Farmer's Welfare
జాతీయ పాల దినోత్సవం
प्रविष्टि तिथि:
25 NOV 2026 10:51 AM
“భారత పాడి పరిశ్రమ బలం, రైతు సౌభాగ్యానికి వేడుక”
భారత పోషకాహారం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాలకు కీలక స్థానం
భారత ప్రజల పోషకాహారంలో పాలకు కీలక స్థానం ఉంది. జంతు మూలాల నుంచి లభించే నాణ్యమైన ప్రొటీన్లతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం సులువుగా గ్రహించగల రూపంలో పాలు అందిస్తాయి. దాదాపు సంపూర్ణ ఆహారంగా పరిగణించే పాలు అన్ని వయసులవారి ఎదుగుదల, ఎముకల ఆరోగ్యం, శారీరక చురుకుదనానికి తోడ్పడతాయి.
ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటాను అందిస్తోంది. 2014-15 నుంచి 2024-25 మధ్య పాల ఉత్పత్తి 5.41 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) పెరిగి 247.87 మిలియన్ టన్నులకు చేరింది. ఈ వృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ ఎంతో ప్రాధాన్యం ఉంది. పాడి పరిశ్రమ 8.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. పాల ఉత్పత్తి, సేకరణలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భారత్‌లో పాడి పశుపోషణలో పనిచేసేవారిలో దాదాపు 70 శాతం మహిళలే. ఈ రంగం వృద్ధిలో వారి కృషిని, అందరినీ కలుపుకొని సాగే గ్రామీణ అభివృద్ధిలో పాడి పరిశ్రమ పాత్రను ఇది చాటిచెబుతోంది.
భారత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత పాడి సహకార ఉద్యమంలో పరివర్తన తీసుకొచ్చిన ఆయన కృషికి ఈ దినోత్సవం గుర్తింపునిస్తుంది. దేశాన్ని పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలబెడుతున్న లక్షలాది పాడి రైతుల కృషిని గౌరవిస్తుంది.
భారత పాడి పరిశ్రమలో గణనీయమైన వృద్ధి
పాల ఉత్పత్తి, ఉత్పాదకతలో నిరంతర వృద్ధితో ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
- పాల ఉత్పత్తి 2014-15లో 146.31 మిలియన్ టన్నుల నుంచి 2024-25లో 247.87 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది 69.41 శాతం వృద్ధి.
- పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ (15.66 శాతం), రాజస్థాన్ (14.82 శాతం), మధ్యప్రదేశ్ (9.12 శాతం), గుజరాత్ (7.78 శాతం), మహారాష్ట్ర (6.71 శాతం) ముందున్నాయి. దేశ మొత్తం పాల ఉత్పత్తిలో ఈ ఐదు రాష్ట్రాల వాటా 54.09 శాతం.
- తలసరి పాల లభ్యత 2014-15లో రోజుకు 319 గ్రాముల నుంచి 2024-25లో 485 గ్రాములకు పెరిగింది. ఇది 52.03 శాతం వృద్ధి.
- ఆవులు, గేదెల సగటు పాల ఉత్పాదకత 2014-15లో ఒక్కో పశువుకు ఏడాదికి 1,640 కిలోల నుంచి 2024-25లో 2,800 కిలోలకు పెరిగింది. ఇది 69 శాతం వృద్ధి.

భారత పాల ఆర్థిక వ్యవస్థ వెనుక సహకార సంస్థల బలం
భారత పాడి సహకార ఉద్యమం పాల ఉత్పత్తిదారులకు వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. గ్రామస్థాయి సంఘాలను జిల్లా పాల సంఘాలు, రాష్ట్ర సమాఖ్యలతో అనుసంధానిస్తోంది. ఈ సంస్థలు పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పాడి పరిశ్రమ సేవల అందుబాటుకు తోడ్పడుతున్నాయి.
దేశ పాడి సహకార వ్యవస్థలో ఉన్న సంస్థలు, విస్తరణ:
- 22 పాల సమాఖ్యలు.
- 241 జిల్లా సహకార పాల సంఘాలు.
- 28 మార్కెటింగ్ డెయిరీలు.
- 25 పాల ఉత్పత్తిదారుల సంస్థలు.
- సుమారు 2.45 లక్షల గ్రామాల్లో విస్తరణ, సభ్యులుగా 1.65 కోట్ల మంది పాడి రైతులు.
గ్రామీణ పాల ఉత్పత్తిదారులు, వ్యవస్థీకృత పాడి మార్కెట్ల మధ్య ఈ వ్యవస్థ సంస్థాగత అనుసంధానాన్ని అందిస్తోంది. సమష్టి మార్కెటింగ్‌కు, మెరుగైన వ్యవస్థీకృత పాల సేకరణ విధానాల అందుబాటుకు కూడా తోడ్పడుతోంది.
ఎన్డీడీబీ డెయిరీ సర్వీసెస్
భారత్‌లో రైతుల యాజమాన్యంలోని పాడి సంస్థల అభివృద్ధిలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) ముఖ్యమైన పాత్ర పోషించింది. దీని పూర్తి యాజమాన్యంలో ఉన్న, లాభాపేక్ష లేని అనుబంధ సంస్థ ఎన్డీడీబీ డెయిరీ సర్వీసెస్ (ఎన్డీడీబీ-డీఎస్), పాల ఉత్పత్తిదారుల సంస్థల (ఎంపీవోలు) ఏర్పాటు, కార్యకలాపాల ప్రారంభానికి తోడ్పడుతోంది.
ఎంపీవోలు రైతుల యాజమాన్యంలోని ఉత్పత్తిదారుల కంపెనీలు. ఇవి పాల ఉత్పత్తిదారులను నిపుణుల నిర్వహణలో నడిచే సంస్థలుగా సంఘటితం చేస్తాయి. సమష్టి పాల సేకరణకు వీలు కల్పిస్తాయి, మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేస్తాయి, పారదర్శక ధరల విధానం, నేరుగా బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు పొందే సదుపాయాన్ని రైతులకు అందిస్తాయి.
2026 అక్టోబర్ 31 నాటికి,
- ఎన్డీడీబీ-డీఎస్ విజయవంతంగా 25 ఎంపీవోలను ఏర్పాటు చేసింది.
- ఈ 25 ఎంపీవోల్లో 18 సంస్థల్లో సభ్యులందరూ మహిళలే. ఆయా సంస్థల బోర్డుల్లో ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహించే డైరెక్టర్లందరూ మహిళలే.
- 12 రాష్ట్రాల్లోని 175 జిల్లాల్లో 13 లక్షల మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు ఈ సంస్థలు సేవలందిస్తున్నాయి.
- ఈ సంస్థల్లోని ఉత్పత్తిదారుల్లో దాదాపు 78 శాతం మహిళలే.
- ఎంపీవోలు రోజుకు సుమారు 70 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి.

పాడి సహకార సంస్థల పాల సేకరణ, విక్రయాలు
పాడి సహకార సంస్థలు రైతులకు వ్యవస్థీకృత మార్కెట్‌ను అందిస్తూ, క్రమం తప్పకుండా పాల సేకరణ జరిగేలా తోడ్పడుతున్నాయి. ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా సహకార సంస్థలు, ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలను నిర్ణయిస్తాయి. అనేక పాడి సహకార సంస్థలు స్వయంచాలక పాల సేకరణ, చెల్లింపు వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి.
2026 అక్టోబర్ 31 నాటికి పాడి సహకార సంస్థలు నమోదు చేసిన వివరాలు:
- రోజుకు 690.90 లక్షల కిలోల పాల సేకరణ.
- రోజుకు 462.95 లక్షల లీటర్ల ద్రవరూప పాల విక్రయాలు.
పాడి సహకార సంస్థలకు కొత్త ఊపు
సహకార సంస్థల ఆధ్వర్యంలో సాగే వైట్ రెవల్యూషన్ 2.0 కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 25న అధికారికంగా ప్రారంభించారు (ప్రామాణిక నిర్వహణ విధానమైన ఎస్ఓపీని 2024 సెప్టెంబర్ 19న ప్రారంభించారు). ఇప్పటివరకు పాడి సహకార సంస్థల పరిధిలో లేని గ్రామాలు, పంచాయతీలకు వాటి సేవలను విస్తరించడం దీని లక్ష్యం. వచ్చే ఐదేళ్లలో పాడి సహకార సంస్థల పాల సేకరణను 50 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహకార వ్యవస్థను బలోపేతం చేయడం, మార్కెట్ అందుబాటును మెరుగుపరచడం, ఉపాధి కల్పించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది. వైట్ రెవల్యూషన్ 2.0 కింద ప్రతిపాదించిన కార్యకలాపాలకు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్మెంట్ (ఎన్పీడీడీ) ద్వారా నిధులు అందిస్తున్నారు.
2028-29 నాటికి ఇప్పటివరకు సేవలు అందని గ్రామాలు, పంచాయతీల్లో 75,000 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న 46,422 పాడి సహకార సంఘాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
2026 అక్టోబర్ 31 నాటికి వైట్ రెవల్యూషన్ 2.0 కింద పురోగతి:
- 24,097 కొత్త పాడి సహకార సంఘాల ఏర్పాటు.
- ఇప్పటికే ఉన్న 31,394 పాడి సహకార సంఘాల బలోపేతం.
పాడి రంగంలో సుస్థిరత, వనరుల పునర్వినియోగం
1. పాడి రంగ విలువ గొలుసు అంతటా సుస్థిరత, వనరుల పునర్వినియోగాన్ని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రోత్సహిస్తోంది. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకున్న పద్ధతులు, సమర్థ వనరుల వినియోగం, పునరుత్పాదక, తక్కువ ఉద్గారాల పరిష్కారాలకు ఊతమిస్తోంది. ‘గోల్డ్ అవుట్ ఆఫ్ గార్బేజ్’ లక్ష్యాన్ని, అంటే పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలను బయోగ్యాస్, సేంద్రియ ఎరువు, అదనపు విలువ కలిగిన జీవ ఎరువులుగా మార్చడాన్ని, రెండు బహుళ రాష్ట్ర సహకార సంఘాల ద్వారా ముందుకు తీసుకెళ్తోంది:
- కోఆపరేటివ్ ఇన్పుట్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ మల్టీ-స్టేట్ లిమిటెడ్: పశుదాణా, వ్యాధి నియంత్రణ, కృత్రిమ గర్భధారణ సహా నాణ్యమైన ఉత్పాదకాలు, సేవలను అందించడం దీని లక్ష్యం.
- గోమయ్ సహకారీ సమితి మల్టీ-స్టేట్ లిమిటెడ్: పశువుల పేడను శాస్త్రీయంగా నిర్వహించడం, వినియోగించడంపై ఇది దృష్టి సారిస్తుంది.
2. నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ స్కీమ్ ‘గోబర్ధన్’ను 2026 అక్టోబర్ 01న ప్రారంభించారు. దేశంలోని సేంద్రియ వనరులను స్వచ్ఛ ఇంధనం, గ్రామీణ సౌభాగ్యం, ఆర్థిక వృద్ధికి ఆధారంగా మలచడం దీని లక్ష్యం. రూ. 23,731 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు చేస్తారు.
ఉత్పత్తి కొనుగోలుకు హామీ, స్థిరమైన ధరలు, మూలధన సాయం, పైప్‌లైన్ అనుసంధానం, రుణ సాయం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని దాదాపు పది రెట్లకు పెంచాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, వనరుల పునర్వినియోగంపై ఆధారపడిన జీవ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఇది తోడ్పడుతుంది.
గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్ (గోబర్ధన్) కార్యక్రమాన్ని తొలుత 2018లో స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద ప్రారంభించారు. పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు సహా సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్, బయో-స్లరీగా మార్చడాన్ని ఇది ప్రోత్సహిస్తోంది. గ్రామాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ జీవనోపాధికి తోడ్పడుతోంది.
ఈ కార్యక్రమాలు వనరుల పునర్వినియోగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
పటిష్ఠ పాడి పరిశ్రమ వ్యవస్థ నిర్మాణం
భారత పాడి పరిశ్రమ పటిష్ఠ మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ పద్ధతుల్లో జాతుల అభివృద్ధి, నాణ్యమైన దాణా, అందుబాటులో ఉండే పశువైద్య సేవలపై ఆధారపడి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశాలను బలోపేతం చేస్తున్నాయి, పశువుల ఉత్పాదకతను మెరుగుపరుస్తున్నాయి, పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాయి, పాడి రైతులకు మెరుగైన ఆదాయం అందేలా తోడ్పడుతున్నాయి.
ఎన్పీడీడీ ద్వారా పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల బలోపేతం
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్మెంట్ (ఎన్పీడీడీ) దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచడం, పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. పాల సేకరణ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్, పాల నాణ్యతకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు మద్దతు అందిస్తోంది.
రెండు భాగాల ద్వారా పాడి పరిశ్రమ సమతుల్య వృద్ధిని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది:
ఏ భాగం: పాల సేకరణ, నాణ్యత మౌలిక సదుపాయాల బలోపేతం
ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవస్థీకృత పాల సేకరణ నెట్‌వర్క్‌ల విస్తరణ, పాల ప్రాసెసింగ్, విలువ జోడింపు మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తుంది. గ్రామస్థాయి కోల్డ్ చైన్ వ్యవస్థలు, పాల పరీక్ష సదుపాయాలు, నాణ్యమైన, పరిశుభ్రమైన పాల ఉత్పత్తిపై శిక్షణకు కూడా మద్దతు ఇస్తుంది.
బీ భాగం: సహకార సంస్థల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి
రైతులకు వ్యవస్థీకృత మార్కెట్ల అందుబాటును మెరుగుపరచడం ద్వారా పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలను పెంచడం దీని లక్ష్యం. పాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు అందిస్తుంది. రైతులకు మెరుగైన ప్రతిఫలం అందేలా ఉత్పత్తిదారుల యాజమాన్యంలోని సంస్థలను బలోపేతం చేస్తుంది.
బీ- భాగం.. ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ అనే తొమ్మిది రాష్ట్రాల్లో అమలవుతోంది.
2026 అక్టోబర్ 31 నాటికి ఎన్పీడీడీ కింద భౌతిక ప్రగతి
- 40,800 కొత్త పాడి సహకార సంఘాల ఏర్పాటు/పునరుద్ధరణ.
- అదనంగా 25.82 లక్షల మంది రైతుల నమోదు, అదనపు పాల సేకరణ 161.17 లక్షలు.
- రోజుకు 168 లక్షల లీటర్ల పాల శీతలీకరణ సామర్థ్యం కల్పన.
- 94,000 పాల నాణ్యత పరీక్ష పరికరాల పంపిణీ.
రాష్ట్రీయ గోకుల్ మిషన్
దేశీయ ఆవు, గేదె జాతులను శాస్త్రీయంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడం, సంరక్షించడం కోసం ప్రత్యేకంగా 2014 డిసెంబర్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం)ను ప్రారంభించారు. పెరుగుతున్న పాల డిమాండ్‌ను తీర్చేందుకు పశువుల పాల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో ఈ పథకం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దేశంలోని గ్రామీణ రైతులకు పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా మార్చేందుకు తోడ్పడుతోంది. 2025 మార్చిలో సవరించిన ఈ పథకం, సంతానోత్పత్తి మౌలిక సదుపాయాల బలోపేతం, అధునాతన సంతానోత్పత్తి సాంకేతికతల అందుబాటు విస్తరణపై దృష్టి సారిస్తోంది. వీర్య కేంద్రాలను బలోపేతం చేయడం, కృత్రిమ గర్భధారణ సేవలను విస్తరించడం, లింగ ఆధారంగా వేరు చేసిన వీర్యం & ఐవీఎఫ్ సాంకేతికత వంటి అధునాతన పద్ధతులతో జాతుల మెరుగుదలను వేగవంతం చేయడం ఇందులో భాగంగా ఉన్నాయి.
ఆర్జీఎం కింద పురోగతి,
- గ్రామీణ భారత్‌లో 50,023 మంది బహుళ ప్రయోజన కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులకు (మైత్రీలు) శిక్షణ & పరికరాల అందజేత.
- 24 ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ప్రయోగశాలల ఏర్పాటు.
- 48 వీర్య కేంద్రాల బలోపేతం కొనసాగుతోంది.
- 32 ఆడ దూడల పెంపక కేంద్రాలకు ఆమోదం.
నేషన్వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్ఏఐపీ)
కృత్రిమ గర్భధారణ సేవల పరిధిని విస్తరించడం, దేశీయ జాతులు సహా మెరుగైన జన్యు లక్షణాలు ఉన్న ఆబోతుల వీర్యంతో నాణ్యమైన కృత్రిమ గర్భధారణ సేవలను రైతుల ఇంటి వద్దకే అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
- 18.71 కోట్లకు పైగా కృత్రిమ గర్భధారణలు నిర్వహించారు.
- దాదాపు 11.17 కోట్ల పశువులకు సేవలు అందించారు.
యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఏహెచ్ఐడీఎఫ్)
యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఏహెచ్ఐడీఎఫ్) ప్రైవేటు రంగం, సహకార సంస్థల్లో ఆధునిక పాల ప్రాసెసింగ్, విలువ జోడింపు, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలకు మద్దతు అందిస్తోంది.
- అర్హులైన లబ్ధిదారులకు ఎనిమిదేళ్లపాటు 3 శాతం వడ్డీ రాయితీ అందిస్తుంది.
- 2020-21 నుంచి ఏహెచ్ఐడీఎఫ్ ద్వారా ప్రైవేటు రంగం, సహకార సంస్థలకు చెందిన 258 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లకు 3 శాతం వడ్డీ రాయితీతో మద్దతు అందించారు. దీనివల్ల సుమారు రూ. 21,797 కోట్ల పెట్టుబడులకు ఊతం లభించింది.
- రోజుకు 500.58 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యం, విలువ జోడింపు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్
పశుపోషకులకు ఆర్థిక నష్టం కలిగించే ప్రధాన పశువ్యాధుల నివారణ, నియంత్రణకు లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎల్హెచ్డీసీపీ) మద్దతు అందిస్తోంది. పశువైద్య మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేస్తోంది. సంచార పశువైద్య యూనిట్ల (ఎంవీయూలు) ద్వారా ఇంటి వద్దకే పశువైద్య సేవలను అందిస్తోంది.
2026 అక్టోబర్ 31 నాటికి,
- 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 4,019 ఎంవీయూలు పనిచేస్తున్నాయి.
- ఈ యూనిట్లు సుమారు 1.5 కోట్ల మంది రైతులకు ఇంటి వద్దకే సేవలను అందించాయి, సుమారు 3.3 కోట్ల పశువులకు చికిత్స చేశాయి.
నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్
ఎల్హెచ్డీసీపీలో భాగమైన నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏడీసీపీ), టీకాలు, వ్యాధులపై నిఘా ద్వారా గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండీ) నియంత్రణ, అంతిమంగా నిర్మూలనకు మద్దతు అందిస్తోంది. బ్రూసెల్లోసిస్ నియంత్రణకూ తోడ్పడుతోంది.
2026 అక్టోబర్ 31 నాటికి,
- మొత్తం ఎఫ్ఎండీ టీకా డోసుల సంఖ్య 152 కోట్లకు పైగా చేరింది. సుమారు 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగింది.
- ఎఫ్ఎండీ వ్యాప్తి ఘటనలు 2019లో 132 నుంచి 2025లో 40కి తగ్గాయి.
- బ్రూసెల్లోసిస్ వ్యాప్తి ఘటనలు 2019లో 22 నుంచి 2025లో 15కి తగ్గాయి.
భారత్ పశుధన్ ద్వారా డిజిటల్ పశువుల రికార్డులు
జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) సహకారంతో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ “భారత్ పశుధన్” డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో నమోదైన పశువులను “పశు ఆధార్”గా పిలిచే 12 అంకెల ప్రత్యేక చెవి ట్యాగ్ సంఖ్యతో గుర్తిస్తారు. పశువులకు సంబంధించిన టీకాలు, సంతానోత్పత్తి, చికిత్స వంటి అన్ని కార్యకలాపాలను నమోదు చేసేందుకు ఈ సంఖ్య ప్రధాన గుర్తింపుగా ఉపయోగపడుతుంది. గుర్తింపు ఉన్న పశువుల డిజిటల్ రికార్డును ఈ డేటాబేస్ అందిస్తూ పశువుల నిర్వహణకు తోడ్పడుతోంది.
2026 అక్టోబర్ 31 నాటికి,
- 9,98,55,955 మంది పశువుల యజమానులు నమోదు చేసుకున్నారు.
- 39.42 కోట్లకు పైగా పశు ఆధార్లను జారీ చేశారు.
ప్రపంచ మార్కెట్లలో భారత పాల ఉత్పత్తులు
భారత పాడి పరిశ్రమ విస్తారమైన దేశీయ మార్కెట్‌కు సేవలందించడంతోపాటు అంతర్జాతీయంగానూ తన ఉనికిని విస్తరిస్తోంది.
- 2025-26లో భారత్ 97,524.82 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
- ఆ ఏడాది ఎగుమతి ఆదాయం 407.12 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది.
- ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, బహ్రెయిన్ ఉన్నాయి.
విభిన్న అంతర్జాతీయ మార్కెట్లకు భారత పాల ఉత్పత్తులు చేరుతున్న తీరును ఈ ఎగుమతులు ప్రతిబింబిస్తున్నాయి. దేశీయ వినియోగానికి మించి పాడి పరిశ్రమ విస్తరిస్తున్న విషయాన్ని చాటుతున్నాయి.
ప్రతి పాల చుక్క వెనుక ఉన్న శక్తి
భారత పాడి పరిశ్రమ ప్రయాణం లక్షలాది మంది రైతులు, మహిళలు, సహకార సంస్థల కృషిని ప్రతిబింబిస్తోంది. పెరుగుతున్న పాల ఉత్పత్తి, పటిష్ఠ మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ పద్ధతుల్లో జాతుల అభివృద్ధి, మెరుగైన పశువైద్య సేవలు ఈ రంగం అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్నాయి. డాక్టర్ వర్గీస్ కురియన్ వారసత్వాన్ని జాతీయ పాల దినోత్సవం గౌరవిస్తుంది. భారత్‌ను పాడి పరిశ్రమలో అగ్రస్థానంలో నిలబెడుతూ, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ, దేశ పోషకాహార భద్రతకు తోడ్పడుతున్న రైతుల కృషికి గుర్తింపునిస్తుంది.
References
Ministry of Fisheries, Animal Husbandry and Dairying
https://www.dahd.gov.in/static/uploads/2026/06/9ae804b82e59e283443396dbb5a245e0.pdf
https://www.dahd.gov.in/static/uploads/2026/04/29232c53442fadce97015a62fd715e74.pdf
https://www.nddbdairyservices.com/milkproducer
https://www.nddbdairyservices.com/aboutUs
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241603®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287675®=48&lang=2
https://www.dahd.gov.in/offerings?page=1
https://www.dahd.gov.in/offerings/schemes-and-services/details/national-programme-for-dairy-development-npdd-EjN5UTMtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298197®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110279®=3&lang=2
https://www.dahd.gov.in/offerings/schemes-and-services/details/livestock-health-disease-control-program-lhdcp-MzN5UTMtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204580
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298199
https://bharatpashudhan.ndlm.co.in/
Ministry of Cooperation
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238399®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247837
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291129
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247837®=48&lang=2
https://sansad.in/getFile/annex/268/AU3046_BTEYKH.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294896
Ministry of Commerce and Industry
https://apeda.gov.in/DairyProducts
Ministry of Petroleum & Natural Gas
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2317937&lang=1®=3
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2194086®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2302242
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?id=150838&ModuleId=16®=percent203&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2212724®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/aug/doc202686946301.pdf
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151226)
आगंतुक पटल : 7
Provide suggestions / comments