Technology

సెమీకండ‌క్ట‌ర్‌లో స‌మ‌గ్ర మౌళిక స‌దుపాయాల నిర్మాణం

సెమీకండక్టర్ రంగంలో భారత్ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వ్యవస్థను నిర్మిస్తున్న ధోలేరా

Posted On: 28 SEP 2026 3:57PM

నేపథ్యం
సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన సెమీకండక్టర్ హబ్ పూర్తికాదు. అత్యంత పరిశుభ్రమైన గదులు, అధునాతన పరికరాలు, ఉత్పత్తి వ్యవస్థల వెనుక ఆసుపత్రులు, పాఠశాలలు, గృహ వసతి, అత్యవసర సేవలు, వాణిజ్య మౌలిక సదుపాయాలతో కూడిన విస్తృత వ్యవస్థ అవసరం. కంపెనీలు, వాటిలో పనిచేసే సిబ్బంది దీర్ఘకాలం కార్యకలాపాలు సాగించేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.



గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ తయారీ క్లస్టర్ అభివృద్ధితోపాటు ఈ విస్తృత వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంటోంది.

భారత్‌లో సెమీకండక్టర్ రంగ విస్తరణకు గుజరాత్ ప్రధాన కేంద్రంగా అవతరించింది. సెమికాన్ ఇండియా 1.0 కింద ఆమోదం పొందిన 12 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టుల్లో ఆరు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ₹1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో సెమీకండక్టర్ తయారీ, కాంపౌండ్ సెమీకండక్టర్, డిస్‌ప్లే సాంకేతికతలు, అధునాతన ప్యాకేజింగ్ ఉన్నాయి.

ఇంత భారీ స్థాయి పెట్టుబడులు మరో సమాంతర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. సెమీకండక్టర్ వ్యవస్థలో భాగమయ్యే ప్రజలు, వ్యాపారాలకు అవసరమైన సదుపాయాలతో పారిశ్రామిక పట్టణాన్ని నిర్మిస్తున్నారు.

సెమికాన్ ఇండియా–2026లో పెట్టుబడుల సులభతరం, వ్యాపార నిర్వహణ సౌలభ్యంపై జరిగిన చర్చా కార్యక్రమంలో గాంధీనగర్‌లోని గుజరాత్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ మిషన్ (జీఎస్ఈఎం) మిషన్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి నేహా కుమారి పాల్గొన్నారు. పారిశ్రామిక క్లస్టర్‌తోపాటు ధోలేరాలో సహాయక మౌలిక సదుపాయాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో ఆమె వివరించారు.

ఫ్యాబ్ తర్వాత అవసరమైన సదుపాయాల నిర్మాణం


ఈ వ్యవస్థలో ఆరోగ్య సంరక్షణ కీలక భాగం. ధోలేరాలో 200 పడకల ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది. 2026 డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను గుజరాత్ ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. భౌతిక మౌలిక సదుపాయాలతోపాటు అత్యవసర ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ఓపీలు), సంబంధిత సంస్థలతో సమన్వయ వ్యవస్థల రూపకల్పన కూడా కొనసాగుతోంది.

విద్య మరో ముఖ్యమైన అంశం. పట్టణంలో అంతర్జాతీయ బాకలారియేట్ (ఐబీ) పాఠ్యప్రణాళికను అనుసరించే పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు. భవనం ఇప్పటికే సిద్ధమైంది. 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పాఠశాల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు కూడా సాగుతున్నాయి.

కొత్తగా రూపుదిద్దుకుంటున్న పారిశ్రామిక క్లస్టర్‌లో పనిచేసే నిపుణులు, పెట్టుబడిదారుల కోసం వసతి సదుపాయాలను సైతం అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక వసతి కేంద్రాన్ని 2026 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పనిచేసే వారికి ఆతిథ్యం కల్పించే పట్టణ సామర్థ్యం పెరుగుతుంది.

ఇతర పౌర మౌలిక సదుపాయాల పనులు కూడా సమాంతరంగా ముందుకు సాగుతున్నాయి. అగ్నిమాపక కేంద్రం నిర్మాణం పూర్తయింది. ఫుడ్ కోర్టు 2026 జులైలో పూర్తయింది. నివాస, వాణిజ్య నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని 2027 మధ్యకాలం నుంచి ఆ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు.

టెంట్ సిటీ నిర్మాణం పూర్తయింది. కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను పొందే తుది దశలో విక్రేతలు ఉన్నారు. మరోవైపు హోటల్ నిర్మాణం కొనసాగుతోంది.

పారిశ్రామిక ప్రాజెక్టు నుంచి సమగ్ర పారిశ్రామిక వ్యవస్థ దిశగా
భారీ పారిశ్రామిక పెట్టుబడుల ప్రణాళికలో వస్తున్న విస్తృత మార్పును ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. సెమీకండక్టర్ కేంద్రానికి అత్యాధునిక తయారీ మౌలిక సదుపాయాలే కాకుండా నైపుణ్యం కలిగిన సిబ్బంది, వారితో వచ్చే కుటుంబాలకు అనువైన వాతావరణం కూడా అవసరం.

ధోలేరా విషయంలో తయారీ సామర్థ్యాలను నెలకొల్పుతున్న సమయంలోనే పారిశ్రామిక క్లస్టర్ చుట్టూ సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.

గత ఏడాదిన్నర నుంచి రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో విస్తృత కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సెమీకండక్టర్ ప్రాజెక్టుతో సమాంతరంగా ధోలేరాలో సహాయక మౌలిక సదుపాయాలు ఎంత వేగంగా రూపుదిద్దుకుంటున్నాయో ఇది తెలియజేస్తోంది.

ఈ విధానం ప్రభావం ఏ ఒక్క సదుపాయానికో పరిమితం కాదు. ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి. పాఠశాలలు కుటుంబాలకు అండగా నిలుస్తాయి. వసతి సదుపాయాలు కొత్తగా వచ్చే నిపుణులు, పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి. అత్యవసర, వాణిజ్య మౌలిక సదుపాయాలు పారిశ్రామిక పట్టణం సజావుగా పనిచేసేందుకు తోడ్పడతాయి.

గుజరాత్‌లో ఆరు సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానుండటంతో భారత్ సెమీకండక్టర్ తయారీ ప్రస్థానంలో ఈ రాష్ట్రం కీలకంగా మారుతోంది. ధోలేరాలో ఫ్యాక్టరీ చుట్టూ అవసరమైన విస్తృత వ్యవస్థ నిర్మాణం కూడా ఆ ప్రయాణంతోపాటే సాగుతోంది.

అందువల్ల కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఈ నమూనా కేవలం సెమీకండక్టర్ ఫ్యాబ్ నిర్మాణానికి పరిమితం కాదు. తయారీ, మౌలిక సదుపాయాలు, ప్రజల దైనందిన జీవనం ఒకేసారి అభివృద్ధి చెందగల సమగ్ర పారిశ్రామిక గమ్యస్థానాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. భారీ స్థాయిలో సెమీకండక్టర్ రంగంలో భారత్ ఆశయాలను సాకారం చేసేందుకు అవసరమైన పునాదిని ఈ నమూనా అందిస్తోంది.

 

Reference:

  • Ministry of Electronics and Information Technology

Click here to see pdf 

****

(Features ID: 160247) आगंतुक पटल : 61
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada , Malayalam