Infrastructure

వ్యర్థాల నుంచి విద్యుత్‌

స్వచ్ఛ భారత్ మిషన్‌లో వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్రస్థానం

Posted On: 27 SEP 2026 11:49AM

దేశ‌వ్యాప్తంగా సేంద్రియ వ్యర్థాలు ఇంధనం, విద్యుత్, విలువైన ఎరువుగా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్‌లో పురపాలక ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. మిషన్ విస్తరిస్తున్న కొద్దీ స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి సేంద్రియ వ్యర్థాలు విలువైన వనరుగా గుర్తింపు పొందాయి. ఆక్సిజన్ లేని వాతావరణంలో సేంద్రియ వ్యర్థాల కుళ్లే ప్రక్రియ ద్వారా ఉత్పత్తయ్యే బయోగ్యాస్ అత్యంత ఆచరణీయమైన, చౌకైన, పర్యావరణహిత వంట ఇంధనాల్లో ఒకటి. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా వచ్చే ద్రవ పదార్థంలో నత్రజని సమృద్ధిగా ఉంటుంది. ఇది సమర్థమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. రసాయన ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించి, వ్యయాన్ని నియంత్రించడంతోపాటు నేల సారాన్ని కాపాడేందుకు తోడ్పడుతుంది. ఈ విధంగా ఒకే కార్యక్రమం ద్వారా రెండు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

స్వచ్ఛ భారత్ మిషన్–పట్టణ 2.0 కింద వ్యర్థాల నుంచి ఇంధన తయారీ కార్యక్రమం అందుబాటులో ఉన్న వ్యర్థాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భిన్న రూపాల్లో అమలవుతోంది. హైదరాబాద్‌లోని ఒక కూరగాయల మార్కెట్ కుళ్లిన కూరగాయలతో ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా తన వీధి దీపాలను వెలిగిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని బహుళ ముడిసరకుల బయో–సీఎన్‌జీ ప్లాంట్ వివిధ రకాల సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛ ఇంధనం, కంపోస్టుగా మారుస్తోంది. గాంధీనగర్‌లోని ఒక విద్యాసంస్థ ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడకుండా రోజుకు 500 మందికి పైగా భోజనం వండుతోంది. గ్వాలియర్‌లోని గోశాల ఆవు పేడను కంప్రెస్డ్ బయోగ్యాస్‌గా మారుస్తోంది. ముడిసరకులు వేరు, ఉత్పత్తి స్థాయులు వేరు. అయితే, వాటి వెనుక ఉన్న మార్పు ఒక్కటే. సుస్థిరత దిశగా సాగుతున్న ప్రయాణంలో నగరాలు, సంస్థలు ఎలా ముందంజలో నిలుస్తున్నాయో ఈ కార్యక్రమాలు చాటుతున్నాయి. వ్యర్థాల నిర్వహణలో వినూత్నమైన, వలయ ఆర్థిక విధానాలను అనుసరించడం ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంతోపాటు వ్యర్థాలను విలువైన వనరుగా మారుస్తున్నాయి.

గాంధీనగర్: ఎల్‌పీజీపై ఆధారపడని విద్యా ప్రాంగణం
గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలోని అడాలజ్ వద్ద ఉన్న శ్రీమతి మానెక్‌బా వినయ్ విహార్ విద్యా సముదాయ వంటశాలలో ప్రతిరోజూ 500 మందికి పైగా భోజనం వండుతున్నారు. ప్రాంగణంలో నివసించే 250 మంది వసతిగృహ విద్యార్థులకు రోజూ రెండు పూటల భోజనం అందిస్తున్నారు. అక్కడే 15 మంది సిబ్బంది కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. అయితే, ఈ వంటశాల ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని పూర్తిగా మానేసి బయోగ్యాస్ ఆధారిత వంట వ్యవస్థకు మారింది.

ఈ విద్యా సముదాయాన్ని నిర్వహిస్తున్న వసుమతి చారిటబుల్ ట్రస్ట్ రోజుకు మొత్తం 90 ఘనపు మీటర్ల సామర్థ్యం కలిగిన రెండు బయోగ్యాస్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ట్రస్ట్ గోశాలలో ఉన్న 222 ఆవుల పేడను ముడిసరకుగా ఉపయోగిస్తున్నారు. సమీప పొలాల నుంచి వచ్చే వంటింటి వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాలను కూడా దీనికి జోడిస్తున్నారు. ప్రాంగణంలోని వంట ఇంధన అవసరాలన్నింటినీ ఈ గ్యాస్ తీరుస్తోంది. బయోగ్యాస్ లేకపోతే నెలకు 30 ఎల్‌పీజీ సిలిండర్లు అవసరమయ్యేవి.

వినూత్నమైన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఇంధన స్వావలంబన, సుస్థిరతను ఎలా సాధించవచ్చో ఈ సంస్థ చూపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వ సంస్థాగత బయోగ్యాస్ ప్లాంట్ పథకం, గుజరాత్ ఇంధన అభివృద్ధి సంస్థ (జీఈడీఏ) వంటి సంస్థాగత యంత్రాంగాలు ఈ మార్పునకు అవసరమైన విధానపరమైన, ఆర్థిక మద్దతును అందించాయి.


 



చిత్రం 1: గుజరాత్‌లోని అడాలజ్ శ్రీమతి మానెక్‌బా వినయ్ విహార్ విద్యా సముదాయంలోని బయోగ్యాస్ ప్లాంట్లు


ప్రత్యామ్నాయ ఇంధనం, సుస్థిర అభివృద్ధి దిశగా గుజరాత్ ముందుకు సాగుతోంది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన స్వావలంబనను సాధిస్తోంది. గోశాలలు, విద్యాసంస్థల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించేందుకు కూడా ఇది వీలు కల్పిస్తోంది.

ప్రయాగ్‌రాజ్: ఒకే ప్లాంట్‌లో నాలుగు రకాల ముడిసరకులు
ప్రయాగ్‌రాజ్ బయో–సీఎన్‌జీ కేంద్రం వివిధ రకాల సేంద్రియ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రూపొందించిన వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్లాంట్.



 

 

చిత్రం 2: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ బయో–సీఎన్‌జీ ప్లాంట్

 




ఈ ప్లాంట్ ప్రారంభంతో హరిత ఇంధనం, వ్యర్థాల నిర్వహణలో ఉత్తరప్రదేశ్ కీలక మైలురాయిని చేరుకుంది. వ్యర్థాలను విలువైన వనరుగా మార్చే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే పర్యావరణ పరిరక్షణ దిశగా భవిష్యత్ అవసరాలకు అనువైన అడుగుగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది.

ఈ ప్లాంట్ రోజుకు 343 టన్నుల సేంద్రియ వ్యర్థాలను శుద్ధి చేసి దాదాపు 21 టన్నుల బయో–సీఎన్‌జీని ఉత్పత్తి చేయగలదు. బహుళ ముడిసరకుల నమూనాలో తడి వ్యర్థాలు, వరి గడ్డి, పశువుల పేడ, కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. తద్వారా వ్యవసాయ అవశేషాలను ఉత్పాదక అవసరాలకు వినియోగించడంతోపాటు పంట వ్యర్థాల దహన సమస్య పరిష్కారానికి తోడ్పడుతున్నారు.

ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో పనిచేసే ఈ కేంద్రం హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్ సముదాయాల నుంచి భారీ పరిమాణంలో సేంద్రియ వ్యర్థాలను స్వీకరిస్తోంది. ప్రారంభంలో రోజుకు కేవలం 7–8 టన్నులుగా ఉన్న తడి వ్యర్థాల సరఫరా ప్రస్తుతం దాదాపు 125 టన్నులకు చేరింది. దీంతో నగరంలో వ్యర్థాల వినియోగం పెరిగింది. ఉత్పత్తి చేసిన బయో–సీఎన్‌జీని కంప్రెస్డ్ బయోగ్యాస్–సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీబీజీ–సీజీడీ) సమన్వయ పథకం కింద విక్రయిస్తున్నారు. ఇంధన క్యాస్కేడ్ మార్గంలో వినియోగదారులకు చేరవేస్తూ ప్రస్తుతం పట్టణ రవాణాకు ఉపయోగిస్తున్నారు.

ఈ ప్రక్రియలో రోజుకు 28 టన్నుల అధిక నాణ్యతగల కంపోస్టు కూడా ఉత్పత్తి అవుతోంది. దీన్ని స్థానిక రైతులకు అందించడం ద్వారా పునరుత్పాదక వ్యవసాయానికి మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో పైపుల ద్వారా దాదాపు 45 వేల ఇళ్లకు స్వచ్ఛ ఇంధనం అందించడంతోపాటు ఏటా సుమారు 57 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని అంచనా.

గ్వాలియర్: విద్యుత్ కేంద్రంగా మారిన గోశాల
గ్వాలియర్‌లోని అతిపెద్ద గోశాల లాల్టిపరాలో ఉన్న ఆదర్శ్ గోశాల. ఇందులో 10 వేలకుపైగా పశువులు ఉన్నాయి. రోజూ ఉత్పత్తయ్యే పేడకు కొత్త ప్రయోజనం కల్పిస్తూ 2024 అక్టోబర్‌లో రోజుకు 100 టన్నుల సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను ప్రారంభించారు. అత్యాధునిక సీబీజీ ప్లాంట్ ఆధారంగా నిర్మించిన భారత్ తొలి ఆధునిక, స్వయం సమృద్ధ గోశాలగా ఆదర్శ్ గోశాల నిలిచింది.





 

చిత్రం 3: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, లాల్టిపరాలో పశువుల పేడ ఆధారిత కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్





ఈ ప్లాంట్ రూపకల్పన పశువుల పేడ వినియోగానికే పరిమితం కాలేదు. మార్కెట్లు, ఇళ్ల నుంచి సేకరించే కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా శుద్ధి చేసే మధ్యప్రదేశ్ తొలి సీబీజీ ప్లాంట్ ఇది. ఐదు ఎకరాల్లో విస్తరించిన ₹31 కోట్ల ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రతిరోజూ 100 టన్నుల పశువుల పేడను రెండు టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్‌గా మారుస్తోంది. రోజుకు 10–15 టన్నుల పొడి జీవ ఎరువును కూడా ఉత్పత్తి చేస్తోంది. సమీప జిల్లాల రైతులకు చౌకగా ఎరువు అందడంతోపాటు సేంద్రియ సాగును ఇది ప్రోత్సహిస్తోంది.

ఈ ప్రయోజనాలు గోశాలకే పరిమితం కావు. శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయంగా సీబీజీ ఉపయోగపడుతోంది. పేడను ఇంధనంగా మార్చడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణ మార్పుల ప్రభావ నియంత్రణకు దోహదం చేస్తోంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. హరిత ఇంధనం, సుస్థిర విధానాల్లో నైపుణ్యాలను పెంపొందిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతోంది.

సీబీజీ ప్లాంట్ కేవలం పారిశ్రామిక కేంద్రం మాత్రమే కాదు. సమాజం, ప్రభుత్వం మధ్య సహకారానికి ఇది ప్రతీక. వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా ఎలా మార్చవచ్చో చాటుతోంది.

బోయిన్‌పల్లి: ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌ కూరగాయల మార్కెట్
ఈ నాలుగు విజయగాథల్లో బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ వినూత్న వ్యర్థాల నిర్వహణ వ్యవస్థకు ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో ప్రతిరోజూ దాదాపు 10 టన్నుల కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరిస్తున్నారు. గతంలో ఈ వ్యర్థాలను చెత్త నిల్వ చేసే కేంద్రాలకు తరలించేవారు. మార్కెట్ ప్రాంగణంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటైన తర్వాత అక్కడ సేకరించే వ్యర్థాల్లో దాదాపు అన్నింటినీ వినియోగిస్తున్నారు. రోజుకు సుమారు 400–500 యూనిట్ల విద్యుత్, 30 కిలోల జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను మార్కెట్ వీధి దీపాలు, దుకాణాలు, పరిపాలనా భవనం, నీటి సరఫరా వ్యవస్థ నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. జీవ ఇంధనాన్ని మార్కెట్‌లోని వాణిజ్య వంటశాలకు సరఫరా చేస్తున్నారు. తద్వారా మార్కెట్‌ను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా ఉంచుతున్నారు.





 

 

చిత్రం 4: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్, బయోగ్యాస్ ప్లాంట్
 





బయోగ్యాస్ ప్లాంట్‌లో కూరగాయలను చిన్న ముక్కలుగా కోసి, మెత్తగా నూరి ద్రవ మిశ్రమంగా మారుస్తారు. ఆ మిశ్రమాన్ని ఆక్సిజన్ రహిత జీర్ణకాల్లోకి పంపుతారు. అక్కడ ఉత్పత్తయ్యే గ్యాస్‌ను తదుపరి వినియోగం కోసం బెలూన్లలో నిల్వ చేస్తారు. మిగిలిన ద్రవ మిశ్రమం నుంచి ద్రవరూప జీవ ఎరువు తయారవుతుంది. దీన్ని రైతులు ఎరువుగా ఉపయోగిస్తారు. బయోగ్యాస్‌ను ప్రత్యేక ట్యాంకులో సేకరించి, వంట అవసరాల కోసం పైపుల ద్వారా పంపిస్తారు. జీవ ఇంధనాన్ని పూర్తిగా బయోగ్యాస్‌తో పనిచేసే జనరేటర్‌కు సరఫరా చేస్తారు. ఈ జనరేటర్ శీతల గిడ్డంగులు, నీటి పంపులు, దుకాణాలు, వీధి దీపాలకు విద్యుత్ అందిస్తుంది.

ఈ ప్లాంట్ ద్వారా మార్కెట్ విద్యుత్ బిల్లు దాదాపు సగానికి తగ్గింది. గతంలో నెలకు సగటున ₹3 లక్షల వరకు విద్యుత్ బిల్లు వచ్చేది. ఈ ప్లాంట్ ప్రభావాన్ని గుర్తించిన తర్వాత మరో ఐదు మార్కెట్ యార్డుల్లో ఇటువంటి ప్లాంట్లకు నిధులు కేటాయించారు. గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్, సరూర్‌నగర్ మార్కెట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా మార్కెట్ యార్డుల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాల పరిమాణానికి అనుగుణంగా వీటి సామర్థ్యాన్ని నిర్ణయించారు.





 

 

చిత్రం 5: బోయిన్‌పల్లి బయోగ్యాస్ ప్లాంట్





ఈ ప్లాంట్ మార్కెట్‌లో మహిళలకు స్థిరమైన ఉపాధిని కూడా కల్పించింది. వారు వ్యర్థాలను గుర్తించి వేరు చేయడం, యంత్రాలను నడపడం, పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడం వంటి పనులు చేస్తున్నారు. మహిళా కార్మికులకు స్థిరమైన ఆదాయం, నైపుణ్యాభివృద్ధిని ఈ ప్లాంట్ అందిస్తోంది.




చిత్రం 6: బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ మహిళా ఉద్యోగి రుక్మిణి దేవమ్మ




బయోగ్యాస్ ప్లాంట్ గురించి రుక్మిణి దేవమ్మ మాటల్లో: ‘‘బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటైన తర్వాత మా పనికి మంచి వేతనం అందుతోంది. మాస్కులు, గమ్‌బూట్లు, చేతి తొడుగులు వంటి అవసరమైన భద్రతా సామగ్రినంతా అందిస్తున్నారు. సురక్షితమైన పని వాతావరణం ఉండటంతో ఇతరులు కూడా మాతో కలిసి పనిచేయాలని ప్రోత్సహిస్తున్నాం.’’

ఈ విజయగాథలను కలిపే అంశం
ఈ నాలుగు విజయగాథల్లో ముడిసరుకు మారుతున్నా, ప్రాథమిక సూత్రం మాత్రం ఒక్కటే. వ్యర్థం ఇక చక్రంలో చివరి దశ కాదు. వ్యర్థాల నుంచి వనరులను తిరిగి పొందే లక్ష్యంతో నిర్వహణ వ్యవస్థలను రూపొందిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ కార్యక్రమాలు చూపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద పట్టణ వ్యర్థాల మౌలిక సదుపాయాల పాత్ర కేవలం సేకరణ, తొలగింపునకే పరిమితం కాకుండా శుద్ధి, ఇంధన ఉత్పత్తి, ఉప ఉత్పత్తుల వినియోగం దిశగా విస్తరిస్తోంది. పశువుల పేడ, వంటింటి వ్యర్థాలు, పంట అవశేషాలు, పారేసిన కూరగాయలను ఇంధనం, విద్యుత్, ఎరువుగా మారుస్తున్నారు. భారత్‌లోని నగరాలు, విద్యా ప్రాంగణాలు, గోశాలలు, మార్కెట్లలో విస్తృతంగా అమలు చేస్తే ఈ విధానం విడివిడి ప్రాజెక్టుల స్థాయిని దాటుతుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి నుంచి సేంద్రియ విధానాల ప్రోత్సాహం వరకు పట్టణ భారత్‌కు విస్తరించగల మార్గాన్ని ఈ ప్రయత్నాలు చూపుతున్నాయి. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విధానాలు కలిసి పరిశుభ్రమైన, పచ్చని, మరింత స్వావలంబన కలిగిన నగరాలకు మార్గం సుగమం చేస్తున్నాయి.

 

Reference

Ministry of Housing and Urban Affairs

Click to see pdf

***

(Features ID: 160258) आगंतुक पटल : 49
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Bengali , Odia , Kannada , Malayalam