• Sitemap
Rural Prosperity

ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ ప‌ద్ధ‌తుల్లో పండుగ‌లు

Posted On: 28 SEP 2026 4:21PM

భారత్‌లో పండుగలు ఎన్నో రూపాల్లో వస్తాయి. అయితే, అవి పంచే భావోద్వేగం మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. గణేశ్ చతుర్థి సందర్భంగా బొజ్జ గణపయ్య ఇళ్లు, కాలనీల్లో కొలువుదీరుతారు. దుర్గాపూజతో మండపాలు భక్తి, కళాత్మకతతో నిండిపోతాయి. దీపావళి దీపాల వెలుగులు, ప్రార్థనలు, కొత్త ప్రారంభాలను తీసుకొస్తుంది. ఛఠ్ పూజ సందర్భంగా కుటుంబాలు ఘాట్ల వద్దకు చేరి సూర్య భగవానుడిని ఆరాధిస్తాయి. విశ్వాసం, కుటుంబం, సమాజంతో ముడిపడిన ఈ వేడుకలకు అవి జరిగే ప్రదేశాలతోనూ సన్నిహిత అనుబంధం ఉంది.

ఆలయానికి పూలు చేరతాయి. పందిరి ప్రార్థనా స్థలంగా మారుతుంది. ఘాట్ పవిత్ర ఆచారంలో భాగమవుతుంది. ఈ సంప్రదాయాలు ప్రజలను ఒక్కచోట చేర్చుతున్న వేళ, పవిత్ర ప్రదేశాల సంరక్షణ కూడా వేడుకలో భాగంగా మారుతోంది. ఈ స్ఫూర్తికి 2026 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ జాతీయ వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం ‘స్వచ్ఛతా మే సహభాగ్; స్వచ్ఛ భారత్, వికసిత భారత్’. పరిశుభ్రతను కాపాడటం అందరి ఉమ్మడి బాధ్యత అనే భావనను ఈ ప్రచారం ప్రధానంగా ముందుకు తీసుకెళ్తోంది. ‘స్వచ్ఛ పర్వ్, హరిత్ పర్వ్’ ద్వారా పరిశుభ్రమైన, పర్యావరణహిత పండుగలకు ప్రాధాన్యం ఇస్తోంది. వ్యర్థాలను ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం, వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూజ్‌), తిరిగి ఉపయోగించడం(రీయూజ్‌), పునర్వినియోగం(రీసైకిల్‌) అనే 3ఆర్‌ల విధానం, వలయ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలను సైతం ప్రోత్సహిస్తోంది.

భారత్ పండుగల్లో ఈ ఆలోచన ఇప్పటికే అర్థవంతమైన రీతిలో ఆచరణలోకి వస్తోంది. పూజా పుష్పాలను కొత్త అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తున్నారు. గణపతి వేడుకల్లో మట్టి విగ్రహాలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పండుగ ప్రాంగణాల నిర్మాణానికి వెదురును వినియోగిస్తున్నారు. భక్తుల కోసం ఛఠ్ ఘాట్లను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కాలానుగుణంగా సంప్రదాయాలు మారినా విశ్వాసం, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ బాధ్యతను వీడాల్సిన అవసరం లేదని ఈ ప్రయత్నాలు చాటుతున్నాయి.

భక్తితో సమర్పించిన పూలకు కొత్త జీవితం
ఉజ్జయినిలో తెల్లవారుజామున వేల మంది భక్తులు పూజ కోసం పూలు తీసుకుని మహాకాళేశ్వర్ ఆలయానికి వస్తారు. వారికి ఆ పూలు భక్తికి ప్రతిరూపాలు. ప్రతిరోజూ దాదాపు 75 వేల నుంచి లక్ష మంది వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో రోజుకు సుమారు 5 నుంచి 6 టన్నుల పూల వ్యర్థాలు వస్తాయి. ప్రత్యేక ‘పుష్పాంజలి ఎకోనిర్మిత్’ వాహనాలు ఈ పూలను సేకరించి శుద్ధి కేంద్రానికి తరలిస్తాయి. అక్కడ వాటిని కంపోస్టు, ఇంధన కడ్డీలు, జీవ ఇంధనాలు వంటి ఉత్పత్తులుగా మారుస్తారు.

శివ్ అర్పణ్ స్వయం సహాయక సంఘం మహిళలకు పూజ తర్వాత మిగిలిన పూలు ఉపాధి వనరుగా, కొత్త ఆశయానికి ఆధారంగా మారాయి. 2024లో పూల వ్యర్థాలతో మూడు కోట్లకు పైగా అగరబత్తీలు, ఇతర పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేశారు. ఈ కార్యక్రమం వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంతోపాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ విధంగా భక్తితో సమర్పించిన పువ్వు ప్రయాణం అక్కడితో ముగియదు. ప్రార్థన తర్వాత ఉపాధి, జీవనోపాధి, పర్యావరణ బాధ్యత రూపంలో అది కొత్త ప్రయోజనాన్ని పొందుతుంది.

వేడుకకు పర్యావరణ బాధ్యత తోడైతే
కోట్ల మంది ప్రజలకు గణేశ్ చతుర్థి ఎంతో ఆత్మీయమైన పండుగ. సంగీతం, ప్రార్థనల నడుమ గణపయ్య ఇళ్లలోకి వస్తారు. కుటుంబంలో భాగమవుతారు. తిరిగి వస్తాననే భరోసానిస్తూ చివరకు నిమజ్జనానికి తరలుతారు. గణనాథుడికి వీడ్కోలు పలకడం పవిత్ర ఘట్టం. అదే సమయంలో మన జల వనరులను కాపాడాల్సిన బాధ్యతతో ప్రియమైన సంప్రదాయం కలిసే సందర్భం కూడా ఇదే.

2024లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం నవీ ముంబైలో 136 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. భక్తులు నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ప్రదేశాలను అందుబాటులోకి తెచ్చారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ ద్వారా ఆ ప్రదేశాల వివరాలను పంచుకున్నారు. దీంతో భక్తులు సులభంగా అక్కడికి చేరుకోగలిగారు. సహజ జల వనరులపై ఒత్తిడి కూడా తగ్గింది.

గణేశ్ విగ్రహాల తయారీలో సంప్రదాయ, పర్యావరణహిత సామగ్రిని ప్రోత్సహించేందుకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శిల్పులకు దాదాపు 500 టన్నుల మట్టిని ఉచితంగా అందించింది. ఈ ప్రయత్నానికి కొనసాగింపుగా మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణహిత విగ్రహాలు, అలంకరణలను ప్రోత్సహించేందుకు ‘ఎకో-బప్పా’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. వేడుకలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారాన్ని కాపాడుతూనే సుస్థిర పద్ధతులను అనుసరించాలని భక్తులు, కళాకారులను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది.

యువతలోనూ ఈ ఆలోచనకు మంచి స్పందన లభించింది. విద్యార్థుల కోసం పింప్రి చించ్‌వడ్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణహిత విగ్రహాల తయారీ, అలంకరణ పోటీలను నిర్వహించింది. మట్టి, పేపర్‌ మాషే, సహజ నారలు, పునర్వినియోగ సామగ్రితో విగ్రహాలను రూపొందించాలని విద్యార్థులను ప్రోత్సహించింది. తద్వారా పండుగల్లో పర్యావరణ సంరక్షణకు చోటు కల్పించింది. మహారాష్ట్రలోని థానేలో దాదాపు 500 మంది విద్యార్థులు షాదూ మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేయడం నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, హస్తకళా నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణంపై మరింత శ్రద్ధతో సంప్రదాయాలను కొనసాగించాలనే ఆలోచనకు బీజం వేశాయి.

2023 నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి కొనసాగింది. 500 మందికి పైగా విద్యార్థులు సహా 900 మందికి పైగా స్వచ్ఛ కార్యకర్తలు వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేశారు. దాదాపు 80 వేల కిలోల వ్యర్థాలను తొలగించి, సుమారు 7,400 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశ్ విగ్రహాలను సేకరించారు. గణపయ్యకు వీడ్కోలు పలికే సందర్భం మరో సేవా కార్యక్రమంగా మారింది.

పర్యావరణహిత మార్పు కోసం ప్రతిసారీ కొత్తదాన్ని అన్వేషించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తరతరాలుగా ప్రజలకు తెలిసిన సామగ్రి వైపు తిరిగి వెళ్లడమే సరైన మార్గం.

అస్సాంలోని డిగ్‌బోయ్‌లో 2023 గణేశ్ పూజను వెదురు ప్రధానంగా నిర్వహించారు. విగ్రహాలు, ప్రవేశ ద్వారాలు, జాపి తలపాగా, ఖొరాహి బుట్టలు సహా సంప్రదాయ అలంకరణలకు వెదురును ఉపయోగించారు. స్థానిక సంప్రదాయం, పర్యావరణ సంరక్షణను ఈ వేడుక ఒక్కచోట చేర్చింది.

కొబ్బరి పీచు, మట్టితో రూపొందించిన పర్యావరణహిత వినాయ‌క‌ విగ్రహాల రూపంలో ఢిల్లీ మరో వినూత్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ఈ విగ్రహాల్లో నాటేందుకు అనువైన విత్తనాలను ఉంచారు. నిమజ్జనం తర్వాత విగ్రహాలు మట్టిలో కరిగిపోయి, వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగాయి. ఆచారం సంప్రదాయ మూలాలను నిలుపుకుంటూనే దాన్ని పూర్తిచేసే విధానంలో ఉపయోగించిన సామగ్రి మరింత సుస్థిర మార్గాన్ని చూపింది.

పందిరి నుంచి ప్రసాదం వరకు.. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ వేడుక
దుర్గాపూజ భక్తి, కళాత్మకత, సామాజిక ఐక్యతకు ప్రతీక. అమ్మవారికి స్వాగతం పలికే తాత్కాలిక పవిత్ర ప్రదేశాలుగా పందిళ్లు రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రదేశాల నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిలో పర్యావరణ స్పృహ క్రమంగా పెరుగుతోంది. 2023లో థర్మాకోల్, ప్లాస్టిక్‌కు బదులుగా వెదురు, కలప, కొబ్బరి చిప్పలు, వస్త్రం, జనపనార, కొబ్బరి నార, ఎండుగడ్డి, వరి గడ్డి, బెత్తం, కాగితం ఉపయోగించారు. నీటిలో సులభంగా కరిగే మట్టి దుర్గామాత విగ్రహాలను కూడా ప్రోత్సహించారు.

ఈ ప్రయత్నాలు పందిళ్లకే పరిమితం కాలేదు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీలం, ఆకుపచ్చ రంగుల చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత అలంకరణలను ప్రోత్సహించారు. ఢిల్లీలోని కొన్ని పందిళ్ల నిర్మాణానికి వెదురు, పత్తిని ప్రధాన సామగ్రిగా ఎంచుకున్నారు.

పూజలో ఉపయోగించిన సమర్పణలకు కూడా మరో ప్రయోజనం కల్పించారు. పూజ తర్వాత సేకరించిన పూలు, ఇతర సేంద్రియ సామగ్రిని కంపోస్టు తయారీతోపాటు ఇతర ఉత్పాదక అవసరాలకు పంపించారు. ప్రసాదం, అల్పాహారాన్ని కాగితపు పళ్లాలు, అరటి ఆకులు, విస్తరాకులు, మట్టి పాత్రల్లో అందించారు. పండుగలోని సుపరిచిత సంప్రదాయాలను కొనసాగిస్తూనే పర్యావరణహిత విధానాలను అనుసరించవచ్చని ఇవి చూపించాయి.

దీపావళి వేడుకల్లో స్వచ్ఛతా స్ఫూర్తి
దీపావళికి పరిశుభ్రతతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధం ఉంది. ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. పాత వస్తువులను వేరు చేస్తారు. పూజలు, కానుకలు, మిఠాయిలతో కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరతారు. ‘స్వచ్ఛ దీపావళి, శుభ్ దీపావళి’ ప్రచారం ఈ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. వ్యర్థాలను వేరు చేయడం, వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, పునర్వినియోగం అనే 3ఆర్‌ల విధానం, స్థానికంగా తయారైన ఉత్పత్తుల వినియోగం, పరిశుభ్రమైన వేడుకలను ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది.

మహారాష్ట్రలోని మీరా భయందర్‌లో పండుగకు ముందస్తు ఏర్పాట్లు, సామాజిక పరిశుభ్రతతో వేడుక ప్రారంభమైంది. దీపావళికి ముందు నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో సఫాయి మిత్రలు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేశారు. జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను కడిగారు. పచ్చని ప్రదేశాలను సంరక్షించారు.

రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో దీపావళి సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను సమీపంలోని వినియోగం తగ్గింపు, తిరిగి వినియోగం, పునర్వినియోగ కేంద్రాలకు తీసుకెళ్లాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

2023లో పునర్వినియోగ స్ఫూర్తి పండుగ కానుకలకూ విస్తరించింది. ఢిల్లీలోని నవజీవన్ విహార్‌లో నిర్వహించిన ‘స్వాప్ బిఫోర్ యూ షాప్–గిఫ్ట్ రివైవల్ మేళా’లో స్థానికులు తమ వద్ద ఉపయోగించకుండా ఉన్న కానుకలను వర్గీకరించిన గిఫ్ట్ పూల్ ద్వారా పరస్పరం మార్చుకున్నారు. ఒక్క రోజులో రెండు గంటల వ్యవధిలోనే 50 కానుకలు వచ్చాయి.

అదే సమయంలో త్రిపురలోని మేలాఘర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు పర్యావరణహిత దీపావళి కోసం మట్టి దీపాలను తయారు చేశారు. ఢిల్లీలోని దీప్ మహోత్సవ్, స్వచ్ఛ ఉత్సవ్, ఓటర్ ఉత్సవ్ కార్యక్రమాలు వేడుకలను వ్యర్థ రహిత అనుభవంగా మార్చవచ్చని చాటాయి. వస్త్ర ముక్కల వ్యర్థాలతో తిరిగి ఉపయోగించగల అలంకరణ పట్టీలు తయారు చేశారు. పారేసిన అట్టముక్కలు సెల్ఫీ ఫ్రేములుగా మారాయి. పాత ఐస్‌క్రీమ్ పుల్లలతో వేలాడే అలంకరణలు రూపొందించారు. మరింత సుస్థిర ప్రత్యామ్నాయాన్ని అందిస్తూనే సుపరిచిత సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు.

దీపాలు ఆరిపోయిన తర్వాత
గువాహటిలో దీపాలు వెలిగించిన తర్వాత కూడా పర్యావరణహిత ప్రయత్నం కొనసాగింది. సంప్రదాయ దీపావళి వేడుకల్లో ఉపయోగించిన అరటి ఆకులను సేకరించి ఏనుగులకు ఆహారంగా పంపించారు.

రాజస్థాన్‌లోని ఝాల్రాపటన్‌లో నిర్మాల్య వాహనాలు ఆలయాల నుంచి పూలదండలు, ఇతర పూజా సామగ్రిని సేకరిస్తాయి. వాటిని తర్వాత కంపోస్టుగా మారుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పండుగ ముగిసిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకే ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభమైంది. ‘క్లీన్ అప్ టు క్లీన్ ఎయిర్’ కార్యక్రమం కింద ‘స్వచ్ఛతా సే స్వచ్ఛ వాయు కీ ఔర్’ అనే సందేశంతో స్ప్రింక్లర్ వాహనాల ద్వారా చెట్లు, మొక్కలకు నీరు అందించారు.

ప్రార్థనలో నది భాగమైన వేళ
ప్రకృతితో భారత్‌కు ఉన్న బలమైన అనుబంధాన్ని ఛఠ్ పూజ ప్రతిబింబిస్తుంది. భక్తులు నీటిలో నిలబడి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేస్తారు. గంగ వంటి పవిత్ర నదుల తీరాల్లో ఈ పూజలు ఎక్కువగా జరుగుతాయి. దీంతో ఘాట్ కేవలం వేడుక జరిగే ప్రదేశంగా కాకుండా ఆచారంలో అంతర్భాగంగా నిలుస్తుంది.

బిహార్‌లోని పట్నాలో గుర్తించిన ఘాట్ల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వ్యర్థ రహిత ఛఠ్ పూజను నిర్వహిస్తోంది. వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేస్తోంది. వేడుకల సమయంలో వచ్చే వ్యర్థాలను ప్రత్యేక వాహనాలు సేకరిస్తాయి. తడి వ్యర్థాలను సేంద్రియ కంపోస్టుగా మారుస్తారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పండుగ వాతావరణాన్ని కాపాడేలా భక్తులు, స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు పూజకు నెల రోజుల ముందు నుంచే విస్తృత సమాచార, విద్య, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

పండుగ పవిత్రతకు అది జరిగే ప్రదేశాల పరిశుభ్రతతో సన్నిహిత సంబంధం ఉందనే భావనను ఈ విధానం గుర్తిస్తోంది. నది ఆరాధనలో భాగమైనప్పుడు దాని తీరాలను కాపాడటం కూడా భక్తికి ప్రతీకగా మారుతుంది.

మంచి మార్పును మిగిల్చే వేడుక
ప్రార్థనలు, దీపాల వెలుగులు, సంగీతం, కలిసికట్టుగా వేడుక చేసుకునే ప్రజలతో పండుగ జ్ఞాపకంగా నిలుస్తుంది. అయితే, ప్రతి వేడుక తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది. శుభ్రం చేయాల్సిన వీధి, ఘాట్ వద్ద పూలు, నీటిలో విగ్రహం, జనం వెళ్లిపోయిన తర్వాత మిగిలే అలంకరణలు అందులో ఉంటాయి. ఇప్పుడు పండుగలు మరింత మేలును కూడా మిగిల్చగలవు. పరిశుభ్రమైన ఘాట్, పునర్వినియోగ అలంకరణ, మట్టి విగ్రహం, కొత్త మొక్క, జీవనోపాధి లేదా మరింత బాధ్యతతో పండుగ చేసుకోవడం నేర్చుకున్న సమాజం రూపంలో ఆ మేలు కనిపించవచ్చు.

పర్యావరణహితంగా మారేందుకు భారత్ పండుగలు తమ రంగులను కోల్పోవాల్సిన అవసరం లేదు. దీపం వెలుగుతూనే ఉంటుంది. వాయిద్యాల ధ్వని వినిపిస్తూనే ఉంటుంది. ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వేడుక ముగిసిన తర్వాత మనం ఏం మిగులుస్తామన్నదే మారాలి. పండుగ ఆనందం ప్రజల మనసుల్లో నిలిచి, దాని భారం భూమిపై మిగలకపోతేనే ఆ వేడుక సంపూర్ణమవుతుంది.

***

(Features ID: 160229) आगंतुक पटल : 11
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Kannada , Malayalam