Rural Prosperity
వర్షాకాలంలోనూ పరిశుభ్రమైన వీధులు
మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వర్షాకాలం కోసం నగరాల సన్నద్ధత
Posted On:
01 OCT 2026 4:21PM
వర్షాలకు ముందే నగరాల్లో కార్యాచరణ

వర్షాకాలం సమీపించి, తొలకరి జల్లులు కురుస్తున్న వేళ దేశవ్యాప్తంగా నగరాలు నీరు నిలిచిపోవడం, చెత్త పేరుకుపోవడం, పారిశుధ్యానికి సంబంధించిన కాలానుగుణ సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాయి. కాలువలను శుభ్రం చేస్తారు. సమస్యలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తారు. పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడతారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నేతృత్వంలోని సఫాయీ అప్నావో, బీమారీ భగావో 2025 (ఎస్‌ఏబీబీ) ప్రచార కార్యక్రమం కింద పట్టణ స్థానిక సంస్థలు వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధతను సమన్వయంతో కూడిన పరిశుభ్రత, ప్రజారోగ్య కార్యాచరణగా మలిచాయి. 2025 జులై 1 నుంచి జులై 31 వరకు నగరాల్లో కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్రత అలవాట్ల ప్రోత్సాహం చేపట్టారు. పాఠశాలలు, నివాస ప్రాంతాలు, ఇతర బహిరంగ ప్రదేశాల ద్వారా ప్రజలను భాగస్వాములను చేశారు.
ఈ ప్రచార కార్యక్రమానికి ‘6 స్వచ్ఛతా మంత్రాలు’ ప్రధాన ఆధారం: చేతులు, ఇళ్లు, పరిసరాలు, మరుగుదొడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం. వర్షాకాలాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు నగరవ్యాప్తంగా సాగుతున్న విస్తృత కృషిలో ఈ సరళమైన అలవాట్లు భాగమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ కృషి అనేక రూపాల్లో కొనసాగుతోంది.
ఢిల్లీలో ఈ కార్యక్రమం స్వచ్ఛత సందేశాన్ని వీధులు, పాఠశాలలకు తీసుకెళ్లింది. వర్షాకాలంలో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని ప్రోత్సహించే 3 కిలోమీటర్ల పింకథాన్ నడక కార్యక్రమానికి 400 మంది ఎన్‌సీసీ బాలికా క్యాడెట్లు నాయకత్వం వహించారు. ఈ ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టారు. 255 పాఠశాలల్లో చేతులు కడుక్కోవడంపై కార్యక్రమాలు నిర్వహించారు. ఇళ్ల వెనుక వీధులు, చెత్త పేరుకుపోయే అవకాశమున్న ప్రదేశాల్లో (జీవీపీల్లో) 206 శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. సామూహిక, ప్రజా మరుగుదొడ్లలో (సీటీల్లో, పీటీల్లో) మరో 469 పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మ్యాన్‌హోళ్లకు అక్కడికక్కడే వేగంగా మరమ్మతులు చేసి పట్టణ భద్రత, పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పాట్నా మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ‘మ్యాన్‌హోల్ అంబులెన్స్‌లను’ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వర్షాల సమయంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి అంబులెన్స్‌లో ముందుగా తయారు చేసిన మ్యాన్‌హోల్ మూతలు, మరమ్మతు పరికరాలు, ప్రత్యేక స్పందన బృందం ఉంటాయి. పాత, ఉపయోగించని మునిసిపల్ వాహనాలను పీఎంసీ ఈ అవసరాలకు పనికొచ్చే వాహనాలుగా మార్చింది. ఒక్కో మునిసిపల్ జోన్‌కు ఒకటి చొప్పున ఆరు అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు వీటిని పీఎంసీ కేంద్ర నియంత్రణ గదితో అనుసంధానించారు. ఈ కార్యక్రమం పౌరుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ఫిర్యాదుల పరిష్కారానికి వీలు కల్పిస్తోంది. మ్యాన్‌హోళ్లకు సంబంధించిన ఫిర్యాదులపై వేగవంతమైన స్పందనను నిర్ధారిస్తోంది.
నవీ ముంబయిలో 600 మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌరుల భాగస్వామ్యంతో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో మలేరియా, డెంగీ నివారణపై దృష్టి సారిస్తూ 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య అవగాహన శిబిరాలు నిర్వహించారు. రెండు రోజుల్లో 52 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, 22,690 మందికి పైగా పౌరులకు చేరువయ్యారు. తెలంగాణలో ఈ ప్రచార కార్యక్రమం దాదాపు 13 లక్షల కుటుంబాలకు చేరింది. సుమారు 14,210 కిలోమీటర్ల కాలువల్లో పూడిక తొలగించారు. 4,343 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన పొదలను తొలగించారు. డెంగీ, మలేరియా నివారణ అవగాహన కార్యక్రమాల ద్వారా దాదాపు 2.5 లక్షల ఇళ్లకు చేరువయ్యారు. ఆరోగ్య శిబిరాల ద్వారా 8,500 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ప్రయోజనం పొందారు. మరోవైపు, చెత్తను ఎరువుగా మార్చేలా బాలలను ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో 140 కంపోస్టింగ్ గుంతలను ఏర్పాటు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఈ కృషి ప్రజల నుంచే మొదలైంది. పండరియాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పారిశుధ్య శిక్షణ ఇచ్చి, స్వచ్ఛతా యాప్‌ను పరిచయం చేశారు. అనంతరం వారు శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయ్‌పూర్‌లో ఇంటింటి ప్రచారం ద్వారా చేతుల పరిశుభ్రత, చెత్తను వేరు చేయడాన్ని ప్రోత్సహించారు. చెత్త పేరుకుపోయే అవకాశమున్న ప్రదేశాలను (జీవీపీలను) శుభ్రం చేసి, సుందరంగా తీర్చిదిద్దారు.
పరిశుభ్రమైన, సురక్షితమైన వర్షాకాలం కోసం ఈశాన్య ప్రాంతంలో సమష్టి కృషి

వర్షాకాలం సమీపిస్తున్న వేళ ఈశాన్య ప్రాంతం వర్షాల కోసం ఎదురుచూడకుండా, వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే సన్నద్ధమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, సిక్కిం, త్రిపురల్లో ఎంఓహెచ్‌యూఏ నేతృత్వంలోని ఎస్‌ఏబీబీ ప్రచార కార్యక్రమం సామూహిక శుభ్రత, వ్యాధుల నివారణ ద్వారా వర్షాకాల సన్నద్ధతను బలోపేతం చేస్తోంది.
నాగాలాండ్‌లో ఆరు పట్టణాల్లోని పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు) పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, కాలువల శుభ్రత, ఆరోగ్య శిబిరాలు, చెత్త తొలగింపు కార్యక్రమాలకు నాయకత్వం వహించాయి. 60 శుభ్రత కార్యక్రమాలు, 30 వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు, 40 వర్షాకాలం అనంతర అవగాహన కార్యక్రమాల ద్వారా దాదాపు 5,000 మందిని భాగస్వాములను చేశాయి. సిక్కిం కొండ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయే ప్రదేశాలు, నీటి ద్వారా, వ్యాధి వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పుపై ఈ ప్రచారం దృష్టి సారించింది. చెత్త ఉత్పత్తయ్యే చోటే దానిని వేరు చేయడం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ కోసం విద్యార్థులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) కలిసి పనిచేశారు. అవగాహన ర్యాలీలు, పీఈటీ సీసాలను చిన్న ముక్కలుగా చేసే కార్యక్రమాలతోపాటు 100 శుభ్రత కార్యక్రమాలు, 100 వర్షాకాలం అనంతర కార్యక్రమాల్లో సుమారు 4,000 మంది పాల్గొన్నారు. అస్సాంలో పట్టణాలు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, సఫాయీమిత్రల ఆరోగ్య పరీక్షలు, వ్యర్థాలను వేరు చేయడంపై దృష్టి సారించాయి. 160 సంస్థలు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో 200 శుభ్రత కార్యక్రమాలు, 40 వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో సుమారు 5,500 మంది పాల్గొన్నారు.
త్రిపురలో యూఎల్‌బీలు చెత్త సేకరణ, వేరు చేయడం, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను బలోపేతం చేశాయి. ఆరోగ్య శిబిరాలు, పాఠశాల ర్యాలీలు, పారిశుధ్య కార్యక్రమాలతోపాటు 150 శుభ్రత కార్యక్రమాలు, 30 వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పట్టణాలుగా నోటిఫై చేసిన 47 ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపట్టారు. నీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేశారు. చెత్త పేరుకుపోయే అవకాశమున్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని సామూహిక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పరిశుభ్రత, వ్యాధుల నివారణను సమాజం రోజువారీగా చేపట్టే చర్యల్లో ఎలా భాగం చేయవచ్చో ఈ కృషి తెలియజేస్తోంది.
గల్లీల నుంచి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నివాస పరిసరాల వరకు..
గల్లీల్లో సాధారణంగా పాదచారుల రాకపోకలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడం, అనధికారికంగా చెత్త వేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీనిని గుర్తించిన మధ్యప్రదేశ్‌లోని నగరాలు ప్రజల చురుకైన భాగస్వామ్యంతో గల్లీల్లో శుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. వర్షాకాలంలో వర్షపు నీరు సాఫీగా ప్రవహించేందుకు ఆక్రమణల తొలగింపు, కాలువల శుభ్రతను కూడా ఈ కార్యక్రమాల్లో భాగం చేశారు.


రేవాలో మునిసిపల్ కార్పొరేషన్ ఈ కృషిని గల్లీలకే పరిమితం చేయకుండా, అన్ని వార్డుల్లో ఇళ్ల ముందు వీధుల పరిశుభ్రతను, రూపాన్ని మెరుగుపరిచేందుకు విస్తరించింది. గోడ చిత్రాలను రూపొందించారు. 3ఆర్‌ల సూత్రాలైన వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్), తిరిగి ఉపయోగించడం(రీసయూస్), పునర్వినియోగానికి(రీసైకిల్) అనువుగా మార్చడం ఆధారంగా ఆట పరికరాలు, సంగీత వాయిద్యాలను తయారు చేశారు. గోడలపై ఇంగ్లిష్, హిందీ అచ్చులు, అక్షరాలు, సంఖ్యలు, గుణకార పట్టికలను కూడా చిత్రించారు. పరిశుభ్రతను అభ్యాసం, వినోద అంశాలతో అనుసంధానించడం ద్వారా మరింత సురక్షితమైన, ఆసక్తికరమైన, పిల్లలకు అనుకూలమైన నివాస పరిసరాలను సృష్టించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడింది.
ఆగ్రాలో ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ నగరవ్యాప్తంగా తొమ్మిది వెనుక వీధులను విజయవంతంగా శుభ్రం చేసి, నిర్వహించింది. ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (తులిప్) శిక్షణార్థులు ఈ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. స్థానిక నివాసితులు తమ పరిసర వీధుల శుభ్రత, సుందరీకరణకు సహకరించారు. పరిశుభ్రత పట్ల స్థానికంగా బాధ్యతా భావాన్ని బలోపేతం చేయడంలో, ఉమ్మడి బహిరంగ ప్రదేశాలను నిరంతరం చక్కగా నిర్వహించడంలో ప్రజల భాగస్వామ్యం ఎలా తోడ్పడగలదో వారి సహకారం తెలియజేస్తోంది.
భద్రత నుంచి అవకాశాల వైపు
భోపాల్‌కు చెందిన జ్యోత్స్నా ధబ్డేకు సంస్థాగత రుణం అందుబాటులోకి రావడం వ్యాపారవేత్తగా ఎదిగేందుకు అవకాశం కల్పించింది. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన రుణ మేళాలో స్వచ్ఛతా ఉద్యమీ యోజన కింద ఆమె రుణం పొందారు. దాని ద్వారా పారిశుధ్య వాహనాన్ని కొనుగోలు చేయగలిగారు. న్యూఢిల్లీలో న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజా, యంత్రాల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయడంలో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.
రాజా మాట్లాడుతూ, “గతంలో మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు వాటిలోకి దిగాల్సి వచ్చేది. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆ పనిని యంత్రాలతోనే చేస్తున్నాం. అదనంగా, గమ్‌బూట్లు, మాస్కులు, భద్రతా కళ్లద్దాలు, హెల్మెట్లు, ఇతర రక్షణ పరికరాలను అందించడం వల్ల మరింత సురక్షితంగా ఉన్నామనే భావన కలుగుతోంది” అని తెలిపారు.

పారిశుధ్య పనులను మరింత సురక్షితంగా, నైపుణ్యంతో, గౌరవప్రదంగా నిర్వహించేందుకు సాగుతున్న కృషిని ఈ అనుభవాలు ప్రతిబింబిస్తున్నాయి.
సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్ 2021 ఆరోగ్య విద్య, భద్రతా పరికరాల అందుబాటు, వినియోగం, కార్మికుల సంక్షేమం, వృత్తిపరమైన ముప్పుల తగ్గింపుపై దృష్టి సారించింది. స్వచ్ఛ్ భారత్ మిషన్–అర్బన్ 2.0 కింద పారిశుధ్య పనుల్లో ఒక్క మరణం కూడా సంభవించకుండా చూడాలనే లక్ష్యం కోసం పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు) రక్షణ పరికరాలు, శిక్షణ, భద్రతా అవగాహన అందించాలని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (ఎంఓహెచ్‌యూఏ) నొక్కిచెప్పింది.
ఈ రంగంలో ముందడుగు వేసిన చండీగఢ్, 2018 నుంచి ప్రమాదకరమైన రీతిలో మనుషులు మురుగు కాలువల్లోకి దిగి శుభ్రం చేయడాన్ని నిషేధించింది. రెస్పాన్సిబుల్ శానిటేషన్ అథారిటీ (ఆర్‌ఎస్‌ఏ) పరిధిలో పనిచేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్ (ఈఆర్‌ఎస్‌యూ), పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), భద్రతా పరికరాలు, క్రమం తప్పని వైద్య పరీక్షలను అందిస్తూ సురక్షిత పారిశుధ్య పద్ధతులకు తోడ్పడుతోంది.
అస్సాంలో 96 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీల్లో) 83 సంస్థలు 2023లో తమను సఫాయీమిత్ర సురక్షిత్ షెహర్‌లుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్రం 5,230 మంది పారిశుధ్య కార్మికుల వివరాలను నమోదు చేసి, 92 ఆరోగ్య శిబిరాలు నిర్వహించింది. మహారాష్ట్రలో మొదటి దశలో 246 మంది మాస్టర్ ట్రైనర్లను తయారు చేశారు. అనంతరం 1,917 మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చారు. రుణాలు, జీవనోపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు సహకరిస్తూ ఉత్తరప్రదేశ్ సఫాయీమిత్రలకు మద్దతు అందించింది. ఈ చర్యలన్నీ కలిసి సఫాయీమిత్రల భద్రత, సామాజిక, ఆర్థిక భద్రత, గౌరవం, వ్యాపార అవకాశాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పారిశుధ్య పనుల నుంచి పారిశుధ్య రంగంలో వ్యాపారసంస్థలుగా ఎదిగేందుకు మార్గాలను సృష్టిస్తున్నాయి.
సన్నద్ధత నుంచి సమాజ కార్యాచరణ వైపు
వర్షాలు కురవడం ప్రారంభమైనప్పుడు వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత అసలు ప్రయోజనం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. శుభ్రం చేసిన కాలువ వర్షపు నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలు కల్పిస్తుంది, పరిశుభ్రమైన వీధి చెత్త పేరుకుపోకుండా నిరోధిస్తుంది, ముందస్తుగా నిర్వహించే ఆరోగ్య శిబిరం వ్యాధులు వ్యాపించకముందే వాటి ముప్పును గుర్తించి, అదుపు చేసేందుకు ప్రజలకు తోడ్పడుతుంది. ప్రతి చర్యలో పౌరుల చురుకైన భాగస్వామ్యం ప్రధానంగా నిలుస్తూ, ప్రజారోగ్యాన్ని సమష్టి బాధ్యతగా మారుస్తోంది.
ఈశాన్య ప్రాంతపు కొండల నుంచి ఢిల్లీ వీధుల వరకు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని సమాజాల వరకు ఈ ప్రచార కార్యక్రమం స్థానిక అవసరాలకు అనుగుణంగా విభిన్న రూపాల్లో సాగింది. అయితే వీటన్నింటిలో ఒకే ఉమ్మడి సత్యం ఉంది: నిజమైన వర్షాకాల సన్నద్ధత అంటే వర్షం కురిసిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు. ఒక్కో వీధి, ఒక్కో నివాస ప్రాంతం, ఒక్కో సమాజం చొప్పున అందరూ కలిసి ముందుగానే సిద్ధం కావడం.
References
Ministry of Housing and Urban Affairs
https://sbmurban.org/SABB-in-Northeast
https://sbmurban.org/safai-Apnao-Bimaari-Bhagao-2025
https://sbmurban.org/Back-Lanes-Cleaning
https://sbmurban.org/Sani-Entrepreneur
Click here to see pdf
***
(Features ID: 160342)
आगंतुक पटल : 48
Provide suggestions / comments