Infrastructure

ఏఐ నుంచి ఈవీల వరకు: పట్టణ పారిశుధ్యాన్ని మారుస్తున్న సాంకేతికత

Posted On: 01 OCT 2026 1:06PM

మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఒక స‌ర‌ళ‌మైన ఆలోచ‌న‌తో 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు, పరిశుభ్రతను అందరి ఉమ్మడి బాధ్యతగా మార్చాలనే ల‌క్ష్యంతో చీపుర్లు, చెత్త బుట్టలు, ప్రజల భాగస్వామ్యంతో మొదలైన కార్యక్రమం త్వరలోనే ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. నేడు ఈ ఉద్యమం కొత్త తరం సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. పట్టణ పారిశుద్ధ్యం డిజిటల్, సెన్సర్ ఆధారిత, విద్యుత్ వ్యవస్థగా మారుతోంది. డిజిటల్ డ్యాష్‌బోర్డులు సేవల పర్యవేక్షణను సులభం చేస్తున్నాయి. కార్మికులకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రోబోలు పనిచేస్తున్నాయి. వ్యర్థాల సేకరణలో విద్యుత్ వాహనాలు కాలుష్యరహిత రవాణాకు దోహదం చేస్తున్నాయి. చీపురు నుంచి రోబో వరకు సాంకేతికత స్వచ్ఛతకు ఆధునిక రూపాన్ని అందిస్తోంది. తద్వారా పరిశుభ్రమైన నగరాలు, సురక్షితమైన పని ప్రదేశాలు, వేగంగా స్పందించే సేవలకు మార్గం సుగమం చేస్తోంది.

రాయ్‌పూర్‌లో డిజిటల్ ముందడుగు: క్యూకు బదులుగా డ్యాష్‌బోర్డు
గతంలో సెప్టిక్ ట్యాంకుల శుభ్రత సేవల కోసం రాయ్‌పూర్ ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు మలవ్యర్థాల తొలగింపు సేవలను ఆన్‌లైన్‌లోనే కోరవచ్చు. దీంతో కార్యాలయాన్ని ప్రత్యక్షంగా సందర్శించాల్సిన అవసరం, వేచి ఉండే సమయం తగ్గుతున్నాయి.
పట్టణ ఆన్‌లైన్ పరిపాలన సేవల వేదిక–ఉపయోగ్ (అర్బన్ ప్లాట్‌ఫామ్ ఫర్ డెలివరీ ఆఫ్ ఆన్‌లైన్ గవర్నెన్స్) ఆధారంగా రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిజిటల్ మలవ్యర్థాల నిర్వహణ (ఎఫ్ఎస్ఎం) డ్యాష్‌బోర్డు నమూనాను ప్రవేశపెట్టింది. ప్రజలు ఈ వ్యవస్థ ద్వారా మలవ్యర్థాల తొలగింపు సేవలను బుక్ చేసుకోవచ్చు. చెల్లింపులు చేసి, సేవల పురోగతిని డిజిటల్ విధానంలో తెలుసుకోవచ్చు. ఈ వేదికకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ), జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్ఐయూఏ), జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్‌యూడీఎం)తో అనుబంధం ఉంది.

ఈ ప్రక్రియను సులభంగా రూపొందించారు. నివాసి మొబైల్ నంబర్ లేదా ఆస్తి గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తే వ్యవస్థ చిరునామాను స్వయంచాలకంగా గుర్తిస్తుంది. ఒకే పేజీ ఫారం ద్వారా మలవ్యర్థాల తొలగింపు సేవను బుక్ చేసుకోవచ్చు. అయితే, అసలైన మార్పు తెర వెనుక జరుగుతుంది.

 



అభ్యర్థన నమోదు చేసిన తర్వాత సేవల పురోగతిని తక్షణమే తెలుసుకునేందుకు వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ‘ఒక దరఖాస్తు–ఒక ప్రయాణం’ విధానం మెరుగైన ప్రణాళికకు తోడ్పడుతుంది. పని పూర్తయిన తర్వాత డ్రైవర్లు చిత్రాలను అప్‌లోడ్ చేస్తారు. దీంతో సేవలను డిజిటల్ విధానంలో ధ్రువీకరించవచ్చు. వాహనాలను పర్యవేక్షించి, వనరులను మరింత సమర్థంగా ప్రణాళిక చేసేందుకు కూడా డ్యాష్‌బోర్డు నగరపాలక సంస్థకు సహాయపడుతుంది. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకరమైన పనులను చేసే విధానాన్ని కూడా సాంకేతికత మారుస్తోంది. మురుగు కాలువలను చేతులతో శుభ్రం చేసే పద్ధతి నుంచి యంత్రాల ఆధారిత శుభ్రత దిశగా మారేందుకు డిజిటల్ పర్యవేక్షణ తోడ్పడుతోంది. దీంతో కార్మికులకు ప్రమాదం తగ్గి, సురక్షితమైన పని పద్ధతులు అమల్లోకి వస్తున్నాయి.

సాధారణ డ్యాష్‌బోర్డులా కనిపించినా ఇది కేవలం కాగితపు పనిని భర్తీ చేయడానికే పరిమితం కాదు. పౌరులు, సేవల సంస్థలు, నగరపాలక వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొస్తోంది. రాయ్‌పూర్‌లో ‘అభ్యర్థన’ నుంచి ‘సేవ’ వరకు జరిగే ప్రక్రియను డిజిటల్ విధానంలో పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతోంది.

జీ–స్పైడర్: కాలువలోకి దిగుతున్న రోబో
తిరువనంతపురం నడిబొడ్డున ఉన్న అమయిజాంచన్ కాలువ తంపనూర్ రైల్వే ప్రాంగణం కింద నుంచి ప్రవహిస్తుంది. పైకప్పుతో మూసి ఉన్న ఈ భాగంలో ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. నిరంతరం నీరు ప్రవహిస్తుంటుంది. కార్మికులు సురక్షితంగా ప్రవేశించేందుకు మార్గాలు లేవు. దీంతో ఇరుకైన ఈ ప్రాంతంలో సంప్రదాయ పద్ధతులతో శుభ్రం చేయడం అత్యంత కష్టంగా మారింది.

ఈ క్లిష్టమైన ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ రోబోను రంగంలోకి దించింది. టెక్నోపార్క్‌కు చెందిన జెన్‌రోబోటిక్ ఇన్నోవేషన్స్ రూపొందించిన ఏఐ ఆధారిత కాలువ శుభ్రత వ్యవస్థ ‘జీ–స్పైడర్’ను నగరపాలక సంస్థ వినియోగిస్తోంది. రోబోటిక్ స్కావెంజర్ ‘బాండికూట్’ను రూపొందించిన సంస్థ కూడా ఇదే.

కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను గుర్తించి, అంచనా వేసి, తొలగించేందుకు రోబో మెషిన్ విజన్, సెన్సర్ ఆధారిత మేధను ఉపయోగిస్తుంది. వివిధ రకాల వ్యర్థాలు, నీటి ప్రవాహ పరిస్థితులు, నిర్మాణపరమైన సవాళ్లకు అనుగుణంగా తక్షణమే తన పనితీరును మార్చుకుంటుంది. ఐదు దిశల్లో స్వేచ్ఛగా కదిలే దాని యంత్రాంగంలో జీవుల అవయవాల పనితీరును పోలిన పంజా ఉంటుంది. దీని సాయంతో మిశ్రమ, అసమాన వ్యర్థాలను తొలగిస్తుంది. బయటకు తీసిన వ్యర్థాలను నేరుగా నిర్దేశిత సేకరణ వాహనాల్లో వేస్తుంది.



ఈ వ్యవస్థ ప్రాధాన్యం ఆటోమేషన్‌కే పరిమితం కాదు. విషవాయువులు, కలుషిత నీరు, ప్రమాదకర వ్యర్థాలకు కార్మికులు ప్రత్యక్షంగా గురయ్యే పరిస్థితిని తగ్గించి వారి భద్రతను జీ–స్పైడర్ పెంచుతోంది. నీటిమట్టం ఎక్కువగా ఉన్నప్పుడు, నిరంతర ప్రవాహ పరిస్థితుల్లోనూ ఇది పనిచేయగలదు. నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా కాలువలను శుభ్రం చేసేందుకు తోడ్పడుతుంది.

అందువల్ల జీ–స్పైడర్ కేవలం శుభ్రత యంత్రం మాత్రమే కాదు. కార్మికులు ప్రవేశిస్తే తీవ్రమైన ప్రమాదం ఎదురయ్యే ప్రదేశాల్లో సాంకేతికత ద్వారా పారిశుద్ధ్య పనులను ఎలా నిర్వహించవచ్చో దీని వినియోగం చూపిస్తోంది. విస్తృత అవకాశాలకూ ఈ నమూనా దారిచూపుతోంది. ఇతర ప్రమాదకర కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థల్లో విస్తరించి, పునరావృతం చేయగల విధానాన్ని తిరువనంతపురం ప్రయోగం చాటుతోంది.

చెత్త సేకరణ వాహనాలకు విద్యుత్ రూపం
రోజువారీ చెత్త సేకరణ వాహనం కూడా పరిశుభ్రమైన నగరాల దిశగా వస్తున్న మార్పులో భాగమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తమిళనాడులోని చెన్నై, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాల్లో ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణకు విద్యుత్ వాహనాలను వినియోగిస్తున్నారు. తద్వారా కాలుష్యరహిత రవాణాను ఆధునిక వ్యర్థాల నిర్వహణతో అనుసంధానిస్తున్నారు.



గుంటూరు నగరంలో 200కు పైగా విద్యుత్ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఉంది. దీంతో వ్యర్థాల సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 71 వేల లీటర్లకు పైగా డీజిల్ వినియోగాన్ని నివారించవచ్చు. పదేళ్లలో 21 వేల టన్నుల హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా.

తమిళనాడులోని చెన్నై నగరం తన రోజువారీ వ్యర్థాల సేకరణ వ్యవస్థలోకి విద్యుత్ వాహనాలను నేరుగా తీసుకొచ్చింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మొత్తం 15 జోన్లలో ఇంటింటి వ్యర్థాల సేకరణ కోసం బ్యాటరీతో నడిచే 5,478 ఈ–రిక్షాలను ప్రవేశపెట్టింది. ఈ వాహనాలు రోజుకు దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డీజిల్‌తో నడిచే సేకరణ వాహనాల స్థానంలో ఈ–రిక్షాలను ప్రవేశపెట్టడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడుతున్నాయి. ఈ వాహనాల ద్వారా రోజుకు దాదాపు 41 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నాయి. ఏడాదికి ఈ తగ్గుదల 15,160 టన్నులుగా ఉంటుంది.



ఈ మార్పు కాలుష్యరహిత వాహనాలకే పరిమితం కాదు. ప్రతి ఈ–రిక్షాలో తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలకు వేర్వేరు చెత్త బుట్టలు ఉన్నాయి. దీంతో సేకరణ దశలోనే వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఈ వాహనాలు ప్రస్తుతం 24,621 వీధులు, 21 లక్షలకు పైగా ఇళ్లకు సేవలు అందిస్తున్నాయి. వాహనాల్లోని శ్రవణ వ్యవస్థల ద్వారా కాలనీల్లో వ్యర్థాల విభజనపై సందేశాలను వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆరు వేల మందికి పైగా ఉపాధిని కూడా కల్పిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వ్యర్థాల సేకరణను పునరుత్పాదక ఇంధనంతో అనుసంధానించి విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ కోసం 100 విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ ఆండ్ కంట్రోల్ సెంట‌ర్‌ (ఐసీసీసీ) ద్వారా తక్షణ జీపీఎస్ పర్యవేక్షణ చేపట్టి సేవల్లో పారదర్శకతను పెంచుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా దాదాపు 24,918 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు ఇంధనం, నిర్వహణ వ్యయాల్లో సుమారు ₹5.97 కోట్లు ఆదా చేయవచ్చని అంచనా.

నగరంలో 20 సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 10 కిలోవాట్ల సౌర ఫలకాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నీ కలిపి రోజుకు 800 నుంచి 1,000 యూనిట్ల హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. రోజుకు 80 నుంచి 100 వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కల్పించగలవు. ఈ నగరాల్లో చెత్త సేకరణ వాహనం కేవలం రవాణా సాధనంగానే మిగలడం లేదు. పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలో కాలుష్యరహితమైన, అనుసంధానిత, మరింత సమర్థవంతమైన భాగంగా మారుతోంది.



తదుపరి అధ్యాయం: ఆధునిక, సురక్షిత స్వచ్ఛత
మరింత తెలివిగా శుభ్రం చేయడానికి, సురక్షితంగా పనిచేయడానికి, వేగంగా స్పందించడానికి సాంకేతికత పట్టణ పారిశుద్ధ్యానికి కొత్త సాధనాలను అందిస్తోంది. డిజిటల్ డ్యాష్‌బోర్డులు, ఏఐ ఆధారిత రోబోలు, విద్యుత్ వ్యర్థాల సేకరణ వాహనాల వంటి ఆవిష్కరణలు రోజువారీ స్వచ్ఛతకు సాంకేతికతను చేరువ చేస్తున్నాయి. ఈ ఆవిష్కరణలను మరిన్ని నగరాలకు విస్తరించి, రోజువారీ జీవితంలో భాగం చేయడం, పట్టణ పారిశుద్ధ్యాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, వేగంగా స్పందించేలా తీర్చిదిద్దడమే తదుపరి అధ్యాయం.

 

 

Reference

Ministry of Housing and Urban Affairs

Click here to see pdf 

****

 

(Features ID: 160270) आगंतुक पटल : 10
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Bengali