Rural Prosperity

మనం పారేసే వస్తువులకు కొత్త ప్రయోజనం

కొత్త ఆలోచ‌న‌ల‌తో వంటింటి వ్యర్థాల పున‌ర్వినియోగం

Posted On: 01 OCT 2026 1:43PM

2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల ప్రవర్తనలో మార్పు కోసం విస్తృత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సామూహిక పరిశుభ్రత కార్యాచరణ కోసం 2017లో వార్షిక ప్రచారంగా ప్రారంభమైన ‘స్వచ్ఛతా హీ సేవా’ (ఎస్‌హెచ్ఎస్) ద్వారా ప్రజల విస్తృత భాగస్వామ్యానికి కూడా ఈ మిషన్ అవకాశం కల్పించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, కంటికి ఆహ్లాదకరమైన పరిశుభ్రత, చెత్త రహిత బహిరంగ ప్రదేశాలపై ఈ ప్రచారం తన దృష్టిని విస్తరించింది.

ఇదే సమయంలో ‘వ్యర్థాల నుంచి సంపద’ అనే ఆలోచన దేశవ్యాప్తంగా వ్యర్థాలను చూసే, నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. పారేసిన సామగ్రిని తిరిగి సేకరించి, పునర్వినియోగించి, విలువైన ఉత్పత్తిగా మార్చగల వనరుగా ఈ విధానం పరిగణిస్తుంది. వలయ ఆర్థిక వ్యవస్థ, వనరుల సమర్థ వినియోగం, సుస్థిర వ్యర్థాల నిర్వహణతో ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసంధానించింది. స్వచ్ఛ భారత్ మిషన్–పట్టణ 2.0 కింద వ్యర్థాలను ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం, శుద్ధి చేయడం, వాటి నుంచి విలువను తిరిగి పొందే వ్యవస్థలను బలోపేతం చేయాలని నగరాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ మార్పు పెద్ద శుద్ధి కేంద్రాల్లోనే కాకుండా ఇళ్లు, సమాజాలు, స్థానిక సంస్థల్లోనూ కనిపిస్తోంది.

ఇంటికే మార్పు తీసుకొస్తున్న కంపోస్టు బుట్ట
వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చడం అనేక భారతీయ కుటుంబాలకు కొత్త విషయం కాదు. నేటి వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల్లో ఈ సంప్రదాయ పద్ధతి మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వృద్ధురాలు కె. సుబ్బలక్ష్మి ఇంట్లోనే ఈ సుపరిచిత అలవాటును ఎలా ఆచరించవచ్చో చూపించారు. మరింత మంది ప్రజలను గృహ కంపోస్టు తయారీ వైపు ప్రోత్సహించేందుకు నగరపాలక సంస్థ ఇటీవల ఆమె అనుభవాన్ని పంచుకుంది. ఆమె వంటింట్లో ఉత్పత్తయ్యే తడి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి తోటలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పారేసే వ్యర్థాలను తిరిగి నేలలో కలుపుతున్నారు..

 

Vijaywada AP k Subbalakshmi senior citizen.jpg



కొవిడ్–19 మహమ్మారి సమయంలో చండీగఢ్‌లోనూ ఇటువంటి ప్రయత్నం మొదలైంది. స్థానిక నివాసి కమల్‌జీత్ కౌర్ డియోల్ ఇంట్లోనే తడి వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడం ప్రారంభించారు. గృహస్థాయి ఆచరణగా మొదలైన ఈ ప్రయత్నం క్రమంగా ఇతరులు కూడా ఇంట్లో కంపోస్టు తయారీ చేపట్టేలా ప్రోత్సహించే అవగాహన కార్యక్రమంగా విస్తరించింది. పరిశుభ్రమైన, పచ్చని నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలను ఆమె ప్రయత్నాలు ప్రేరేపించాయి.

 

siddipet telangana swachh badi composting.jpg



వ్యక్తిగత ప్రయత్నాలు విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న సమయంలోనే ఈ ఆలోచన వ్యవస్థీకృత సామాజిక అభ్యసనంలోనూ చోటు సంపాదించింది. తెలంగాణలోని సిద్ధిపేటలో ప్రత్యేక వ్యర్థాల నిర్వహణ అభ్యసన కేంద్రం ‘స్వచ్ఛ బడి’ యువతకు గృహ కంపోస్టు తయారీ నుంచి సామాజిక స్థాయి కంపోస్టు తయారీ వరకు ఆచరణాత్మక వ్యర్థాల నిర్వహణ పద్ధతుల్లో ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తోంది. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ 141 పురపాలక ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. తద్వారా బాధ్యతాయుత వ్యర్థాల నిర్వహణపై అవగాహన, ఆచరణాత్మక అభ్యసనం ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.

చిన్న కంపోస్టు బుట్టతో మొదలయ్యే ప్రయత్నం విస్తృత ప్రభావాన్ని చూపగలదు. మొక్కలకు కొత్త జీవం అందించడంతోపాటు నిరంతరం ఉత్పత్తయ్యే తడి వ్యర్థాలు చెత్త నిల్వ కేంద్రాలకు చేరకుండా అడ్డుకుంటుంది. అంతకంటే ముఖ్యంగా వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశం నుంచే వాటి నిర్వహణను ఎలా ప్రారంభించవచ్చో ఇది చూపిస్తోంది.

కలుపు మొక్క అవకాశంగా మారిన వేళ

 


గృహ వ్యర్థాలే కాకుండా దీర్ఘకాలంగా నిర్వహణకు సవాలుగా నిలిచిన పదార్థాలకు కూడా ప్రజలు కొత్త ఉపయోగాలను కనుగొంటున్నారు. అస్సాంలోని మోరిగావ్ జిల్లా బోర్చిలా గ్రామంలో జల వనరుల చుట్టూ నివసించే ప్రజలకు నిరంతర సమస్యగా మారిన ఒక మొక్కను సద్వినియోగం చేస్తున్నారు. స్థానికంగా ‘పానీ మెటెకా’గా పిలిచే గుర్రపుడెక్క జల వనరుల్లో వేగంగా విస్తరించే ఆక్రమణ స్వభావం కలిగిన మొక్క. అందంగా కనిపించినప్పటికీ నదులు, చెరువులు, సరస్సుల వంటి మంచినీటి వనరులను విస్తృతంగా ఆక్రమించి సమస్యాత్మక కలుపు మొక్కగా మారింది. దీని విపరీతమైన పెరుగుదల చేపల వేట, రవాణా, వినోద కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ జల వనరుల వినియోగాన్ని కష్టతరం చేస్తోంది.

అయితే, బోర్చిలా గ్రామ మహిళలు గుర్రపుడెక్కను అవకాశంగా మార్చే కొత్త మార్గాన్ని కనుగొన్నారు. జల వనరుల్లో అవాంఛితంగా పెరిగే మొక్కగా మాత్రమే చూడకుండా దానితో హస్తకళా ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. అస్సాం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ మద్దతుతో చేపట్టిన ఈ కార్యక్రమం మహిళలకు అదనపు ఆదాయ వనరును కల్పించింది. ఈ పనితో వారు నెలకు కనీసం ₹10 వేలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు జల వనరులకు సమస్యగా భావించిన మొక్క ఇప్పుడు జీవనోపాధి, వ్యాపారానికి ఉపయోగపడే వనరుగా మారుతోంది. వ్యర్థాల నిర్వహణకు మించి వనరుల పునరుద్ధరణ ద్వారా విలువ, జీవనోపాధి అవకాశాలను సృష్టించవచ్చని ఈ అనుభవం చూపిస్తోంది. భారంగా మిగిలిపోయే పదార్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడంతోపాటు వనరుల సుస్థిర వినియోగాన్ని ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తాయి.

కొబ్బరి వ్యర్థాలకు కొత్త మార్కెట్
ఆక్రమణ స్వభావం కలిగిన మొక్కను గ్రామీణ జీవనోపాధి వనరుగా మార్చిన తర్వాత ఇప్పుడు పట్టణ వ్యర్థాల భారాన్ని పెంచుతున్న మరో పదార్థంపై దృష్టి పడింది. పట్నాలో కొబ్బరి చిప్పలు, పీచు, ఇతర అవశేషాలను తిరిగి సేకరించి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తున్నారు. నగరంలో ప్రతిరోజూ దాదాపు 25–30 మెట్రిక్ టన్నుల కొబ్బరి చిప్పలు ఉత్పత్తి అవుతున్నాయి. గతంలో ఇవి చెత్త నిల్వ కేంద్రాలకు చేరే వ్యర్థాల పరిమాణాన్ని పెంచేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పట్నా మున్సిపల్ కార్పొరేషన్ దానాపూర్ ప్రాంతంలో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పారేసిన కొబ్బరి అవశేషాలను ఉత్పాదక వనరులుగా మార్చేందుకు ఇది మార్గం కల్పిస్తోంది.

 

 


వ్యర్థాలను కేవలం పారేయాల్సిన పదార్థంగా కాకుండా వనరుగా పరిగణించే స్వచ్ఛ భారత్ మిషన్ శాస్త్రీయ విధానాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోంది. కొబ్బరి వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన భాగాలను తిరిగి సేకరించి వ్యవసాయం, ఉద్యానవనం, ఇతర వాణిజ్య అవసరాలకు పనికొచ్చే ఉత్పత్తులుగా మార్చేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు. తొలుత రోజుకు 10 టన్నుల శుద్ధి సామర్థ్యంతో ప్రారంభమైన కేంద్రాన్ని పలు షిఫ్టుల్లో నడిపి, రోజుకు 30 టన్నుల సామర్థ్యానికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు.

కొబ్బరి వ్యర్థాల్లోని వివిధ భాగాలను తిరిగి సేకరించి ఉత్పాదక అవసరాలకు ఉపయోగించవచ్చు. తడి అవశేషాలను అధిక నాణ్యతగల సేంద్రియ కంపోస్టుగా మారుస్తారు. కొబ్బరి పీచుతో కొబ్బరి నార తాళ్లను తయారు చేస్తారు. వీటిని నిర్మాణం, ప్యాకేజింగ్, చాపలు, హస్తకళా ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. కోకోపీట్ మరో విలువైన ఉత్పత్తి. వ్యవసాయం, ఉద్యానవనంలో, ముఖ్యంగా నర్సరీలు, పైకప్పు తోటల్లో మొక్కలు పెరిగే మాధ్యమంగా దీని వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

 



ఈ పదార్థాలను తిరిగి సేకరించి, శుద్ధి చేయడం ద్వారా పారేయాల్సిన కొబ్బరి వ్యర్థాల పరిమాణం తగ్గుతుంది. వ్యర్థాల నుంచి తయారైన ఉత్పత్తులు మళ్లీ ఉత్పాదక వినియోగంలోకి వస్తాయి. ఈ విధానం వలయ ఆర్థిక పద్ధతులను ముందుకు తీసుకెళ్లడంతోపాటు స్థానిక జీవనోపాధి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.

వ్యర్థం బహిరంగ ప్రదేశంగా మారిన వేళ
పారేసిన సామగ్రిపై నగరాల దృక్పథాన్ని కూడా ‘వ్యర్థాల నుంచి సంపద’ భావన మారుస్తోంది. పనికిరాని సామగ్రిని కేవలం వ్యర్థంగా చూడకుండా బహిరంగ ప్రదేశాలు, సామాజిక సదుపాయాల్లో తిరిగి ఉపయోగించే మార్గాలను నగరాలు అన్వేషిస్తున్నాయి. పారేసిన సామగ్రిని ప్రజా ప్రదేశాలు, ఆకర్షణల్లో భాగంగా కొత్త ప్రయోజనానికి ఉపయోగించే ‘వేస్ట్ టు వండర్’ పార్కుల ఏర్పాటు అలాంటి విధానాల్లో ఒకటి. సామగ్రి వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరమ్మతు చేయడం, పునర్వినియోగం ద్వారా నిరంతరం ఉపయోగంలో ఉంచాలని ప్రోత్సహించే వలయ ఆర్థిక వ్యవస్థ సూత్రాలను ఈ విధానం ప్రతిబింబిస్తోంది.

ఈ విధానానికి చండీగఢ్ తొలి ఉదాహరణల్లో ఒకటిగా నిలుస్తోంది. పారిశ్రామిక, గృహ వ్యర్థాలతో అక్కడి రాక్ గార్డెన్‌ను రూపొందించారు. పారేసిన సామగ్రిని బహిరంగ ప్రదేశంలో సృజనాత్మకంగా ఎలా తిరిగి ఉపయోగించవచ్చో ఇది చూపించింది. నగరంలో 1.75 ఎకరాల్లో ‘వేస్ట్ టు వండర్’ పార్కును కూడా అభివృద్ధి చేశారు. పారేసిన ఇనుప రేకులు, కడ్డీలు, ఫ్యాన్లు, వాహన భాగాలతో పార్కులోని నిర్మాణాలను రూపొందించారు.

 



ఢిల్లీలోని ‘వేస్ట్ టు వండర్’ పార్కులోనూ ఇదే విధానాన్ని అనుసరించారు. చెత్త నిల్వ కేంద్రాల నుంచి సేకరించిన పారిశ్రామిక వ్యర్థాలు, లోహపు తుక్కు, పారేసిన వాహన భాగాలను తిరిగి ఉపయోగించి నమూనాలు, ఇతర నిర్మాణాలను రూపొందించారు. వినోదం, పట్టణ సుందరీకరణకే పరిమితం కాకుండా పారేసిన సామగ్రిని ఉత్పాదక, ప్రజా వినియోగ మౌలిక సదుపాయాల్లో ఎలా భాగం చేయవచ్చో ఇలాంటి ప్రదేశాలు చూపిస్తున్నాయి. పట్టణ సుందరీకరణకు మించి స్వచ్ఛ ఇంధన మౌలిక సదుపాయాలను కూడా ఈ పార్కు అనుసంధానించింది. మొత్తం 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర వృక్షాలు, పైకప్పు సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయవచ్చు. తద్వారా వ్యర్థాలు, పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పాదకంగా వినియోగిస్తూనే అదనపు ఆదాయ మార్గాన్ని సృష్టించవచ్చు.

 



వ్యర్థం నుంచి వనరుగా
పారేసిన సామగ్రిని నేరుగా తుది తొలగింపునకు పంపకుండా తిరిగి సేకరించి, కొత్త ప్రయోజనానికి ఉపయోగించి, ఉత్పాదక వినియోగంలోకి తీసుకురావచ్చని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. వ్యర్థాల భారాన్ని పెంచే పదార్థాలను బహిరంగ ప్రదేశాలు, సృజనాత్మక ఆకర్షణల్లో భాగాలుగా, కొన్ని సందర్భాల్లో ఆర్థిక విలువ కలిగిన వనరులుగా మార్చవచ్చు.

వ్యర్థాన్ని పారేయాల్సిన పదార్థంగా చూసే దృక్పథం నుంచి దానిలో వనరుగా మారగల సామర్థ్యాన్ని గుర్తించే దిశగా మార్పుతో ‘వ్యర్థాల నుంచి సంపద’ విధానం మొదలవుతుంది. సరైన విభజన, పునరుద్ధరణ, శుద్ధి ద్వారా పారేసిన సామగ్రిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చవచ్చు. తద్వారా పరిశుభ్రమైన సమాజాలు, వనరుల సమర్థ వినియోగానికి మద్దతు లభించడంతోపాటు వలయ ఆర్థిక వ్యవస్థ దిశగా మార్పు వేగవంతమవుతుంది.

 

References

Ministry of Housing & Urban Affairs

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2067772&lang=2&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2210020&lang=1&reg=6

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2075883&lang=2&reg=3

 

PIB Backgrounder

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=160036&ModuleId=3&reg=48&lang=1

Click here to see pdf 

***

(Features ID: 160272) आगंतुक पटल : 15
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali