• Sitemap
  • Advance Search
Rural Prosperity

మందుల చీటీకి మించిన సంరక్షణ

జీవితంలోని ప్రతి దశకూ అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు

Posted On: 16 SEP 2026 7:05PM

‘ఒక చిన్నారిని పెంచేందుకు ఊరంతా తోడుండాలి’ అని ఓ పాత సామెత చెబుతుంది. అయితే, ఆ ఖర్చును ఎవరు భరిస్తారో మాత్రం ఆ సామెత‌ చెప్పదు! ఒక క్రమబద్ధమైన జీవన విధానం, నిర్దిష్ట ఖర్చులతో సాగుతున్న చిన్న కుటుంబంలోకి కొత్త ప్రాణం అడుగుపెట్టగానే జీవితం కొత్త పద్ధతిలో సాగుతుంది. నిద్రలేని రాత్రులు, శిశువుల డైపర్లు, వైప్స్‌, వైద్యుల సందర్శనలు, మందులు... నవజాత శిశువుపై ప్రేమ, సంరక్షణకు సంబంధించి లెక్కలేనన్ని చిన్న నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో, బాధ్యతలు, ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కుటుంబంలోకి చిన్నారి వచ్చినప్పుడు శిశు సంరక్షణ నుంచి ప్రసవానంతర సంరక్షణ వరకు ఆరోగ్య ఉత్పత్తులు తప్పనిసరి అవసరాలుగా మారతాయి.

మందులు కుటుంబ ఖర్చుల్లో ముఖ్య భాగమే అయినా, నవజాత శిశువు ఉన్న కుటుంబాలకు అదొక్కటే వ్యయం కాదు. శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న వ్యక్తి లేదా వృద్ధ తల్లిదండ్రులు, ఇతర ఆధారితులు ఉన్న కుటుంబాలకూ అనేక అవసరాలు ఉంటాయి. మందులకు మించి అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ అందించాలన్న విస్తృత లక్ష్యంతో ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పరిధిని క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 20,000కు పైగా జన్ఔషధి కేంద్రాల వ్య‌వ‌స్థ‌ ద్వారా కుటుంబాలకు ఇంటికి సమీపంలోనే అందుబాటు ధరల్లో విస్తృత శ్రేణి శస్త్రచికిత్స, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు లభిస్తున్నాయి.

 



యువ కుటుంబంలోకి చిన్నారి రావటంతో రోజువారీ అవసరాలు కొత్తగా మొదలవుతాయి. జన్ఔషధి కేంద్రాల్లో లభించే శిశు సంరక్షణ ఉత్పత్తుల శ్రేణి ‘జన్ఔషధి బచ్‌పన్‌’ ద్వారా కుటుంబాలు అవసరమైన వస్తువులను అందుబాటు ధరల్లో పొందవచ్చు. వివిధ పరిమాణాల్లో శిశు డైపర్లు, వైప్స్‌ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు, 20 వైప్స్‌ ప్యాక్ ధర ₹45. తరచూ ఉపయోగించే ప్రధాన శిశు సంరక్షణ వస్తువుల్లో ఇది తక్కువ ధరకు లభించే ఎంపిక. జన్ఔషధి ఉత్పత్తుల జాబితాలో 250 మిల్లీలీటర్ల బేబీ ఫీడింగ్ బాటిల్, మాన్యువ‌ల్‌ బ్రెస్ట్ పంప్, హాట్ వాట‌ర్ బ్యాగ్‌, శిశువుకు ఆహారం అందించే ఫీడింగ్ ట్యూబ్‌ వంటి వస్తువులు కూడా ఉన్నాయి.

ఈ సంరక్షణ ప్రయాణంలో తల్లికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ప్రసవం తర్వాత కోలుకునేందుకు తగిన విశ్రాంతి, సహకారం, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రసవానంతర సంరక్షణకు తోడ్పడే అబ్‌డామిన‌ల్ బెల్ట్‌లు జన్ఔషధి నెట్‌వర్క్‌లో లభిస్తున్నాయి. ₹525 ధరకు అందించే స‌ర్వైక‌ల్ దిండ్లు సౌకర్యం, ఆధారం కల్పిస్తాయి. గర్భధారణ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఇవి ఉపయోగపడతాయి.

ఎదుగుతున్న చిన్నారి అవసరాలు నవజాత శిశువు అవసరాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఇంట్లోనే సహాయక పరికరాలు అవసరమవుతాయి. అందువల్ల తక్కువ ధరల్లో ఆరోగ్య సంరక్షణ పరికరాలు కుటుంబాలకు అందటం ఎంతో ముఖ్యం. జన్ఔషధి కేంద్రాల్లో ఎలక్ట్రికల్ నెబ్యులైజర్ యంత్రం ₹937.50కు, ట్యూబ్‌తో కూడిన పిల్లల నెబ్యులైజర్ మాస్క్ ₹200కు లభిస్తున్నాయి. చికిత్సకే పరిమితం కాకుండా ఆరోగ్య పర్యవేక్షణ, కోలుకునే ప్రక్రియ, రోజువారీ ఆరోగ్య నిర్వహణకు తోడ్పడే ఉత్పత్తులను జనౌషధి కేంద్రాలు విస్తృతంగా అందిస్తున్నాయి.

 



రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా పరిశీలించేందుకు 25 గ్లూకోమీటర్ పరీక్ష పట్టీల ప్యాక్ ₹500కు జన్ఔషధి నెట్‌వర్క్‌లో లభిస్తోంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలిచే పల్స్ ఆక్సీమీటర్లు కూడా అందుబాటులో ఉన్న వైద్య పరికరాల జాబితాలో ఉన్నాయి.

తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల వయసు పెరిగేకొద్దీ వారిని చూసుకునే బాధ్యత కుటుంబ జీవితంలో ప్రధాన భాగంగా మారుతుంది. వృద్ధులు, ఇతరులపై ఆధారపడేవారు లేదా మంచానికే పరిమితమైన వ్యక్తుల విషయంలో పరిశుభ్రత, సౌకర్యం, గౌరవం, రోజువారీ సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఉంటుంది.

కుటుంబ సభ్యుడి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పర్యవేక్షించే వారికి ఈ ఉత్పత్తుల కొనుగోలు తరచూ ఎదురయ్యే ఖర్చుగా మారుతుంది. నిత్యం వాడే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై స్వల్ప ఆదా కూడా నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ కుటుంబానికి గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం పెద్దల డైపర్ల కోసం ప్రత్యేకంగా ‘జన్ఔషధి స్వాభిమాన్‌’ శ్రేణిని ప్రవేశపెట్టింది.

తల్లిదండ్రులుగా మారిన తొలి రోజుల నుంచి బాల్యం వరకు, సాధారణ ఆరోగ్య పర్యవేక్షణ నుంచి వృద్ధ కుటుంబ సభ్యుల సంరక్షణ వరకు కుటుంబ ఆరోగ్య ప్రయాణం నిరంతరం సాగుతుంది. దానితో పాటు ఖర్చులూ కొనసాగుతాయి. శస్త్రచికిత్స ఉత్పత్తులు, రోజువారీ వినియోగ వస్తువులతో కూడిన జనౌషధి ఉత్పత్తుల జాబితా ఈ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జన్ఔషధి నెట్‌వర్క్‌లో మరిన్ని ఆరోగ్య, సహాయక సంరక్షణ ఉత్పత్తులను చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. మోకాలి కదలికలకు తోడ్పడే మోష‌న్‌-నీ బ్రేస్, కూర్చున్న స్థితి నుంచి నిలబడేందుకు సహకరించే వాకర్, మెడిక‌ల్ స్టీమ్ వేపొరైజ‌ర్‌, ఫుల్ ఎలివేట‌ర్ పిల్లో(పాదాలను ఎత్తుగా ఉంచే దిండు), గర్భిణులకు బ్యాక్ స‌పోర్ట్ బెల్ట్‌, స‌ర్వైక‌ల్ కాల‌ర్‌ వంటివి ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. మందులకు మించి అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను విస్తరించటం, అత్యవసర ఆరోగ్య ఉత్పత్తులు, నడక సహాయక పరికరాలు, పునరావాస సాధనాలు, సంరక్షణ వస్తువులను పౌరులందరికీ చేరువ చేయటంపై ప్రభుత్వం కొనసాగిస్తున్న కృషిని ఈ విస్తరణ ప్రతిబింబిస్తోంది.

 

***

(Features ID: 160023) आगंतुक पटल : 7
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Malayalam