Infrastructure
బాధ్యతగా నదుల పరిరక్షణ
నదుల కాపాడటం కోసం ప్రజా ఉద్యమ నిర్మాణం
Posted On:
01 SEP 2026 5:09PM
శతాబ్దాలుగా భారత నాగరికత, సంస్కృతి, దైనందిన జీవితంలో గంగానది అంతర్భాగంగా కొనసాగుతోంది. సమాజాలను పోషించి, జీవనోపాధికి మద్దతు ఇస్తూ తరతరాల సంప్రదాయాలకు స్ఫూర్తినిచ్చింది. అయితే, కాలక్రమంలో పెరుగుతున్న నగరాలు, కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ నదిపై ఒత్తిడిని పెంచాయి. దీంతో గంగానది పర్యావరణ ఆరోగ్యాన్ని, ప్రజలతో దానికి ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టమైంది. గంగానది పునరుజ్జీవనమంటే కేవలం నీటిని శుభ్రపరచడం మాత్రమే కాదు. ఈ విస్తృత అవగాహనతోనే నమామి గంగే కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించారు.
గంగానది, దాని ఉపనదుల కోసం రూపొందించిన సమీకృత పరిరక్షణ కార్యక్రమం ఇది. కాలుష్య నియంత్రణ, పరిరక్షణ, నదుల పునరుజ్జీవనాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. మురుగునీటి శుద్ధి, నదీ తీరాల అభివృద్ధి, అడవుల పెంపకం తదితర రంగాలకు నమామి గంగే కార్యకలాపాలు విస్తరించాయి. శాస్త్రీయ పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన ఈ సమీకృత ప్రయత్నాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. అయితే, శాశ్వత పరివర్తనకు ఏ కార్యక్రమమూ విస్మరించలేని భాగస్వామి అవసరం. ఆ భాగస్వామి పౌరసమాజమే. ఈ విశ్వాసం నుంచి నమామి గంగేలో ప్రజల భాగస్వామ్య స్తంభమైన జన్ గంగ ఆవిర్భవించింది. జన్ భాగీదారి దార్శనికత స్ఫూర్తితో పరిరక్షణలో ప్రజలను కేంద్ర స్థానంలో నిలుపుతుంది. ఇక్కడే నమామి గంగే ప్రజల కథగా మారుతుంది. అవగాహన నుంచి భాగస్వామ్యం వైపు, చివరకు బాధ్యతను స్వీకరించే దిశగా సాగే కథ ఇది.
నదితో ఏకం: ప్రజాభాగస్వామ్య కథలకు వేడుక
పర్యావరణ చర్యలకు అతీతంగా ప్రజలను అనేక విధాలుగా ఒక దగ్గరకు చేర్చగల శక్తి నదికి ఉంది. ప్రజలు కలుసుకోవడం, పాల్గొనడం, నదితో తమ ఉమ్మడి అనుబంధాన్ని వేడుకగా జరుపుకోవడం కోసం నదీ తీరాలు వేదికలుగా మారతాయి. పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కల పెంపకం, విద్యా కార్యక్రమాల ద్వారా జన్ గంగ ఇలాంటి అవకాశాలను సృష్టిస్తోంది. పరిరక్షణను వ్యక్తిగత బాధ్యతకు పరిమితం చేయకుండా సమష్టి అనుభవంగా ఈ కార్యకలాపాలు మారుస్తున్నాయి.
నమామి గంగే కింద ప్రజల భాగస్వామ్యానికి అత్యంత స్పష్టమైన రూపాల్లో నదుల పరిశుభ్రత ఒకటి. ఈ సందేశాన్ని విస్తరించే కీలక వేదికగా గంగా స్వచ్ఛత పక్షోత్సవం అవతరించింది. ప్రతి సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు నిర్వహించే ఈ పక్షం రోజుల కార్యక్రమం ప్రధాన గంగా పరీవాహక ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లో వేలాది మందికి చేరువవుతోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంతోపాటు గంగానది ఉపనదుల వెంట ఉన్న పట్టణాలను కూడా ఇది కవర్ చేస్తుంది. నదుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు, సామాజిక బృందాలు, ఇతర భాగస్వాములు సమన్వయంతో కృషి చేస్తున్నారు.


ఢిల్లీలోని యమునా నది వెంట ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాలు ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నాయి. నదీ ప్రాంతాలు, పరిసరాల పరిశుభ్రతకు ఈ కార్యక్రమాలు ప్రత్యక్షంగా తోడ్పడుతున్నాయి. నిర్దేశిత సందర్భాలకే పరిమితమైన కార్యక్రమంగా కాకుండా నదుల పరిరక్షణను సాధారణ పౌర బాధ్యతగా మార్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు సమష్టిగా సహాయపడుతున్నాయి.
నదీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సమాజాలు శ్రద్ధ చూపుతున్న కొద్దీ నదీ తీరాలపైనా దృష్టి విస్తరిస్తోంది. ఫలితంగా నమామి గంగే కింద ప్రజల భాగస్వామ్యంలో మొక్కల పెంపకం అంతర్భాగంగా మారింది. ఆరోగ్యకరమైన వృక్షసంపద నదీ తీరాలను స్థిరంగా ఉంచి, నేల కోతను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ పర్యావరణ ప్రయోజనాలు నదులు, పరిసర ఆవాసాల దృఢత్వాన్ని పెంచుతాయి.
దీనికి అనుబంధంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం మొక్కల పెంపకంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. తల్లులకు హృదయపూర్వక నివాళిగా మొక్కలు నాటాలని ఈ కార్యక్రమం ప్రజలను ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగత భావోద్వేగాన్ని పర్యావరణ పరిరక్షణపై ఉమ్మడి బాధ్యతతో అనుసంధానిస్తుంది. ఈ బలమైన అనుబంధం వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు కొత్త లక్ష్యంతో పాల్గొనేలా ప్రోత్సహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రజలను ఏకం చేసే తీరులోనూ ఈ స్ఫూర్తి ప్రతిబింబిస్తోంది. మొక్కల పెంపకం, అవగాహన కార్యక్రమాలు, సామాజిక చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ఈ సందర్భం మరింత బలోపేతం చేస్తోంది.
ఒక ఉద్యమ విలువలు తర్వాతి తరానికి చేరినప్పుడు అది మరింత బలపడుతుంది. అందువల్ల యువత భాగస్వామ్యానికి జన్ గంగలో కీలక స్థానం ఉంది. పర్యావరణ అభ్యాసం, సృజనాత్మక వ్యక్తీకరణకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం విభిన్న అవకాశాలను అందిస్తున్నాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, పోస్టర్లు, చర్చలు, పరస్పర అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు నదులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తున్నారు.

తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ ప్రపంచ పర్యావరణ సవాళ్లతో అనుసంధానించేందుకు అనుభవపూర్వక కార్యకలాపాలు అవకాశం కల్పిస్తున్నాయి. ఉపన్యాసాలు, క్షేత్ర సందర్శనలు, స్వచ్ఛంద సేవ, ప్రజా సంబంధాల కార్యక్రమాల ద్వారా విశ్వవిద్యాలయ గంగా క్లబ్‌లు ఈ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నాయి. ఎకో క్లబ్‌లు, ఎన్‌సీసీ విభాగాలు, విద్యాసంస్థలు నిరంతర భాగస్వామ్యానికి అదనపు వేదికలను అందిస్తున్నాయి. పుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా నదుల పరిరక్షణకు నిబద్ధత చూపే పరిజ్ఞానం కలిగిన యువ పౌరులను ఈ ప్రయత్నాలు సమష్టిగా తీర్చిదిద్దుతున్నాయి.

నమామి గంగే కార్యక్రమం నదుల పరిరక్షణను అనేక వార్షిక కార్యక్రమాల్లో భాగం చేసింది. ఏడాది పొడవునా ప్రజలను నదులతో అనుసంధానంగా ఉంచేందుకు ఈ సందర్భాలు తోడ్పడుతున్నాయి. వీటిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రధాన వేదికగా గంగా ఉత్సవ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. గంగానదికి భారత జాతీయ నది గుర్తింపు లభించిన సందర్భాన్ని ఇది స్మరించుకుంటుంది. ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, కళా పోటీలు, ప్రజా చర్చలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాగస్వామ్యం, ఉమ్మడి వ్యక్తీకరణకు అవకాశాలను సృష్టిస్తుంది. స్వచ్ఛతా హీ సేవ, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి ఇతర సందర్భాలు కూడా ప్రజల భాగస్వామ్య అవకాశాలను మరింత విస్తరిస్తున్నాయి. ప్రజలు, నదుల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక అనుబంధాన్ని అవి పునరుద్ఘాటిస్తున్నాయి.

కేవలం అవగాహన కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారానే నదులతో మరింత లోతైన అనుబంధం ఏర్పడుతుంది. నదుల పరిరక్షణ స్ఫూర్తిని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చేందుకు నమామి గంగే వినూత్న కార్యక్రమాలను రూపొందించింది. గంగానది వెంట సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళల రివర్ రాఫ్టింగ్ యాత్ర దీనికి ప్రముఖ ఉదాహరణ. నది ఎగువ ప్రాంతాల నుంచి సముద్రం వరకు సాగిన ఈ యాత్ర సాహసం, సహకారం, పర్యావరణ నిబద్ధతను చాటింది. గంగానది కేవలం సహజ వనరు కాదనే సందేశాన్ని అందించింది. విద్యార్థులు, స్థానికులు, యువ స్వచ్ఛంద కార్యకర్తలతో జరిగిన సంభాషణలు భావాల మార్పిడికి వేదికలను సృష్టించాయి.


గంగా పరీవాహక ప్రాంతమంతటా గంగా ప్రహరీలు క్షేత్రస్థాయి పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే నిబద్ధత కలిగిన సామాజిక స్వచ్ఛంద కార్యకర్తలుగా అవతరించారు. పర్యావరణ అవగాహనను విస్తరించడం, బాధ్యతాయుత పద్ధతులను ప్రోత్సహించడం, స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు. గంగా సేవా దూతలు పాఠశాలలు, సంస్థలు, నివాస ప్రాంతాల్లో ప్రజా సంబంధాలను విస్తరించడం ద్వారా ఈ ప్రయత్నాలకు అనుబంధంగా నిలుస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు, స్థానిక చర్యల ద్వారా నదుల పరిరక్షణను రోజువారీ సామాజిక జీవితానికి మరింత చేరువ చేస్తున్నారు. జలచరాల రక్షణ, ఆవాసాల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణ ప్రజలకు నదితో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. పౌరుల నేతృత్వంలోని చర్యల ద్వారా జన్ భాగీదారి స్ఫూర్తిని ఈ స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌లు సమష్టిగా ప్రతిబింబిస్తున్నాయి. అవగాహన కలిగిన సమాజాలు నదులు, వాటి పరిసర పర్యావరణ వ్యవస్థలకు శాశ్వత సంరక్షకులుగా ఎలా మారగలవో వారి కృషి చాటుతోంది.



నదుల సంరక్షణ బాధ్యతను జీవన సంస్కృతిగా తీర్చిదిద్దుతూ
నదుల పునరుజ్జీవనం అందించే శాశ్వత వారసత్వం ఆరోగ్యకరమైన నది మాత్రమే కాదు... దానితో మరింత బలమైన అనుబంధాన్ని కూడా అందిస్తుంది. మౌలిక వసతులు నదీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలవు. శాస్త్రీయ చర్యలు పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయగలవు. సాంకేతికత పర్యవేక్షణ, నిర్వహణను మెరుగుపరచగలదు. అయితే, కేవలం ఇంజినీరింగ్‌తో సృష్టించలేని ఒక అంశంపైనే నదుల దీర్ఘకాలిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రతి ప్రయత్నం విస్తృత పరివర్తనకు తోడ్పడుతుందని జన్ గంగ ద్వారా నమామి గంగే కార్యక్రమం చాటింది. ఇది పర్యావరణ కార్యక్రమాన్ని మించిన ప్రజా ఉద్యమం. జన్ భాగీదారి దార్శనికత మార్గదర్శకత్వంలో సమష్టి కార్యాచరణ సుస్థిర అభివృద్ధికి ఎలా పునాదిగా మారగలదో ఇది తెలియజేస్తోంది.
References
Ministry of Jal Shakti
https://www.jalshakti-dowr.gov.in/offerings/schemes-and-services/details/namami-gange-AO5ATNtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2109118®=48&lang=2
Ministry of Culture
https://amritkaal.nic.in/event-campaign-detail?98
Click here to see PDF
***
(Features ID: 159852)
आगंतुक पटल : 2
Provide suggestions / comments