Infrastructure
పర్యాటక మైలురాళ్లుగా లైట్హౌస్లు
మారుతున్న భారతదేశ దీపస్తంభాల కథ
Posted On:
10 OCT 2026 3:17PM
తరతరాలుగా భారతదేశ లైట్‌హౌస్‌లను ప్రజలు దూరం నుంచే చూసేవారు. సముద్ర తీరాల చివరన నిలిచి ప్రమాదకరమైన ప్రాంతాలను సూచిస్తూ, చీకటిలో నౌకలకు దారి చూపేవి. వాటి వెలుగు నావికుల కోసం, వాటి టవర్లు తీరప్రాంత సౌందర్యంలో భాగంగా ఉండేవి.
11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీరం, 205 లైట్హౌస్లు కలిగిన భారత్ ప్రస్తుతం ఈ చారిత్రక సముద్ర మార్గదర్శకాలకు కొత్త రూపం ఇస్తోంది. లైట్‌హౌస్ ఇప్పుడు దూరం నుంచి కనిపించే గుర్తుకే పరిమితం కావడం లేదు. భారత తీరప్రాంతంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరించడమే వాటి ప్రాథమిక విధి. ఆ కీలక బాధ్యతలో ఎలాంటి మార్పు లేదు. అయితే వాటి చుట్టూ కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది. లైట్‌హౌస్ స్టేషన్లను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటి చరిత్రకు మ్యూజియంలలో చోటు కల్పిస్తున్నారు. వాటి పరిసర ప్రాంతాల్లో నడక మార్గాలు, ఉద్యానవనాలు, యాంఫీథియేటర్లు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. లైట్‌హౌస్‌ల వెలుగు నిరంతరాయంగా పనిచేసేలా ఆధునిక వ్యవస్థలతో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నారు.
లైట్‌హౌస్ పర్యాటకుల సంఖ్య 2014లో దాదాపు 4 లక్షలు ఉండగా, 2024–25లో 18.63 లక్షలకు పెరిగింది. చారిత్రక, నిర్మాణ విశిష్టతను పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా 75 లైట్‌హౌస్‌లను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేశారు. గుజరాత్‌లోని మాండ్వీ, ద్వారక లైట్హౌస్లు, కర్ణాటకలోని తద్రి లైట్‌హౌస్, తమిళనాడులోని పాంబన్ లైట్‌హౌస్, కేరళలోని విళింజం లైట్‌హౌస్ వీటిలో ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్ (డీజీఎల్‌ఎల్) పరిధిలో డిజిటల్ టికెటింగ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. దీంతో సందర్శకుల సేవలు ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి వచ్చాయి. లైట్‌హౌస్ పర్యాటకంపై పెరుగుతున్న ఆసక్తి భారత సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించేందుకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, రవాణా సేవలు, స్థానిక దుకాణాలు, హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

ఇప్పటికీ దారి చూపుతోన్న వెలుగు
దూరం నుంచి చూస్తే లైట్‌హౌస్ మునుపటిలానే కనిపించవచ్చు. కానీ దాని వెలుగు వెనుక పనిచేసే సాంకేతికత గణనీయంగా మారింది. ఒకప్పుడు మంటలు, నూనెపై ఆధారపడిన దీపాలు ఇప్పుడు సౌరశక్తితో పనిచేస్తూ ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థంగా మారాయి. దేశంలోని అన్ని లైట్హౌస్లు సౌరశక్తితో పనిచేస్తున్నాయి. దీంతో నౌకలకు దారి చూపే ఈ దీపాల మౌలిక వ్యవస్థలో పునరుత్పాదక ఇంధనం కీలక భాగంగా మారింది.
ఒక్కో లైట్‌హౌస్‌లో చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. గుజరాత్‌లోని సమియాని ద్వీపంలో నూనె దీపం స్థానంలో తొలుత సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రానిక్ ఫ్లాషర్ను ఏర్పాటు చేశారు. అనంతరం 2016లో ఎల్ఈడీ లాంతరును అమర్చారు. జోడియాలో సౌరశక్తితో పనిచేసే ఫ్లాషింగ్ లైట్‌ను ప్రవేశపెట్టారు. 2021లో దాని స్థానంలో అధిక తీవ్రత కలిగిన ఎల్ఈడీ లాంతరును ఏర్పాటు చేశారు. భారత విస్తృత సముద్ర సమాచార నెట్‌వర్క్‌లో లైట్హౌస్లు భాగంగా మారాయి. తీరప్రాంత లైట్‌హౌస్‌లపై 87 ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్) షోర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో లైట్‌హౌస్‌ల వెలుగు విశ్వసనీయంగా, అవసరాలకు స్పందించేలా పనిచేస్తూ నౌకలకు సురక్షితంగా దారి చూపుతోంది. ఏఐఎస్ అనేది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ (సోలాస్) నిబంధనలకు అనుగుణంగా పనిచేసే నౌక, తీర ఆధారిత డేటా ప్రసార వ్యవస్థ. పరిసర పరిస్థితులపై స్పష్టమైన అవగాహనను పెంచే శక్తిమంతమైన సాధనంగా ఇది పనిచేస్తోంది. తద్వారా నౌకాయాన భద్రత, సముద్ర రవాణా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతున్నాయి.
లైట్‌హౌస్ మ్యూజియంలు: చేరువవుతున్న సముద్ర చరిత్ర
ఆధునిక సాంకేతికత లైట్‌హౌస్‌ల పనితీరును బలోపేతం చేస్తుండగా, వాటి గత చరిత్రకు ప్రత్యేక స్థానం లభిస్తోంది. చెన్నై, మహాబలిపురం, అలప్పుజ, కన్నూర్, ముట్టం, ద్వారక, గోపనాథ్లో భారత్‌కు ప్రత్యేక లైట్‌హౌస్ మ్యూజియంలు ఉన్నాయి.

మామల్లపురం అని కూడా పిలిచే మహాబలిపురానికి తమిళనాడు తీరంలో శతాబ్దాలుగా సాగిన సముద్ర కార్యకలాపాలతో ముడిపడిన ఘన చరిత్ర ఉంది. ఆగ్నేయాసియా, మధ్యధరా ప్రాంత దేశాలతో సముద్ర వాణిజ్యం కోసం క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో పల్లవులు దీన్ని ప్రధాన నౌకాశ్రయంగా అభివృద్ధి చేశారు. ఒకప్పుడు తీరానికి చేరువయ్యే నౌకలకు కట్టెల మంట దారి చూపేది. 1887లో ఒలక్కనేశ్వర ఆలయ పైకప్పుపై నాలుగో శ్రేణి ఆప్టిక్, లాంతరు లోపల వత్తి దీపాన్ని ఏర్పాటు చేసి తొలి సంప్రదాయ లైట్‌హౌస్‌ను నెలకొల్పారు. 2004లో ప్రధాన దీపం, అత్యవసర దీప వ్యవస్థలను 150 వాట్లు, 230 వోల్టుల సామర్థ్యం కలిగిన మూడు మెటల్ హాలైడ్ ల్యాంపుల సమూహంగా మార్చారు.
ప్రస్తుత లైట్‌హౌస్ రాతి నిర్మాణంతో తీర్చిదిద్దిన 26 మీటర్ల ఎత్తైన వృత్తాకార గోపురం. తాను పరిరక్షిస్తున్న చరిత్రతో పాటు ఈ గోపురం కూడా నిరంతరం ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. 2020లో ప్రధాన దీపాన్ని 236 వాట్ల ఎల్ఈడీ అరేతో ఆధునికీకరించారు. దేశంలో ఈ తరహా ఎల్ఈడీ వ్యవస్థను తొలిసారిగా ఇక్కడే అమర్చారు. ఫలితంగా సజీవ వారసత్వం, పనిచేసే ఆధునిక సాంకేతికత ఒకేచోట కనిపిస్తున్నాయి. ఆకట్టుకునే ప్రదర్శనలు, అరుదైన పురావస్తువుల ద్వారా లైట్‌హౌస్‌ల చరిత్రను ఈ మ్యూజియం తెలియజేస్తోంది. నేషనల్ హెరిటేజ్ అండ్ మారిటైమ్ మ్యూజియం ఈ ప్రదేశ చరిత్రను సందర్శకుల అనుభవంలో భాగం చేస్తోంది.
మ్యూజియం ఆధారిత ఈ విధానాన్ని మరింత భారీ ప్రాజెక్టుల్లోనూ అమలు చేస్తున్నారు.
గుజరాత్‌లోని లోథాల్లో నిర్మిస్తున్న నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)లో 77 మీటర్ల ఎత్తైన లైట్‌హౌస్ మ్యూజియం ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లైట్‌హౌస్ మ్యూజియంగా, అతిపెద్ద సముద్ర మ్యూజియంలలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించారు. అంచనా వ్యయం ₹266.11 కోట్లు. అత్యంత కీలకమైన సాంస్కృతిక, సముద్ర వారసత్వ కార్యక్రమాల్లో ఎన్ఎంహెచ్సీ ఒకటి. ఐదు వేల సంవత్సరాలకు పైగా విస్తరించిన భారత సముద్ర వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసి ప్రదర్శించడం దీని లక్ష్యం. ఇందులో 5డీ డోమ్ థియేటర్, కోస్టల్ స్టేట్స్ పెవిలియన్, మ్యూజియోటెల్, ఎకో రిసార్ట్, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) సహకారంతో అభివృద్ధి చేస్తున్న మారిటైమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంఆర్ఐ) కూడా ఉంటాయి. మొత్తం సముదాయాన్ని విశాలంగా వీక్షించే అవకాశం లైట్‌హౌస్ మ్యూజియం సందర్శకులకు కల్పిస్తుంది. దేశంలోని పురాతన లైట్‌హౌస్‌లలో ఒకటైన మహాబలిపురం లైట్‌హౌస్ స్ఫూర్తితో దీని రూపకల్పన చేపట్టారు. రాతిని విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రత్యేక నిర్మాణ శైలిని కొనసాగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన వర్చువల్ రియాలిటీ (వీఆర్) వాక్‌త్రూలు భారత విశాల తీరరేఖ వెంట ఉన్న లైట్‌హౌస్‌ల చరిత్రను సందర్శకులకు పరిచయం చేస్తాయి. అత్యాధునిక సౌండ్ అండ్ లైట్ షోలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ సాంకేతికతతో లైట్‌హౌస్‌ను వెలుగులతో అలంకరిస్తారు.
పురాతన సముద్ర వాణిజ్యంతో సంబంధం ఉన్న దేశంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాల్లో లోథాల్ ఒకటి. ఇలాంటి లైట్‌హౌస్ మ్యూజియం పురాతన నౌకాయాన సంప్రదాయాలను ఆధునిక నావిగేషన్ సహాయక వ్యవస్థల పరిణామంతో అనుసంధానిస్తుంది. ఈ కథ భారత తూర్పు తీరం వెంబడి కూడా విస్తరిస్తోంది. విశాఖపట్నంలోని ఓల్డ్ లైట్‌హౌస్ ప్రాంతంలో కొత్త లైట్‌హౌస్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం 3,156 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు.
లైట్‌హౌస్ ఒక వేడుకగా మారిన వేళ
ఈ పరివర్తన సాధారణ ప్రాజెక్టులు అరుదుగా సృష్టించే కొత్త విశేషానికి దారితీసింది. లైట్‌హౌస్ కేంద్రంగా ప్రత్యేక ఉత్సవం రూపుదిద్దుకుంది. తొలి ఎడిషన్‌ను 2023లో గోవాలోని ఫోర్ట్ అగ్వాడాలో నిర్వహించారు. రెండో ఎడిషన్ 2024లో ఒడిశాలోని పూరీలో జరగగా, మూడో ఎడిషన్‌ను 2026లో విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విస్తృత సాంస్కృతిక నేపథ్యంతో లైట్‌హౌస్‌లను అనుసంధానించారు. తొలి ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, సముద్ర చరిత్రపై సదస్సులు, శాస్త్రీయ కళా ప్రదర్శనలు, ప్రముఖ గాయకులతో సంగీత సాయంత్రాలు, తీరప్రాంత వంటకాల ద్వారా సముద్ర వారసత్వానికి సజీవ రూపం ఇచ్చారు.
|

|
గోవాలో ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్
రెండో ఎడిషన్‌లో కమ్యూనిటీ భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పూరీలో నిర్వహించిన కార్యక్రమంలో లైట్‌హౌస్ వారసత్వాన్ని ఇసుక కళ, పడవల కళ, యోగా, జానపద నృత్యాలు, సంగీతంతో అనుసంధానించారు. పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసిన ఒడిశాలోని గోపాల్పూర్, పూరీ, చంద్రభాగ, పారాదీప్, ఫాల్స్ పాయింట్ లైట్‌హౌస్‌లను కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. లైట్‌హౌస్ ప్రదేశాల పరిరక్షణ, రక్షణ, ప్రచారంలో తీరప్రాంత ప్రజలను భాగస్వాములను చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0లో లైట్‌హౌస్ తీరప్రాంత అస్తిత్వానికి సంబంధించిన మరింత విస్తృత వేడుకకు కేంద్రంగా మారింది. స్థానిక హస్తకళలు, తీరప్రాంత వంటకాలు, రాత్రివేళ వెలుగుల అలంకరణ కార్యక్రమానికి కొత్త రంగులు అద్దాయి. కుటుంబాలు, యువత, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, సందర్శకులు వేడుకలకు జీవం పోశారు. వారి ఉత్సాహభరిత భాగస్వామ్యం ఈ వేడుకను మరింత ఆకర్షణీయంగా, సమ్మిళితంగా మార్చడంతో పాటు లైట్‌హౌస్ చుట్టుపక్కల సమాజాలతో సన్నిహిత అనుబంధాన్ని ఏర్పరిచింది.
గోవాలోని అగ్వాడాలో ఈ కొత్త విధానం పూర్తి ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. చారిత్రక లైట్‌హౌస్ వద్ద లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రారంభించారు. పాత చారిత్రక చిహ్నం చుట్టూ కొత్త కథను చెప్పేందుకు లైట్‌హౌస్ నిర్మాణాన్నే తెరగా ఉపయోగిస్తున్నారు.
|
Aguada Lighthouse
|
లైట్హౌస్కు కొత్త ప్రయాణ మార్గం
ఈ ఆలోచన ఇప్పుడు భారత తీరప్రాంత గోపురాలకే పరిమితం కావడం లేదు. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ, ఇప్పటికే ఉన్న లైట్‌హౌస్‌లకు ప్రజా జీవితంలో మరింత విస్తృత పాత్రను కల్పిస్తోంది. సందర్శకులకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన 75 ప్రదేశాలకు అదనంగా మరో 25 లైట్‌హౌస్‌లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. బ్రహ్మపుత్ర నది వెంబడి పాండు, బోగీబీల్, సిల్ఘాట్, బిశ్వనాథ్ ఘాట్ ప్రాంతాల్లో నాలుగు లైట్‌హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ₹84 కోట్ల ఉమ్మడి వ్యయంతో అంతర్గత జలమార్గంపై నిర్మిస్తున్న దేశంలోని తొలి లైట్‌హౌస్ మౌలిక సదుపాయాలు ఇవే. ఒక్కో లైట్‌హౌస్ 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. సౌరశక్తి, వాతావరణ పరిశీలన సెన్సర్లు నావిగేషన్ మౌలిక వ్యవస్థకు ఆధునిక సామర్థ్యాలను జోడిస్తాయి.
అయితే ఈ లైట్‌హౌస్‌లను కేవలం నౌకాయాన అవసరాల కోసమే రూపొందించడం లేదు. ప్రతి ప్రదేశంలో మ్యూజియం, యాంఫీథియేటర్, క్యాఫెటీరియా, పిల్లల ఆటస్థలం, సావనీర్ దుకాణం, సుందరంగా తీర్చిదిద్దిన ప్రజా ప్రదేశాలు ఉంటాయి. ఈ ఆలోచన సరళమైనదే అయినా ఎంతో ప్రాధాన్యం కలిగింది. దూరం నుంచి నౌకలకు దిశను సూచించే నిర్మాణంగానే లైట్‌హౌస్ మిగిలిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలను నీటికి, దాని చరిత్రకు, భవిష్యత్తు అవకాశాలకు చేరువ చేసే ప్రదేశంగా కూడా మారగలదు. తరతరాలుగా తీరప్రాంతాల్లో నిలిచిన గోపురాల నుంచి బ్రహ్మపుత్ర నది వెంట వెలుగులు విరజిమ్మనున్న కొత్త లైట్‌హౌస్‌ల వరకు భారత దీపస్తంభాల కథ కొత్త దిశలో ప్రయాణిస్తోంది. వెలుగు తన ప్రధాన బాధ్యతను కొనసాగిస్తుండగా, లైట్‌హౌస్ స్వతంత్ర పర్యాటక గమ్యస్థానంగా మారుతోంది.
References
Ministry of Ports, Shipping and Waterways
https://dgll.nic.in/DGLL-light-house-location/about-chennai/mahabalipuram-lighthouse
https://dgll.nic.in/about-DGLL/Service-reminders/nais
https://www.dgll.nic.in/DGLL-light-house-location/about-vts-gandhi-dham/samiyani-island-lighthouse-station
https://nmhc.in/about-us/
https://www.dgll.nic.in/DGLL-light-house-location/about-vts-gandhi-dham/jodiya-lighthouse
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2066548®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297603®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2213361&lang=1®=3
https://x.com/shipmin_india/status/2009198735956566313
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2063453&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200943&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235574®=3&lang=1
Ministry of Culture
https://culture.gov.in/photo-gallery/mamallapuram-lighthouse
Please See PDF
(Features ID: 160450)
आगंतुक पटल : 15
Provide suggestions / comments