Farmer's Welfare

సూక్ష్మ ఆహార శుద్ధి బజార్‌లో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల వేడుక

Posted On: 26 AUG 2026 11:43AM

భారతదేశ‌ రుచులకు కొత్త అవకాశాలు
 


ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో భారత పాక వైవిధ్యాన్ని ప్రతిబింబించే జాతీయ ప్రదర్శన సందర్శకులకు స్వాగతం పలికింది. ప్రత్యేక, స్థానిక, సంప్రదాయ ఆహార పదార్థాలతో కొలువుదీరిన స్టాళ్లు అట్టడుగు స్థాయి ఔత్సాహికత, ప్రాంతీయ వారసత్వానికి సంబంధించిన కథలను కళ్లకు కట్టాయి.

ఈ ఉత్సాహభరిత వాతావరణంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 24–25 తేదీల్లో పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్ధీకరణ) బజార్‌ను నిర్వహించింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రదర్శనకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన బజార్‌ భారత పాక వైవిధ్యానికి వేడుకగా నిలిచింది. సూక్ష్మ ఆహార సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదిక కల్పించింది. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల నుంచి ఊరగాయలు, అల్పాహార పదార్థాలు, పానీయాలు, విలువ జోడించిన ఇతర ఆహారాల వరకు ఎన్నో ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. స్థానిక పదార్థాలు, సంప్రదాయ పరిజ్ఞానాన్ని విస్తృత మార్కెట్ అవకాశాలు కలిగిన ఆశాజనక బ్రాండ్లుగా ఎలా తీర్చిదిద్దవచ్చో బజార్‌ చాటిచెప్పింది. 2020 జూన్ 29న ప్రారంభమైన పీఎంఎఫ్‌ఎంఈ పథకం ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సహాయం ద్వారా సూక్ష్మ ఆహార సంస్థలకు మద్దతు ఇస్తోంది. కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న యూనిట్లను బలోపేతం చేసుకోవడానికి ఔత్సాహికులకు తోడ్పడుతోంది.

 

1



భారత సూక్ష్మ ఆహార శుద్ధి రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న విస్తృత పరివర్తనలో ఫరాజ్ కథ కూడా ఒక భాగం. పీఎంఎఫ్‌ఎంఈ బజార్‌లోని ఎస్‌హెచ్‌హెచ్ఈ ఫుడ్స్ స్టాల్‌ వద్ద సందర్శకులు ఆగి ఉత్పత్తులను పరిశీలిస్తుండగా ఫరాజ్ గమనించారు. ఆ సమయంలో ఆయన బృందం బిహార్ నుంచి మొదలైన తమ ప్రయాణాన్ని గర్వంగా వివరిస్తోంది. ఫరాజ్‌కు అది కేవలం మార్కెట్‌లో చోటుచేసుకున్న సందర్భం కాదు. తమ చిన్న సంస్థ ఎంత దూరం ప్రయాణించిందో గుర్తుచేసిన క్షణం.

2



బిహార్‌ ప్రజలు ఎంతో ఇష్టపడే మఖానాకు ఆధునిక గుర్తింపు ఇవ్వాలనే సాధారణ ఆలోచనతో ఎస్‌హెచ్‌హెచ్ఈ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో ఆవిర్భవించింది. మఖానా మిశ్రమంతో తయారుచేసిన కుకీలు, సులభంగా తినేందుకు రూపొందించిన చిన్న మఖానా ప్యాకెట్లతో సహా విలువ జోడించిన ఉత్పత్తులపై బృందం ప్రయోగాలు ప్రారంభించింది. 2021లో పీఎంఎఫ్‌ఎంఈ పథకంతో అనుసంధానం సంస్థకు గణనీయ ప్రోత్సాహాన్ని అందించింది. సంస్థకు ప్రచారం పెరగడంతోపాటు బ్రాండ్ నిర్మాణానికి మద్దతు లభించి, కొత్త వ్యాపార అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. వినియోగదారులు, వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేందుకు పీఎంఎఫ్‌ఎంఈ బజార్‌ కూడా విలువైన వనరుగా మారుతోంది.

 

3



ఈ పథకం ప్రభావం మరింత విస్తరించి, ఎస్‌హెచ్‌హెచ్ఈ ఫుడ్స్‌ తన శుద్ధి యూనిట్‌ను ఆధునీకరించేందుకు తోడ్పడింది. ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా ₹10 లక్షల వరకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం అందించే పీఎంఎఫ్‌ఎంఈ రుణ అనుసంధాన మూలధన రాయితీ కింద సంస్థ తీసుకున్న ₹10 లక్షల రుణంపై ₹3 లక్షలకు పైగా రాయితీ లభించింది. ఈ మద్దతుతో సంస్థ పోటీ సామర్థ్యం పెరిగింది, కార్యకలాపాలు క్రమబద్ధమయ్యాయి, వృద్ధికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన యంత్రాల్లో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఫలితంగా రోజుకు కేవలం 100 కిలోల శుద్ధి స్థాయి నుంచి రోజుకు కనీసం 1,000 కిలోలకు ఉత్పత్తి పెరిగింది. విక్రయాల్లోనూ ఇదే వృద్ధి కనిపించింది. 2021లో ₹2.5–3 లక్షలుగా ఉన్న ఎస్‌హెచ్‌హెచ్ఈ ఫుడ్స్ విక్రయాలు ఇప్పుడు ₹14 కోట్లను దాటాయి. ఫరాజ్‌కు ఈ గణాంకాలు ఆకాంక్ష, సహకారం, వేగంగా సాకారమవుతున్న కలను ప్రతిబింబిస్తున్నాయి. భారత వైవిధ్యభరిత ఆహార రంగంలో పథకం మరింత లోతుగా విస్తరిస్తున్న కొద్దీ, అది చేరిన ప్రతి ప్రాంతంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతోంది.

ఉదయ్‌పూర్‌లో ఈ ప్రభావం సంప్రదాయం, ప్రకృతి, లక్ష్యాల సమ్మేళనంగా కనిపిస్తుంది. గిరిజన విజ్ఞానం, ఆయుర్వేదాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తూ ట్రైబల్‌వేద 2017 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రెండు అంశాల సమ్మేళనం సంస్థ పేరులోనే అందంగా ప్రతిబింబిస్తుంది. ప్రతి నేరేడు పండ్ల సీజన్ ఈ ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. 3,000–5,000 మంది గిరిజన మహిళలు అడవుల్లోకి వెళ్లి పండ్లను సేకరిస్తారు. వాటితో నేరేడు వెనిగర్‌, క్యూబ్స్‌, స్ట్రిప్స్‌ వంటి ప్రత్యేక, నిల్వ పదార్థాలు లేని ఉత్పత్తులను తయారుచేస్తారు. ఈ కార్యక్రమం వారికి ఆదాయాన్ని మించిన ప్రయోజనాలను అందిస్తోంది. ఉపాధిని సృష్టించి, జీవనోపాధిని బలోపేతం చేస్తూ వారి సమాజాలకు కొత్త అవకాశాలను తెరుస్తోంది.

 

4



ఈ ప్రయాణానికి పీఎంఎఫ్‌ఎంఈ మరింత ఊతమిచ్చింది. మెరుగైన యంత్రాలతో కార్యకలాపాలు బలోపేతం కాగా, విస్తృత మార్కెట్ సదుపాయంతో ట్రైబల్‌వేద ఉత్పత్తులు గతంలో ఎన్నడూ చేరని ప్రాంతాలకు చేరుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, సంస్థ సొంత వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ ప్రయాణం భారత సరిహద్దులను దాటి దుబాయ్‌, అమెరికా వినియోగదారులకూ చేరింది. పరిమిత వినియోగదారులతో మొదలైన సంస్థ ఇప్పుడు రాజస్థాన్ అడవులను దాటి విస్తరించింది. సంప్రదాయానికి అవకాశం లభిస్తే రెండూ వికసించగలవు అనే సరళమైన భావనను ముందుకు తీసుకెళ్తోంది.

మహారాష్ట్రకు చెందిన మయూర్ హాండే ప్రయాణం అతి చిన్న ఏర్పాటు, పెద్ద ఆశయంతో మొదలైంది. 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన సోయా రిచ్ సోయా, టోఫూతో ఉత్పత్తులను తయారుచేస్తోంది. సోయాను గ్రైండ్ చేసి పాలు తీసి, వాటిని పులియబెట్టి టోఫూ తయారుచేస్తుంది. పుదీనా, పొగవాసన వంటి భిన్న రుచులను జోడించి కొత్త ఉత్పత్తులను రూపొందిస్తోంది. అయితే, ఆవిష్కరణలకు సరైన యంత్రాలు అవసరం. యంత్రాలకు పెట్టుబడి కావాలి. పీఎంఎఫ్‌ఎంఈలో చేరకముందు నిధుల కొరత నిరంతర అడ్డంకిగా ఉండేది. రుణాల మంజూరులో జాప్యం విస్తరణను మరింత మందగించింది.

5



సోయా రిచ్ 2021లో పీఎంఎఫ్‌ఎంఈ పథకంలో చేరింది. పథకం నుంచి లభించిన సహకారం అనేక అంశాలను ఒకేసారి సమన్వయం చేసేందుకు తోడ్పడింది. ₹20 లక్షల ప్రాజెక్టుకు పథకం కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం మూలధన రాయితీ మద్దతుతో సంస్థ బ్యాంకు రుణం పొందింది. సహాయం యంత్రాలకే పరిమితం కాలేదు. బ్రాండ్‌ను బలోపేతం చేయడం, మార్కెట్ పరిధిని విస్తరించడం, వ్యాపారాన్ని ప్రభుత్వ పోర్టళ్లతో అనుసంధానించడంలోనూ మద్దతు లభించింది. ఫలితాలే సంస్థ విజయాన్ని వెల్లడిస్తున్నాయి. ఒక చిన్న యూనిట్‌తో మొదలైన సోయా రిచ్ ప్రస్తుతం ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. నెలవారీ విక్రయాలు సుమారు ₹2 లక్షల నుంచి దాదాపు ₹35 లక్షలకు పెరిగాయి. ఈ ప్రయాణం ఒక సరళమైన సందేశాన్ని అందిస్తోంది: సరైన సహకారం లభిస్తే చిన్న ప్రారంభాలు ఎంతో దూరం సాగగలవు. ఈ కథ చిన్నగా ప్రారంభమై విస్తరించగా, మరో ప్రయాణం దశాబ్దాల క్రితం మొదలై ఇప్పటికీ కొత్త అవకాశాలను అందుకుంటోంది.

పీయూష్ మొహంతీకి ఆహార శుద్ధి కేవలం వ్యాపారం కాదు. అది ఒడిశాలో 1995లో మొదలైన వారసత్వం. మాలతి ఫుడ్ ప్రొడక్ట్స్‌లో వివిధ రకాల చిరుధాన్యాలను జాగ్రత్తగా శుభ్రపరచి, గ్రైండ్ చేసి, శుద్ధి అనంతరం ప్యాక్ చేస్తారు. ఎన్నో ఏళ్లపాటు విశ్వసనీయ యంత్రాల కొరత కారణంగా సంస్థ ఆశించిన నాణ్యతను సాధించడం కష్టమైంది. 2024లో పీఎంఎఫ్‌ఎంఈతో అనుసంధానం కొత్త అవకాశాన్ని తెచ్చింది. ₹9 లక్షలకు పైగా మూలధన రాయితీతో మెరుగైన శుద్ధి యంత్రాల్లో పెట్టుబడి పెట్టి తయారీ కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు వీలు కలిగింది.

6



ఈ మార్పు ఫలితాలు త్వరగానే కనిపించాయి. మెరుగైన యంత్రాలతో ఉత్పత్తుల నాణ్యత పెరగగా, విక్రయాలు దాదాపు 40 శాతం వృద్ధి చెందాయి. మాలతి ఫుడ్ ప్రొడక్ట్స్ తన మార్కెటింగ్‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు విస్తరించింది. వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రచారం, పరిజ్ఞానం, విలువైన మార్కెట్ సంబంధాలు లభించాయి. అయితే, అత్యంత అర్థవంతమైన మార్పును విక్రయ గణాంకాలు లేదా యంత్రాల ఆధునికీకరణలో గుర్తించలేం. గతంలో అసాధ్యమని భావించిన పరిమితులను దాటి ముందుకు సాగగలమన్న ఆత్మవిశ్వాసమే అసలైన మార్పు. మెరుగైన సామర్థ్యాలు, పెరుగుతున్న మార్కెట్ ఉనికితో మాలతి ఫుడ్ ప్రొడక్ట్స్ వచ్చే ఏడాది నుంచి ఎగుమతి అవకాశాలను అన్వేషించాలని భావిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల వారసత్వం ఇప్పుడు భారత సరిహద్దులను దాటేందుకు సిద్ధమవుతోంది.

ఈ కథలు కేవలం వ్యాపారాల వృద్ధికి సంబంధించినవి కావు. మరింత పెద్ద లక్ష్యాల దిశగా సాగేందుకు కలలకు ధైర్యం లభించిన తీరును ఇవి తెలియజేస్తున్నాయి. రంగులు, సువాసనలు, రుచులను మించిన శాశ్వత సందేశాన్ని బజార్ మిగిల్చింది: ఒక కలకు అవకాశం లభిస్తే అది ఒక జీవితాన్నే మార్చగలదనే నిశ్శబ్ద జ్ఞాపకం.

References

Ministry of Food Processing Industries

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2302922&reg=3&lang=1

PIB Backgrounder

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155134&ModuleId=3&reg=48&lang=2

 

Click to see pdf

 

***

(Features ID: 159728) आगंतुक पटल : 104
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada , Malayalam