Farmer's Welfare
పుట్టగొడుగుల సాగుతో కొత్త ఉపాధి అవకాశాలు
Posted On:
10 NOV 2026 10:25AM
ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉద్యానవన రంగంలో పుట్టగొడుగుల సాగుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రంగం మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లో సాధారణంగా కేలరీలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. తక్కువ స్థలంలోనే వీటిని సాగు చేయవచ్చు. గ్రామీణ, పట్టణ, పట్టణ శివారు ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల పెంపకానికి అవకాశం ఉంది.
వ్యర్థాల సేకరణ నుంచి స్వయం ఉపాధి దిశగా
కొద్దిపాటి స్థలం, కొన్ని పుట్టగొడుగుల పెంపకం సంచులు, కొత్త నైపుణ్యం ఉంటే విభిన్న ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చు. దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు పుట్టగొడుగుల సాగు ఆచరణీయమైన జీవనోపాధి మార్గంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చెందిన రుతు జీవితంలోనూ ఇదే జరిగింది. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఆమె చేసిన ప్రయత్నంతో ఈ ప్రయాణం మొదలైంది. 20 ఏళ్ల వయసులో వ్యర్థాలను సేకరించే పని చేస్తున్న రుతు సొంతంగా ఉపాధి పొందాలని ఆశించారు.

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ (ఎస్టీఆర్వై) కార్యక్రమం కింద నిర్వహించిన స్వల్పకాలిక శిక్షణతో ఆమెకు అవకాశం లభించింది. గుంటూరులోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) పుట్టగొడుగుల ఉత్పత్తిలో శిక్షణ ఇచ్చింది. కంపోస్టు తయారీ, పుట్టగొడుగుల విత్తన పదార్థాన్ని కలపడం, పైమట్టి పొర ఏర్పాటు, మొగ్గలు రావడం, పంట పెరుగుదల, కోత వంటి ప్రధాన దశలను ఈ శిక్షణలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ నిర్వహణ, విస్తరణ శిక్షణ సంస్థ (ఎస్ఏఎంఈటీఐ), హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మేనేజ్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్పానింగ్: పుట్టగొడుగుల విత్తన పదార్థాన్ని కంపోస్టులో కలిపే ప్రక్రియ.
కేసింగ్: కంపోస్టులో పుట్టగొడుగుల విత్తన పదార్థం వ్యాపించిన తర్వాత దానిపై ప్రత్యేక మట్టి పొరను పరచడం. ఈ మట్టి తేమను నిల్వ ఉంచి, పుట్టగొడుగుల పెరుగుదలకు అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది.
పిన్నింగ్: మట్టి పొరపై లేదా దాని సమీపంలో చిన్న పుట్టగొడుగుల మొగ్గలు కనిపించడం ప్రారంభమయ్యే దశ.
భారత్‌లో చాలామంది రైతులకు తక్కువ భూమి, పరిమిత పెట్టుబడి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టగొడుగుల సాగు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వ్యవసాయ వ్యర్థాలను సాగుకు అవసరమైన మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ భూమి, నీరు, పెట్టుబడి సరిపోతాయి. వనరుల సమర్థ వినియోగం, ఉపాధి కల్పన, సుస్థిరత, పోషకాహార భద్రత వంటి అంశాలకు తోడ్పడే వ్యవసాయ వ్యాపారంగా కూడా దీనికి అవకాశాలు ఉన్నాయి.
శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించి రుతు మిల్కీ పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. స్థానిక మార్కెట్‌కు క్రమం తప్పకుండా సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారు. రోజుకు సుమారు 8 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తూ నెలకు దాదాపు రూ.35,000 ఆదాయం పొందుతున్నారు. సాగులో వ్యాధులు లేని శుభ్రమైన వరి గడ్డి, నాణ్యమైన విత్తన పదార్థాన్ని ఉపయోగించడం, సరైన ఉష్ణోగ్రత, తేమను కొనసాగించడం ఎంత ముఖ్యమో కూడా తెలుసుకున్నారు. ఆమె అనుభవాలు, ప్రోత్సాహంతో అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు నుంచి నలుగురు చిన్నస్థాయిలో పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. వారికి రుతు మార్గదర్శకత్వం, సహకారం అందిస్తున్నారు.
లక్ష్యానికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, ఆ నైపుణ్యాలను ఆచరణలో ఉపయోగిస్తే విభిన్న జీవనోపాధి అవకాశాలు ఏర్పడతాయని రుతు అనుభవం తెలియజేస్తోంది. స్వల్పకాలిక శిక్షణతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఆదాయానికి పునాది వేయడమే కాకుండా, సమాజంలోని ఇతరులు కూడా పుట్టగొడుగుల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకునేందుకు ప్రేరణనిచ్చింది.
ఒక మహిళ స్ఫూర్తితో పుట్టగొడుగుల గ్రామం
ఒక వ్యక్తి చేపట్టిన ఉపాధి కార్యక్రమం సమష్టి కృషికి ప్రేరణగా నిలిస్తే సమాజంలో విస్తృత మార్పులు తీసుకురావచ్చు. అనంత్‌పూర్ గ్రామానికి చెందిన అనితా దేవి పుట్టగొడుగుల సాగు నుంచి సామాజిక నాయకత్వం వరకు సాగించిన ప్రయాణం ఇందుకు నిదర్శనం. స్థానిక వనరుల ఆధారంగా చేపట్టిన ఉపాధి కార్యక్రమం గ్రామీణ మహిళలకు ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు సామూహిక వ్యాపారాలను ఎలా బలోపేతం చేస్తుందో ఆమె అనుభవం తెలియజేస్తోంది. సొంతంగా ఆదాయం సంపాదించాలనే ఆశయంతో అనితా దేవి పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జీబీ పంత్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొంది సాగుపై అవగాహన పెంచుకున్నారు. 2010లో బిహార్‌లోని నలందా జిల్లా హర్నౌత్ బ్లాక్‌లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంతో ఏర్పడిన అనుబంధం ఆమె వ్యాపార ప్రయాణానికి దిశానిర్దేశం చేసింది. కేవీకే అధికారుల ప్రోత్సాహంతో స్థానిక పరిస్థితులకు అనువైన ఆయిస్టర్, మిల్కీ వైట్ పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఈ రకాలను పెంచవచ్చు.

అనితా దేవి చేపట్టిన కార్యక్రమం క్రమంగా అనంత్‌పూర్ గ్రామంలోని ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చింది. పుట్టగొడుగుల సాగు పొరుగున ఉన్న గ్రామాలకూ విస్తరించింది. దీంతో 2012లో రాష్ట్ర వ్యవసాయ శాఖ అనంత్పూర్ను 'పుట్టగొడుగుల గ్రామం'గా ప్రకటించింది. ఈ ఉపాధి మార్గాన్ని సమాజంలో విస్తరించేందుకు ఆమె చేసిన కృషితో 'మష్రూమ్ మహిళ'గా గుర్తింపు పొందారు. సాగు విస్తరించడంతో నాణ్యమైన పుట్టగొడుగుల విత్తన పదార్థం అందుబాటులో ఉండటం కీలక అవసరంగా మారింది. జాతీయ ఉద్యానవన మిషన్ సహకారంతో రూ.15 లక్షల సబ్సిడీ పొంది అనితా దేవి విత్తన పదార్థం ఉత్పత్తి ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దీంతో సాగుకు అవసరమైన ముఖ్యమైన వనరు అందుబాటులోకి వచ్చింది. మాధోపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించి సామూహిక వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేశారు. ఈ సంస్థ పుట్టగొడుగుల ఉత్పత్తిదారులు, విక్రేతలతో కలిసి పనిచేస్తూ మహిళలకు ప్రభుత్వ పథకాలు, మార్కెట్లతో అనుసంధానం కల్పిస్తోంది.
2023 నాటికి నలందాలో జీవిక స్వయం సహాయక సంఘాలకు చెందిన 250 మందికి పైగా మహిళలు పుట్టగొడుగుల ఆధారిత ఉపాధి కార్యకలాపాల్లో భాగస్వాములయ్యారు. బిహార్‌లోని పుట్టగొడుగుల గ్రామంగా అనంత్పూర్కు లభించిన గుర్తింపు, ఆర్థిక స్వావలంబన కోసం ఒక మహిళ ప్రారంభించిన ప్రయత్నాన్ని సమాజం విస్తృతంగా స్వీకరించిందనడానికి నిదర్శనం. నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత సహకారం, అవసరమైన వనరుల లభ్యత, సామూహిక వ్యాపార కార్యకలాపాలు పరస్పరం బలోపేతం చేసుకుంటూ ఉపాధి అవకాశాలను ఎలా విస్తరించవచ్చో అనితా దేవి ప్రయాణం తెలియజేస్తోంది.
పుట్టగొడుగుల సాగును ఎంచుకున్న ఇంజినీర్
సంప్రదాయ వ్యవసాయానికి అతీతంగా కూడా పుట్టగొడుగుల సాగు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా తక్కువ భూమితో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వృత్తి నిపుణులకు ఇది మంచి అవకాశంగా మారుతోంది. గుజరాత్‌లోని తాపీ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ అంజనాబెన్ గామిత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తాపీ కృషి విజ్ఞాన కేంద్రం 'అగ్రో సందేశ్'లో ప్రచురించిన ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగు కథనాన్ని చదివిన తర్వాత ఆమెకు ఈ రంగంపై ఆసక్తి కలిగింది. ఎక్కువ భూమి అవసరం లేకుండానే పుట్టగొడుగులను పెంచవచ్చని గుర్తించిన ఆమె తాపీ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ 'పుట్టగొడుగుల సాగు ద్వారా వ్యవస్థాపకత అభివృద్ధి' అంశంపై నిర్వహించిన నాలుగు రోజుల శిక్షణలో పాల్గొన్నారు. కేవీకే శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి 2017లో ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు.

ప్రారంభంలో వెదురు, ఆకుపచ్చ షేడ్‌నెట్‌తో 15 × 10 అడుగుల చిన్న షెడ్డును నిర్మించారు. కేవీకే ఆమెకు పుట్టగొడుగుల విత్తన పదార్థం, పాలిథిన్ సంచులు, ఇతర అవసరమైన సామగ్రిని అందించడంతో పాటు నిరంతర సాంకేతిక మార్గదర్శకత్వం ఇచ్చింది. రెండున్నర నెలల్లో తొలి పంట ద్వారా సుమారు 140 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేశారు. రూ.11,000 ఉత్పత్తి వ్యయంతో రూ.28,000 ఆదాయం పొందారు. ఈ ఫలితాలతో ప్రోత్సాహం పొందిన ఆమె 2019లో మరో రూ.1.72 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు షెడ్డును 23 × 80 అడుగులకు విస్తరించారు. ఆ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 250 కిలోల విత్తన పదార్థాన్ని ఉపయోగించి 1,234 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేశారు. ఈ పంట ద్వారా రూ.3.09 లక్షల స్థూల ఆదాయం లభించగా, ఉత్పత్తి వ్యయాలు పోను రూ.2.20 లక్షల నికర లాభం వచ్చింది.

ఉత్పత్తిని పెంచడంతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు అంజనాబెన్ స్థానిక మార్కెట్లతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. పుట్టగొడుగులను 100 నుంచి 200 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి వ్యారాలోని అంగన్వాడీ కార్యకర్తలు, చిల్లర వ్యాపారులు, కూరగాయల విక్రేతల ద్వారా సరఫరా చేశారు. ఫోన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించడం విక్రయాలకు తోడ్పడింది. జిల్లా సేంద్రీయ మార్కెట్ ద్వారా వినియోగదారులకు నేరుగా విక్రయించే మరో అవకాశం లభించింది. లక్ష్యానికి అనుగుణమైన శిక్షణ, సంస్థాగత మార్గదర్శకత్వం, తక్కువ మౌలిక సదుపాయాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన మార్కెటింగ్ వ్యూహాలతో పుట్టగొడుగుల సాగులో వ్యాపార అవకాశాలను ఎలా సృష్టించుకోవచ్చో అంజనాబెన్ అనుభవం తెలియజేస్తోంది.
25 సంచులతో ప్రారంభించి పుట్టగొడుగుల వ్యాపారంగా విస్తరణ
ఉత్తరాఖండ్‌లో పుట్టగొడుగుల సాగులో చేపట్టిన చిన్న ప్రయోగం క్రమంగా విభిన్న కార్యకలాపాలతో కూడిన వ్యాపారంగా ఎదిగి ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం చూపుతోంది. డెహ్రాడూన్‌లోని చర్బా గ్రామానికి చెందిన సమాచార సాంకేతిక రంగ నిపుణురాలు హిరేషా వర్మ 2013లో కేవలం 25 సంచులతో ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. సిబ్బంది నివాసం కోసం ఉద్దేశించిన చిన్న గదిలో ఈ ప్రయోగం చేపట్టారు. తొలుత రూ.2,000 పెట్టుబడి పెట్టి సుమారు రూ.5,000 రాబడి పొందారు. ఈ ఫలితాలు పుట్టగొడుగుల సాగును వ్యాపారంగా చేపట్టేందుకు ఆమెను ప్రోత్సహించాయి. అనంతరం డెహ్రాడూన్ కేంద్రంగా 'హాన్ ఆగ్రోకేర్' పేరుతో పుట్టగొడుగుల వ్యాపార సంస్థను స్థాపించారు.

డెహ్రాడూన్ కృషి విజ్ఞాన కేంద్రం, సోలన్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి పుట్టగొడుగుల పరిశోధన డైరెక్టరేట్‌లో పొందిన శిక్షణ ఆమె వ్యాపార ప్రయాణానికి తోడ్పడింది. వివిధ రకాల పుట్టగొడుగులు, సాగు పద్ధతులపై నైపుణ్యం పెంపొందించుకున్నారు. కంపోస్టు, విత్తన పదార్థం కోసం డెహ్రాడూన్ పుట్టగొడుగుల శాఖతో అనుసంధానం ఏర్పరచుకున్నారు. జాతీయ ఉద్యానవన మిషన్, జాతీయ ఉద్యానవన బోర్డు ద్వారా ఆర్థిక సహకారం పొందేందుకు ప్రయత్నించారు. ప్రయోగాత్మక కార్యక్రమంగా ఒక్కొక్కటి 500 పుట్టగొడుగుల సంచులను ఉంచగల సామర్థ్యంతో మూడు వెదురు సాగు షెడ్డులను ఏర్పాటు చేశారు. ఇవి వ్యాపార విస్తరణకు పునాది వేశాయి.
ప్రస్తుతం హాన్ ఆగ్రోకేర్ రోజుకు సుమారు ఒక టన్ను పుట్టగొడుగులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంస్థలో 15 మంది పనిచేస్తున్నారు. వాణిజ్య ఉత్పత్తితో పాటు తన అనుభవంతో ఇతరులకూ ప్రయోజనం చేకూర్చేందుకు హిరేషా కృషి చేస్తున్నారు. కొండ ప్రాంతాలకు చెందిన 2,000 మందికి పైగా మహిళలు, రైతులకు శిక్షణ ఇచ్చారు.
ప్రారంభంలో సీజన్లో రోజుకు కేవలం 20 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసిన ఆమె, ఇప్పుడు ఏడాది పొడవునా ఉత్పత్తి చేసే విజయవంతమైన వ్యాపార సంస్థను అభివృద్ధి చేశారు. ఆమె యూనిట్లో 10 ఏసీ గదులు, రోజుకు 1,000 కిలోల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సాంకేతిక పరికరాలతో కూడిన ప్లాంట్ ఉన్నాయి.
షిటాకే, గానోడెర్మా వంటి ప్రత్యేక రకాల పుట్టగొడుగుల సాగుకు కూడా ఆమె వ్యాపారాన్ని విస్తరించారు. పచ్చళ్లు, కుకీలు, నగెట్స్, సూప్, ప్రొటీన్ పొడి, టీ, అప్పడాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ఆమె సేవలు ఉత్పత్తి, ఉత్పత్తుల వైవిధ్యీకరణకే పరిమితం కాలేదు. తెహ్రీ, పౌరీ, గఢ్వాల్ ప్రాంతాల రైతులకు సాంకేతిక సహాయం అందిస్తూ పుట్టగొడుగుల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకునేందుకు తోడ్పడుతున్నారు.
కొండ ప్రాంతాల్లో పుట్టగొడుగుల సాగుకు కొత్త అవకాశాలు
బాగేశ్వర్‌లోని ఉదేర్ఖానీ గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో మదన్ మోహన్‌కు కొత్త సాగు విధానాన్ని ప్రయత్నించే అవకాశం కనిపించింది. అప్పటివరకు రక్షిత వాతావరణంలో కూరగాయల సాగు, పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం లేకపోయినా వాటిపై ఆసక్తి చూపారు.

2020–21లో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) కింద గ్రామంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి పుట్టగొడుగుల పరిశోధన డైరెక్టరేట్, అల్మోరా చేపట్టిన కార్యక్రమం ద్వారా ఈ అవకాశం లభించింది. పుట్టగొడుగుల సాగు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పరిమిత ఆర్థిక వనరులు మదన్ మోహన్‌కు అడ్డంకిగా నిలిచాయి. కార్యక్రమం ద్వారా అందిన సహకారం ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడింది. 2022లో ఆయన పొలంలో అవసరమైనప్పుడు తరలించగల పాలీహౌస్ను ఏర్పాటు చేశారు. పుట్టగొడుగుల సాగు కోసం వేడి ద్వారా శుద్ధి చేసిన ఐదు క్వింటాళ్ల కంపోస్టును కూడా అందించారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా కాఫ్లిగైర్ కృషి విజ్ఞాన కేంద్రం శిక్షణతో పాటు నిరంతర సాంకేతిక మార్గదర్శకత్వం అందించింది. దీంతో సంస్థాగత సహకారంతో ఆయన పుట్టగొడుగుల సాగు ప్రారంభించగలిగారు.
పోర్టబుల్ పాలీహౌస్: కొండ ప్రాంతాలు, చిన్న రైతుల సాగు పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన, అవసరమైన చోటుకు తరలించగల రక్షిత సాగు నిర్మాణం.
సిఫార్సు చేసిన సాగు పద్ధతులను అనుసరిస్తూ, కేవీకే నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిన మదన్ మోహన్ విక్రయానికి అనువైన ఒక క్వింటాల్ బటన్ పుట్టగొడుగులను పండించారు. 62.4 చదరపు మీటర్ల పాలీహౌస్లో టమాటా, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్ వంటి కూరగాయలను 7.5 క్వింటాళ్ల మేర ఉత్పత్తి చేశారు. సాధారణ సీజన్‌కు భిన్నంగా పంట కోయడం వల్ల మార్కెట్లో అదనపు ప్రయోజనం లభించింది. ఆ సమయంలో హల్ద్వానీ మార్కెట్ నుంచి స్థానిక చిల్లర వ్యాపారులకు సరఫరా పరిమితంగా ఉండేది. పుట్టగొడుగులు, కూరగాయల సాగు ద్వారా కలిపి రూ.41,250 ఆదాయం పొందారు. ఇది ఆయన గత వ్యవసాయ ఆదాయంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఆయన సాధించిన పురోగతి ఇతర రైతులు కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలను పరిశీలించేందుకు ప్రేరణనిచ్చింది. అల్మోరాలోని ఐసీఏఆర్ పుట్టగొడుగుల పరిశోధన డైరెక్టరేట్ నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన కృషిని గుర్తించి సత్కరించారు.
పుట్టగొడుగుల సాగు కేవలం అదనపు వ్యవసాయ కార్యకలాపంగానే కాకుండా విభిన్న జీవనోపాధి అవకాశాలు, వ్యాపారాల ఏర్పాటుకు మార్గంగా నిలుస్తుందని ఈ అనుభవాలు తెలియజేస్తున్నాయి. తగిన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం, ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే రైతులు పరిమిత భూమి, వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు. అదే సమయంలో అదనపు ఆదాయ అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చు.
References
Ministry of Agriculture & Farmers Welfare
https://icar.gov.in/en/node/5810
https://icar.gov.in/sites/default/files/2025-04/ICAR%20Annual%20Report%202023-24-english.pdf
https://icar.gov.in/en/node/5684
https://www.manage.gov.in/publications/reports/internreports/Documentation%20of%20Women%20Leaders.pdf
https://www.manage.gov.in/publications/SuccessStories/SuccessStories-STRY100.pdf
https://icaratariguwahati.org.in/sites/default/files/Technical/Natural%20Resource%20Managment%20.pdf
https://nhb.gov.in/pdf/Cultivation.pdf
https://agritech.tnau.ac.in/farm_enterprises/Farm%20enterprises\_%20Mushroom_button_mushroom_spawning.html
https://epubs.icar.org.in/index.php/MR/article/view/162741/59036
https://epubs.icar.org.in/index.php/MR/article/view/146647/53511
Ministry of Development of North Eastern Region (DoNER)
https://necouncil.gov.in/sites/default/files/2026-07/nec-journal-new-1.pdf
Click to see pdf
***
(Features ID: 160766)
आगंतुक पटल : 30
Provide suggestions / comments