌, సుసంప‌న్న‌మైన భ‌విష్య‌త్తుకు మార్గం సుగ‌మం చేస్తోంద‌నే దాటికి పీకేవీవై నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

 

 

References:

§ Press Information Bureau (PIB) Releases

§ Ministry of Agriculture & Farmers Welfare Documents

§ Mission Organic Value Chain Development (MOVCDNER) - https://movcd.dac.gov.in/about

§ Parliament Questions (Lok Sabha)

§ myScheme Portal - https://www.myscheme.gov.in/schemes/pkvy

Click here to see pdf

 

****

(Explainer ID: 155686) आगंतुक पटल : 45
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Malayalam , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Kannada