Farmer's Welfare
ప్రపంచ ఆహార దినోత్సవం- 2025
“పోషకాహారం, మెరుగైన భవిత కోసం చేయీ చేయీ కలుపుదాం”
Posted On:
15 OCT 2025 5:35PM
పరిచయం
ఆహార భద్రత, పోషకాహారం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఏటా అక్టోబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వ్యక్తికీ సురక్షిత, తగిన పోషకాహారాన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లను ఇది గుర్తుచేస్తుంది. ఆహారం జీవితానికి పునాది. ఆరోగ్యం, పెరుగుదల, సంక్షేమానికి అత్యంత కీలకమైనది. ఆహారోత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా పురోగతి ఉన్నప్పటికీ.. లక్షలాది ప్రజలు ఇప్పటికీ ఆకలి, పోషకాహారలోపాలను ఎదుర్కొంటున్నారు. సమర్థమైన విధానాలు, అవసరానికి తగిన ఆహార వ్యవస్థలు, సహకార చర్యల ఆవశ్యకతను ఇది చాటుతోంది.
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార- వ్యవసాయ సంస్థను నెలకొల్పిన రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1981లో ‘ఆహారానికి ప్రథమ ప్రాధాన్యం (ఫుడ్ కమ్స్ ఫస్ట్)’ అనే ఇతివృత్తంతో మొదటిసారిగా అధికారికంగా ఈ దినోత్సవాన్ని పాటించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1984లో దీనిని ఆమోదించింది. ఆకలి- భవిష్యత్ ఆహార కార్యాచరణ, ప్రజలు, ప్రపంచం గురించి అవగాహన పెంపొందించేలా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో సమష్టి కార్యాచరణ ద్వారా.. ఐరాస క్యాలెండరులో అత్యంత విస్తృతంగా జరుపుకొనే రోజుల్లో ప్రపంచ ఆహార దినోత్సవం ఒకటిగా నిలిచింది. 2025 సంవత్సర ఇతివృత్తం- “పోషకాహారం, మెరుగైన భవిత కోసం చేయీ చేయీ కలుపుదాం (హ్యాండ్ ఇన్ హాండ్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్).” వ్యావసాయక ఆహార వ్యవస్థల్లో గణనీయమైన మార్పుల దిశగా ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం, అన్ని రంగాల నడుమ అంతర్జాతీయ సహకారాన్ని పునరుద్ఘాటించేలా ఈ ఇతివృత్తాన్ని నిర్ణయించారు.
పౌష్టిక, సుస్థిర దేశ నిర్మాణం
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్... పోషకాహార లోపాన్ని తగ్గించడం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు, విధానాల ద్వారా ఆకలి సమస్యను పరిష్కరించి, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో విశేష పురోగతి సాధించింది. ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవ ఇతివృత్తానికి అనుగుణంగా.. లక్షలాది జీవితాలను మెరుగుపరచడంలో, ఇంటింటికీ పోషకాహారం చేరేలా చూడడంలో భారత్ చేపడుతున్న చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారత ఆహార భద్రత వ్యవస్థలో వైవిధ్యం కనిపిస్తుంది. జాతీయ పథకాలు, అలాగే అల్పాదాయ కుటుంబాలు, పిల్లలు, వృద్ధులకు చేయూతనిచ్చే స్థానిక కార్యక్రమాలు రెండూ ఇందులో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో భారత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దాదాపు 90 మిలియన్ మెట్రిక్ టన్నుల పెరుగుదల నమోదవగా.. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 64 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. భారత్ ఇప్పుడు పాలు, చిరు ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండగా.. చేపలు, పండ్లు, కూరగాయలకు సంబంధించి రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. తేనె, గుడ్ల ఉత్పత్తి కూడా 2014తో పోలిస్తే రెట్టింపైంది. గత 11 సంవత్సరాల్లో దేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ తనదైన ముద్ర వేసింది.
ఆహార, పోషకాహార భద్రత కోసం ప్రభుత్వ కీలక కార్యక్రమాలు
దేశాభివృద్ధిలో ఆహారం, వ్యవసాయం అత్యంత ప్రధానమైనవని గుర్తించిన ప్రభుత్వం.. అందరికీ నాణ్యమైన ఆహార లభ్యత దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేసింది. అదే సమయంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ, రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. ఆకలిని, పోషకాహార లోపాన్ని సమర్థంగా నిర్మూలించడంలో దేశ నిరంతర నిబద్ధతకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిదర్శనం. ఆహార భద్రత అంటే- క్రియాశీలమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం.. ప్రజల ఆహార అవసరాలు, ప్రాధాన్యాలను తీర్చేలా అందరికీ అన్ని సమయాల్లో తగినంత సురక్షిత, పోషకాహారం భౌతికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండేలా చూడడం. దీనిని సాధించాలంటే తగినంత ఆహారోత్పత్తితోపాటు దాని సమాన పంపిణీ కూడా ఆవశ్యకం.
జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)
ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం 2007-08లో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)ను ప్రారంభించింది. విస్తీర్ణాన్ని పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా వరి, గోధుమ, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం, భూ సారం - ఉత్పాదకతను పునరుద్ధరించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం దీని లక్ష్యాలు. 2014–15లో ఎన్ఎఫ్ఎస్ఎంను విస్తరించి ముతక తృణదాన్యాలను ఇందులో చేర్చారు. ఉత్పాదకత, భూ సారం, రైతు ఆదాయం ముఖ్య లక్ష్యాలుగా కొనసాగుతున్నాయి. 2024–25లో దీని పేరును ‘జాతీయ ఆహార భద్రత – పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం)గా మార్చారు.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)
గ్రామీణ జనాభాలో 75 శాతం వరకు, పట్టణ జనాభాలో 50 శాతం వరకు ఈ చట్టం పరిధిలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 81.35 కోట్ల మంది ప్రజలు అంత్యోదయ అన్న యోజన (ఏఏవై), ప్రాధాన్య గృహాల కింద ఉన్నారు. ఏఏవై పరిధిలోని కుటుంబాలకు నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. అలాగే ప్రాధాన్య కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోలు అందుతాయి. ప్రస్తుతం దాదాపు 78.90 కోట్ల లబ్ధిదారులు ఈ చట్టం పరిధిలో ఉన్నారు.
ఎన్ఎఫ్ఎస్ఎం/ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం అన్నవి మొత్తం నిల్వల (సెంట్రల్ పూల్) కోసం ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తికి దోహదపడుతుండగా.. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)- 2013 అవి సమానంగా పంపిణీకి అయ్యేలా చూస్తుంది. ఎన్ఎఫ్ఎస్ఎం/ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం, ఎన్ఎఫ్ఎస్ఏ భారత ఆహార భద్రత వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఒకటి ఉత్పత్తిని ముందుకు నడుపుతూ, మరొకటి సజావుగా పంపిణీ జరిగేలా చూస్తూ.. ఉత్పాదకత ప్రయోజనాలనూ- సమ్మిళిత వృద్ధి, సుస్థిరత, పోషకాహార భద్రతలనూ అనుసంధానిస్తున్నాయి.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఆర్థిక అవాంతరాల వల్ల పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించే ప్రత్యేక లక్ష్యంతో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను ప్రారంభించారు. ఎన్ఎఫ్ఎస్ఏ ద్వారా ఇప్పటికే గుర్తించి, దాని పరిధిలోకి వచ్చే కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం దీని ప్రధాన విధి. ఏడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. పీఎంజీకేఏవై ఏడో దశ 2022 డిసెంబరు 31 వరకు అమలులో ఉంది.
పేద లబ్ధిదారుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, అలాగే దేశవ్యాప్తంగా ఏకరూపతతోపాటు పేదలకు ప్రయోజనకరంగా కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి.. పీఎంజీకేఏవై కింద 2023 జనవరి 1 నుంచి అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) గృహాలు, ప్రాధాన్య గృహాలు (పీహెచ్‌హెచ్) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ గడువును 2024 జనవరి 1 నుంచి అయిదు సంవత్సరాలు పొడిగించారు. అంచనా వ్యయం రూ. 11.80 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
పీఎం పోషణ్ (పోషణ్ శక్తి నిర్మాణ్) పథకం
· ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న పాఠశాలల్లోని పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడం ద్వారా విద్యను పెంపొందించడం, ఆకలిని ఎదుర్కోవడం.. తద్వారా వెనుకబడిన విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో పీఎం పోషణ్ (పోషణ్ శక్తి నిర్మాణ్) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 14 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రాథమిక విద్యార్థులందరికీ వేడి వేడి పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తారు. పోషక ప్రమాణాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనాన్ని అందించడం ద్వారా.. ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇది తోడ్పడుతుంది. పాఠశాల హాజరును పెంచడంతోపాటు పిల్లల్లో అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుంది. సామాజిక సమానత్వాన్ని, భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
· 24-25 ఆర్థిక సంవత్సరానికి డీఎఫ్‌పీడీ నుంచి కేటాయింపు: 22.96 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, గోధుమలు.
భారత్‌లో బియ్యంలో పోషకాల జోడింపు
ఆహార భద్రత, ప్రజల్లో సూక్ష్మపోషకాల వినియోగాన్ని మెరుగుపరచడం ఎల్లప్పుడూ భారత ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. ఈ లక్ష్యానికి కట్టుబడి ఉన్న ఆహార - ప్రజా పంపిణీ శాఖ.. మొత్తం పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.
· ఈ శాఖ ప్రారంభించిన కీలక కార్యక్రమాల్లో ‘బియ్యంలో పోషకాల జోడింపు’ ఒకటి.
· ప్రధానమైన ఆహారానికి ముఖ్య సూక్ష్మపోషకాలను జోడించడమన్నది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న, రుజువులతో నిరూపితమైన కార్యక్రమం. సూక్ష్మపోషక లోపాల భారాన్ని తగ్గించే నిర్ణయాత్మక వ్యూహమిది.
· దేశ జనాభాలో దాదాపు 65 శాతం ప్రజలకు బియ్యం ప్రధానమైన ఆహారంగా ఉన్న నేపథ్యంలో.. 2019లో భారత ప్రభుత్వం బియ్యంలో పోషకాల జోడింపునకు సంబంధించి ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆహార పంపిణీ పథకాల ద్వారా 2024 నాటికి అత్యంత పేద, బలహీన వర్గాలకు పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యాన్ని దశలవారీగా అందిస్తామని 2021లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
· బయటకు తీసిన బలవర్ధకమైన బియ్యపు గింజల (ఎఫ్‌ఆర్‌కే) ను బరువు ప్రకారం 1 శాతం నిష్పత్తిలో బియ్యంతో కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. వీటిలో బియ్యం పిండితోపాటు మూడు ప్రధాన సూక్ష్మపోషకాలు- ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటాయి. అవి పరిమాణం, ఆకారం, రంగులో పిండిచేసిన బియ్యాన్ని పోలి ఉంటాయి. సాధారణ బియ్యం వంటి వాసన, రుచి, ఆకృతిలో ఉంటాయి.
· దేశంలో బియ్యంలో పోషకాల జోడింపు నిర్ణయం అమలును పూర్తి దశలవారీ ప్రయోగాత్మక కార్యక్రమం ద్వారా చేపట్టారు. ప్రయోగాత్మక అమలు, ప్రామాణీకరణ, అవసరమైన వ్యవస్థాగత ఏర్పాట్లు, అమలు, విస్తరణను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి.
· ఈ పథకాన్ని దశలవారీగా విస్తరించారు. ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకం మొదటి దశ (2021-22) పరిధిలోకి వస్తాయి. ఐసీడీఎస్, పీఎం పోషణ్‌తోపాటు ఎదుగుదల లోపం ఎక్కువగా ఉన్న 269 ఆకాంక్షాత్మక, అధిక భారాన్ని ఎదుర్కొంటున్న జిల్లాల్లో టీపీడీఎస్ రెండో దశ (2022-23) పరిధిలోకి వస్తాయి. మూడో దశలో (2023-24) మిగిలిన జిల్లాలను టీపీడీఎస్ కింద చేర్చారు.
· 2024 మార్చి మార్చి నాటికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పీఎంజీకేఏవై, ఐసీడీఎస్, పీఎం పోషణ్ మొదలైన అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేసే బియ్యం 100 శాతం బలవర్ధకమయ్యాయి.
· అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 2028 డిసెంబరు వరకు అందరికీ పోషకాలను జోడించిన బియ్యం సరఫరా కొనసాగింపునకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎంజీకేఏవైలో భాగంగా భారత ప్రభుత్వం దీనికి 100 శాతం నిధులు (రూ. 17,082 కోట్లు) అందిస్తుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునికీకరణ, సాంకేతికత ఆధారిత సంస్కరణలు
· స్మార్ట్-పీడీఎస్ (సాంకేతికత ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునికీకరణ, సంస్కరణల పథకం) ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను భారత ప్రభుత్వం ఆధునికీకరించింది. 2025 డిసెంబరు నాటికి దశలవారీగా స్మార్ట్- పీడీఎస్ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించనుంది. పీడీఎస్ సాంకేతిక ఆధారాలను బలోపేతం చేయడంతోపాటు నాలుగు కీలక మాడ్యూళ్లపై దృష్టి పెట్టడం ద్వారా కీలక మార్పులను తేవడం దీని లక్ష్యం:
1. ఆహార ధాన్యాల సేకరణ
2. సరఫరా వ్యవస్థ నిర్వహణ, ధాన్యాల కేటాయింపు
3. రేషన్ కార్డు, చవక ధరల దుకాణాల నిర్వహణ
4. బయోమెట్రిక్ ఆధారిత ధాన్యం పంపిణీ మాడ్యూల్ (ఇ- కేవైసీ).
· మేరా రేషన్ 2.0: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు పారదర్శకత, సౌలభ్యాన్ని పెంపొందించడం కోసం ఆహార - ప్రజా పంపిణీ శాఖ (డీఎఫ్‌పీడీ) 2024 ఆగస్టు 20న మేరా రేషన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. అప్‌గ్రేడ్ చేసిన యాప్‌లో లబ్ధిదారులకు వారి అర్హతలు, విత్‌డ్రా వివరాలు, సమీపంలోని చవక ధరల దుకాణం స్థానాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది. అలాగే అంతరాయం లేని, వినియోగదారీ అనుకూల అనుభవం కోసం సరికొత్త విలువ ఆధారిత ఫీచర్లూ ఉంటాయి. ఇప్పటికే కోటికి పైగా డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంస్కరణలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ఇతర కార్యక్రమాలను చేపట్టింది: -
· డిజిటలీకరణ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డులు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా (100%) డిజిటలైజ్ అయ్యాయి.
· పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారం: దేశవ్యాప్తంగా పారదర్శకత పోర్టల్, ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార సౌకర్యం, టోల్ ఫ్రీ నంబర్ అమలయ్యాయి.
· ఆన్‌లైన్ కేటాయింపు, సరఫరా వ్యవస్థ నిర్వహణ: చండీగఢ్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు, దాద్రా - నాగర్ హవేలి పట్టణ ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఆన్‌లైన్ కేటాయింపును అమలు చేశారు. మినహాయించిన ఆ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. మరోవైపు 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ నిర్వహణను కంప్యూటరీకరించారు.
· ఆధార్ అనుసంధానం: దేశవ్యాప్తంగా దాదాపు 99.9 శాతం రేషన్ కార్డులను ఆధార్ నంబర్లతో అనుసంధానించారు.
· చవక ధరల దుకాణాల ఆటోమేషన్: దాదాపు అన్ని చవక ధరల దుకాణాల్లో ఇప్పుడు ఇ-పోస్ పరికరాలున్నాయి. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఎలక్ట్రానిక్ విధానంలో, పారదర్శకంగా ఆహార ధాన్యాల పంపిణీ కోసం బయోమెట్రిక్/ఆధార్ ఆధారిత ప్రామాణీకరణకు వీలు కలుగుతుంది.
· ఒక దేశం, ఒకే రేషన్ కార్డు: లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా పీడీఎస్ ప్రయోజనాలను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. పోర్టబిలిటీని, సౌలభ్యాన్ని అందిస్తుంది.
· హెల్ప్‌లైన్ నంబర్ 1967/1800- రాష్ట్ర సిరీస్ నంబరు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఫిర్యాదుల పరిష్కారం, లబ్ధిదారులు ఏవైనా ఫిర్యాదులను దాఖలు చేయడం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, దుర్వినియోగం వంటి ఫిర్యాదులు ఎక్కడి నుంచి ఈ విభాగానికి వచ్చినా.. విచారణ జరిపి తగిన చర్యల కోసం వాటిని సంబంధిత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపుతారు.
సార్వత్రిక మార్కెట్ విక్రయాల పథకం (దేశీయ) [ఓఎంఎస్ఎస్(డీ)]
మార్కెట్ లభ్యతను పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, సాధారణ ప్రజలకు తక్కువ ధరలకు అందుబాటులోకి తేవడానికి.. మిగులు ఆహార ధాన్యాలను (గోధుమ, బియ్యం) ఓపెన్ మార్కెట్ అమ్మకాల పథకం (దేశీయ) ద్వారా విక్రయిస్తారు.
కింది అంశాల్లో ఇది దోహదపడుతుంది:
· మార్కెటులో ఆహార ధాన్యాల లభ్యతను పెంచడం
· ధరలను స్థిరీకరించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం
· ఆహార భద్రత
· మరింత అందుబాటు ధరల్లో సాధారణ ప్రజలకు ఆహార ధాన్యాలు అందేలా చూడడం
అంతే కాకుండా, ఓపెన్ మార్కెట్ విక్రయ పథకం (దేశీయ) విధానం కింద.. సాధారణ వినియోగదారులకు సబ్సిడీ ధరలపై గోధుమ పిండి, బియ్యాన్ని అందించడం కోసం భారత్ అట్టా, భారత్ రైస్‌లను ప్రభుత్వం ప్రారంభించింది.
పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరతా మిషన్
రూ. 11,440 కోట్ల బడ్జెటు కేటాయింపులతో పప్పుధాన్యాల రంగంలో ఆత్మనిర్భరత మిషన్ (2025–26 నుంచి 2030–31 వరకు)ను 2025 అక్టోబరు 11న ప్రధానమంత్రి ప్రారంభించారు. పోషకాహార భద్రత, స్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా.. దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం పప్పుధాన్యాల మిషన్ లక్ష్యం. సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్లకు పెంచడం ద్వారా ఇది దాదాపు రెండు కోట్ల మంది పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
వరల్డ్ ఫుడ్ ఇండియా-2025: ప్రపంచ ఆహార రంగంలో భారత నేతృత్వ ప్రదర్శన
2025 సెప్టెంబరులో ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘వరల్డ్ ఫుడ్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా, అలాగే ఆహార శుద్ధి, సుస్థిరత, ఆవిష్కరణల్లో దేశ శక్తిని చాటడం ద్వారా భారత్‌ను ‘అంతర్జాతీయ ఆహార నిలయం’గా నిలపడం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమ లక్ష్యం. 90కి పైగా దేశాలు, 2,000కి పైగా ఎగ్జిబిటర్ల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగింది. సహకార చర్యలు, సాంకేతిక పురోగతి ద్వారా ప్రపంచ ఆహార భద్రతను పెంపొందించడంలో భారత్ పాత్రను ఇది చాటింది.
ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన భారతీయ ఆహారం
భారతీయ థాలీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పోషకాహారం, సుస్థిరతల్లో దాని అద్భుత సహకారాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లివింగ్ ప్లానెట్ నివేదిక గుర్తించి, ప్రకటించింది. సంప్రదాయ భారతీయ ఆహారం ఎక్కువగా మొక్కలపై ఆధారపడినది. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు, కూరగాయల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది సహజ వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మాంసాహారంతో పోలిస్తే హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. ప్రపంచ ప్రజలు భారత వినియోగ విధానాలను అవలంబిస్తే.. 2050 నాటికి ప్రపంచ ఆహారోత్పత్తిని కొనసాగించడానికి భూమిలో 0.84 శాతం సరిపోతుందని నివేదిక ప్రముఖంగా పేర్కొన్నది. ఈ గుర్తింపు భారత్‌ను సుస్థిర ఆహార పద్ధతుల్లో ముందంజలో నిలుపుతుంది. అందరికీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్థానిక సంప్రదాయాలు ఎలా సహాయపడతాయో ఇది చాటుతుంది.
ముగింపు
అందరికీ సురక్షితమైన, పోషకాలతో కూడిన, సుస్థిర ఆహారాన్ని అందేలా చూడడం ప్రాధాన్యాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం- 2025 మనకు గుర్తు చేస్తుంది. ఇతివృత్తం ‘పోషకాహారం, మెరుగైన భవిత కోసం చేయీ చేయీ కలుపుదాం (హ్యాండ్ ఇన్ హాండ్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్)’- ఆకలి, పోషకాహార లోపాన్ని పరిష్కరించడం కోసం అంతర్జాతీయ సహకారం, సమష్టి కృషి ఆవశ్యకతను చాటుతోంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలు.. ఆహార భద్రత, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం పట్ల దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆహార పంపిణీని బలోపేతం చేయడం, బలహీన వర్గాలకు చేయూతనివ్వడం లక్ష్యంగా చేపట్టిన సమగ్ర కార్యక్రమాల ద్వారా.. ఆకలిని నిర్మూలించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది. క్రియాశీల ఆహార వ్యవస్థల నిర్మాణం, ఆకలిపై ప్రపంచ పోరాటానికి సానుకూల ఉదాహరణలుగా నేటి మన చర్యలు నిలుస్తున్నాయి.
రిఫరెన్సులు:
Food and Agriculture Organization
https://www.fao.org/world-food-day/about/en
Department of Food and Public Distribution
https://nfsa.gov.in/portal/nfsa-act
Ministry of Education
https://pmposhan.education.gov.in/Union%20Budgetary.html
Lok Sabha
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU4410_Jc3GA9.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU3624_K90Fbi.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AS242_Qrobv3.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU4518_ge2pFO.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU2844_3rLPAM.pdf?source=pqals
MyScheme Portal
https://www.myscheme.gov.in/schemes/pm-poshan
Government of Haryana
https://haryanafood.gov.in/rice-fortification/
PIB Press Release
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=153283&ModuleId=3
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/aug/doc202588602801.pdf
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=155126&NoteId=155126&ModuleId=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177772
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=151969&ModuleId=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2159013
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2170508
Click here for pdf file.
***
(Backgrounder ID: 155634)
Visitor Counter : 19
Provide suggestions / comments
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam