Infrastructure

రూపకల్పనతోనే గౌరవం: ప్రజా మరుగుదొడ్ల రూపురేఖలను మార్చుతున్న ఆవిష్కరణలు

Posted On: 02 OCT 2026 12:28PM

ప్రజా పారిశుధ్య సదుపాయాల విస్తరణలో భారత‌దేశ‌ నగరాలు కొన్నేళ్లుగా గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. ప్రజా మరుగుదొడ్ల లభ్యత, పరిశుభ్రత, భద్రత, సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ వాటిని అందరికీ అనువైనవిగా తీర్చిదిద్దేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నాయి.

ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్తూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) దేశవ్యాప్తంగా పారిశుధ్య రంగ ఆవిష్కరణలకు ఊతమిచ్చింది. నగరాలు మరుగుదొడ్లను నిర్మించాయి. ప్రజల్లో అవగాహన పెంచాయి. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) హోదా సాధించేందుకు కృషి చేశాయి. అనేక నగరాలు మరింత ముందడుగు వేసి ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ హోదాలను సాధించాయి. స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ (ఎస్‌బీఎం–యూ) కింద 2022లో ప్రారంభించిన టాయిలెట్స్ 2.0 కార్యక్రమం మరింత ఉన్నత ప్రమాణాలను నిర్దేశించింది. కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లను సురక్షితంగా, పరిశుభ్రంగా, అందరికీ అనువుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. పౌరులు ఇప్పుడు స్వచ్ఛత యాప్‌లోని ‘ఎస్‌బీఎం టాయిలెట్ లొకేటర్’ ద్వారా సమీపంలోని మరుగుదొడ్డి సదుపాయాన్ని గుర్తించవచ్చు.

ప్రస్తుతం ఊహించని ప్రదేశాల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది. పాత బస్సు మహిళల మరుగుదొడ్డిగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్మాణ సామగ్రిగా కొత్త రూపం పొందాయి. రద్దీ మార్కెట్‌లో స్మార్ట్ లాంజ్ అందుబాటులోకి వచ్చింది. ఓ చిన్న నగరం శానిటరీ వ్యర్థాల నిర్వహణకు సురక్షిత పరిష్కారాన్ని కనుగొంది. ఆధ్యాత్మిక‌ నగరాలు అందరికీ అనువైన సదుపాయాలను కల్పిస్తున్నాయి. ప్రాథమిక సదుపాయాల కల్పన నుంచి గౌరవం, భద్రత, ఆవిష్కరణల దిశగా సాగుతున్న ప్రయాణాన్ని ఈ విజయగాథలు తెలియజేస్తున్నాయి.

న్యూ ఏజ్ టాయిలెట్స్: పాత బస్సుతో మహిళలకు సురక్షిత ప్రదేశం
రద్దీ బస్‌ టెర్మినళ్లలో ప్రయాణించే మహిళలకు పరిశుభ్రమైన, వ్యక్తిగత గోప్యత కలిగిన మరుగుదొడ్డి దొరకడం తరచూ కష్టమవుతుంది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ అవసరాన్ని తీర్చేందుకు పాత బస్సుకు కొత్త రూపం ఇచ్చారు. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టీసీ) మెజెస్టిక్ బస్‌ టెర్మినల్‌లో స్త్రీ టాయిలెట్‌ను ఏర్పాటు చేసింది. వినియోగంలో లేని వాహనంతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ సదుపాయాన్ని మహిళలు మాత్రమే వినియోగించవచ్చు.



ఈ మరుగుదొడ్డిలో మూడు భారతీయ శైలి, రెండు పాశ్చాత్య శైలి కమోడ్‌లు ఉన్నాయి. రుతుక్రమ పరిశుభ్రత కోసం శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్, ఇన్సినరేటర్ ఏర్పాటు చేశారు. తల్లులు పిల్లలకు పాలివ్వడానికి, డైపర్లు మార్చడానికి ప్రత్యేక ప్రదేశం అందుబాటులో ఉంది. ఈ సదుపాయం స్వయంగా ఉత్పత్తి చేసే సౌరశక్తితో సెన్సర్ లైట్లు పనిచేస్తాయి. వ్యర్థ జలాలను బస్‌స్టేషన్ సమీపంలోని మురుగునీటి చాంబర్‌కు పంపిస్తారు. చిన్నపిల్లలతో ప్రయాణించే తల్లులకు ఈ మరుగుదొడ్డి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది.

నవీ ముంబై సస్టెయినబుల్ టాయిలెట్స్: పర్యావరణహిత పట్టణ రూపకల్పనకు నమూనా
ఒక నగరంలో పారవేసే వ్యర్థాలతో ప్రజా మరుగుదొడ్డిని నిర్మించవచ్చా? అది సాధ్యమేనని నవీ ముంబై నిరూపించింది. నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) కోపర్‌ఖైరానే సెక్టార్–14లో ఆస్పిరేషనల్ టాయిలెట్స్‌ను అభివృద్ధి చేసింది. రద్దీగా ఉండే నిసర్గుద్యాన్ పట్టణ ఉద్యానవనం సమీపంలో ఈ సదుపాయం ఉంది. ప్రతిరోజూ దాదాపు 8,000 నుంచి 9,000 మంది దీనిని వినియోగిస్తున్నారు.

 



ఈ నిర్మాణంలో 426 చదరపు మీటర్ల రీసైకిల్ ప్లాస్టిక్ షీటింగ్‌ను ఉపయోగించారు. ఇందులో 5.3 మెట్రిక్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్, 11,700 ప్లాస్టిక్ సీసాలు, 35,200 సీసా మూతలు ఉన్నాయి. నిర్మాణదారులు తిరిగి వినియోగానికి అనువుగా మార్చిన 85 కంప్యూటర్ కీబోర్డులు, 284 కిలోల స్క్రాప్ లోహాన్ని కూడా ఉపయోగించారు. రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సూత్రాన్ని ఈ ప్రాజెక్టు రోజువారీ ఆచరణలోకి తీసుకొచ్చింది.

రూపకల్పనలో భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. పురుషులు, మహిళలకు వేర్వేరు విభాగాలు వ్యక్తిగత గోప్యతను కల్పిస్తున్నాయి. పిల్లలు, దివ్యాంగులకు ప్రత్యేక యూనిట్లు, బేబీ కేర్ స్టేషన్లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. శుద్ధి చేసిన మురుగునీటితో పనిచేసే ఫౌంటెన్ ఈ పర్యావరణహిత రూపకల్పనకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. పర్యావరణ ఆవిష్కరణ, పౌర గర్వానికి ఈ సముదాయం చిహ్నంగా మారింది.

స్వచ్ఛ్ స్మార్ట్ టాయిలెట్స్: భోపాల్‌లో సౌకర్యవంతమైన ఫ్రెష్‌రూమ్స్
భోపాల్‌లోని 10 నంబర్ మార్కెట్ ప్రతిరోజూ కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ అక్కడ స్మార్ట్, విలాసవంతమైన ప్రజా సౌకర్య కేంద్రాలైన ‘ఫ్రెష్‌రూమ్స్’ను ఏర్పాటు చేసింది. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద డిజైన్–బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (డీబీఓటీ) నమూనాలో వీటిని నిర్వహిస్తున్నారు. మార్కెట్‌లోని స్మార్ట్ లాంజ్ 800 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రతిరోజూ 500 నుంచి 1,000 మంది ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నారు.

 



సాంకేతికత ఈ కేంద్రానికి ప్రధాన ఆధారం. ఇందులో సెన్సర్ ఆధారిత మరుగుదొడ్లు, ట‌చ్‌-ఫ్రీ యూరినల్స్ ఉన్నాయి. వేడి, చల్లటి నీటితో స్నాన సదుపాయాలు, లాకర్లు, వై-ఫై సేవలను కూడా సందర్శకులు ఉపయోగించుకోవచ్చు. కేఫ్, వెండింగ్ మెషిన్లు, బేబీ చేంజింగ్ గదులు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని డిజిటల్ ఇన్ఫర్మేషన్ వాల్ అందిస్తుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులకు వేర్వేరుగా సులభంగా వినియోగించగల సదుపాయాలు ఉన్నాయి. సాంకేతికత, సౌకర్యం, స్థిరత్వాన్ని సమన్వయం చేస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగల ప్రపంచస్థాయి పారిశుధ్య సేవలను వినూత్న నమూనాల ద్వారా అందించవచ్చని ఫ్రెష్‌రూమ్స్ చాటుతున్నాయి.

కరాడ్‌లో స్మార్ట్ శానిటరీ పరిష్కారాలు: సురక్షిత పారవేతతో సురక్షిత నగరం
పరిశుభ్రమైన మరుగుదొడ్లు పారిశుధ్య వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. శానిటరీ వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం మరో కీలక అంశం. ఉపయోగించిన న్యాప్‌కిన్లు, డైపర్లను బహిరంగంగా పారేస్తే ప్రజారోగ్యం, పర్యావరణానికి హాని కలుగుతుంది. సామాజిక సంకోచం కారణంగా ఈ సమస్య తరచూ చర్చకు రాదు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న చిన్న నగరం కరాడ్ ఈ సవాలును నేరుగా ఎదుర్కొంది. శానిటరీ, బయోమెడికల్ వ్యర్థాలను 100 శాతం వేరు చేయడం, సేకరించడం, ప్రాసెస్ చేయడం అక్కడ అమలవుతోంది. ఆసుపత్రులు, క్లినిక్‌లు, గృహాలు, ఇతర కేంద్రాల నుంచి ప్రతిరోజూ దాదాపు 300 నుంచి 350 కిలోల శానిటరీ వ్యర్థాలను సేకరిస్తున్నారు.

 



శానిటరీ వ్యర్థాలపై ఉన్న సామాజిక సంకోచాన్ని తొలగించడం తొలి అడుగుగా మారింది. కార్యశాలలు, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు, బహిరంగ ప్రకటనల ద్వారా నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. కరాడ్ మునిసిపల్ కౌన్సిల్ (కేఎంసీ) మహిళల సహకారంతో అవగాహన బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నివాస ప్రాంతాల్లో ప్రజలకు సందేశాన్ని చేరవేశాయి. మహిళలు వ్యర్థాలను సురక్షితంగా పారవేసేందుకు ప్రజా మరుగుదొడ్లలో ప్రత్యేక ఎరుపు రంగు డబ్బాలను ఉంచారు.

 



పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు, వ్యర్థాల పారవేత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రోత్సహించారు. ఉపయోగించిన ప్యాడ్లను కాగితంలో చుట్టాలని నగర ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీ) బృందం సూచించింది. అప్పటి నుంచి అనేక పాఠశాలలు ఇన్సినరేటర్లను ఏర్పాటు చేశాయి. వాటిలో మిగిలే అవశేషాలను బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రానికి పంపుతున్నారు.



చెత్త సేకరణ వాహనాల్లో శానిటరీ వ్యర్థాలకు ప్రత్యేక డబ్బా ఉంటుంది. ఇన్సినరేటర్‌లో కాల్చేందుకు అనువైన వ్యర్థాలు మాత్రమే చేరేలా సిబ్బంది వాటిని వేరు చేస్తారు.



ఈ వ్యర్థాల శుద్ధి కోసం కేఎంసీ కరాడ్ హాస్పిటల్ అసోసియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రం నిర్మాణానికి కేఎంసీ స్థలం కేటాయించగా, అసోసియేషన్ దాని నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను చేపట్టింది. రోజుకు 600 కిలోల సామర్థ్యం కలిగిన కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ (సీబీడబ్ల్యూటీఎఫ్) ఇది. మునిసిపల్ కౌన్సిల్ సేకరించే శానిటరీ వ్యర్థాలను ఈ కేంద్రం ఉచితంగా ప్రాసెస్ చేస్తుంది. కేంద్రంలోని ఇన్సినరేటర్‌లో ఉష్ణోగ్రత 1,200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. హానికర పదార్థాలను తొలగించేందుకు వాయువులను ఫిల్టర్ చేస్తారు. ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (ఎస్‌పీసీబీ) వ్యవస్థకు అనుసంధానించారు.

ఈ పీపీపీ భాగస్వామ్యం మునిసిపల్ కౌన్సిల్‌పై ఆర్థిక భారాన్ని తగ్గించింది. వ్యర్థాల సేకరణ, రవాణా ఖర్చులను మాత్రమే కౌన్సిల్ భరిస్తోంది. అధిక ఉష్ణోగ్రత వద్ద శానిటరీ వ్యర్థాలను కాల్చడం ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడంతో పాటు వాటిని నిర్వహించే పారిశుధ్య కార్మికులకు రక్షణ కల్పిస్తోంది. బహిరంగంగా వ్యర్థాలను పారవేసే పద్ధతి పూర్తిగా తొలగిపోవడంతో పర్యావరణ కాలుష్యం, వ్యాధుల వ్యాప్తి తగ్గాయి. శానిటరీ వ్యర్థాల పారవేత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలతో సహా నగరవాసుల జీవన నాణ్యత మెరుగుపడింది.

తిరుపతి యాత్రికులకు సౌకర్యం, పరిశుభ్రత, సంరక్షణ
పుణ్యక్షేత్రాలకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు నిత్యావసరంగా మారాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఒకటి. భక్తులు, పర్యాటకులు, స్థానికుల కోసం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధునిక మరుగుదొడ్ల సముదాయాలను నిర్మించింది.

 



బస్‌స్టేషన్ సమీపంలో మహిళల కోసం ప్రత్యేక పింక్ టాయిలెట్ కాంప్లెక్స్ ఉంది. ఇది శ్రీనివాసం, విష్ణునివాసం, రైల్వేస్టేషన్, బస్‌ టెర్మినల్ వంటి ప్రధాన ప్రాంతాలకు సమీపంలో ఉంది. మహిళలు భారతీయ, పాశ్చాత్య శైలి మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, మదర్ కేర్, చేంజింగ్ గదులను వినియోగించుకోవచ్చు. రుతుక్రమ పరిశుభ్రత కోసం ఇన్సినరేటర్లు, శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 12,000 నుంచి 15,000 మంది ఈ సముదాయాన్ని వినియోగిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో పద్ధతి ప్రకారం శుభ్రపరిచే వ్యవస్థ ద్వారా పరిశుభ్రతను కాపాడుతున్నారు.

రైల్వేస్టేషన్ సమీపంలోని కామన్ పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్, గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతానికి ప్రతిరోజూ వచ్చే 20,000 నుంచి 25,000 మంది భక్తులకు సేవలు అందిస్తోంది. అందరికీ సులభంగా వినియోగపడేలా రూపొందించిన ఈ సముదాయంలో పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, దివ్యాంగులు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ర్యాంపులు, హ్యాండ్‌రెయిల్స్, పిల్లలకు అనువైన పరికరాలు, స్నానపు గదులు యాత్రికులకు మరింత సౌకర్యం, పరిశుభ్రత, సులభ ప్రాప్యతను కల్పిస్తున్నాయి.

భ‌విష్య‌త్‌ మార్గం
ఎస్‌బీఎం–యూ 2.0 కింద దృష్టి ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణానికే పరిమితం కావడం లేదు. వాటిని పరిశుభ్రంగా, సురక్షితంగా, అందరికీ అనువుగా, స్థిరమైన రీతిలో నిర్వహించడం ప్రస్తుతం ప్రధాన లక్ష్యం. నగరాలు తమకు అనువైన విధానాల్లో ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటున్నాయో ఈ విజయగాథలు తెలియజేస్తున్నాయి. పాత బస్సు, రీసైకిల్ ప్లాస్టిక్, సెన్సర్ ఆధారిత పరికరాలు, అధిక ఉష్ణోగ్రత ఇన్సినరేటర్ వంటి ప్రతి ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీలతో భాగస్వామ్యాలు ఈ సదుపాయాల సమర్థ నిర్వహణకు తోడ్పడుతున్నాయి. అంకితభావంతో పనిచేసే కార్మికులు, సంరక్షకులు ప్రతిరోజూ వీటికి జీవం పోస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న వేళ ముందున్న దిశ స్పష్టంగా కనిపిస్తోంది. లింగం, సామర్థ్యం, నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి పరిశుభ్రమైన, గౌరవప్రదమైన మరుగుదొడ్డి సదుపాయం అందాలి. మార్కెట్ల నుంచి స్మారక కట్టడాల వరకు భారత నగరాలు ఈ హామీని ఆచరణలోకి తీసుకొస్తున్నాయి.

 

Reference:

Ministry of Housing and Urban Affairs

Click to see pdf

***

 

(Features ID: 160449) आगंतुक पटल : 54
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Kannada , Malayalam