Social Welfare
మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో ప్రపంచ దృక్ఫథాలు, భారతదేశ కార్యక్రమాలు
Posted On:
09 NOV 2025 2:56PM
మానసిక ఆరోగ్యం అంటే కేవలం సంతోషంగా లేదా మంచి మనస్థితితో ఉండటం మాత్రమే కాదు ఇది మన మానసిక-భావోద్వేగ, సామాజిక, ఆలోచనా, శారీరక సామర్థ్యాలతో కూడినది. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి, జీవితాన్ని సంతోషంగా జీవించడానికి మన మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం.
మానసిక ఆరోగ్యం అనేది కనీస మానవహక్కు. వ్యక్తిగత, సమాజ, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కీలకం. గత కొన్నేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలపై దృష్టి, చర్చలు పెరిగాయి. ఈ రంగంలోని వివిధ వైద్య, కౌన్సిలింగ్, బాధిత, ఇతరులు గత దశాబ్దానికి పైగా కాలం నుంచి మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించినప్పటికీ, అంతర్జాతీయంగా కొవిడ్-19 మహమ్మారి ఈ సమస్యపై తిరిగి దృష్టి సారించాల్సిన అవసరాన్ని పెంచింది(ఐక్యరాజ్యసమితి, 2021).
ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాల్లో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు అంటే 110 కోట్ల మంది మానసిక సమస్యతో జీవిస్తున్నారని అంచనా. భారత్‌లో ప్రతి 100 మందిలో 11 మందికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంచనా.

ఈ సమస్యల ప్రభావం వైక్యలంతో జీవించిన సంవత్సరాల్లో(వైఎల్‌డీ) నిర్దేష్టంగా ఉంటుంది. 0-5 ఏళ్ల మధ్య వయస్సు వారిని మినహాయిస్తే అన్ని వయస్సుల వారు, ముఖ్యంగా 15-29 వయస్సు వారిలో నిరాశ, ఆందోళన వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి(డబ్ల్యూహెచ్ఓ, 2025).
లాన్సెట్ అధ్యయనం(2020) ప్రకారం ప్రపంచ వ్యాధి భారంలో 5.2% మానసిక ఆరోగ్య సమస్యలు. ఇందులో నిరాశ, ఆందోళన సమస్యలే 6.2 శాతం, 4.7 శాతంగా ఉన్నాయి(మానసిక ఆరోగ్య అట్లాస్, 2024). ఈ పెరుగుతున్న భారం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఎంత పెద్ద సవాళ్లుగా మారుతున్నాయో తెలియజేస్తోంది.

మానసిక ఆరోగ్యం కారణంగా వైకల్యం, వ్యాధి భారం, చికిత్స మధ్య అంతరాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది(జాతీయ విద్యా విధానం, పేజీ 4). వివిధ విధానాలు, కార్యక్రమాల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తోంది.
మానసిక ఆరోగ్య సమస్యలు

భారత్‌లో మానసిక ఆరోగ్యం
2015-16లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) నిర్వహించిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే(ఎన్ఎంహెచ్ఎస్) ప్రకారం 10.6% మంది భారతీయ వయోజనులు - సుమారు 100 మందిలో 11 మంది గుర్తించదగ్గ మానసిక సమస్యలతో జీవిస్తున్నారు.
సర్వేలో తేలిన అంశాలు
భారతీయ వయోజనుల జనాభాలో 15% మంది జోక్యం అవసరమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మానసిక రుగ్మతల జీవితకాల ప్రాబల్యం 13.7%. అంటే ప్రతి 100 మంది భారతీయుల్లో 14 మంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలతో(6.9%) పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో(13.5%) మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ.
2019లో జరిగిన ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ అధ్యయనం ప్రకారం పురుషుల(10%) కంటే మహిళలకు(20%) మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ. భారత్‌లో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా నిరాశ, ఆందోళన, శారీరక అసౌకర్యాలు వంటి సమస్యల బారిన పడతారు.
భారత్‌లో ఆత్మహత్యల రేటు పెరుగుతోంది. 2023లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ‘భారత్‌లో ఆత్మహత్యలు & ప్రమాద మరణాలు’ ప్రకారం:
2023లో 1,71,418 ఆత్మహత్యలు నమోదయ్యాయి.
మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో 72.8% పురుషులు కాగా, మహిళలు 27.2%.
చికిత్సలో అంతరాలు
మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్న 70% నుంచి 92% మందికి అవగాహనారాహిత్యం, సామాజిక అపవాదులు, నిపుణుల కొరత వంటి కారణాలతో సరైన చికిత్స అందడం లేదని 2015-16 ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ అధ్యయనం తేల్చింది.
మానసిక ఆరోగ్య చికిత్స అందించే నిపుణుల కొరత కూడా ప్రధాన సమస్య. లక్ష మంది జనాభాకు ముగ్గురు ముగ్గురు మానసిక వైద్యులు ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేస్తోంది. 2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రిలో ప్రచురితమైన గార్గ్ ఎట్ అల్ అధ్యయనం ప్రకారం భారత్‌లో లక్ష మంది జనాభాకు 0.75 మానసిక వైద్యులు మాత్రమే ఉన్నారు.
బలహీన మానసిక ఆరోగ్యం చూపే ప్రభావం
బలహీన మానసిక ఆరోగ్యం మనుషుల ఆరోగ్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై విస్తృత ప్రభావం చూపుతుంది.
శారీరక ఆరోగ్యం
మానసిక, శారీరక ఆరోగ్యం మధ్య బలమైన సంబంధం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మానసిక ఆరోగ్యం బలహీనంగా ఉండే వ్యక్తులు మొత్తంగా అనారోగ్యంతో ఉంటారని, తక్కువ ఆయుర్దానం కలిగి ఉంటారని పేర్కొంది. ఉదాహరణకు, నిరాశతో ఉండే ప్రజల్లో గుండె సంబంధ వ్యాధుల ముప్పు ఎక్కువ. వీరిలో ఈ వ్యాధుల ముప్పు 72% ఎక్కువ అని లాన్సెట్ సైకియాట్రి అధ్యయనం తేల్చింది. బలహీన మానసిక ఆరోగ్యం ఉన్న వారిలో దీర్ఘకాల నొప్పి, నిద్రకు అంతరాయం కలగడం కూడా ఎక్కువే.
ఆర్థిక ప్రభావం
కార్మికుల్లో బలహీన మానసిక ఆరోగ్యం పరోక్షంగా ఆర్థిక ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఉత్పాదకత నష్టం(పనికి గైర్హాజరు, సరిగ్గా పనిచేయలేకపోవడం, సిబ్బందిని మార్చాల్సి రావడం వంటి కారణాలు), ఆరోగ్య చికిత్స వంటి అదనపు పరోక్ష ఖర్చులకు కారణమవుతుంది(డబ్ల్యూహెచ్ఓ, 2025). దీని వల్ల ప్రజల సంపాదన సామర్థ్యం, వృద్ధి తగ్గడంతో పాటు నిరుద్యోగ రేటు, ఆరోగ్య చికిత్స ఖర్చులు పెరిగిపోతాయి(సార్‌టోరియస్, 2013). నిరాశ, ఆందోళన వల్ల కోల్పోతున్న ఉత్పాదకతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ అమెరికా డాలర్ల మేర నష్టం వస్తోంది(డబ్ల్యూహెచ్ఓ, 2025).
ఆరోగ్య చికిత్స, పరోక్ష ఖర్చులు సహా మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ప్రపంచ ఆర్థిక భారం 2030 నాటికి 16 ట్రిలియన్ డాలర్లకు పెరగొచ్చు(జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్, 2021). మానసిక రుగ్మతలు కలిగిన పిల్లలు విద్యాపరంగా పేలవమైన ఫలితాలు, జీవితకాల ఆదాయం తక్కువగా ఉండటం వంటి ఆర్థికంగా ప్రతికూలతలు ఎదుర్కొంటారు(డొరన్ & కించిన్, 2019).
సామాజిక ఒత్తిడి, సంబంధాలపై ప్రభావం
మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సామాజికంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. ఒత్తిడితో కూడిన సంబంధాలు, సంభాషణా వసవాళ్లు వారి సమస్యలను మరింత పెంచుతాయి. నిరాశతో ఉన్న వ్యక్తులు ఇతరులతో సంబంధాలు ఏర్పాటుచేసుకోవడం, నెరపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, దీంతో సామాజిక సహకారం లేకపోవడం వల్ల నిరాశ మరింత తీవ్రమవుతుందని ది లాన్సెట్ సైకియాట్రి(2010)లో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.
సామాజిక వివక్ష
అంతర్గతంగా సిగ్గు, ప్రతికూల నమ్మకాలు, సంరక్షణ లేకపోవడం వంటి వాటితో ముడిపడి ఉన్న వివక్ష, మానసిక అనారోగ్యం వల్ల చికిత్స పొందడం, సామాజిక ఏకీకరణకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది(అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్, 2024).
తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని ప్రజలు, ప్రత్యేకంగా వివక్ష కారణంగా ఒంటరితనం, మానసిక ఆరోగ్యం క్షీణించే ముప్పు ఎక్కువ ఉన్న వారు మానసిక వైద్యంలో పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి(డబ్ల్యూహెచ్ఓ, 2018). ఉదాహరణకు ది లాన్సెట్ సైకియాట్రి(2020)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మానసిక రుగ్మతలు ప్రత్యేకంగా సైజోఫ్రెనియా వంటి తీవ్ర పరిస్థితులు ఉన్న వారు వివక్షను ఎక్కువగా ఎదుర్కొంటారు. సంరక్షణ తక్కువగా ఉండటం జీవననాణ్యతను తగ్గించడంతో పాటు చికిత్స లేదా కొలుకునే అవకాశాలను తగ్గిస్తుంది.
పెరుగుతున్న ఆత్మహత్యల ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా దాదాపు 7,27,000 మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు(డబ్ల్యూహెచ్ఓ, 2025). సైకియాట్రి రీసెర్చ్(2023)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో మామూలు వారి కంటే 16 రెట్లు ఎక్కువ ఆత్మహత్య ముప్పు ఉంటుంది. ఈ ముప్పు అన్ని ప్రాంతాలు, కాలాల్లోనూ కొనసాగుతోంది.
యువతలో మరింత ప్రమాదం
మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వయోజనుల్లో మూడింత ఒక వంతు మందిలో ఈ సమస్యలు 14వ యేటికి, సగం మందిలో 18వ యేటి కల్లా, దాదాపు మూడింత రెండొంతుల మందిలో 25 ఏళ్ల వయస్సు కల్లా మొదలవుతున్నాయి(డబ్ల్యూహెచ్ఓ, 2025). మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాల్యం లేదా కౌమార దశలో వస్తున్నాయి. 14 ఏళ్ల వయస్సు నాటికి 50%, 24 ఏళ్ల వయస్సు కల్లా 75% మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి.(డబ్ల్యూహెచ్ఓ, 2020). కౌమార దశలో మానసిక ఆరోగ్య సమస్యల వల్ల విద్యలో రాణించడం తగ్గుతుందని, తమకు తాము హాని తలపెట్టుకునే ప్రమాదం, మాదకద్రవ్యాలు వాడే ముప్పు పెరుగుతుందని 2017లో ది లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.
మానసిక ఆరోగ్యంపై కొవిడ్-19 ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం అధికంగా పడింది. మహమ్మారి సమయంలో ఆందోళనతో ఇబ్బందిపడే వారి సంఖ్య 25% పెరిగింది. క్వారంటైన్ కారణంగా ఒంటరితనం పెరిగింది. ఉద్యోగాల కోతలు, ఆర్థిక అభద్రత వల్ల ఒత్తిడి స్థాయిలు, మానసిక సమస్యలు పెరిగాయి.
అంతర్జాతీయ విధాన చట్రాలు
సమగ్ర మానసిక ఆరోగ్య కార్యచరణ ప్రణాళిక 2013-2030 అమలు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాలన్నీ అంగీకరించాయి. సమర్థవంతమైన నాయకత్వం, పరిపాలనను బలోపేతం చేయడం, సమగ్ర, ఏకీకృత, ప్రతిస్పందించే సమాజ ఆధారిత సంరక్షణను అందించడం, నివారణ వ్యూహాలు అమలు చేయడం, సమాచార వ్యవస్థలు, పరిశోధనను బలోపేతం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ఈ ప్రణాళిక లక్ష్యం. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ "ప్రపంచ మానసిక ఆరోగ్య నివేదిక"ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలను ఈ నివేదికలో సిఫార్సు చేసింది.
కీలక సూచనలు:
పరివర్తనకు మూడు మార్గాలు:
నిబద్ధతను మరింత పెంచడం: మానసిక ఆరోగ్యం విలువను గుర్తించేలా వ్యక్తులు, సమాజాలను ప్రోత్సహించడం, సామాజిక సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించడం, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం.
పరిస్థితుల పునర్నిర్వచన: మెరుగైన మానసిక వైద్య ఫలితాల కోసం శారీరక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను మార్చడం. ఇళ్లు, పాఠశాలలు, పని ప్రదేశాలు, సమాజాల్లో పరిస్థితులను మెరుగుపర్చడం ఇందులో భాగం.
మానసిక వైద్య సంరక్షణ బలోపేతం: మానసిక ఆసుపత్రుల్లో కస్టోడియల్ సంరక్షణ నుంచి కమ్యూనిటీ ఆధారిత సంరక్షణ నమూనాల వైపు పరివర్తన తేవడం. సాధారణ వైద్య సంరక్షణ వ్యవస్థల్లోకి మానసిక వైద్య సేవలను భాగం చేయడం కూడా ఇందులో ఒకటి. ఆందోళన, నిరాశ వంటి సాధారణ మానసిక సమస్యలకు చికిత్స అవకాశాలు వైవిద్యంగా మార్చడం, పెంచడం. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, మరింత సమర్థంగా అందించేందుకు టాస్క్-షేరింగ్ విధానాలు, డిజిటల్ సాంకేతికతల వినియోగం(డబ్ల్యూహెచ్ఓ, 2022).
యూనివర్సల్ హెల్త్ కవరేజీ(యూహెచ్‌సీ)లోకి మానసిక వైద్య సంరక్షణను భాగం చేసేందుకు అనేక వ్యూహాలను డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది.

యూహెచ్‌సీలో మానసిక వైద్య సంరక్షణను భాగం చేయడం ద్వారా మొత్తం ఆరోగ్య ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని, చికిత్స అంతరాలు తగ్గుతాయని, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారి జీవననాణ్యత మెరుగవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది.
వివిధ ప్రోత్సాహక, నివారణ కార్యక్రమాలు, బహుళ రంగాల సహకారం, సమన్వయాన్ని ప్రోత్సహించడం, ప్రారంభించడం, సులభతరం చేయడం ద్వారా గణనీయ సహకారం అందించవచ్చు.
మానసిక ఆరోగ్యం మెరుగుపరిచేందుకు భారతదేశ సమగ్ర చర్యలు
విధానాలు
నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్(ఎన్ఎంహెచ్‌పీ)-1982
దేశంలో పెరుగుతున్న మానసిక రుగ్మతలు, మానసిక వైద్య సేవలు సరిపడా లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు 1982లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రాథమిక లక్ష్యం: మానసిక వైద్యాన్ని సాధారణ వైద్య సంరక్షణ వ్యవస్థతో ఏకీకృతం చేయడం, అందరికీ అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమ లక్ష్యం.
డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్(డీఎంహెచ్‌పీ)-1996
కర్ణాటకలో చేపట్టిన బళ్లారి మోడల్ ఆధారంగా 1996లో 4 జిల్లాల్లో డీఎంహెచ్‌పీ ప్రారంభమైంది. ఇది ఎన్ఎంహెచ్‌పీలో భాగం.
పరిధి: 9వ పంచవర్ష ప్రణాళిక సమయంలో 27 జిల్లాలకు డీఎంహెచ్‌పీని విస్తరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 767 జిల్లాల్లో అమలులో ఉంది.
అందించే సేవలు:
- కౌన్సిలింగ్, ఔట్‌పేషెంట్ చికిత్స
- జిల్లా స్థాయిలో 10 పడకల ఇన్‌పేషెంట్ సౌకర్యం
- ఆత్మహత్యల నివారణ కార్యక్రమాలు
- మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు
ప్రతి జిల్లాకు ఉండాల్సిన బృందం: సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్/కమ్యూనిటీ నర్స్, మానిటరింగ్ & ఎవాల్యుయేషన్ ఆఫీసర్, కేస్ రిజిస్ట్రీ అసిస్టెంట్, వార్డ్ అసిస్టెంట్
కీలక విభాగాలు:
ముందుగా గుర్తించడం, చికిత్స అందించడం
సాధారణ ఫిజీషియన్లకు స్వల్పకాల శిక్షణ
మానసిక అనారోగ్యాన్ని గుర్తించేలా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ
ప్రజలకు అవగాహన కలిగించే ప్రచార కార్యక్రమాలు
పర్యవేక్షణ కోసం రికార్డు నిర్వహణ
అమలు విధానం: ఇది సమాజ-ఆధారిత నమూనా. ప్రధానంగా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, కళంకాన్ని తగ్గించడం, త్వరగా గుర్తించి చికిత్స అందించడం, సేవల ప్రణాళిక, పరిశోధన కోసం డేటా సేకరించడంపై దృష్టి సారిస్తుంది.
నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ(ఎన్ఎస్‌పీఎస్)-2022
2022లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది.
లక్ష్యం: 2030 నాటికి ఆత్మహత్యల రేటును 10 శాతానికి తగ్గించడం.
కీలక విభాగాలు:
పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్య పరీక్షలు చేయడం
హెల్ప్‌లైన్లు, మానసిక సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయడం
సామాజిక వివక్షను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం
పని ప్రదేశాల్లో మానసిక వైద్యంపై కార్యక్రమాలు చేయడం
లక్షిత బృందాలు: చికిత్స, నివారణే లక్ష్యంగా విద్యార్థులు, రైతులు, యువత, ఇతర అధిక ముప్పు ఉండే ప్రజలపై ప్రధాన దృష్టి ఉంటుంది.
శిక్షణ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణ
మానసిక వైద్య సంరక్షణ నిపుణులకు శిక్షణ
మౌలిక సదుపాయాల అభివృద్ధి:
దేశవ్యాప్తంగా 47 రాష్ట్ర ప్రభుత్వ మెంటల్ హాస్పిటళ్లు ఉన్నాయి. కేంద్ర సంస్థలుగా బెంగళూరులో ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్, తేజ్‌పూర్‌లో ఎల్‌జీబీఆర్ఐఎంహెచ్, రాంచితో సీఐపీ ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్‌లో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

మానవవనరుల అభివృద్ధి పథకం ఏ - సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్
సైకియాట్రి, క్లినికల్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్, నర్సింగ్ వంటి కోర్సుల బలోపేతానికి మొత్తం 25 సీఓఈలు మంజూరయ్యాయి.
11వ ప్రణాళిక(2007-2012): ఒక్కోటి రూ.30 కోట్లతో 11 సీఓఈలు
12వ ప్రణాళిక(2021-2017): ఒక్కోటి రూ.33.70 కోట్ల వ్యయంతో 10 సీఓఈలు
12వ ప్రణాళిక తర్వాత(2017-2018): ఒక్కోటి రూ.36.96 కోట్లతో 4 సీఓఈలు
మూలధన వ్యయం, పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలు, అధ్యాపకుల ఖర్చులు అన్నింటికీ ఈ గ్రాంట్ వర్తిస్తుంది. తృతీయ స్థాయి సంరక్షణ అందించడంతో పాటు పీజీ సీట్ల సృష్టి, పరిశోధన నిర్వహణ, డీఎంహెచ్‌పీ అమలుకు ఈ గ్రాంట్ వర్తిస్తుంది.
మానవవనరుల అభివృద్ధి పథకం బీ - పీజీ విభాగం నవీకరణ:
19 ప్రభుత్వ సంస్థల్లో మొత్తం 47 పీజీ విభాగాల ఏర్పాటు
- 11వ ప్రణాళిక(2009-2011): ఒక్కోటి రూ.51 లక్షల నుంచి రూ.1 కోటితో 11 సంస్థల్లో 27 విభాగాల ఏర్పాటు
- 12వ ప్రణాళిక(2015-16): ఒక్కోటి రూ.0.85-0.99 కోట్లతో 4 సంస్థల్లో 13 విభాగాల ఏర్పాటు
- 12వ ప్రణాళిక తర్వాత(2017-2018): ఒక్కోటి రూ.1.89-2.20 కోట్లతో 4 సంస్థల్లో 7 విభాగాల ఏర్పాటు
డిజిటల్ శిక్షణ కార్యక్రమాలు:
డిజిటల్ శిక్షణ సంస్థలు(2018 నుంచి): ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్, ఎల్‌జీబీఆర్ఐఎంహెచ్, సీఐపీ రాంచిలో ఏర్పాటు, 1,76,454 మంది వైద్య నిపుణులకు శిక్షణ.
ఐగాట్-దీక్ష వేదిక(2020): ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ, క్షేత్రస్థాయిలో సామర్థ్యాల పెంపు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా మానసిక ఆరోగ్య సంరక్షణ బలోపేతం
సంపూర్ణ ఆరోగ్యంలో మానసిక ఆరోగ్య సంరక్షణ కీలక విభాగమని గుర్తిస్తూ, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ప్రాథమిక చికిత్సలో మానసిక ఆరోగ్య సేవలను భాగం చేసింది.
ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా 1.75 లక్షల సబ్ హెల్త్ సెంటర్లు(ఎస్‌హెచ్‌సీ), ప్రైమరీ హెల్త్ సెంటర్లు(పీహెచ్‌సీ) ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వీటిల్లో ప్రాథమిక మానసిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యాంశాలు:
సమీకృత మానసిక వైద్య సేవలు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అందించే ప్రాథమిక ఆరోగ్య సేవల్లో కీలక విభాగంగా మానసిక వైద్య సేవలను చేర్చడం.
ఆర్థిక భద్రత: ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై పథకం ద్వారా అందిస్తున్న రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమా మానసిక సమస్యలకు కూడా వర్తిస్తుంది. ఈ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం మధ్య రూ.120.19 కోట్లతో 1.35 లక్షల మంది వైద్యం పొందారు(పార్లమెంటు ప్రశ్న, 2023).
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమం కింద ఇంటెలెక్చవల్ డిసబిలిటీ, సైజోఫెర్నియా, సైజోటైపల్, డెలుషనల్ డిజార్డర్స్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్టర్ వంటి 22 రకాల మానసిక రుగ్మతలకు నగదు రహిత వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో పాటు రాష్ట్రాలు కూడా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా చికిత్సలను మార్చుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది(పత్రికా సమాచార కార్యాలయం, 2024 మార్చి 25).
అదనంగా, కౌన్సిలింగ్, సైకియాట్రిక్ కేర్ సహా మానసిక రుగ్మతలకు అవసరమైన వివిధ చికిత్సలకు ఈ పథకం వర్తిస్తుంది. చికిత్స అంతరాలను తగ్గించడం, వ్యక్తులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సరైన మానసిక వైద్యసేవలను పొందేలా చూడటం వీటి లక్ష్యం.
టెలీసైకియాట్రి సౌలభ్యం: వెనుకబడిన ప్రాంతాల్లో మానసిక వైద్య సేవల సౌలహ్యాన్ని పెంచేందుకు టెలీమానస్ ద్వారా టెలీమెడిసిన్ సేవలు.
సామర్థ్య నిర్మాణం, అవగాహన:
మానసిక అనారోగ్యాన్ని గుర్తించేలా ఆరోగ్య సంరక్షకులకు శిక్షణ, ప్రజల్లో కళంకాన్ని తగ్గించేలా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు.
జిల్లా మానసిక వైద్య కార్యక్రమం(డీఎంహెచ్‌పీ) సేవల విస్తరణ: డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఔట్‌పేషెంట్ చికిత్స, కౌన్సిలింగ్, మందులు, అత్యవసర సేవలను అందిస్తున్నాయి.
కొవిడ్-19 ప్రతిస్పందన(2020)
మహమ్మారి సమయంలో బాధితుల్లో ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొనేలా మానసిక సహకారం అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 24/7 జాతీయ హెల్ప్‌లైన్(080-4611 0007) ప్రారంభించింది(పత్రికా సమాచార కార్యాలయం, 2021).
టెలీమానస్ మొబైల్ యాప్, వీడియో కన్సల్టేషన్
టెలీమానస్ - టోల్-ఫ్రీ మానసిక వైద్య సేవ
ప్రారంభం: 2022లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం రోజు
కవరేజీ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
టోల్ ఫ్రీ నెంబర్లు: 14416, 1-800-891-4416
వినియోగం: 2025 అక్టోబర్ నాటికి టెలీమానస్‌కు 28,38,322 ఫోన్లు వచ్చాయి.
టెలీమానస్ మొబైల్ యాప్
లక్షణాలు:
స్వయం సంరక్షణ చిట్కాలతో సమాచార గ్రంథాలయం
ఒత్తిడి లక్షణాలు గుర్తించేలా మార్గదర్శకం
ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగ సమస్యలు ఎదుర్కొనే శిక్షణ
దేశవ్యాప్తంగా సుశిక్షితులైన కౌన్సిలర్లు, నిపుణులతో గోప్యమైన సహకారం
వీడియో కన్సల్టేషన్ ఫీచర్
ప్రారంభం: 2024 అక్టోబర్ 10న(పైలట్)
పైలట్ రాష్ట్రాలు: కర్ణాటక, తమిళనాడు, జమ్ము కశ్మీర్
దేశవ్యాప్తంగా ప్రారంభం: 2025 జూన్ 16న
కార్యాచరణ:
మానసిక వైద్య నిపుణులు(సైకాయాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్ నర్స్) ఆడియో సంప్రదింపులు, వీడియో ఆధారిత క్లినికల్ సేవలు అందించవచ్చు. కేవలం సైకియాట్రిస్ట్‌లకు మాత్రమే ఈ-ప్రిస్క్రిప్షన్‌లు ఇచ్చే అధికారం ఉంది.
వినియోగం: 1,242 వీడియో కాల్స్(2025 అక్టోబర్ 27 నాటికి)
గుర్తింపు
డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు: మానసిక ఆరోగ్య సంరక్షణ అందించడంలో టెలీమానస్ వినూత్న, సమర్థవంతమైన నమూనాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది.
భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధిగా ఉన్న డాక్టర్ రొడెరికో హెచ్. ఆఫ్రిన్.. మానసిక వైద్య ఫలితాల సామర్థ్యాలు పెంపొందించడంలో ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రధానంగా చెప్పారు. భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రాముఖ్యతనూ ఆయన ప్రస్తావించారు(2024 అక్టోబర్‌లో యాప్ ప్రారంభోత్సవంలో).
మూలం: “రాపిడ్ అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆన్ టెలీ మానస్: టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్”, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, 2024.
ఇటీవల పరిణామాలు
మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ 2024-25 ఆర్థిక సర్వే మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అంటే మానసిక-భావోద్వేగ, సామాజిక, జ్ఞాన సంబంధ, శారీరక కోణాలతో కూడినదని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సమగ్ర సమాజ దృష్టికోణం విధానాన్ని అవలంభించాల్సిన అవసరాన్ని పేర్కొనడంతో పాటు ఆచరణీయమైన, ప్రభావవంతమైన నివారణ వ్యూహాలు, చికిత్స ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించింది. భారతదేశ జనాభా ప్రయోజనం కేవలం నైపుణ్యాలు, విద్య, శారీరక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉండదని, ముఖ్యంగా యువత మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరమని తెలిపింది.
సర్వేలోని పలు కీలక సిఫార్సులు:
పాఠశాలల్లో మానసిక వైద్య విద్య బలోపేతం: విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి, ప్రవర్తన సమస్యలపై ప్రారంభంతోనే జోక్యం చేసుకోవడం.
పనిప్రదేశంలో మానసిక వైద్య విధానాలు పెంపొందించడం: ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడి, సుదీర్ఘ పని గంటలలను ఎదుర్కొనే విధానాల అమలు.
డిజిటల్ మానసిక వైద్య సేవలు పెంచడం: టెలీమానస్‌ను బలోపేతం చేయడం, ఏఐ-ఆధారిత మానసిక వైద్య పరిష్కారాలు అందించడం.
ముగింపు
మానసిక ఆరోగ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సవాలుగా కొనసాగుతోంది. ఇది వ్యక్తులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా బలహీన వర్గాలపై అధిక ప్రభావం చూపుతోంది. టెలీ మానస్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్ గణనీయ పురోగతి సాధించినప్పటికీ, మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అవగాహనను బలోపేతం చేయడం, సిబ్బందికి శిక్షణను విస్తరించడం, డిజిటల్ పరిష్కారాల్లో పెట్టుబడి పెట్టడం, అందరికీ అందుబాటులో ఉండే, సమ్మిళిత, వివక్షలేని మానసిక వైద్య సంరక్షణ అందరికీ అందేలా సమగ్ర విధానాన్ని అమలు చేయడం అవసరం.
మనీషా వర్మ
మాజీ ఏడీజీ(మీడియా)
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
***
(Features ID: 156083)
Visitor Counter : 13
Provide suggestions / comments