Rural Prosperity
స్వచ్ఛత.. ఒక ఉమ్మడి విశ్వాసంగా మారిన వేళ
ప్రాచీన సంప్రదాయాల నుంచి ఆధునిక తీర్థయాత్రల వరకు సామూహిక అలవాటుగా మారుతోన్న స్వచ్ఛత
Posted On:
29 SEP 2026 5:37PM
ప్రాచీన భారత్‌లో స్వచ్ఛత: దైనందిన జీవితంలో భాగమైన ఆచారం

ఆధునిక పారిశుద్ధ్య ఉద్యమం కంటే ఎంతో ముందునుంచే భారత్‌కు స్వచ్ఛతతో అనుబంధం ఉంది. సింధూ లోయ నాగరికతలో అధునాతన పారిశుద్ధ్య వ్యవస్థలు ఉన్నట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత గుజరాత్‌లోని లోథాల్ వంటి నగరాలను విస్తృత మురుగునీటి కాలువలతో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. అనేక ఇళ్లలో కాలువలకు అనుసంధానించిన వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేవి. తనిఖీ కేంద్రాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిర్మాణాలు కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉండేవి. శరీర పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతకు వేద సంప్రదాయం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. స్వచ్ఛమైన నీరు, తాజా గాలి, ఆరోగ్యకరమైన పరిసరాలను ఆధ్యాత్మిక ఆచారాలతో అనుసంధానించింది. నదులు, ఇతర జల వనరుల సమీపంలో మల విసర్జన చేయొద్దని ప్రాచీన మార్గదర్శకాలు సూచించాయి. బౌద్ధ సంప్రదాయాల్లోనూ ఇదే అనుబంధం కనిపిస్తుంది. నీటిలో మలమూత్ర విసర్జన చేయకూడదని బౌద్ధ భిక్షువులకు నిర్దేశించారు. తర్వాత వచ్చే వ్యక్తి కోసం మరుగుదొడ్డి ప్రదేశాలను శుభ్రం చేయాలని కూడా సూచించారు. క్రమబద్ధమైన పారిశుద్ధ్య సంప్రదాయం ఉనికిని పురావస్తు ఆధారాలు బలపరుస్తున్నాయి. బిహార్‌లోని గుప్తుల కాలం నాటి ఆశ్రమంలో ప్రత్యేక మరుగుదొడ్డి గది ఉండేది.
ఈ ఉదాహరణలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. భారత్‌లో స్వచ్ఛత ఎప్పటి నుంచో ప్రవర్తన, క్రమశిక్షణ, సామాజిక జీవితంతో ముడిపడి ఉంది.
పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల నుంచి సామాజిక ప్రవర్తనలో మార్పు వరకు..
శతాబ్దాలు గడిచిన తర్వాత ఆధునిక భారత్‌లో పారిశుద్ధ్యం ఒక సవాలుగా మారింది. తగిన పారిశుద్ధ్య వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వాటిని వినియోగించి, నిరంతరం సంరక్షించే అలవాట్లను పెంపొందించడం కూడా ఈ సవాలులో భాగమే. దీన్ని ఎదుర్కొనేందుకు 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం)ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో చేపట్టిన అతిపెద్ద పారిశుద్ధ్య ఉద్యమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్–గ్రామీణ్ (ఎస్‌బీఎం–జీ), స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ (ఎస్‌బీఎం–యూ) అనే రెండు విభాగాలు ఉన్నాయి. గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల అందుబాటు, వినియోగం, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఎస్‌బీఎం–జీ దృష్టి సారిస్తుంది. పట్టణ పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలు, పరిశుభ్రత మౌలిక సదుపాయాలపై ఎస్‌బీఎం–యూ దృష్టి పెడుతుంది.
2014 తర్వాత గడిచిన దశాబ్దంలో ఒకవైపు మరుగుదొడ్ల నుంచి వ్యర్థాల తొలగింపు, నిర్వహణ వ్యవస్థల వరకు విస్తృత పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా నిర్మించారు. మరోవైపు స్వచ్ఛతను దైనందిన ప్రవర్తనలో భాగం చేసేందుకు అవసరమైన అలవాట్ల మార్పును తీసుకురావడం, ఆ మార్పును కొనసాగించడం వంటి మరింత క్లిష్టమైన బాధ్యతను ఈ ప్రయాణం చేపట్టింది. ఎస్‌బీఎం కింద చోటుచేసుకుంటున్న విస్తృత పరివర్తన ఇదే.
శాశ్వత గ్రామాలు, నగరాల్లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు సంస్థాగత రూపం దాల్చాయి. అయితే, తక్కువ సమయంలో కోట్ల మంది ఒక్కచోట చేరే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో ఈ ప్రవర్తనా మార్పు అసలైన పరీక్షను ఎదుర్కొంటుంది.
మహా కుంభమేళా: భారీ సమ్మేళనం నుంచి స్వచ్ఛతా ఉద్యమం వరకు
ఈ మార్పును మహా కుంభమేళా–2025 అంత స్పష్టంగా చూపించే కార్యక్రమాలు చాలా తక్కువ. ఈ వేడుకల భారీ స్థాయి పారిశుద్ధ్య నిర్వహణకు పెద్ద సవాలుగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. తగిన పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల కల్పన, అవగాహన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ సవాలును ఎదుర్కొన్నారు. మేళా ప్రాంగణంలో 28 వేలకు పైగా మరుగుదొడ్లు, 20 వేల సామూహిక మూత్రశాలలను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేసేందుకు 20 వేల చెత్త బుట్టలను అందుబాటులో ఉంచారు. అయితే, మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ఈ కార్యక్రమ లక్ష్యం కాదు. మేళా ప్రాంగణాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించాలని భక్తులను ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛత పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని చురుగ్గా ప్రోత్సహించారు. ప్రయాగ్‌రాజ్‌లో ‘స్వచ్ఛతా రథయాత్ర’ సాగింది. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలను ఉపయోగించడం, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నివారించడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించిన బహిరంగ ఊరేగింపు ఇది. వీధి నాటకాలు, సంగీత ప్రదర్శనల ద్వారా వ్యర్థాలను వేరు చేయడం, తొలగించే పద్ధతులను వివరించారు. ఘాట్లలో ఏర్పాటు చేసిన ప్రజా సమాచార వ్యవస్థల ద్వారా పరిశుభ్రత సందేశాలను వినిపించారు.
సామాజిక భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాలకూ ఈ విధానం అవకాశం కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని 28 జిల్లాలకు చెందిన మహిళలు, పలు పొరుగు రాష్ట్రాల కళాకారులు సుస్థిర ఉత్పత్తులను తయారు చేశారు. ఆకులతో తయారు చేసిన పళ్లాలు, మట్టి కప్పులు, జనపనార సంచులు, వస్త్ర సంచులు వాటిలో ఉన్నాయి. దాదాపు 60 కోట్ల పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేసి 300 ప్రాంతాల్లో విక్రయించారు. ఈ కార్యక్రమ సందేశం వ్యర్థాలను తొలగించడానికే పరిమితం కాలేదు. వ్యర్థాల ఉత్పత్తిని నివారించే ప్రయత్నాల్లో ప్రజలను భాగస్వాములను చేసింది. ప్రవర్తనలో మార్పు తీసుకురావడమంటే ఇదే.
బలమైన ప్రజా పరిశుభ్రత వ్యవస్థలు ప్రజల ప్రవర్తనలో సానుకూల మార్పును ఎలా ప్రోత్సహించగలవో కూడా మహా కుంభమేళా–2025 చూపించింది. ప్రధాన పుణ్యస్నాన తేదీల తర్వాత వేగవంతమైన పారిశుద్ధ్య బృందాలు మేళా ప్రాంగణాలను తిరిగి శుభ్రపరిచాయి. మరుగుదొడ్లను శుభ్రం చేసి, యాత్రికులు వదిలివెళ్లిన వ్యర్థాలను తొలగించాయి. క్రిమిసంహారక మందుల పిచికారీ, ఫాగింగ్ కూడా చేపట్టాయి.
కన్వర్ యాత్ర: యాత్రా మార్గమే స్వచ్ఛతా ప్రాంగణంగా మారిన వేళ
ప్రయాగ్‌రాజ్ నదీ తీరాల్లో భారీ జనసందోహ సమన్వయం సవాలుగా నిలిస్తే, కన్వర్ యాత్ర సాగే సుదీర్ఘ మార్గాలు మరో రకమైన నిర్వహణ సమస్యను ముందుకు తెచ్చాయి. ఈ యాత్ర సమయంలో లక్షల మంది భక్తులు ఒకే మార్గాల్లో ప్రయాణిస్తారు. దీంతో రహదారులు, ఘాట్లు, విశ్రాంతి ప్రదేశాలు, ప్రజా సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీలో యాత్ర సందర్భంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన మార్గాలు, విశ్రాంతి కేంద్రాల్లో అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. నిరంతరంగా రహదారులను ఊడ్చడం, వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచారు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిరుత్సాహపరిచారు. మహిళా యాత్రికుల అవసరాలపైనా ఈ కార్యక్రమం దృష్టి సారించింది. మహిళా వలంటీర్ల నిర్వహణలో రెండు ప్రత్యేక గులాబీ రంగు కన్వర్ శిబిరాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, స్నానపు సదుపాయాలను ఈ శిబిరాల్లో కల్పించారు. దీంతో పారిశుద్ధ్యాన్ని గౌరవం, సౌకర్యంతో అనుసంధానించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలుగా ఐదు లక్షలకు పైగా భక్తులకు స్టీల్ గంగాజల పాత్రలు, జనపనార సంచులను అందించారు.
అమర్‌నాథ్ యాత్ర: విశ్వాసం నుంచి బాధ్యతాయుత కార్యాచరణ దిశగా

దుమ్ముతో కూడిన రహదారుల నుంచి కశ్మీర్ హిమాలయాల్లోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థ వరకు సాగే అమర్‌నాథ్ యాత్ర ఈ బాధ్యతను మరో స్థాయికి తీసుకెళ్తోంది. 2025లో నాలుగు లక్షలకు పైగా భక్తులు ఈ యాత్ర చేపట్టారు. ఈ యాత్రను ఎస్‌బీఎం–యూ 2.0తో అనుసంధానించారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత పద్ధతులపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎలాంటి వ్యర్థాలను పల్లపు ప్రాంతాల్లో వేయని, పర్యావరణహిత యాత్రను నిర్వహించడమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛతా ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర వలంటీర్లు ఈ ప్రయత్నానికి సహకరించారు. వసతి కేంద్రాలు, లంగర్ ప్రదేశాలు, యాత్రా శిబిరాల్లో వారు సేవలు అందించారు. వ్యర్థాలను వేరు చేయడాన్ని ప్రోత్సహించి, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిరుత్సాహపరిచారు. పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై సందేశాలను కూడా ప్రచారం చేశారు. కార్యక్రమాల స్థాయి ఎంతో విస్తృతంగా ఉంది. రోజుకు దాదాపు 11.67 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయినప్పటికీ, వాటిలో 100 శాతాన్ని శుద్ధి చేశారు. తడి, పొడి వ్యర్థాల కోసం యాత్రా మార్గంలో 1,016 జంట చెత్త బుట్టల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళల మరుగుదొడ్ల సమీపంలో పారిశుద్ధ్య వ్యర్థాల కోసం ప్రత్యేక చెత్త బుట్టలు ఉంచారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 1,300 మంది సఫాయి మిత్రలు పనిచేశారు. యాత్రా మార్గంలో నిరంతర పరిశుభ్రతను కాపాడేందుకు వారు సేవలు అందించారు.

అవగాహన కార్యక్రమాలను ఆసక్తికరంగా, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. ‘ప్లాస్టిక్ లావో, థైలా లే జావో’, ‘బిన్ ఇట్, విన్ ఇట్’ వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. సమాచారాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు అనుసంధానించాయి. సమాచార, విద్య, ప్రచార కార్యక్రమంలో సూచిక బోర్డులు, వీధి నాటకాలను కూడా ఉపయోగించారు. ‘గ్రీన్ ప్లెడ్జ్’ కార్యక్రమం ద్వారా 70 వేల మందికి పైగా భక్తులు ఒక్కచోట చేరారు. స్వచ్ఛత, సుస్థిర విధానాలను పాటిస్తామని పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు. యాత్రికులు సెల్ఫీలు, విజయవంతమైన పారిశుద్ధ్య అనుభవాలను పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లోనూ ఈ సందేశం విస్తరించింది. ఇక్కడ మార్పు ప్రత్యేకంగా కనిపిస్తోంది.
యాత్రికుడు ఇప్పుడు కేవలం పారిశుద్ధ్య సదుపాయాలను వినియోగించుకునే వ్యక్తి మాత్రమే కాదు. వాటి నిర్వహణలో భాగస్వామిగా మారుతున్నాడు. విశ్వాసానికి బాధ్యత తోడవుతోంది.
మతపరమైన ఆచారమే వ్యర్థాల నిర్వహణలో భాగమైన వేళ

ఈ ఉద్యమం ప్రధాన తీర్థయాత్రలకు వెలుపల ఉన్న ప్రార్థనా ప్రదేశాలకూ విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో చేపట్టిన కార్యక్రమం దీనికి ముఖ్య ఉదాహరణ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ను ప్రారంభించింది. మతపరమైన, పవిత్ర వ్యర్థాల నిర్వహణపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. పూలు, పూలదండలు, మత గ్రంథాలు, దెబ్బతిన్న విగ్రహాలు వంటి సామగ్రి ఈ విభాగంలోకి వస్తుంది. వాటిని ప్రత్యేకంగా సేకరించి, శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు ప్రాజెక్టు ఏర్పాట్లు కల్పిస్తుంది. జూబ్లీహిల్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. తొలుత ఏడుగురు వ్యక్తులు 66 కిలోల మతపరమైన సామగ్రిని అందించారు. రెండో దశలో 443 కిలోలను సేకరించారు. మూడో దశలో ఈ కార్యక్రమాన్ని ఆరు ప్రధాన ఆలయాలకు విస్తరించారు. ఇందులో 124 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ దశలో 753.59 కిలోల సామగ్రిని సేకరించారు. సేకరించిన సామగ్రిని వేరు చేసి, వివరాలను నమోదు చేసి, పునర్వినియోగానికి పంపించారు. తదుపరి శుద్ధి కోసం గుర్తింపు పొందిన సంస్థకు అప్పగించారు. వ్యర్థాలను ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం, సుస్థిర వ్యర్థాల నిర్వహణను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. స్వచ్ఛత ప్రయాణంలో ఇది ముఖ్యమైన విస్తరణ. ఇప్పుడు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడమే లక్ష్యం కాదు. మతపరమైన వ్యర్థాలను నిర్వహించే విధానంలోనూ మార్పు తీసుకురావడంపై దృష్టి పెరిగింది.
స్వచ్ఛతా ప్రయాణంలో భాగమైన వేళ
భారత్ పారిశుద్ధ్య ప్రయాణం సుదీర్ఘ మార్గాన్ని అధిగమించింది. ప్రాచీన నివాస ప్రాంతాల్లో నీరు, పారిశుద్ధ్యానికి అధునాతన వ్యవస్థలను నిర్మించారు. మత సంప్రదాయాలు స్వచ్ఛతను వ్యక్తిగత, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అనుసంధానించాయి. ఆధునిక భారత్ అందరికీ పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించే సవాలును ఎదుర్కొంది. స్వచ్ఛ భారత్ మిషన్ భారీ స్థాయిలో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను సృష్టించింది. అయితే, మౌలిక సదుపాయాలతోనే ఈ ప్రయాణం పూర్తికాదు. స్వచ్ఛతను అలవాటుగా మార్చడం తదుపరి దశ. దీనికి సమాచారం, ప్రజల భాగస్వామ్యం, పదేపదే చేపట్టే సామాజిక కార్యాచరణ అవసరమైంది. ప్రస్తుతం ఈ ప్రయత్నం కేవలం ప్రచార కార్యక్రమాల రోజుల్లోనే కాకుండా అనేక చోట్ల కనిపిస్తోంది. తీర్థయాత్ర మార్గాలు, మతపరమైన సమ్మేళనాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, పండుగ ప్రాంగణాల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది. అప్పుడే స్వచ్ఛత ఒక ప్రచార కార్యక్రమం స్థాయిని దాటుతుంది. అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు సామూహిక రూపం దాల్చినప్పుడు సంస్కృతిగా మారుతుంది.
References
Ministry of Jal Shakti
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2091806®=48&lang=2
https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Studies-and-surveys/Swachhata-Sanskriti-Draft-G2-Small-Review-Copy.pdf
Ministry of Education
http://ncert.nic.in/textbook/pdf/fees106.pdf
Government of Uttar Pradesh
https://x.com/MahaKumbh_2025?lang=en
Government of Jammu & Kashmir
https://swachh.jk.gov.in/clean-beginnings-strengthening-sanitation-for-shri-amarnath-ji-yatra-2025-at-yatri-niwas-jammu/
Government of Telangana
https://x.com/GHMCOnline/media
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2090918®=48&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=160036&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=153694&ModuleId=3®=48&lang=2
When Swachhata Becomes Shared Faith
***
(Features ID: 160246)
आगंतुक पटल : 12
Provide suggestions / comments