• Sitemap
  • Advance Search
Social Welfare

ఆడవి నుంచి ఆధునికత వైపు

ప్రపంచ విపణిలోకి అడుగిడుతున్న గిరిజన భారతం

Posted On: 27 MAR 2026 10:37AM

భారతదేశంలోని గిరిజన సంఘాలు ప్రపంచ విపణిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒక విషయం స్పష్టంగా అవగతమౌతోంది. గిరిజన కళాకారులు తయారు చేసే వస్తువులను ఏ ఆధునిక యంత్రాలు కూడా తయారు చేయలేవు. పరిశ్రమల ద్వారా వస్త్రాలు, ఆధునిక వస్తువులు భారీగా ఉత్పత్తి అవుతున్న ప్రస్తుత కాలంలో, ఈ ప్రత్యేకతే వారికి బలమైన ఆయుధంగా మారింది. ఈ నైపుణ్యాన్ని, శక్తిని స్థిరమైన ఆదాయంగా, గౌరవంగా మార్చడంలో  TRIFED మరియు RISA వంటి కార్యక్రమాలు సహాయపడుతున్నాయి.

 

భారతదేశంలోని ప్రధాన గిరిజన ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం

భారతదేశ గిరిజన సంఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమ స్థానాన్ని పునర్నిర్మించుకుంటున్నాయి. అటవీ ఆధారిత జీవనోపాధిని ఆధునిక వినియోగదారులను ఆకర్షించే సుస్థిరమైన, అధిక-విలువైన ఉత్పత్తులుగా మారుస్తున్నాయి. జీవనోపాధి కోసం చేసే శ్రమ నుంచి వ్యాపారవేత్తలుగా మారుతున్న ఈ మార్పు, గిరిజన ఆర్థిక వ్యవస్థల విస్తృత పునర్నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సంప్రదాయం అనేది వారికి మాత్రమే పరిమితమైన ఒంటరి అంశం కాదు. అది జాతీయ,  ప్రపంచ మార్కెట్లతో అనుసంధానమైన ఆధునిక విప్లవం కూడా.

2026 మార్చి 18-30 వరకూ న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ – 2026 (Bharat Tribes Fest 2026) వేదికగా ఈ మార్పు స్పష్టంగా వ్యక్తమైంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో,  ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED) ఆధ్వర్యంలో ముందుకు సాగిన ఈ ఉత్సవం, భారతదేశ గిరిజన వారసత్వాన్ని కళ్ళకు కట్టడమే కాకుండా, అత్యంత శక్తివంతమైన రూపంలో జీవం పోసుకున్న జాతీయ వేదికగా పని చేసింది. హస్తకళలు, సంస్కృతి, జీవనోపాధికి బాటలు వేస్తూనే, ఇది సనాతన గిరిజన సంప్రదాయాలను దేశ సాంస్కృతిక, ఆర్థిక ముఖచిత్రంలో ముందంజలోకి తీసుకువచ్చాయి.

ఈ మార్పునకు 'RISA: ఏ ప్రీమియం ట్రైబల్ బ్రాండ్' వంటి లక్షిత విధానపరమైన సహకారంతో  పాటు వన్ ధన్ యోజన, ట్రైబ్స్ ఇండియా నెట్‌వర్క్ వంటి కార్యక్రమాలు చోదకశక్తులుగా నిలిచాయి. గిరిజన కళాకారులు అటవీ ఆధారిత జీవనోపాధి నుంచి ప్రపంచ వాణిజ్య విపణిలో చురుకైన భాగస్వామ్యానికి మారుతున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చే కథలు వారసత్వం, ఆశయాల సమాహారం; ఇక్కడ అడవులు అధునితకతతో మమేకమౌతాయి. ప్రాచీన నైపుణ్యాలు, వాటి నిజమైన మార్కెట్ విలువను పొందుతాయి.

GFX

ముఖ్య ఉత్సవ విశేషాలు:

  • 75 వన్ ధన్ వికాస్ కేంద్రాలు
  • 400+ గిరిజన కళాకారులు
  • 17 ప్రత్యక్ష ప్రదర్శనలు
  • 310 ఆర్ట్ & క్రాఫ్ట్ భాగస్వాములు
  • 120 గిరిజన వంటకాల భాగస్వాములు

ట్రైబ్స్ ఇండియా మోడల్: వన్ ధన్ నుంచి విలువల గొలుసు వరకు

భారతదేశ గిరిజన ఆర్థిక వ్యవస్థ... జీవనోపాధి భద్రతను మార్కెట్ సదుపాయాలతో కలిపి పటిష్టమైన సంస్థాగత చట్రాల ద్వారా వ్యవస్థీకృత పద్ధతిలో పునర్నిర్మితమౌతోంది.  దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులైన గిరిజన సమాజాలకు కేవలం మద్దతు మాత్రమే కాకుండా, సాధికారత అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అంటే, కేవలం ముడిసరుకు సరఫరా చేసే స్థాయి నుంచి గ్లోబల్ మార్కెట్‌లో ప్రీమియం ధరలను శాసించగల బ్రాండ్‌ల సృష్టికర్తలుగా, యజమానులుగా వారి అభివృద్ధికి అవకాశాలను అందించడమే ఇందులో ప్రధాన ఉద్దేశం.

  • TRIFED నేతృత్వంలోని ట్రైబ్స్ ఇండియా నెట్‌వర్క్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజన ఉత్పత్తిదారులను నేరుగా పట్టణ వినియోగదారులతో కలుపుతుంది.
  • వన్ ధన్ వికాస్ కేంద్రాలు (VDVKs):  అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  TRIFED ప్రారంభించిన సమాజ యాజమాన్య కేంద్రాలు. ఇవి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (MFP) యొక్క విలువ జోడింపు, ప్రాసెసింగ్,  బ్రాండింగ్‌పై దృష్టి సారిస్తాయి.
  • ప్రతి VDVK క్లస్టర్ 15 గిరిజన స్వయం సహాయక బృందాల (SHGs) సమాఖ్యగా రూపొందించడమైంది. ప్రతి SHG లో 20 మంది సభ్యులు ఉంటారు, అంటే ఒక క్లస్టర్‌లో దాదాపు 300 మంది లబ్ధిదారులు సామూహికంగా అభివృద్ధి చెందుతారు.

ఈ నమూనా ద్వారా సామూహిక సేకరణ, ఉమ్మడి ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, బలమైన మార్కెట్ అనుసంధానం సాధ్యమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మొహవా లేదా చింతపండును ప్రాసెస్ చేసే మహిళలు ఇప్పుడు కేవలం రైతులు మాత్రమే కాదు; వారు మైక్రో-ఎంట్రప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. అదే సమయంలో, RISA బ్రాండ్ గిరిజన హస్తకళలను గ్లోబల్ మార్కెట్‌లో ప్రీమియం ఉత్పత్తులుగా నిలబెడుతోంది.

గిరిజన ఉత్పత్తిదారులు తమ అటవీ ఉత్పత్తులను మరియు హస్తకళలను ఈ వన్ ధన్ వికాస్ కేంద్రాలకు తీసుకువస్తారు, అక్కడ నాణ్యత తనిఖీ, విలువ జోడింపు, ప్యాకేజింగ్, డాక్యుమెంటేషన్ జరుగుతాయి. అక్కడి నుంచి, ఉత్పత్తులు ట్రైబ్స్ ఇండియా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్ మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరుతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) వంటి సంస్థలతో కలిసి TRIFED సంప్రదాయ కళలను ఆధునిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుస్తోంది. ఒకప్పుడు స్థానిక మధ్యవర్తులకు తక్కువ ధరకే అమ్ముడుపోయిన ఛత్తీస్‌గఢ్ 'డోక్రా' పెండెంట్, ఇప్పుడు తన స్వీయ గుర్తింపుతో అంతర్జాతీయ వేదికలపై అధిక ధరను పొందుతోంది.

 

గిరిజన ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న మహిళలు

ఇందులో అత్యంత కీలకమైన మార్పు లింగసమానత్వం. మహిలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు, వారు మార్పును ముందుకు నడిపిస్తున్న ఉత్పత్తిదారులు కూడా. అంతే కాదు వారు నాయకులు, నాణ్యతకు రక్షకులు. మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలు ఆర్థిక సాధికారతకు కేంద్రాలుగా మారాయి; ఇవి సామూహిక పొదుపు, మైక్రో-లెండింగ్ (సూక్ష్మ రుణాలు),  ముడిసరుకుపై ఉమ్మడి పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. చాలామందికి, TRIFED వారి మొదటి అధికారిక ఆర్థిక గుర్తింపును అందించింది, తద్వారా గతంలో గుర్తింపు లేని వారి జీవనోపాధి శ్రమను డాక్యుమెంట్ చేసిన పనిగా రూపొందించి, మార్పునకు బాటలు వేసింది.

భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ - 2026 (Bharat Tribes Fest 2026) లో ఈ మార్పులు కేవలం కొలవదగ్గ ఫలితాల్లోనే కాకుండా, ఆ మహిళల వాస్తవ జీవితాల్లో,  వారి కథల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇది వారి అభిప్రాయాలను, అనుభవాలను తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది.

రేపటి కోసం సంప్రదాయాలను నేస్తున్న మార్పు చోదకులు

మిజోరంలోని లాంగ్ట్లై జిల్లా కమలానగర్‌కు చెందిన చక్మా తెగకు చెందిన 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త డెబోంగ్షి చక్మా, మార్పునకు సంబంధించిన ఒక శక్తివంతమైన గాధను నిశ్శబ్దంగా లిఖిస్తున్నారు. ఇందులో సంప్రదాయాలను గతానికి వదిలేయకుండా, ప్రపంచ మార్కెట్‌లోకి ముందుకు తీసుకువెళుతున్నారు. చక్మా సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన ఆమె, స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను గౌరవం, గుర్తింపు,  ఆర్థిక సాధికారతకు మార్గాలుగా పునర్నిర్మిస్తున్నారు.

బోధిబ్లూమ్ సొసైటీ (Bodhibloom Society) వ్యవస్థాపకురాలిగా, డెబోంగ్షి 500 మందికి పైగా సభ్యులతో కూడిన ఒక చైతన్యవంతమైన సమూహాన్ని నడిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా విడాకులు తీసుకున్న మహిళలతో సహా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళల సాధికారతపై ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె చొరవ కేవలం ఒకే రకమైన హస్తకళకు పరిమితం కాలేదు; ఇది విభిన్నమైన, సమాజ ఆధారిత జీవనోపాధి నమూనాను కలిగి ఉంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ ఆహార పద్ధతుల నుంచి జూమ్ (పోడు) వ్యవసాయం, వెదురు ఆధారిత ఉత్పత్తుల వరకు, ఆమె పని పర్యావరణం, సంస్కృతి, వ్యాపారాన్ని అద్భుతంగా అనుసంధానిస్తుంది.

యంత్రాల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న డెబోంగ్షి ప్రయాణం, గిరిజన సమాజాల పట్టుదలను, సృజనాత్మకతను చాటిచెబుతోంది. TRIFED తో సహకారం ద్వారా, ఆమె ఉత్పత్తులు ఇప్పుడు స్థానిక మార్కెట్లను దాటి సుదూర ప్రాంతాలకు చేరుతున్నాయి. ఇది సాంస్కృతిక ప్రామాణికతను కాపాడుతూనే, సంప్రదాయ పద్ధతులను స్థిరమైన ఆదాయంగా మారుస్తోంది. హస్తకళలతో చేసిన, పర్యావరణ అనుకూల వస్తువుల పట్ల ప్రపంచ వినియోగదారులు ఆకర్షితులవుతున్న తరుణంలో, ఆమె పని సుస్థిరతతో పాటు వారసత్వాల కలయికగా నిలుస్తోంది.

వారసత్వాన్ని చేనేతగా మలుస్తూ...

జార్ఖండ్‌లోని కజ్రీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంతాల్ కళాకారిణి ఊర్మిళ సోన్వార్, తన చుట్టూ ఉన్న సాంస్కృతిక,  పర్యావరణ పరిసరాల నుంచి ప్రేరణ పొంది ఒక యువ డిజైనర్‌గా ఎదుగుతున్నారు. ఆమె తన పనిలో "బారా ఖండ్" అనే స్థానిక పవిత్ర ఆచారాన్ని, తన గ్రామంలోని పర్వత ప్రాంత ప్రకృతిని ప్రతిబింబింపజేస్తున్నారు. ఈ అంశాలను ఆమె అద్భుతమైన, అస్తిత్వంతో కూడిన చేనేత చీరలుగా మారుస్తున్నారు.

12వ తరగతి వరకు చదువుకున్న ఊర్మిళ చేనేత రంగానికి పూర్తిగా అంకితమయ్యారు. స్వదేశీ సంప్రదాయాలను కాపాడుతూనే, తన వారసత్వాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు. ఆమె రూపొందించే డిజైన్లు ఆమెకు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, సంతాల్ సంస్కృతికి విస్తృత గుర్తింపును తెస్తున్నాయి. తద్వారా స్థానిక హస్తకళలను జాతీయ, ప్రపంచ మార్కెట్లలో నిలబెడుతున్నాయి. తన పని ద్వారా ఆమె ఒక కొత్త తరం కళాకారులకు ప్రతినిధిగా నిలుస్తున్నారు; ఒక సాంస్కృతిక రాయబారిగా తన సమాజ వారసత్వాన్ని సృజనాత్మకతతో, లక్ష్యంతో ముందుకు తీసుకువెళుతున్నారు.

పెద్దల వారసత్వ పోగులను సంరక్షిస్తూ...

తమిళనాడులోని నీలగిరి కొండలకు చెందిన 42 ఏళ్ల తోడ (Toda) కళాకారిణి సంగీతకు, ఎంబ్రాయిడరీ అనేది కేవలం అభ్యసించిన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆమె జీవితకాల వారసత్వం. తెల్లటి ముతక పత్తి వస్త్రంపై ఎరుపు, నలుపు దారాలతో, తరతరాల మహిళల నుంచి అందిపుచ్చుకున్న   క్లిష్టమైన రేఖాగణిత నమూనాలను (geometric patterns) రూపొందిస్తున్నారు.

తోడ తెగ జనాభా కేవలం వెయ్యి లోపు మాత్రమే ఉన్నందున, ఈ సంప్రదాయం అంతరించే ప్రమాదంలో ఉన్న అంశాల స్థితిలో ఉంది. నీలగిరి దాటి బయట కనిపిస్తున్న చాలా కళాఖండాలు, వారు కౌమారదశ నుంచి దశాబ్దాల పాటు చేసిన కృషికి ఫలితాలు. సంగీత ఈ రంగంలో అభ్యాసకురాలిగా,  ఒక వారధిగా పనిచేస్తూ, ఈ కళను విస్తృత వేదికల పైకి తీసుకువెళుతున్నారు; అదే సమయంలో ఈ కళను కాపాడుతున్న మహిళలకు తగిన గుర్తింపు,  ఆదాయం అందేలా చూస్తున్నారు.

వ్యర్థానికి విలువ: ఒక సుస్థిరమైన హస్తకళా ప్రయాణం

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్‌లోని థారూ తెగకు చెందిన 45 ఏళ్ల అనితా రాణా, సంప్రదాయ పర్యావరణ జ్ఞానం ఏ విధంగా సుస్థిర జీవనోపాధిని పెంపొందించగలదో నిరూపిస్తున్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా సభ్యులతో ఉన్న ఒక మహిళా సమూహంలో భాగమైన ఆమె, మెరుగైన మార్కెట్ ప్రాప్తిని, సరైన ధరను, 'సరస్ ఫెయిర్' (SARAS Fair) వంటి గిరిజన ఉత్సవాల్లో తన పనిని ప్రదర్శించే అవకాశాలను పొందారు.

ఆమె కళ ముంజా గడ్డి (Munja grass) అల్లికతో కూడుకున్న నైపుణ్యం. ఇది ఒక కాలానుగుణమైన, పర్యావరణంలో త్వరగా కలిసిపోయే వనరు. దీనిని రోటీ హాట్ కేస్‌లు వంటి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడం ద్వారా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని ఆమె అందిస్తున్నారు. యువతులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, అనిత ఈ స్వదేశీ పద్ధతిని కాపాడుతూనే సమాజంలో గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పిస్తున్నారు. సుస్థిరత, సంప్రదాయం,  వ్యాపారం కలిసి ఎలా శాశ్వత ప్రభావాన్ని చూపుతాయో ఆమె ప్రయాణం ప్రతిబింబిస్తుంది.

 

అస్తిత్వంలో వేళ్లూనుకున్న వృద్ధి

భారతదేశంలోని గిరిజన సంఘాలు ప్రపంచ విపణిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒక విషయం స్పష్టంగా అవగతమౌతోంది. గిరిజన కళాకారులు తయారు చేసే వస్తువులను ఏ ఆధునిక యంత్రాలు కూడా తయారు చేయలేవు. పరిశ్రమల ద్వారా వస్త్రాలు, ఆధునిక వస్తువులు భారీగా ఉత్పత్తి అవుతున్న ప్రస్తుత కాలంలో, ఈ ప్రత్యేకతే వారికి బలమైన ఆయుధంగా మారింది. ఈ నైపుణ్యాన్ని, శక్తిని స్థిరమైన ఆదాయంగా, గౌరవంగా మార్చడంలో  TRIFED మరియు RISA వంటి కార్యక్రమాలు సహాయపడుతున్నాయి.

వన్ ధన్ వికాస్ కేంద్రాల విస్తరణ, ట్రైబ్స్ ఇండియా ఈ-కామర్స్ ఉనికి పెరగడం, భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ -2026 వంటి వేదికల ద్వారా లభిస్తున్న గుర్తింపుతో, వివిధ ప్రాంతాల కళాకారులు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా సృష్టికర్తలుగా తమ స్వంత నిబంధనల ప్రకారం మార్కెట్‌తో అనుసంధానమవుతున్నారు.

అటవీ ఉత్పత్తుల నుంచి గ్లోబల్ డిజైన్ వేదికల వరకు, గిరిజన భారతం కేవలం వస్తువులను ఉత్పత్తి చేయడం లేదు. అది సుస్థిరమైన, కలుపుకొనిపోయే, మూలాలతో ముడిపడిన ఒక అభివృద్ధి నమూనాను రూపొందిస్తోంది.

RISA: కాలాతీత గిరిజన కళ ఒక అత్యున్నత శ్రేణి గిరిజన బ్రాండ్


గిరిజన హస్తకళలను ప్రీమియం మార్కెట్‌లో నిలబెట్టడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమం ఇది. త్రిపురలోని సంప్రదాయ 'రిసా' వస్త్రం నుంచి ప్రేరణ పొందిన ఈ బ్రాండ్, వారసత్వాన్ని ఆధునిక డిజైన్‌తో మిళితం చేస్తుంది.

 

ముఖ్య లక్షణాలు:

  • ఆధునిక మార్కెట్ కోసం డిజైనర్-కళాకారుల భాగస్వామ్యం.
  • నైపుణ్యం, నాణ్యత, గ్లోబల్ పొజిషనింగ్‌పై దృష్టి.
  • గిరిజన క్రాఫ్ట్ క్లస్టర్ల బలోపేతం.

ప్రదర్శితమైన కళలు:

  • ఎరి & ముగా సిల్క్ – అస్సాం
  • కోట్‌పాడ్ కాటన్ – ఒడిశా
  • చాంగ్పా పష్మీనా – లడఖ్
  • తోడ ఎంబ్రాయిడరీ – తమిళనాడు
  • లాంగ్పి పాటరీ – మణిపూర్
  • తుర్టుక్ బ్రాస్ కట్లరీ – లడఖ్
  • డోక్రా ఆర్ట్ – ఛత్తీస్‌గఢ్

 

***

(Features ID: 158338) आगंतुक पटल : 41
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam