Infrastructure
పట్టణాల రూపాంతరం: మరింత హరిత, సుస్థిర నగరాల నిర్మాణం
Posted On:
02 OCT 2026 12:04PM
ఒక నగర అభివృద్ధి దాని భవనాలు, రహదారుల్లోనే కాదు, రోజువారీ సవాళ్లకు స్పందించే విధానంలోనూ కనిపిస్తుంది. వ్యర్థాలను నిర్వహించే తీరు, ప్రజల భాగస్వామ్యం, సేవల అందజేత పట్టణ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయి. దేశవ్యాప్తంగా రోజువారీ జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పునకు స్వచ్ఛ్ భారత్ మిషన్ బలమైన పునాదిని అందించింది. ఈ కార్యక్రమం ద్వారా కాలక్రమేణా దృష్టి కేవలం చెత్త సేకరణ, తొలగింపును దాటి విస్తరించింది. పారేసిన వస్తువుల నుంచి విలువను పొందేందుకు, బాధ్యతాయుతమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు, మునిసిపల్ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు నగరాలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. వ్యర్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్, తిరిగి ఉపయోగించడం, ఉపయోగకరమైన వనరులను వెలికితీయడం స్థానిక వ్యవస్థల్లో అంతర్భాగాలుగా మారుతుండటంతో పర్యావరణహిత పద్ధతులు కూడా విస్తరిస్తున్నాయి. డిజిటల్ పర్యవేక్షణ, డేటా ఆధారిత వ్యవస్థలు, మెరుగైన సేవల అందజేత స్థానిక సంస్థలు మరింత కచ్చితత్వంతో పనిచేసేందుకు తోడ్పడుతున్నాయి. పర్యావరణ బాధ్యతను రోజువారీ జీవిత అవసరాలతో సమతుల్యం చేసే పట్టణ ప్రాంతాలను ఈ కృషి క్రమంగా సృష్టిస్తోంది.
సుస్థిర పట్టణ రూపాంతరంలో ముందున్న నగరాలు
వివిధ ప్రాంతాల్లోని నగరాలు స్థానిక పరిష్కారాల ద్వారా అర్థవంతమైన పర్యావరణ ఫలితాలను ఎలా సాధించవచ్చో చూపిస్తున్నాయి. సుస్థిర పట్టణ రూపాంతరం అనేక రూపాల్లో ఉండవచ్చని వాటి అనుభవాలు తెలియజేస్తున్నాయి. చెత్త నిల్వ ప్రదేశాలను సమగ్ర వ్యర్థాల నిర్వహణ కేంద్రాలుగా మార్చడం, వ్యర్థ రహిత పద్ధతులను ప్రోత్సహించడం వీటిలో ఉన్నాయి. సాంకేతికత కూడా రోజువారీ పారిశుధ్య సేవలను మెరుగుపరుస్తూ, పట్టణ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఈ విభిన్న విధానాలను కింది కథనాలు తెలియజేస్తున్నాయి.
హరిత గోవా: వ్యర్థాల నుంచి ఇంధనం
గోవాలోని సాలిగావ్ లోయల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ సెంటర్ పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తోంది. 113,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రాన్ని గోవా వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నిర్వహిస్తోంది. గతంలో ఈ ప్రదేశాన్ని చెత్త డంపింగ్ కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు దీనిని గోవాకు సమగ్ర, పర్యావరణహిత వ్యర్థాల నిర్వహణ కేంద్రంగా మార్చారు. ఈ కేంద్రం ప్రతిరోజూ 250 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను నిర్వహిస్తుంది. ఇక్కడ వ్యర్థాల నుంచి సేంద్రియ పదార్థాలను వేరు చేసి, బయోగ్యాస్‌గా మారుస్తారు. ఇది విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ విద్యుత్ ఆ ప్రాంతంలో విద్యుత్ కొరతను తగ్గిస్తూ స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తుంది.
రెస్టారెంట్ల నుంచి వచ్చే తడి చెత్తను మీథేన్ అధికంగా ఉండే బయోగ్యాస్ సహా విలువైన జీవ ఉత్పత్తులుగా మారుస్తారు. ఈ కేంద్రంలో ప్రాసెస్ చేసే 100 మెట్రిక్ టన్నుల పొడి చెత్త నుంచి రీసైక్లింగ్‌కు ఉపయోగపడే పదార్థాలను వేరు చేస్తారు. మిగిలిన పొడి చెత్తను సహ-ప్రాసెసింగ్ కోసం సిమెంట్ కర్మాగారాలకు పంపుతారు. అదనంగా, ఈ కేంద్రంలో తడి చెత్త నుంచి 1.32 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ విద్యుత్‌తో 35 యూనిట్లు పనిచేస్తాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో సగాన్ని గోవా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు సరఫరా చేస్తారు. ఈ ప్లాంట్ రోజూ 7–8 టన్నుల కంపోస్టును కూడా ఉత్పత్తి చేస్తుంది. స్థానిక పంచాయతీలు ఈ కంపోస్టును తోటల పెంపకం, తిరిగి అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తాయి.

ఈ సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం రాష్ట్రంలోని మొత్తం వ్యర్థాల్లో సుమారు మూడో వంతును ప్రాసెస్ చేస్తూ గోవా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఒకప్పుడు కేవలం చెత్త సేకరించినవారు ఇప్పుడు ప్లాంట్‌లో శిక్షణ పొందిన సిబ్బందిలో భాగమయ్యారు. పర్యావరణానికి మేలు చేయడంతోపాటు ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది. నగరాన్ని “వ్యర్థ రహితంగా” మార్చాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏడాది పొడవునా నిరంతరం పనిచేస్తోంది.

గాంధీనగర్ వ్యర్థ రహిత ప్రస్థానం: మార్పును ముందుకు నడిపిస్తున్న పౌరులు
గుజరాత్‌లోని గాంధీనగర్ స్వచ్ఛత, సుస్థిరతకు బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ పట్ల నిబద్ధత, స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో భాగస్వామ్యం ద్వారా నగరం పరిశుభ్రత సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్త జీరో వేస్ట్ వీక్ ఉద్యమం స్ఫూర్తితో గాంధీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రవర్తనా మార్పును ప్రోత్సహించడం, వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం అనే 3ఆర్ సూత్రాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమాల లక్ష్యాలు. నగరంలోని 25 ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించి, 600 మందికి పైగా పౌరులను ప్రత్యక్షంగా భాగస్వాములను చేశారు. ప్రత్యేక సామాజిక మాధ్యమ ప్రచారాలు ఆ వారంలో 40,000 మందికి పైగా చేరి, అవగాహన కల్పించాయి. గాంధీనగర్ అంతటా ప్రజల భాగస్వామ్యం, సుస్థిర చర్యలకు మై థేలీ స్టాళ్లు చురుకైన వేదికలుగా నిలిచాయి. వాడిన దుస్తులను విరాళంగా ఇవ్వాలని పౌరులను ప్రోత్సహించారు. స్థానిక స్వయం సహాయక సంఘాల్లోని నైపుణ్యం కలిగిన మహిళలు ఈ దుస్తులను తిరిగి ఉపయోగించగల సంచులుగా మార్చారు.
పాఠశాల విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు “స్వచ్ఛతా సే షురువాత్” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ సమస్యలు, బాధ్యతాయుతమైన పద్ధతులపై అవగాహన పెంచేందుకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు సుస్థిరతపై ఆచరణాత్మక అవగాహన పొందేలా ఆసక్తికరమైన, పరస్పర భాగస్వామ్యంతో కూడిన ఆటలను రూపొందించారు. పాత దుస్తులు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేందుకు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ వ్యాన్ నివాసితుల ఇంటి ముంగిటికి వెళ్లింది. వస్తువులను అందించినవారికి బహుమతులు ఇచ్చి, మరింత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. తమ వ్యక్తిగత కృషి, రోజువారీ అలవాట్లను ఆన్‌లైన్ అనుభవ వాక్యాల ద్వారా పంచుకోవాలని కూడా పౌరులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల ద్వారా గాంధీనగర్ తన వ్యర్థ రహిత దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తోంది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లక్ష్యం కోసం పనిచేస్తూ, వనరులను బాధ్యతగా వినియోగించే పద్ధతులను నగరం నిరంతరం బలోపేతం చేస్తోంది.


సమర్థమైన వ్యర్థాల నిర్వహణకు కాకినాడ తెలివైన విధానం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సాంకేతికత ఆధారిత వ్యర్థాల నిర్వహణకు గుర్తించదగిన ఉదాహరణగా ఎదిగింది. కాకినాడలో ప్రతిరోజూ సుమారు 144 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు ఉన్నాయి. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ 50 వార్డుల్లో ఈ నిర్వహణ చేపడుతోంది. వీటిని మరో 382 సూక్ష్మ ప్రాంతాలుగా విభజించారు. ఒక్కో సూక్ష్మ ప్రాంతంలో 250 నుంచి 350 కుటుంబాలు ఉంటాయి. ఇద్దరు పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంతాన్ని నిర్వహిస్తారు.

సుమారు 112,993 కుటుంబాలు ఉన్న నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం 973 మందికి పైగా పారిశుధ్య కార్మికులను నియమించారు. ఈ కుటుంబాల నుంచి చెత్త సేకరణ కోసం నగరవ్యాప్తంగా 40,661 నిర్దేశిత సేకరణ కేంద్రాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ, రవాణాను సులభతరం చేసేందుకు డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓడబ్ల్యూఎంఎస్) ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ), ముఖ గుర్తింపు, జీపీఎస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌ఆర్‌ఎంఎస్) సిబ్బంది, రవాణా నిర్వహణకు మరింత తోడ్పడుతున్నాయి. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రతి ఇంటి లేదా సంస్థ గేటు వద్ద ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌లతో కూడిన ట్యాగ్‌లను అమర్చారు. చెత్తను తీసుకునేటప్పుడు సేకరణ సిబ్బంది ఈ ట్యాగ్‌లను స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన సమాచారం ఓడబ్ల్యూఎంఎస్‌లో నమోదవుతుంది. దీంతో అధికారులు సేకరణ పురోగతిని పర్యవేక్షించగలరు. నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక పారిశుధ్య సిబ్బంది కృషితో 100% ఇంటింటి చెత్త సేకరణ సాధ్యమైంది.

మునిసిపల్ కార్పొరేషన్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలతో కూడిన 108 హాపర్ వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ పరికరాలు రవాణాను పర్యవేక్షించి, చెత్త సేకరణ, ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలింపు సమయంలో నిర్దేశిత మార్గం నుంచి తప్పితే సమాచారం అందిస్తాయి. సఫాయీమిత్రలందరికీ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను (ఎఫ్‌ఆర్‌ఎస్) కూడా ప్రవేశపెట్టింది. కార్మికులు ఇప్పుడు ముఖ గుర్తింపు సాంకేతికతతో తమ హాజరును నమోదు చేసుకోవచ్చు. దీంతో చేతితో నిర్వహించే హాజరు రిజిస్టర్లు లేదా వేలిముద్ర స్కానర్ల అవసరం ఉండదు. నిశిత పర్యవేక్షణ కోసం ఈ సాంకేతికతలన్నింటినీ సెంట్రల్ కమాండ్ సెంటర్‌తో అనుసంధానించారు. ప్రస్తుతం సుమారు 60% మంది నివాసితులు వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే వాటిని వేరు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, నివాసితుల సమష్టి కృషి వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే కాకినాడ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది.
ఘాజియాబాద్: వ్యర్థాల నుంచి కార్బన్ క్రెడిట్ల విలువ
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపడుతూనే పరిశుభ్రత, పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది. ఘాజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులో నమోదు చేసుకుంది. యునైటెడ్ నేషన్స్ ధ్రువీకరించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణను ఆర్థిక ప్రయోజనాల అవకాశాలతో అనుసంధానిస్తుంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద మెరుగైన ఘన వ్యర్థాల నిర్వహణ చెత్త నిల్వ ప్రదేశాల నుంచి వెలువడే మీథేన్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులను తగ్గించగలదు.
పరిశుభ్రమైన ఇంధనాలు, శక్తి వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు. ఈ కృషికి అనుగుణంగా ఘాజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్ల తన నిబద్ధతను చాటుకుంది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) మద్దతు ఉన్న వెరిఫైడ్ కార్బన్ స్టాండర్డ్ (వీసీఎస్) కింద గుర్తింపు పొందింది.
జీఎంసీ నగరవ్యాప్తంగా పాత వీధి దీపాల స్థానంలో విద్యుత్‌ను సమర్థంగా వినియోగించే ఎల్‌ఈడీ దీపాలను అమర్చింది. ఈ చర్య కార్బన్ ఉద్గారాలతోపాటు విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. తడి చెత్త నుంచి కంపోస్టు తయారు చేసేందుకు “తడి వ్యర్థాల కంపోస్టింగ్” పద్ధతిని కూడా అనుసరిస్తోంది. ఈ ప్రక్రియ వేగవంతమైన వ్యర్థాల నిర్వహణకు తోడ్పడి, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తర్వాత, వ్యర్థాలను కొత్త విలువ వనరుగా మార్చే ఉత్తరప్రదేశ్‌లోని తొలి పట్టణ స్థానిక సంస్థగా (యూఎల్‌బీ), దేశంలో రెండో సంస్థగా ఘాజియాబాద్ నిలవనుంది.
ఈ చర్యలన్నీ కలిసి సుమారు 2.7 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తాయని అంచనా. ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ ఒక క్రెడిట్‌కు సమానం కాబట్టి, ఈ తగ్గింపు 2.7 లక్షల కార్బన్ క్రెడిట్లకు సమానంగా ఉంటుంది. ధ్రువీకరించిన క్రెడిట్లను అంతర్జాతీయ కార్బన్ మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఈ కార్యక్రమం ఘాజియాబాద్‌లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అవకాశాలకు తోడ్పడుతోంది.


ప్రతి వనరుకు విలువనిచ్చే నగరాల నిర్మాణం
నగరాల్లో కొనసాగుతున్న రూపాంతరం పట్టణ వనరుల నిర్వహణ విధానంలో వస్తున్న విస్తృత మార్పును ప్రతిబింబిస్తోంది. సాంకేతికత రోజువారీ పారిశుధ్య సేవలను బలోపేతం చేస్తుండగా, పౌరులు సుస్థిర పద్ధతుల్లో చురుకైన భాగస్వాములవుతున్నారు. స్థానిక పరిష్కారాలు రోజువారీ పట్టణ జీవితంలో స్పష్టమైన మెరుగుదలను తీసుకువస్తున్నాయి. సమర్థమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఆవిష్కరణలను ప్రజల కృషితో సమన్వయం చేయడంలోని విలువను కూడా ఇవి తెలియజేస్తున్నాయి. ఈ విధానాలన్నీ కలిసి మరింత పరిశుభ్రమైన, వనరులను తిరిగి వినియోగించే, వాటిని సమర్థంగా ఉపయోగించే పట్టణ వ్యవస్థల వైపు దిశ చూపుతున్నాయి.
References
Ministry of Housing and Urban Affairs
Click here for pdf file.
***
(Features ID: 160343)
आगंतुक पटल : 8
Provide suggestions / comments