Economy

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్: వ్యాపార ప్రస్థానంగా మారిన సంప్ర‌దాయం

Posted On: 13 OCT 2026 11:25AM

ఒకప్పుడు గ్రామంలో తిరిగే చరఖా జాతీయతా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచేది. నేడు గ్రామీణ సంస్థలతో విస్తరిస్తున్న వ్యవస్థ ద్వారా ఆ స్ఫూర్తి కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. తేనె, మూలికా ఉత్పత్తులు, అరటి నార, వస్త్రాలు, ఇతర గ్రామీణ పరిశ్రమలు సంప్రదాయ నైపుణ్యాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.

స్వయం సమృద్ధి స్ఫూర్తి వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ప్రతిధ్వనిస్తోంది. ఆర్థిక వనరులు, సాంకేతికత, శిక్షణ అందుబాటులోకి రావడంతో సంప్రదాయ నైపుణ్యాలు, స్థానిక వనరులకు కొత్త మార్కెట్లు లభిస్తున్నాయి.

స్థానిక సంస్థలు, వినియోగదారుల మధ్య పెరుగుతున్న అనుసంధానం ఖాదీ మహోత్సవ్‌లోనూ కనిపిస్తోంది. ఏటా అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఖాదీ మహోత్సవ్ నిర్వహిస్తారు. యువతపై ప్రత్యేక దృష్టి సారించే ఈ ప్రచారం ఖాదీ, ‘వోకల్ ఫర్ లోకల్’పై వారిలో అవగాహన పెంచుతోంది. ఖాదీ, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది.



ఈ పరివర్తనలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యాక్ట్–1956 కింద ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ ఇది. గ్రామీణ పరిశ్రమల ప్రణాళిక, ప్రోత్సాహం, సదుపాయాల కల్పన, నిర్వహణ, సహాయానికి ఈ చట్టం కేవీఐసీకి బాధ్యతలు అప్పగించింది. శిక్షణ, ముడి పదార్థాలు, మార్కెటింగ్, పరిశోధన, నాణ్యత మెరుగుదలకు సంబంధించిన చర్యలు దీని పరిధిలోకి వస్తాయి. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన సాంకేతిక సమాచారం, సదుపాయాలను అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, పరిశోధనకు కూడా సహకరిస్తోంది.

2025–26లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలు చరిత్రలోనే అత్యధికంగా ₹1.87 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2026 మే నాటికి నమోదైన గణాంకం. 2013–14తో పోలిస్తే విక్రయాలు 501 శాతం పెరగగా, ఉత్పత్తి 380 శాతం వృద్ధితో ₹1,25,296 కోట్లకు చేరింది. ఈ రంగంలో ఉపాధి 56 శాతం పెరిగి 2.04 కోట్లకు చేరుకుంది. కళాకారులకు చెల్లించే పారితోషికం కూడా పెరిగింది. 2013–14లో ఒక్కో హాంక్‌కు ₹4గా ఉన్న పారితోషికం ప్రస్తుతం ₹15కు చేరింది. ఇది దాదాపు 275 శాతం పెరుగుదల.

ఒక హాంక్ అంటే 840 గజాల పొడవు, ఒక పౌండ్ బరువు కలిగిన నూలు.

ఒక్కో కళాకారుడికి అండగా గ్రామీణ వ్యాపారాల నిర్మాణం
నైపుణ్యాల సముపార్జన నుంచి మార్కెట్ అవకాశాల వరకు పలు కార్యక్రమాలు కళాకారులు, గ్రామీణ పరిశ్రమలకు సహకరిస్తున్నాయి.

కేవీఐసీకి 35 శాఖాపరమైన, శాఖేతర శిక్షణ కేంద్రాల నెట్‌వర్క్ ఉంది. ఆహార ఉత్పత్తులు, బేకరీ, తేనెటీగల పెంపకం, అగర్‌బత్తీలు, కొవ్వొత్తులు, మోటార్ మరమ్మతులు, ఇతర అనేక కార్యకలాపాల్లో శిక్షణ అందిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేవీఐసీ శిక్షణ కార్యక్రమాల ద్వారా 79,682 మంది శిక్షణార్థులు శిక్షణ పొందారు.

ఖాదీ రంగంలోని దాదాపు ఐదు లక్షల మంది కళాకారుల్లో 80 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. 2025–26లో వివిధ కేవీఐసీ కార్యక్రమాల ద్వారా 47,382 మంది మహిళలు శిక్షణ పొందారు. మొత్తం శిక్షణార్థుల్లో వీరి వాటా దాదాపు 59 శాతం.

శిక్షణతో పాటు టూల్‌కిట్లు, పరికరాల పంపిణీ, మార్కెటింగ్ సహాయం, ఇతర చర్యలను కూడా అమలు చేస్తున్నారు.

 



2008 మార్చి నుంచి ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) ద్వారా కేవీఐసీ దాదాపు 97.95 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది.

ఈ పథకం లబ్ధిదారుల్లో శ్రీ జితేంద్ర బైఠా ఒకరు. ఆయన 2020లో బిహార్‌లో బేకరీ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏటా ₹72 లక్షల టర్నోవర్ సాధిస్తూ స్థానికంగా 20 మందికి ఉపాధి కల్పిస్తోంది.

ఉత్పత్తికి అవసరమైన సంస్థాగత ఆర్థిక సహాయం, పనిముట్లు, సాంకేతికత కూడా అందిస్తున్నారు.

గ్రామోద్యోగ్ వికాస్ యోజన ద్వారా ఆధునిక యంత్రాలు, టూల్‌కిట్లు, పరికరాలు అందిస్తూ కళాకారులకు సాధికారత కల్పిస్తున్నారు. 2025–26లో 37,769 యంత్రాలు, టూల్‌కిట్లు, పరికరాలను పంపిణీ చేశారు. ఈ పథకం కింద 2026 మే నాటికి కేవీఐసీ 3.23 లక్షలకు పైగా యంత్రాలు, టూల్‌కిట్లు, పరికరాలను అందించింది.

ఖాదీ సంస్థలు, కళాకారులు పనిచేసే విస్తృత వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు ఈ ప్రయత్నాలకు అదనపు సహకారం అందిస్తున్నాయి.

మారుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను మెరుగుపరచడం, విలువ జోడించడంలో ఖాదీ సంస్థలకు ఖాదీ వికాస్ యోజన సహాయపడుతోంది. ఈ పథకంలోని మాడిఫైడ్ మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ విలువ జోడింపు, మార్కెట్ ఆధారిత ధరల నిర్ణయంలో సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పిస్తోంది. 2024–25లో 1,097 ఖాదీ సంస్థలకు ₹245 కోట్లు విడుదల చేయగా, 1,45,484 మంది కళాకారులు ప్రయోజనం పొందారు.

సరసమైన రుణాలు అదనపు సహాయాన్ని అందిస్తున్నాయి. ఇంటరెస్ట్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ స్కీమ్ కింద అర్హత కలిగిన ఖాదీ సంస్థలు ఏటా 4 శాతం రాయితీ వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు.

కళాకారులకు పనిచేసే ప్రదేశం కూడా ఎంతో ముఖ్యం. వర్క్‌షెడ్ స్కీమ్ ద్వారా మెరుగైన ఉత్పత్తి ప్రదేశాలు, అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. 2025–26లో డిసెంబర్ 2025 వరకు ఈ పథకం ద్వారా 1,309 మంది కళాకారులు ప్రయోజనం పొందారు.

ఈ చర్యలు కళాకారులకు మెరుగైన పని పరిస్థితులతో పాటు ఉత్పత్తికి అవసరమైన వనరులను అందిస్తున్నాయి.

గ్రామీణ సంస్థల నుంచి విస్తృత మార్కెట్ల దిశగా
గ్రామీణ పరిశ్రమల్లో సంప్రదాయ నైపుణ్యాలు, స్థానిక వనరులు కొత్త వ్యాపారాలు, ఉత్పత్తులుగా రూపుదిద్దుకుంటున్నాయి. సాంకేతికత, శిక్షణ, మార్కెట్ అనుసంధానం వీటికి అండగా నిలుస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి చర్యలు ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి.

కేవీఐసీ ద్వారా పీఎంఈజీపీ పథకం కింద లభించిన సహాయంతో శ్రీ ఎస్‌.పి. సింగ్ తేనె, కుకీల తయారీ సంస్థను అభివృద్ధి చేశారు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యాపారం ప్రస్తుతం దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తూ అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. తేనె, కుకీలు ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తులు. ఎగుమతుల్లో అమెరికా ప్రధాన వాటా కలిగి ఉంది.

2010లో సహాయం పొందిన తర్వాత అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొంటూ ఈ సంస్థ క్రమంగా తన ఎగుమతి కార్యకలాపాలను విస్తరించింది. దుబాయ్, అమెరికా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో సంస్థ పాల్గొనేందుకు కేవీఐసీ సహకరించింది. దీంతో విదేశీ కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సంస్థ 36 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఐరోపా మార్కెట్లకు తేనె ఎగుమతులను విస్తరించేందుకు పంజాబ్‌లోని రాజ్‌పురాలో రెండో యూనిట్‌ను అభివృద్ధి చేస్తోంది.

 



శ్రీ బి. సుందరరాజ్‌కు సహజ సువాసన కలిగిన మొక్క గ్రామీణ పరిశ్రమ ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. తన అగర్‌బత్తీ యూనిట్ ద్వారా అగర్‌బత్తీలు, మూలికా ఉత్పత్తులు, వట్టివేరు అగర్‌బత్తీలు, వట్టివేరు సాంబ్రాణిని తయారు చేస్తున్నారు. 2024–25లో గ్రామోద్యోగ్ వికాస్ యోజన (జీవీవై) కింద లభించిన సహాయంతో తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకుని, ఉత్పత్తుల శ్రేణిని విస్తరించారు. స్థానికంగా లభించే వనరుతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇది వీలు కల్పించింది. సంప్రదాయ విజ్ఞానం, స్థానిక వనరులను మార్కెట్‌కు అనువైన గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులుగా మార్చడంలో కేవీఐసీ సహాయం ఎలా ఉపయోగపడుతుందో ఆయన సంస్థ చాటుతోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా జట్టి మజ్రా గ్రామంలో శ్రీ సాహిల్ చౌధరి మోనో కార్టన్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ స్థానిక నిర్మాణ, ప్యాకేజింగ్ అవసరాలను తీరుస్తోంది. ₹25 లక్షల ప్రాజెక్టు వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ కేవీఐసీ సహకారం కలిగిన పీఎంఈజీపీ కింద పనిచేస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థ ఏటా దాదాపు ₹45 లక్షల టర్నోవర్ నమోదు చేస్తూ 23 మందికి ఉపాధి కల్పిస్తోంది. చౌధరి వ్యాపార ఆలోచనను పనిచేసే తయారీ సంస్థగా మార్చడంలో ఆర్థిక సహాయం తోడ్పడింది. స్థానిక ఔత్సాహికత స్వయం సమృద్ధి, ఉపాధి, ఆత్మనిర్భర్ భారత్ విస్తృత లక్ష్యానికి ఎలా దోహదం చేయగలదో ఆయన ప్రయాణం తెలియజేస్తోంది.

గ్రామీణ సంస్థలకు కొత్త మార్కెట్లు
వినియోగదారులను చేరుకునేందుకు కేవీఐసీ డిజిటల్, ప్రత్యక్ష విక్రయ మార్గాలను విస్తరించింది. దుస్తులు, వస్త్రాలు, కిరాణా ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ ద్రవ్యాలు, అగర్‌బత్తీలతో కూడిన విస్తృత ఉత్పత్తుల శ్రేణిని అందించే ఆన్‌లైన్ ఖాదీ ఇండియా స్టోర్‌(www.khadiindia.gov.in)ను నిర్వహిస్తోంది.

ప్రత్యేక ప్రచార, మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా ఖాదీ ఇండియా బ్రాండ్‌కు ప్రోత్సాహం అందిస్తున్నారు. సంప్రదాయ ఉత్పత్తులను ఆధునిక వినియోగదారులకు ఈ కార్యక్రమాలు చేరువ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన మార్కెటింగ్ నెట్‌వర్క్‌లో 8 శాఖాపరమైన ఖాదీ ఇండియా విక్రయ కేంద్రాలు, 15 కేవీఐసీ శాఖలు ఉన్నాయి. ఖాదీ సంస్థలు దేశవ్యాప్తంగా మరో 8,035 విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.

జాతీయ, జోనల్, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రదర్శనలు అదనపు మార్కెట్ అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనేందుకు కూడా కేవీఐసీ ప్రోత్సాహం అందిస్తోంది.

ఖాదీ: ప్రపంచ కథను అల్లుతూ..
ఫ్యాషన్ రంగంలో ఖాదీ కొత్త రూపాలను సంతరించుకుంటోంది. న్యూజిలాండ్ ఫ్యాషన్ వీక్ 2026, లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 వంటి వేదికలపై ప్రత్యేకమైన ఖాదీ హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో వారసత్వ పద్ధతులను ఆధునిక డిజైన్లతో మేళవించి ఖాదీకి విలక్షణమైన ఆధునిక గుర్తింపును తీసుకొచ్చారు.

 



వారసత్వం నుంచి అవకాశాల దిశగా..
పెరిగిన ఉత్పత్తి, విక్రయాలు, విస్తరిస్తున్న ఉపాధి, కళాకారులకు అధిక పారితోషికం, కొత్త గ్రామీణ వ్యాపారాల్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వృద్ధి ప్రతిఫలిస్తోంది. సంప్రదాయ నైపుణ్యాలు సాంకేతికత, ఆర్థిక వనరులు, మార్కెట్లతో అనుసంధానమవుతున్న కొద్దీ గ్రామీణ భారత్‌లో ఈ రంగం కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది.

 

 

References

Ministry of Micro, Small and Medium Enterprise

https://www.msme.gov.in/static/uploads/2026/05/1bfda06b460e72543530b40817573495.pdf?_gl=1*ijpb14*_ga*ODgwMjkyOTQyLjE3ODI2NTg1OTM.*_ga_4858QHF08F*czE3ODI5NzE5MzUkbzIkZzEkdDE3ODI5NzIzNzgkajUzJGwwJGgw

https://www.kvic.gov.in/kvicres/aboutkvic.php

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2265369&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2307332&reg=3&lang=1

https://x.com/kvicindia/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2224092&reg=3&lang=1

Others

https://www.coek.in/events

https://innovateindia.mygov.in/khadi-mahotsav/

https://www.facebook.com/kvicindia/posts/from-a-young-entrepreneur-in-himachal-pradesh-to-a-thriving-business-ownersahil-/1519536520217135/

https://www.youtube.com/watch?v=QzwX93saslI

Click here for pdf file. 

***

(Features ID: 160451) आगंतुक पटल : 8
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Tamil , English , हिन्दी , Bengali