• Sitemap
  • Advance Search
Social Welfare

క్యాచ్ ద రెయిన్: నీటి సంరక్షణకు స‌రికొత్త‌ జాతీయ పిలుపు

Posted On: 19 JUL 2026 8:52AM

2026 జూన్ 28న ప్రసారమైన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో వర్షపు నీటిని బొట్టు బొట్టుగా పొదుపు చేయాలని, దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ నిరంతరం కొనసాగాలని గౌరవ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందిస్తూ.. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, మొక్కలు నాటడం, ప్రజా భాగస్వామ్యం పెంచేందుకు 2026 జూలై 4 నుంచి ఆగస్టు 4 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.



“క్యాచ్ ద రెయిన్ - ఈ మిషన్ ద్వారా ప్రతీ వర్షపు బొట్టునూ మనం కలసికట్టుగా సంరక్షించాలి. ప్రతీ ఒక్క వర్షపు బొట్టునూ కలసికట్టుగా దాచుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.” ~ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

మనం చేపట్టాల్సిన పనులు:
* ప్రతీ ఇల్లు, సొసైటీ, పనిప్రదేశంలో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం.
* తగిన ప్రదేశాల్లో రీచార్జ్ పిట్లు, షాఫ్ట్‌లను నిర్మించడం, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఉపయోగించని బోరుబావులను బాగు చేయడం.
* బావులు, సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించి వినియోగంలోకి తేవడం.
* రాబోయే వర్షాకాలంలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి సమీపంలో ఉన్న చెరువులు, జలాశయాల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.
* నీటి నిల్వ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచడానికి వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం.

జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 (6 సెప్టెంబర్ 2024)
నీటి సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 6 సెప్టెంబర్ 2024న గుజరాత్‌లోని సూరత్‌లో 'జల్ సంచయ్ జన్ భాగీదారి' ప్రారంభమైంది. గౌరవ ప్రధాని వర్చువల్‌గా పాల్గొని నీటి సంరక్షణను జాతీయ ప్రాధాన్యతగా మలచాలనే తన సంక‌ల్పాన్ని చాటిచెప్పారు.

సమాజం, సీఎస్ఆర్, వ్యయం(3సీ) సూత్రాల ఆధారంగా ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యాన్ని, సంస్థల మద్దతును, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) భాగస్వామ్యాన్ని పెంచింది. నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వ పథకాలతో అనుసంధానించింది. తక్కువ ఖర్చుతో భూగర్భ జల రీచార్జ్, నీటి నిల్వ వ‌స‌తుల‌ నిర్మాణం, పాడైన బోరుబావుల పునరుద్ధరణ, స్థానిక అవసరాలకు తగిన శాస్త్రీయ పరిష్కారాలను ప్రభుత్వం, సమాజం కలసికట్టుగా అమలు చేయడంపై ఇది దృష్టి సారించింది.

1 ఏప్రిల్ 2024 నుంచి 31 మే 2025 వరకు అమలు చేసిన జేఎస్‌జేబీ 1.0, దాదాపు 10 లక్షల భూగర్భ జల పునరుద్ధరణ నిర్మాణాలను చేపట్టి లక్ష్యాన్ని మించింది. దేశవ్యాప్తంగా 27 లక్షలకు పైగా కృత్రిమ రీచార్జ్ నిర్మాణాలు పూర్తయ్యాయి.

జల్ సంచయ్ జన్ భాగీదారి 2.0 (2025)
ఈ విజయాన్ని పునాదిగా చేసుకుని, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న జిల్లాలలో తక్కువ ఖర్చుతో కూడిన స్థానిక పద్ధతుల ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు 1 జూన్ 2025న జేఎస్‌జేబీ 2.0 ప్రారంభమైంది.

31 మే 2026 నాటికి కనీసం ఒక కోటి భూగర్భ జల పునరుద్ధరణ నిర్మాణాలను చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇది నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 50 శాతానికి పైగా ఎక్కువ. ఈ నిర్మాణాల క్షేత్రస్థాయి పరిశీలన, భౌతిక తనిఖీ ప్రస్తుతం జరుగుతోంది.

జేఎస్‌జేబీ 1.0 కింద అత్యుత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపుగా, నవంబర్ 2025లో జరిగిన 6వ జాతీయ నీటి పురస్కారాల కార్యక్రమంలో ప్రభుత్వం సత్కరించింది.

జల్ సంచయ్ జన్ భాగీదారి: క్యాచ్ ద రెయిన్ (2026)

 


జల్ సంచయ్ జన్ భాగీదారి(జేఎస్‌జేబీ) పరిధిని విస్తరిస్తూ జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్(జేఎస్ఏ:సీటీఆర్) ప్రచారంతో అనుసంధానిస్తూ 1 జూన్ 2026న 'జల్ సంచయ్ జన్ భాగీదారి: క్యాచ్ ద రెయిన్(జేఎస్‌జేబీ:సీటీఆర్)' ప్రారంభించారు.

వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి నిల్వ, ప్రజల భాగస్వామ్యంపై నూతన ఉత్సాహంతో, ప్రతీ వర్షాన్ని నీటి సంరక్షణ అవకాశంగా మలచడం ఈ ప్రచారం లక్ష్యం. ఇది స్థానిక అవసరాలకు తగిన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను ప్రోత్సహిస్తూ నిలకడైన నీటి నిర్వహణ ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

ఈ ప్రచారం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కలసి ముందుకు సాగుతోంది:
* వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్(వీబీ-జీ రాం-జీ)
* పీఎంకేఎస్‌వై కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్(పీడీఎంసీ)
* పీఎంకేఎస్‌వై కింద జలాశయాల మరమ్మతు, పునరుద్ధరణ(ఆర్ఆర్ఆర్)
* క్యాంపా
* ఆర్థిక సంఘం గ్రాంట్లు
* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

 



జేఎస్‌జేబీ: సీటీఆర్ కార్యక్రమానికి 'జన్ భాగీదారి' ప్రధాన బలం. పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, యువత, విద్యాసంస్థలు, పౌరసమాజ సంస్థలు, స్థానిక ప్రజలను నీటి సంరక్షణ చర్యల్లో భాగస్వాములను చేస్తోంది.

జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్(జేఎస్ఏ: సీటీఆర్‌)
ప్రపంచ నీటి దినోత్సవం(22 మార్చి 2021)  నాడు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ "ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు - వర్షపు నీటిని ఒడిసిప‌డ‌దాం" అనే నినాదంతో 'జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్'ను ప్రారంభించారు.

256 జిల్లాల్లోని 1,592 నీటి ఎద్దడి బ్లాకుల్లో అమలు చేసిన జల్ శక్తి అభియాన్ 2019 విజయవంతమైన అనుభవాలతో ఈ ప్రచారం మొదలైంది. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వాటర్‌షెడ్ అభివృద్ధి, జలాశయాల పునరుజ్జీవనం, అటవీకరణ వంటి పనులను ప్రజా ఉద్యమంలా చేపట్టింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం కొత్త అంశాలు, ప్రాధాన్యతలతో ఈ ప్రచారం కొనసాగుతోంది.

2021 – ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు - వర్షపు నీటిని ఒడిసిపడ‌దాం
* వర్షపు నీటి నిల్వ, నీటి సంరక్షణ
* జలాశయాల జియో-ట్యాగింగ్
* శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక
* జల్ శక్తి కేంద్రాలు, అవగాహన కార్యక్రమాలు

2022 – నీటి సంరక్షణ చర్యల విస్తరణ
* సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ
* భూగర్భ జలాల పునరుద్ధరణ, వాటర్‌షెడ్ అభివృద్ధి
* మాగాణి నేల‌ ప్రాంతాలు, నదుల పునరుజ్జీవనం
* స్ప్రింగ్‌-షెడ్ అభివృద్ధి, నీటి వ‌న‌రుల‌ రక్షణ

2023 – తాగునీటి వనరుల సుస్థిర‌త‌
* 150 నీటి ఎద్దడి జిల్లాలపై దృష్టి
* తాగునీటి వనరుల బలోపేతం
* భూగర్భ జలాల పునరుద్ధరణ, వనరుల నిలకడ
* క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సమాజ భాగస్వామ్యం

2024 – నారీ శక్తి సే జల్ శక్తి
* మహిళల నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు
* జలాశయాల శుభ్రత, పూడిక తీత
* భూగర్భ జలాల పెంపునకు ఉపయోగించని బోరుబావుల పునరుద్ధరణ
* అటవీకరణ, స్థానిక నీటి వనరుల పునరుజ్జీవనం

దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలు నీటి భద్రతను ఎలా పెంచవచ్చో నిరూపించాయి. నీటి సంరక్షణ, పరిశుభ్రత రంగాల్లో ప్రతిభ చూపిన వారిని 'స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్' ద్వారా క్రమం తప్పకుండా గౌరవిస్తున్నారు.

జల్ శక్తి కేంద్రాలు(జేఎస్‌కేలు)
దేశంలోని జిల్లాల్లో జల్ శక్తి కేంద్రాలను(జేఎస్‌కే) ఏర్పాటు చేయడం ఈ ప్రచారంలో కీలకమైన అంశం. ఇవి నీటి సంరక్షణకు సంబంధించి జ్ఞాన సమగ్ర కేంద్రాలుగా పనిచేస్తాయి. వర్షపు నీటి నిల్వ పద్ధతులపై సమాచారాన్ని ఇస్తూ, స్థానిక ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి సాంకేతిక సలహాలు అందిస్తూ నీటి సంరక్షణ ప్రణాళికలు, అమలుకు సహకరిస్తాయి.

 



వర్షపు నీటి నిల్వ నుంచి గ్రామీణ ప్రగతి వరకు
గౌరవ ప్రధాని నాయకత్వంలో నీటి సంరక్షణ ఒక జాతీయ ప్రాధాన్యతగా, ప్రజల ఉద్యమంగా మారింది. క్యాచ్ ద రెయిన్, జల్ సంచయ్ జన్ భాగీదారి వంటి కార్యక్రమాల ద్వారా ఒక విభాగానికి మాత్రమే పరిమితమైన నీటి సంరక్షణ కార్య‌క్ర‌మాన్ని ప్రజల భాగస్వామ్యం, శాస్త్రీయ ప్రణాళిక, వనరుల అనుసంధానంతో దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా ప్రభుత్వం మార్చగలిగింది.

వికసిత్ భారత్ దిశగా భారతదేశం పయనిస్తున్న వేళ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జలాశయాల పునరుద్ధరణ, నీటి సమర్థ వినియోగం వంటి నిరంతర ప్రయత్నాలు వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ జీవనోపాధికి, వాతావరణ మార్పులను తట్టుకోవడానికి, భావి తరాలకు నీటి వనరులను అందించడానికి అత్యంత కీలకంగా ఉంటాయి.

శాస్త్రీయ ప్రణాళిక, స్థానిక బాధ్యత, ఉమ్మడి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రచారం గ్రామీణ భారతంలో స్థిరమైన నీటి వనరులను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు, నీటి అవసరాలు పెరుగుతున్న తరుణంలో ప్రతీ వర్షపు బొట్టునూ దాచుకోవడం నీటి భద్రతకు ఎంతో అవసరం. ఇది వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తూ నిలకడైన గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుంది.

ప్రతీ నీటి బొట్టునూ సంరక్షించాలంటూ ప్రధాని మన్ కీ బాత్ వంటి వేదికల ద్వారా ఇస్తున్న పిలుపు పౌరులను, సంస్థలను, అన్ని స్థాయిల ప్రభుత్వాలను నీటి భద్రత దిశగా కలసికట్టుగా పనిచేసేలా ప్రేరేపించింది.

***

(Features ID: 159272) आगंतुक पटल : 16
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , हिन्दी , Nepali , Assamese , Kannada , Malayalam