Social Welfare
ఏఐ-ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న ఎస్ఓఏఆర్
Posted On:
22 OCT 2025 10:07AM
కీలకాంశాలు
- మారుతున్న డిజిటల్ ప్రపంచానికి తగ్గట్టుగా భారతదేశాన్ని సిద్ధం చేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులతో పాటు అధ్యాపకులపై స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్(ఎస్ఓఏఆర్) దృష్టిసారించింది.
- ఎస్ఓఏఆర్‌లో విద్యార్థుల కోసం 15 గంటల మాడ్యూల్, అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా 45 గంటల మాడ్యూల్ ఉన్నాయి. ఎథికల్ ఏఐ వినియోగం, మెషీన్ లెర్నింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై దృష్టిసారిస్తూ ఈ మాడ్యూళ్ల రూపకల్పన జరిగింది.
- ఏఐ-ఆధారిత అభ్యాసం, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌కు కేంద్రం 2025-26 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది.
- ఎన్ఏపీఎస్-2 కింద ఏఐ డేటా ఇంజినీర్, మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ వంటి ఏఐ సంబంధిత ఉద్యోగాల కోసం 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య 2025 జూన్ నాటికి 1,480 మంది అప్రెంటీస్‌లు శిక్షణ పొందారు.
పరిచయం
ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆటోమెషన్‌లో వస్తున్న పురోగతితో ప్రపంచ శ్రామికశక్తి భారీగా పరివర్తన చెందుతోంది. ఆరోగ్యసంరక్షణ, ఆర్థిక, విద్య, తయారీ, ప్రజాసేవలు వంటి పరిశ్రమల్లో ఏఐ భాగంగా మారిపోయింది. దీంతో విస్తృతస్థాయిలో ఏఐ నేర్చుకోవాల్సిన, ఏఐలో ప్రత్యేక నైపుణ్యత అత్యవసరంగా మారింది. భారతదేశ విద్యారంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలను భాగం చేయడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌డీఈ) ఈ స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్(ఎస్ఓఏఆర్) అనే వ్యూహాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ సాంకేతిక పురోగతికి నాయకత్వం వహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2025 జూన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2015లో ప్రారంభమై వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలను శక్తివంతులను చేసిన స్కిల్ ఇండియా మిషన్ కూడా ఈ ఏడాదికి పదేళ్ల మైలురాయికి చేరుకుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) 4.0 కింద ఏఐ వంటి సరికొత్త రంగాలకు స్కిల్ ఇండియా మిషన్ విస్తరిస్తోంది.
భవిష్యత్తును శక్తివంతం చేయడమే ఎస్ఓఏఆర్ లక్ష్యం

ఏఐ పట్ల అవగాహన పెంచడం: పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఏఐ జ్ఞానం పెంపొందించడం ఎస్ఓఏఆర్ కార్యక్రమ ప్రాధాన్యం. మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) మౌలిక అంశాలు, ఎథికల్ ఏఐ వినియోగం వంటి ప్రాథమిక ఏఐ సూత్రాలను పరిచయం చేయడం ద్వారా యువ అభ్యాసకులలో ఆసక్తి, ఆకాంక్షను రేకెత్తించడం, వారిని సాంకేతికత ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాల్లో ఏఐకి సంబంధించిన పాఠాలు చేర్చేందుకు గానూ అధ్యాపకులకు ఎస్ఓఏఆర్ ప్రత్యేక శిక్షణను అందిస్తోంది.

ఆర్థిక స్వయం సమృద్ధికి మద్దతు: ఐటీ, డిజిటల్ ఆవిష్కరణ, ఏఐ-ఆధారిత పరిశ్రమలు వంటి అధిక డిమాండ్ కలిగిన రంగాల కోసం యువతకు నైపుణ్యాలను కల్పించడం ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి(ఆత్మనిర్భర్ భారత్) సాధించాలనే భారతదేశ సంకల్పానికి ఎస్ఓఏఆర్ వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తోంది. ఉపాధి, వ్యవస్థాపకత అవకాశాలు పెంపొందించడం కోసం అధునాతన సాంకేతికతల్లో నైపుణ్య కల్పనపై దృష్టి సారించే పీఎంకేవీవై 4.0 వంటి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలకు అనుగుణంగా ఎస్ఓఏఆర్ ఉంటుంది.

సాంకేతికత-ఆధారిత భారతదేశ నిర్మాణం: ఏఐ ఆధారిత ఉద్యోగాలు, సంస్థల కోసం యువతను సిద్ధం చేయడం ద్వారా ఏఐ రంగంలో భారత్‌ను ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయిలో నిలబెట్టడం ఎస్ఓఏఆర్ దీర్ఘకాలిక సంకల్పం. ఏఐ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు, అధ్యాపకులతో కూడిన పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించడం ద్వారా ఏఐ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, సాంకేతిక ఆవిష్కరణల్లో నిపుణులను తయారుచేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
భారతదేశ విద్యారంగ ముఖచిత్రాన్ని మారుస్తున్న కృత్రిమ మేధ
ఆవిష్కరణలను ప్రోత్సహించడం, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, సాంకేతికత ఆధారిత భవిష్యత్తుకు తగ్గట్టుగా విద్యార్థులను సిద్ధం చేయడం ద్వారా భారతదేశ విద్యారంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సులకు అనుగుణంగా ఏఐని తరగతి గదులు, నైపుణ్యాభివృద్ధిలో భాగం చేయడం జరుగుతోంది.
ఈ దిశగా తీసుకువచ్చిన పలు కీలక మార్పులు ఇవి:
పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐ
విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, డిజిటల్ అక్షరాసత్యను పెంపొందించడం కోసం తగు దశల్లో పాఠశాల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధ(ఏఐ) వంటి సమకాలీన అంశాలను భాగం చేయాలని జాతీయ విద్యా విధానం 2020 స్పష్టం చేస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇప్పటికే అనుబంధ పాఠశాలల్లో ఏఐని ఒక సబ్జెక్టుగా అమలుచేస్తోంది. నైపుణ్యాభివృద్ధి, ప్రత్యేకమైన అభ్యాస సాధనాలు వంటి ఆచరణాత్మక మాధ్యమాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ 2019-2020 విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతిలో ఏఐని ప్రవేశపెట్టి 2020-21లో 11వ తరగతి వరకు పొడిగించింది.
సెంటర్ ఫర్ ఏఐ ఎక్సెలెన్స్ ఏర్పాటు:
విద్యారంగంలో ఏఐని మరింతగా భాగం చేయడం కోసం భారత ప్రభుత్వం సెంటర్ ఫర్ ఏఐ ఎక్సెలెన్స్‌ను స్థాపిస్తోంది. భారతీయ భాషల్లో ఏఐ వినియోగం, తరగతి గదుల్లో విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, సంప్రదాయ బోధనా పద్ధతుల నుంచి ''చాక్‌బోర్డుల నుంచి చిప్‌సెట్స్ వరకు'' వంటి సాంకేతికత ఆధారిత విధానాల వైపు మారడం లాంటివి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సెలెన్స్ లక్ష్యాలు.
ఏఐ మౌలిక వ్యవస్థ, మానవవనరుల నిర్మాణం కోసం విస్తృతమైన జాతీయ ప్రయత్నాలకు సెంటర్ ఫర్ ఏఐ ఎక్సెలెన్స్ సహకరిస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) ఆమోదిత విద్యాసంస్థల్లోనూ వివిధ కోర్సుల్లో ఏఐని ఐచ్ఛికగా ప్రవేశపెట్టాలనే సిఫార్సులు కూడా ఉన్నాయి.
డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్, ప్రిడిక్టీవ్ డేటా అనలటిక్స్ వంటి ఏఐ సంబంధిత కోర్సులను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు కూడా అందిస్తున్నాయి.
స్కిల్ ఇండియా మిషన్(ఎస్ఐఎం)లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్
భవిష్యత్తుకు తగ్గట్టుగా శ్రామికశక్తిని సిద్ధం చేయడానికి భారతప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్(ఎస్ఐఎం)లో ఏఐ, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. ఇందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) 4.0, నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్ఏపీఎస్), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ)లు, జాతీయ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్ఎస్‌టీఐ)లు, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్(ఎస్ఐడీహెచ్) కింద కార్యక్రమాలు చేపడుతోంది.



ఎస్ఓఏఆర్ ఆవశ్యకత, ఆశిస్తున్న ఫలితాలు
స్కిల్ ఇండియా మిషన్‌తో భాగస్వామ్యం: విద్యార్థుల కోసం లక్షిత మాడ్యూళ్లను అందించడం, ఏఐ ఆధారిత రంగాల్లో ఉద్యోగావకాశాలు, ఉత్పాదకతను పెంపొందించడం కోసం యువతకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలు అందించడం కోసం స్కిల్ ఇండియా మిషన్‌కు ఎస్ఓఏఆర్ సహకరిస్తోంది.
వికసిత్ భారత్ సంకల్పానికి తోడ్పాటు: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే భారతదేశ సంకల్పాన్ని ఏఐ ఫర్ ఆల్ కార్యక్రమాల ద్వారా ఎస్ఓఏఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఆవిష్కరణలు, ప్రపంచం పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఏఐని వినియోగించగల సాంకేతికతపై పట్టున్న శ్రామిక శక్తిని తయారుచేస్తోంది.
అందరికీ అందుబాటులో ఏఐ శిక్షణ: స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ వంటి అందరికీ అందుబాటులో ఉన్న వేదికల్లో ఏఐ శిక్షణను భాగం చేయడం ద్వారా పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని ఎస్ఓఏఆర్ తొలగిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్ నైపుణ్యాలను సమానంగా అందుబాటులో ఉంచడం ద్వారా అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పిస్తోంది.
ఏఐ అవగాహన కలిగిన విద్యార్థులు, సుశిక్షుతులైన అధ్యాపకులు: ఎథికల్ ఏఐని వినియోగించగల సామర్థ్యం ఉన్న విద్యార్థులను అందించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా తరగతి గదుల్లో ఏఐని ప్రవేశపెట్టడం వంటివి ఎస్ఓఏఆర్ లక్ష్యం.
ఏఐలో ఉపాధి పట్ల ఆసక్తిని పెంచడం, నైపుణ్యలోపాలను తగ్గించడం: నైపుణ్యాలు కల్పించడం ద్వారా ఏఐ రంగంలో ఉపాధి పట్ల యువతలో ఆసక్తి పెంచడం ఎస్ఓఏఆర్ కార్యక్రమ లక్ష్యం. సమ్మిళిత శిక్షణ ఇవ్వడం, అధిక డిమాండ్ కలిగిన సాంకేతిక నైపుణ్యాలను అందుబాటులో ఉంచడం ద్వారా డిజిటల్ సామర్థ్యాల్లో పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది.
ముగింపు
ఏఐ ఆధారిత విద్యావిధానం, శ్రామికశక్తి అభివృద్ధిలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపడంలో స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్(ఎస్ఓఏఆర్) కీలకమైన కార్యక్రమం. పాఠశాలల పాఠ్యాంశాలు, వొకేషనల్ శిక్షణలో ఏఐ బోధనను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు అధునాతన నైపుణ్యాలు కల్పించడంతో పాటు నైతికంగా సాంకేతికత వినియోగం, ఆవిష్కరణల సంస్కృతిని ఎస్ఓఏఆర్ ప్రోత్సహిస్తోంది. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ వంటి వేదికలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా విభిన్న సామాజిక-ఆర్థిక తరగతులకు ఏఐ నైపుణ్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా సాంకేతిక, ఆర్థిక పురోగతి దిశగా భారతదేశ యువతకు సాధికారత కల్పిస్తోంది. వికసిత్ భారత్ @ 2047 సంకల్పంలో కీలక అడుగుగా డిజిటల్‌గా సమ్మిళిత, పోటీతత్వ, స్వయం సమృద్ధి కలిగిన భారత్‌కు ఎస్ఓఏఆర్ పునాది వేస్తోంది.
References:
Union Budget:
https://www.indiabudget.gov.in/doc/bh1.pdf
Press Information Bureau:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2153010
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2147048
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1704878
Ministry of Education:
https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/PIB2132184.pdf
Ministry of Skill Development and Entrepreneurship:
https://www.skillindiadigital.gov.in/home
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU2748_0eg8Dq.pdf?source=pqals
https://www.apprenticeshipindia.gov.in/
Others:
https://www.cprgindia.org/Padh-AI-Conclave/image/pdf/PADHAI-CONCLAVE-BROCHURE.pdf
***
(Backgrounder ID: 155653)
Visitor Counter : 8
Provide suggestions / comments
Read this release in:
Malayalam
,
English
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Urdu
,
Nepali
,
हिन्दी
,
Hindi_Ddn
,
Punjabi
,
Odia
,
Kannada