Infrastructure
జల్ సంచయ్ జన్ భాగీదారి: క్షేత్రస్థాయి ప్రయత్నాలతో నీటి భద్రత
Posted On:
03 SEP 2026 3:14PM
శతాబ్దాలుగా భారత్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలు స్థానిక అవసరాలకు అనుగుణంగా నీటిని సేకరించడం, నిల్వ చేయడం, పంచుకోవడం వంటి పద్ధతులను అభివృద్ధి చేశారు. దిగుడు బావులు, చెరువులు, కుంటలు, జోహడ్‌లు, సంప్రదాయ సాగునీటి వ్యవస్థలు ఒక సరళమైన అవగాహనకు ప్రతీకలుగా నిలిచాయి: నీటి భద్రత సమష్టి బాధ్యత.
జనాభా పెరుగుదల, వ్యవసాయ విస్తరణ, వేగవంతమైన పట్టణీకరణతో నీటి నిర్వహణ మరింత సంక్లిష్టంగా మారింది. కొత్త సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు, సంస్థాగత యంత్రాంగాలు అవసరమయ్యాయి. అయినప్పటికీ సుస్థిర జల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే కీలకంగా కొనసాగుతోంది.
సమష్టి కార్యాచరణ సంప్రదాయానికి జల సంచయ్ జన్ భాగీదారి (జేఎస్‌జేబీ) కొత్త రూపాన్నిచ్చింది. 2024 సెప్టెంబర్ 6న ప్రారంభించిన ఈ కార్యక్రమం జల సంరక్షణలో సామాజిక భాగస్వామ్యం, ప్రజల బాధ్యతను కేంద్రంగా నిలిపింది. తక్కువ వ్యయంతో భూగర్భ జలాల రీఛార్జ్, నీటి నిల్వ నిర్మాణాల ఏర్పాటు, నిరుపయోగంగా మారిన బోరుబావుల పునరుద్ధరణపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది. సంపూర్ణ ప్రభుత్వ భాగస్వామ్యం, సంపూర్ణ సామాజిక భాగస్వామ్య విధానంతో శాస్త్రీయంగా రూపొందించిన, స్థానిక అవసరాలకు అనువైన పరిష్కారాలను కూడా ప్రోత్సహిస్తోంది. సమాజం(కమ్యూనిటీ), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్), వ్యయం(కాస్ట్) అనే 3సీల మార్గదర్శకత్వంలో జేఎస్‌జేబీ అమలవుతోంది.
ఈ విధానాన్ని కొనసాగిస్తూ, వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు జేఎస్‌జేబీ 1.0 కింద 2025 మే నాటికి దేశవ్యాప్తంగా 27 లక్షలకు పైగా నిర్మాణాలు ఏర్పాటు చేశారు. 2025 జూన్‌లో ప్రారంభించిన జేఎస్‌జేబీ 2.0 కింద 2026 మే నాటికి 1.5 కోట్లకు పైగా భూగర్భ జల పునర్భరణ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. 2026 జూన్‌లో జల సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమ పరిధిని విస్తరించారు. జలశక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌ఏ: సీటీఆర్) ప్రచారంతో జేఎస్‌జేబీని అనుసంధానించి, జల సంచయ్ జన్ భాగీదారి: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌జేబీ: సీటీఆర్)గా అమల్లోకి తీసుకొచ్చారు. 2026 సెప్టెంబర్ 3 నాటికి 1.58 కోట్లకు పైగా కృత్రిమ భూగర్భ జల పునర్భరణ నిర్మాణాలు ఏర్పాటయ్యాయి.
జల సంరక్షణ, సహకారంపై జాతీయ స్థాయి దృష్టి
జలశక్తి మంత్రిత్వ శాఖ విభాగ స్థాయి సదస్సు 2026 సెప్టెంబర్ 1–2 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న విభాగ స్థాయి సదస్సుల పరంపరలో ఇది మొదటిది. జల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తాగునీటి వ్యవస్థల మూలాల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ నీటి సరఫరాతోపాటు జల సంచయ్ జన్ భాగీదారి: క్యాచ్ ది రెయిన్ ఈ సదస్సులోని నాలుగు ప్రధాన ఇతివృత్తాల్లో ఒకటిగా నిలిచింది.

జన్ భాగీదారి(ప్రజల భాగస్వామ్యాన్ని) ప్రస్తావిస్తూ.. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ‘జల ఉత్సవ్’ను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జల నిర్వహణ, పాలనపై విజ్ఞానం, సామర్థ్యాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆచరణాత్మకంగా నేర్చుకోవడం, విజయవంతమైన కార్యక్రమాలను ఇతర ప్రాంతాల్లో అమలు చేయడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో క్రమబద్ధమైన అంతర్రాష్ట్ర అధ్యయన పర్యటనలు నిర్వహించాలని సూచించారు. జల రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒకచోట చేర్చి, క్రమపద్ధతిలో నిర్వహించి, విశ్లేషించి, సమర్థంగా వినియోగించే పటిష్ఠమైన జల సమాచార పాలన అవసరమని కూడా పేర్కొన్నారు.
జల పాలనలోని కీలక అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. జల భద్రత గల భారత్, వికసిత భారత్–2047 దార్శనికతను సాకారం చేసే దిశగా ఈ సదస్సు ఒక ముందడుగుగా నిలిచింది.
దేశవ్యాప్తంగా సమాజాలు, సంస్థలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జల సంరక్షణ చర్యలను చేపడుతూ ఈ సూత్రాలను క్షేత్రస్థాయి కార్యాచరణగా మారుస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్: నీటి కోసం భూమిని కేటాయించిన రైతులు
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో రైతులు తమ వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని జల సంరక్షణకు కేటాయించారు. ఆవా పానీ ఝోకీ ఉద్యమం కింద రైతులు స్వచ్ఛందంగా తమ వ్యవసాయ భూమిలో 5 శాతాన్ని రీఛార్జ్ అయ్యే కుంటలు, మెట్ల ఆకృతిలోని గుంతల కోసం కేటాయించారు. సుస్థిర జల నిర్వహణకు భారీ స్థాయి నిర్వాసనం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం లేదని ఈ నమూనా చాటుతోంది. సమష్టి సంకల్పమే ఇందుకు అవసరం.
1,260 మందికి పైగా రైతులు ఈ నమూనాను అనుసరించగా, జిల్లావ్యాప్తంగా 2,000కు పైగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. అనేక గ్రామాల్లో భూగర్భ జలమట్టం 3 నుంచి 4 మీటర్ల మేర పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోని 17 గిరిజన ఆవాసాల్లో నీటి ఊటలు తిరిగి జీవం పోసుకున్నాయి. సూక్ష్మ వాటర్‌షెడ్ ప్రాంతాల మ్యాపింగ్, భూజల శాస్త్ర అంచనాలు, సాంకేతిక మార్గదర్శకత్వం ద్వారా ప్రభుత్వం ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చింది. కార్యక్రమంలో రైతుల బాధ్యతే ప్రధానంగా కొనసాగింది.

కొరియా జిల్లా, ఛత్తీస్‌గఢ్
ఆంధ్రప్రదేశ్: తమ నీటి బాధ్యతను స్వీకరించిన గ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మురుగుమ్మి, మారెళ్ల, తంగెళ్ల వంటి గ్రామాలు గతంలో అనిశ్చిత వర్షపాతం, క్షీణిస్తున్న భూగర్భ జలమట్టాలు, పనిచేయని బోరుబావుల సమస్యలను ఎదుర్కొన్నాయి. ఈ సవాళ్లు వ్యవసాయం, జీవనోపాధిపై ప్రభావం చూపాయి.

జేఎస్‌జేబీ కార్యక్రమం కింద స్థానిక స్థాయిలోనే పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. అవగాహన పెంచేందుకు గ్రామసభలు, ఇంటింటి ప్రచారాలు, కళాజాతలు(సంప్రదాయ జానపద నాటక ప్రదర్శనలు), కార్యశాలలు నిర్వహించారు. నీటి బడ్జెట్, పంటల ప్రణాళిక, భూగర్భ జలాల పంపిణీ వంటి చర్యలను రూపొందించేందుకు రైతులు, మహిళలు, యువత, స్థానిక సంస్థలను ఈ ప్రయత్నాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి.

ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
గ్రామాలు కొండ శిఖరం నుంచి లోయ వరకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ వర్షపు నీటి సేకరణ, నిల్వ, రీఛార్జ్ చర్యలు చేపట్టాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి లోయల వైపు ప్రవహించే వర్షపు నీటిని క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా దిగువ ప్రాంతాల్లో నేల, నీటి సంరక్షణను బలోపేతం చేయడమే ఈ విధానం.
మురుగుమ్మిలో 71 జల సంరక్షణ నిర్మాణాలు దాదాపు 8.11 లక్షల ఘనపు మీటర్ల ఉమ్మడి నిల్వ సామర్థ్యాన్ని కల్పించాయి. ఇవి 264.5 హెక్టార్ల వ్యవసాయ భూమికి రక్షిత సాగునీటిని అందిస్తున్నాయి.
మారెళ్లలో 53 నిర్మాణాలు దాదాపు 10.04 లక్షల ఘనపు మీటర్ల ఉమ్మడి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికి అదనంగా సామూహిక కుంటలు, చెరువుల పునరుద్ధరణ ద్వారా దాదాపు 5.95 లక్షల ఘనపు మీటర్ల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.
తంగెళ్లలో 71 నిర్మాణాలు దాదాపు 5.89 లక్షల ఘనపు మీటర్ల ఉమ్మడి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణతో నిల్వ సామర్థ్యం మరో 3.98 లక్షల ఘనపు మీటర్ల మేర పెరిగింది.
ఈ ప్రయత్నాలన్నీ కలిపి దాదాపు 5,900 మందికి భూగర్భ జలాల లభ్యతను మెరుగుపరిచాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఆధారిత జీవనోపాధులను బలోపేతం చేయడంతోపాటు నేలలో తేమను పునరుద్ధరించి, వలసల ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడ్డాయి.
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఒడిశా: భవనాల పైకప్పులు, చెరువుల నుంచి భూగర్భ జలాశయాల వరకు
ఒడిశాలో జేఎస్‌జేబీ కార్యక్రమం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. వర్షపు నీరు పడిన చోటే సేకరించి, భూగర్భ జలాశయాల్లోకి చేరేలా చర్యలు చేపడుతున్నారు. ఛాటా పథకం ద్వారా భవనాల పైకప్పుల నుంచి వర్షపు నీటిని సేకరిస్తుండగా, అరువా పథకం ద్వారా జల వనరుల నుంచి భూగర్భ జలాశయాల్లోకి నీరు చేరేలా చేస్తున్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, స్థానిక జల వనరులు, ప్రజల భాగస్వామ్యాన్ని ఈ చర్యలు అనుసంధానిస్తూ భూగర్భ జల సంరక్షణ, జల భద్రతను బలోపేతం చేస్తున్నాయి.
జాజ్‌పూర్ జిల్లాలో 2022–23 నుంచి 2025–26 మధ్య అరువా పథకం కింద 117 పునర్భరణ షాఫ్టులు, ఛాటా పథకం కింద 114 పైకప్పు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంస్థలు, విద్యా ప్రాంగణాల్లో చేపట్టిన ఈ పనులు కొరై, బింఝార్‌పూర్, బరి, రసూల్‌పూర్, దశరథ్‌పూర్, జాజ్‌పూర్ వంటి అత్యంత ప్రాధాన్య బ్లాకులకు విస్తరించాయి. ఈ ప్రయత్నం స్థిరమైన నీటి సరఫరా, వ్యవసాయ రంగంలో ఆటుపోట్లను తట్టుకునే మెరుగైన సామర్థ్యానికి తోడ్పడింది. ముఖ్యంగా మహిళలు నీటి సేకరణ కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించింది.
ఈ విధానం జాజ్‌పూర్‌కే పరిమితం కాలేదు.
కటక్ జిల్లాలో ఛాటా పథకం కింద ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా సదుపాయాల వద్ద 57 పైకప్పు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. లోతైన భూగర్భ జలాశయాల్లో నీటి పునర్భరణకు వీలుగా అరువా పథకం కింద చెరువులు, ఇతర జల వనరుల్లో 35 రీఛార్జ్ షాఫ్టులను నిర్మించారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, పంచాయతీరాజ్ సంస్థల భాగస్వామ్యంతో వీధి నాటకాలు, సదస్సులు, కార్యశాలలు నిర్వహించి ఈ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారు.
అదే విధంగా గంజాం జిల్లాలోని దిగపహండి ప్రాంతంలో 2020 నుంచి 2022 మధ్య భూగర్భ జలమట్టాలు 1 నుంచి 3 మీటర్ల మేర క్షీణించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోని పైకప్పు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు ఆ నీటిని పునర్భరణ బోరుబావుల్లోకి మళ్లిస్తున్నాయి. ఈ చర్యలు చేపట్టిన ప్రాంతాల చుట్టుపక్కల రుతుపవనాల అనంతరం భూగర్భ జలమట్టాల పునరుద్ధరణ మెరుగ్గా ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.

దిగపహండి, గంజాం జిల్లా, ఒడిశా
జల భద్రత కోసం విస్తరిస్తున్న ప్రజా ఉద్యమం
ప్రభుత్వ విధానం జల సంరక్షణ నిర్మాణాల ఏర్పాటుకే పరిమితం కాదు. నీటి పట్ల బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించడం కూడా దీని లక్ష్యం. జల నిర్వహణలో జన్ భాగీదారి—ప్రజల భాగస్వామ్యాన్ని జేఎస్‌జేబీ కేంద్రంగా నిలుపుతోంది. స్థానిక అవసరాలకు అనువైన పరిష్కారాల కోసం సమాజాలు, పంచాయతీలు, సంస్థలు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. సంప్రదాయ పరిజ్ఞానాన్ని శాస్త్రీయ ప్రణాళికతో, స్థానిక బాధ్యతను సంస్థాగత మద్దతుతో, వ్యక్తిగత చర్యను సమష్టి ఫలితాలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమ విస్తృత ప్రాధాన్యం ఉంది. సంరక్షించిన ప్రతి నీటి బొట్టు పటిష్ఠ సమాజాల నిర్మాణం, భారత్ దీర్ఘకాలిక జల భద్రతను బలోపేతం చేసే మహత్తర ప్రయత్నంలో భాగమవుతోంది.
References
Prime Minister’s Office
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2052494®=3&lang=2#:~:text=To%20further%20the%20Prime%20Minister's,whole%2Dof%2Dgovernment%20approach®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2306122®=48&lang=1
Ministry of Jal Shakti
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271660&lang=1®=48
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250425®=48&lang=2
https://jsjb.mowr.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235468®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292604®=48&lang=1
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286237®=22&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=152136®=3&lang=2
Click to see pdf
***
(Features ID: 159847)
आगंतुक पटल : 54
Provide suggestions / comments