Infrastructure
వ్యర్థం నుంచి సద్వినియోగం దిశగా: ప్లాస్టిక్ కథను తిరగరాస్తున్న భారతీయ నగరాలు
Posted On:
25 SEP 2026 2:25PM
దశాబ్దం క్రితం భారత మార్కెట్లలో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే దానితోపాటు సాధారణంగా పాలిథిన్గా పిలిచే ప్లాస్టిక్ సంచి ఇచ్చేవారు. కూరగాయలు, దుస్తులు, ఆహార పదార్థాలు సహా అనేక రకాల కొనుగోళ్లను ఈ సంచుల్లో తీసుకెళ్లేవారు.
నేడు దేశవ్యాప్తంగా మార్కెట్లు క్రమంగా ప్లాస్టిక్ రహితంగా మారుతున్నాయి. చాలామంది వినియోగదారులు ఇంటి నుంచే వస్త్ర సంచులు తీసుకెళ్తున్నారు. దుకాణదారులు తిరిగి ఉపయోగించగల ప్రత్యామ్నాయాలను అందిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే పొడి, తడి వ్యర్థాలను వేరు చేస్తున్నారు. గృహాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ చెత్త నిల్వ కేంద్రాలకు కాకుండా వనరుల పునరుద్ధరణ కేంద్రాలకు చేరుతోంది. అందులో కొంత భాగం తిరిగి కొత్త ఉత్పత్తిగా రావచ్చు. కఠినమైన నిబంధనలు, మెరుగైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలతో భారత్ తన ప్లాస్టిక్ కథను మార్చడం ప్రారంభించింది. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) వ్యర్థాల సేకరణ, విభజన, వనరుల పునరుద్ధరణ వ్యవస్థలను బలోపేతం చేసింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై 2022 జులై 1 నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది.
అయితే, ఈ మార్పు ఒక్క రాత్రిలోనో, కేవలం నిబంధనలతోనో రాలేదు. అవగాహన, స్థానిక చర్యలు, ప్రజల భాగస్వామ్యంతో చిన్న చిన్న అలవాట్ల నుంచి ఈ మార్పు రూపుదిద్దుకుంది. చిన్న మార్పులు ప్లాస్టిక్ ప్రయాణాన్ని ఎలా కొత్త దిశకు తీసుకెళ్లగలవో దేశవ్యాప్తంగా నగరాలు, సమాజాలు చూపిస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, వెనక్కి ఇచ్చేయడం, పునరుద్ధరించడం, కొత్త ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం వంటి అన్ని దశలను ఈ ప్రయత్నాలు కవర్ చేస్తున్నాయి.
తగ్గింపు: పరిష్కారంలో మార్కెట్‌ను భాగం చేయడం
మార్కెట్లో ప్రతి ఉదయం ఒక చిన్న అలవాటు వందలసార్లు పునరావృతమవుతుంది. మార్కెట్లలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు తిరుచిరాపల్లి నగరపాలక సంస్థ 2022లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
220 మంది విక్రేతలు ఉన్న తెన్నూర్, కేకే నగర్, వొరైయూర్ రైతు బజార్లను విస్తృత అవగాహన కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ హానిని విక్రేతలకు తిరుచిరాపల్లి నగరపాలక సంస్థ వివరించింది. సుస్థిర ప్రత్యామ్నాయాలను స్వీకరించాలని వారిని ప్రోత్సహించింది. ‘తునిప్పై తిరువిళా’–వస్త్ర సంచుల ఉత్సవం ద్వారా తిరిగి ఉపయోగించగల వస్త్ర సంచులను వాడాలని వినియోగదారులను మరింతగా ప్రోత్సహించారు. ఈ ప్రయత్నాలు కొలవగల ఫలితాలను ఇచ్చాయి. తెన్నూర్ మార్కెట్లో ఏడాదిలో 2,200 కిలోల ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించారు. కేకే నగర్లో నాలుగు నెలల్లో 620 కిలోలు, వొరైయూర్లో ఆరు నెలల్లో 300 కిలోల వినియోగాన్ని అరికట్టారు.

పునర్వినియోగం: వస్త్ర సంచుల ఎంపికను సులభం చేస్తున్న థైలా ఏటీఎం
ప్లాస్టిక్ సంచికి వస్త్ర సంచి సులభమైన ప్రత్యామ్నాయం. అయితే, రోజువారీ కొనుగోళ్లలో అది భాగం కావాలంటే సులభంగా అందుబాటులో ఉండాలి. మహారాష్ట్రలోని వీటా పట్టణంలో రద్దీ ప్రదేశాల్లో నగర పరిషత్ ఐదు ‘థైలా ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వినియోగదారులకు తిరిగి ఉపయోగించగల పత్తి సంచులను అందిస్తోంది.

ఈ యంత్రాలు వెండింగ్ మెషీన్ల మాదిరిగా పనిచేస్తాయి. వినియోగదారులు నాణెం లేదా నోటు వేస్తే వస్త్ర సంచి బయటకు వస్తుంది. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ (జీఎస్ఎం) సాంకేతికతతో రూపొందించిన ఈ యంత్రాలు సంచుల నిల్వలను దూరం నుంచే పర్యవేక్షిస్తాయి. నిర్దేశిత స్థాయి కంటే నిల్వలు తగ్గినప్పుడు నగర పరిషత్‌కు సమాచారం పంపుతాయి. ఈ కార్యక్రమం జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది. యంత్రాల ద్వారా అందించే సంచులను స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు కుడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 6 వేల సంచులు అమ్ముడయ్యాయి. వారపు సంతలో ఒక్కరోజే దాదాపు 200 సంచుల విక్రయం నమోదైంది.
వీటా నివాసి ముంతాజ్ రాజు సయ్యద్‌కు ఈ మార్పు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ‘‘థైలా ఏటీఎం ద్వారా ఇప్పుడు వస్త్ర సంచిని పొందగలుగుతున్నాను. దీంతో కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్లడం సులభమైంది’’ అని ఆమె చెప్పారు.

మహారాష్ట్రలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చేపట్టిన విస్తృత ప్రయత్నాల్లో థైలా ఏటీఎం ఒక భాగం. మార్కెట్లలో తనిఖీలు, జరిమానాలు, వీధి నాటకాలు, ప్రజా ప్రచార కార్యక్రమాల ద్వారా నిబంధనల అమలును అవగాహనతో నగరాలు అనుసంధానిస్తున్నాయి. ఇందాపూర్‌లో అధికారులు 25 కిలోల ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకుని ₹90 వేల జరిమానా విధించారు. అదే సమయంలో ప్రజలు ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారు. వార్ధాలో ఒక స్వయం సహాయక సంఘం 17 వేల కాగితపు సంచులను పంపిణీ చేసింది. పదేపదే ఉపయోగించేందుకు వస్త్రం, జనపనార సంచులను కూడా ప్రోత్సహిస్తున్నారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయాలు మరింత సులభంగా అందుబాటులోకి రావడానికి ఈ ప్రయత్నాలు దోహదం చేస్తున్నాయి.

తిరిగి అప్పగించడం: పాల ప్యాకెట్లకు ప్రతిఫలం
ఖాళీ పాల ప్యాకెట్‌ను తిరిగి ఇస్తే కుటుంబానికి ఏదైనా ప్రయోజనం లభిస్తే ఎలా ఉంటుంది? అండమాన్ నికోబార్ దీవుల్లో వాడిన ప్లాస్టిక్ పాల ప్యాకెట్లను పారేయకుండా తిరిగి ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తూ తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
వినియోగదారులు వాడిన ప్యాకెట్లను ఇచ్చి తాజా పాలు, రాయితీలు వంటి ప్రోత్సాహకాలను పొందేందుకు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునర్వినియోగం, బాధ్యతాయుత వ్యర్థాల తొలగింపు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అండమాన్ నికోబార్ దీవుల సమగ్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏఎన్ఐఐడీసీఓ), శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ (ఎస్వీపీఎంసీ) సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
వ్యవస్థీకృత విధానం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహిస్తూ వాటికి ఈ కార్యక్రమం విలువ కల్పిస్తోంది. 2024 నవంబర్ నాటికి 17,600 పాల ప్యాకెట్లను సేకరించి, వాటిని తిరిగి ఇచ్చిన ప్రజలకు 352 లీటర్ల పాలు అందించారు. చిన్న ప్రోత్సాహకంతో బాధ్యతాయుత వ్యర్థాల తొలగింపును సామాజిక అలవాటుగా ఎలా మార్చవచ్చో ఈ నమూనా చూపిస్తోంది.
పునరుద్ధరణ: ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త జీవితం
ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం ద్వారా బెంగళూరును మరింత పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్లాస్టిక్ సంఘం ప్రకారం నగరంలో నెలకు ఒక్కో వ్యక్తి దాదాపు 16 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన ‘ప్రాజెక్ట్ పృథ్వి’ పారేసిన ప్లాస్టిక్‌కు కొత్త జీవితం కల్పిస్తోంది.

ఈ కార్యక్రమం కింద సఫాయి సాథీల కోసం ‘స్వచ్ఛతా కేంద్రం’ పేరుతో సామగ్రి పునరుద్ధరణ కేంద్రాన్ని 2019లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి, చిన్న ముక్కలుగా చేసి, కట్టలుగా మారుస్తారు. తద్వారా శుద్ధి చేసిన సామగ్రిని పునర్వినియోగ సంస్థలు ఉపయోగించగల స్థితికి తీసుకొస్తారు. కొవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ కేంద్రం 76 మంది సఫాయి సాథీలకు ఉపాధి కల్పించింది. సామాజిక సంస్థ ‘హసిరు దళ’ నిర్వహిస్తున్న ఈ కేంద్రం వ్యర్థాల పునరుద్ధరణను జీవనోపాధితో అనుసంధానిస్తోంది.

శుద్ధి చేసిన ప్లాస్టిక్‌ను రహదారులు, వ్యవసాయ నీటి పైపులు, ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల భారాన్ని తగ్గించడంతోపాటు నగరాలను మరింత పరిశుభ్రమైన ప్రదేశాలుగా మార్చేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. ఒకప్పుడు పారేసిన ప్లాస్టిక్ ఇప్పుడు ఉపయోగకరమైన సామగ్రిగా తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తోంది. తద్వారా వలయ ఆర్థిక వ్యవస్థ భావన రోజువారీ వ్యర్థాల నిర్వహణకు మరింత చేరువవుతోంది.
కొత్త రూపకల్పన: మల్టీ-లేయర్డ్ ప్లాస్టిక్‌తో మన్నికైన ఉత్పత్తులు
చాక్లెట్ చుట్టలు, బిస్కెట్ ప్యాకెట్ల నుంచి చిప్స్, షాంపూ సాచెట్ల వరకు రోజువారీ ప్యాకేజింగ్‌లో మల్టీ-లేయర్డ్ ప్లాస్టిక్(ఎంఎల్పీ)ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్, కాగితం, అల్యూమినియం వంటి వివిధ పదార్థాల పొరలతో వీటిని తయారు చేస్తారు. దీంతో వాటిని వేరు చేసి పునర్వినియోగం చేయడం కష్టమవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యర్థాల్లో అధిక భాగం చెత్త నిల్వ కేంద్రాలకే చేరేది. అయితే, పటియాలాలో ప్లాస్టిక్ పునర్వినియోగ కేంద్రం (పీఆర్ఎఫ్) ద్వారా పునర్వినియోగం కష్టమైన ఈ వ్యర్థాలకు కొత్త ప్రయోజనం కల్పించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) మద్దతుతో నగరంలో ఏర్పాటు చేసిన పునర్వినియోగ కేంద్రంలో తక్కువ విలువ కలిగిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి, శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా చేస్తారు. వేడి, చల్లటి ఒత్తిడి ప్రక్రియలతో ఈ ముక్కలను కలిపి చిప్బోర్డుగా తయారు చేస్తారు. ప్లైవుడ్‌కు పర్యావరణహిత ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. నీరు, చెదపురుగులను తట్టుకునే ఈ సామగ్రి ఫర్నిచర్, పైకప్పులు, తాత్కాలిక నివాసాల తయారీకి సరిపడా దృఢంగా ఉంటుంది. రోజుకు 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రం 75 నుంచి 100 చిప్బోర్డులను ఉత్పత్తి చేస్తోంది. పునర్వినియోగం కష్టమైన ప్లాస్టిక్‌కు కొత్త ప్రయోజనం కల్పిస్తూ, వలయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు చెత్త నిల్వ కేంద్రాలకు చేరే వ్యర్థాలను ఈ కార్యక్రమం తగ్గిస్తోంది.
భవిష్యత్తు మార్గం
వ్యర్థాలను ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం, ఇంటింటి నుంచి సేకరించడం, శాస్త్రీయంగా శుద్ధి చేయడం, సామగ్రిని తిరిగి పొందడంపై స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) దృష్టి సారిస్తోంది. స్థానిక స్థాయిలో మార్పు ఎలా మొదలవుతుందో, మార్కెట్లు ప్రజల అలవాట్లను ఎలా మార్చగలవో ఈ విజయగాథలు తెలియజేస్తున్నాయి. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ, స్థానిక చర్యలు ప్లాస్టిక్ ప్రయాణాన్ని ఎలా మార్చగలవో ఇవి చాటుతున్నాయి. కొలమానాలు వేరు—కిలోలు, సంచులు, ప్యాకెట్లు, చిప్బోర్డులు. అయితే, దిశ మాత్రం ఒక్కటే. రోజువారీ ఎంపికలను శాశ్వత మార్పుగా తీర్చిదిద్దడమే ఆ దిశ.
Reference
Ministry of Housing and Urban Affairs
Click here to see PDF
***
(Features ID: 160259)
आगंतुक पटल : 28
Provide suggestions / comments