Infrastructure

భారతీయ వాయుయాన్ నియమ్-2026: భారత విమానయానానికి ఆధునిక నిబంధనావళి

प्रविष्टि तिथि: 04 NOV 2026 18:15 PM

భారత్‌లో పౌర విమానయానం, కొత్త నిబంధనల అవసరం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి. ప్రధాన నగరాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల మధ్య విమాన అనుసంధానం పెరుగుతోంది. 2014లో 74గా ఉన్న కార్యకలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2026 అక్టోబర్ నాటికి 166కు చేరడం దేశ విమానయాన విస్తరణకు నిదర్శనం. ఈ రంగం విస్తరిస్తున్న కొద్దీ విమాన సాంకేతికత, కార్యకలాపాలు, నిధుల సమీకరణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, భద్రతకు ప్రాధాన్యమిస్తూ నియంత్రణ వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ వృద్ధికి స్పష్టమైన, ఆధునికమైన, భద్రతకు ప్రాధాన్యమిచ్చే చట్టపరమైన వ్యవస్థ అవసరం. ఈ ఆధునికీకరణకు భారతీయ వాయుయాన్ అధినియమ్-2024 చట్టపరమైన పునాదిని అందిస్తోంది. దశాబ్దాలపాటు ప్రధాన నిబంధనావళిగా అమల్లో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్-1937 స్థానంలో ఈ చట్టం కింద ప్రభుత్వం భారతీయ వాయుయాన్ నియమ్-2026ను ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు, విమానయాన రంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూనే కీలక భద్రతా అవసరాలను కొనసాగిస్తాయి.

విమానాల రూపకల్పన, ధ్రువీకరణకు మరింత స్పష్టమైన విధానాన్ని నిర్దేశించడం ఈ నిబంధనల్లో ముఖ్యమైన అంశం. విమాన రూపకల్పనలకు ఆమోదం, విడిభాగాల తయారీకి అనుమతి ఇవ్వడం ఇందులో భాగం. తద్వారా రూపకల్పన దేశంగా (స్టేట్ ఆఫ్ డిజైన్) భారత్ స్థానం బలోపేతమవుతుంది. భాగస్వామ్య యాజమాన్యానికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒక విమానంపై పలువురికి సంయుక్త యాజమాన్యాన్ని అనుమతిస్తూనే, దాని కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు ఎవరివో స్పష్టంగా నిర్దేశించేలా చూస్తాయి. విమానాల లీజుకు సంబంధించి కేప్ టౌన్ కన్వెన్షన్ విధానాన్ని భారత్‌లో అమలు చేసే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ యాక్ట్-2025కు తోడుగా, ఇర్రివోకబుల్ డీ-రిజిస్ట్రేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఆథరైజేషన్ (ఐడీఈఆర్‌ఏ) వ్యవస్థ విమానాల నమోదును నిర్ణీత గడువులో రద్దు చేసే ప్రక్రియను అందిస్తుంది. అర్హతగల విమానాల ఎగుమతికీ వీలు కల్పిస్తుంది. కాలక్రమంలో విమానాల కొనుగోలు, లీజు వ్యయాలను తగ్గించేందుకు, విమాన ఛార్జీలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది తోడ్పడవచ్చు. విమానయాన సంస్థల వాణిజ్య వెసులుబాటు, సులభతర వ్యాపార నిర్వహణ, ప్రయాణికుల ప్రయోజనాల పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడం ఈ నిబంధనల లక్ష్యం. విమాన ఛార్జీలు, సంబంధిత రుసుముల్లో మరింత పారదర్శకతను ప్రోత్సహించి ప్రయాణికుల ప్రయోజనాలకు రక్షణను బలోపేతం చేస్తాయి. అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేందుకూ వీలు కల్పిస్తాయి.

భారతీయ వాయుయాన్ నియమ్-2026లో ఎనిమిది అధ్యాయాలు, ఆరు షెడ్యూళ్లలో 220 నిబంధనలు ఉన్నాయి. విమానాల నమోదు, విమానయాన యోగ్యత, సిబ్బంది లైసెన్సులు, ఏరోడ్రోమ్‌ల కార్యకలాపాలు, విమాన నావిగేషన్ సేవలు, విమాన కార్యకలాపాలు వీటి పరిధిలోకి వస్తాయి. నియంత్రణ పర్యవేక్షణ, భద్రతా నిర్వహణ, నిబంధనల అమలు, శిక్షలకు సంబంధించిన అవసరాలను కూడా ఇవి నిర్దేశిస్తాయి. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్-1937, ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్-1920లోని 9వ భాగం స్థానంలో ఇవి అమల్లోకి వస్తాయి. నిర్దేశిత కొనసాగింపు నిబంధనలకు లోబడి రేడియో టెలిఫోన్ ఆపరేటర్ (రిస్ట్రిక్టెడ్) సర్టిఫికెట్ అండ్ లైసెన్స్ రూల్స్-2025ను కూడా ఇవి రద్దు చేస్తాయి.

 



భారతీయ వాయుయాన్ నియమ్-2026లోని కీలక నిబంధనలు
విమానాల రూపకల్పన, సిబ్బంది లైసెన్సుల నుంచి విమానాశ్రయాలు, రోజువారీ విమాన కార్యకలాపాల వరకు పౌర విమానయానానికి సంబంధించిన అంశాలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి. ముఖ్యమైన నిబంధనలు ఇలా ఉన్నాయి:

సాధారణ భద్రత, ప్రజల ప్రవర్తన
విమానాల వినియోగం, నమోదు, గుర్తింపు, సురక్షిత కార్యకలాపాలకు సంబంధించిన అవసరాలను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి.
- విమానాల నమోదు: విమానాలను నమోదు చేయాలి. నిర్దేశిత జాతీయత గుర్తు, నమోదు గుర్తులను విమానంపై ప్రదర్శించాలి.
- విమాన పత్రాలు: చెల్లుబాటులో ఉన్న నమోదు ధ్రువపత్రం, విమానయాన యోగ్యత ధ్రువపత్రం, కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, ఇతర నిర్దేశిత పత్రాలు విమానంలో ఉండాలి.
- ఆంక్షలున్న వస్తువులు: ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, సైనిక సామగ్రిని తరలించేందుకు నిర్దేశిత అనుమతులు అవసరం.
- ఆంక్షలున్న ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాలు: నిర్దేశిత ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలపై నియంత్రణ ఉంటుంది.
- ఫొటోలు, వీడియోల చిత్రీకరణ: ఏరోడ్రోమ్‌లలో, గాల్లో ప్రయాణిస్తున్న విమానాల నుంచి ఫొటోలు తీయడానికి నిర్దేశిత అనుమతులు అవసరం.
- విమాన ప్రయాణ భద్రత: సురక్షిత విమాన కార్యకలాపాలు, ప్రమాదకరంగా విమానాలు నడపడం, అత్యవసర పరిస్థితులు, ఆపదలో ఉన్న విమానాలు, నిర్దేశిత విమానయాన నిబంధనల పాటింపునకు సంబంధించిన అవసరాలను నిర్దేశిస్తాయి.
- విమాన రక్షణ: సిబ్బందిపై దాడులు, వారి విధులకు ఆటంకం కలిగించడం, చట్టవిరుద్ధ చర్యలు, విమాన భద్రతకు ముప్పు కలిగించే ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
- కార్యకలాపాలపై ఇతర ఆంక్షలు: విమానాలకు ఇంధనం నింపడం, వస్తువులను జారవిడవడం, పారాచూట్‌తో దిగడం, జంతువుల రవాణా, నియంత్రణ పరిధిలోని ఇతర కార్యకలాపాలకు నిబంధనలు వర్తిస్తాయి. శబ్దానికి సంబంధించిన ఆంక్షలను కూడా ఇవి నిర్దేశిస్తాయి. భారత గగనతలంలో సోనిక్ బూమ్‌లు సృష్టించే పౌర విమాన కార్యకలాపాలపై నిషేధం ఇందులో భాగం.

విమానాల రూపకల్పన, తయారీ, విమానయాన యోగ్యత
భారత్‌లో రూపొందించిన వాటితో సహా విమానాలు, విమానయాన ఉత్పత్తుల రూపకల్పన, ధ్రువీకరణకు ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి. తయారీ, విమానయాన యోగ్యత, నిర్వహణకు సంబంధించిన అవసరాలను కూడా నిర్దేశిస్తాయి.
- టైప్ సర్టిఫికేషన్: భారత్ రూపకల్పన దేశంగా ఉన్న సందర్భాల్లో విమానాలు, ఇంజిన్లు, ప్రొపెల్లర్లకు డీజీసీఏ టైప్ సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు. నిర్దేశిత షరతులకు లోబడి విదేశీ టైప్ సర్టిఫికెట్లను ధ్రువీకరించవచ్చు లేదా ఆమోదించవచ్చు.
- విమానయాన యోగ్యత ఆదేశాలు: భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండి, దాని ప్రభావం అదే రకపు రూపకల్పనతో తయారైన ఇతర ఉత్పత్తులపైనా పడే అవకాశం ఉంటే డీజీసీఏ ఆదేశాలు జారీ చేయవచ్చు. నిర్దేశిత మినహాయింపులకు లోబడి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించేందుకు ముసాయిదా ఆదేశాలను సాధారణంగా డీజీసీఏ వెబ్‌సైట్‌లో 30 రోజులపాటు ఉంచుతారు.
- ఇండియన్ టెక్నికల్ స్టాండర్డ్ ఆర్డర్స్: 27–33 నిబంధనల పరిధిలోకి రాని విమాన విడిభాగాలు డీజీసీఏ నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
- విడిభాగాల రూపకల్పన, తయారీ: నిర్దేశిత విమానయాన యోగ్యత అవసరాలను తీర్చే విమాన విడిభాగాల రూపకల్పన, తయారీకి డీజీసీఏ అనుమతి ఇవ్వవచ్చు.
- విమానయాన యోగ్యత ధ్రువీకరణ: విమానయాన యోగ్యత ధ్రువపత్రాలు, ప్రత్యేక విమానయాన యోగ్యత ధ్రువపత్రాలు, విమానయాన యోగ్యత సమీక్ష ధ్రువపత్రాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
- శబ్ద ధ్రువీకరణ: నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా డీజీసీఏ విమాన శబ్ద ధ్రువపత్రాలను జారీ చేయవచ్చు.
- తనిఖీలు, నిర్వహణ: విమానాల తనిఖీలు, నిర్ణీత వ్యవధుల్లో ఓవర్‌హాల్స్, మార్పులు, మరమ్మతులు, నిర్వహణ ధ్రువీకరణపై నిబంధనలు వర్తిస్తాయి.
- నిర్వహణ రికార్డులు: విమానాలు, ఇంజిన్లు, ప్రొపెల్లర్లకు సంబంధించిన లాగ్‌బుక్‌లు, లాగ్‌లతోపాటు ఇతర నిర్దేశిత రికార్డులను నిర్వహించాలి.
- ఆమోదం పొందిన సంస్థలు: నిర్దేశిత అవసరాలు, పర్యవేక్షణకు లోబడి విమానాల రూపకల్పన, తయారీ, నిర్వహణ, అనుబంధ కార్యకలాపాలు చేపట్టే సంస్థలకు డీజీసీఏ ఆమోదం ఇవ్వవచ్చు.
- విదేశీ సంస్థలు: నిర్దేశిత షరతులకు లోబడి విమానాలు, ఇంజిన్లు, విడిభాగాల నిర్వహణకు విదేశాల్లో ఆమోదం పొందిన సంస్థలను డీజీసీఏ గుర్తించవచ్చు.
విమాన పరికరాలు, రేడియో సాధనాలు, బరువు, సమతుల్యత, లోపాలున్న విడిభాగాలు, నిర్వహణ ధ్రువీకరణకు సంబంధించిన అవసరాలను కూడా ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి.

విమానాల నమోదు, గుర్తింపు
విమానాల నమోదు, గుర్తింపు, యాజమాన్య మార్పులు, నమోదు రికార్డుల నిర్వహణకు సంబంధించిన అవసరాలను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి.
- నమోదు వర్గాలు: నిర్దేశిత యాజమాన్య, పౌరసత్వ, వ్యాపార నమోదు, లీజు ప్రమాణాల ఆధారంగా విమానాలను ఏ లేదా బీ వర్గాల్లో నమోదు చేయవచ్చు.
- నమోదు ధ్రువపత్రాలు: నమోదు ధ్రువపత్రాల కోసం దరఖాస్తులు, వాటి జారీకి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. వాయు మార్గంలో భారత్‌కు దిగుమతి చేసే విమానాలకు ఇచ్చే తాత్కాలిక ధ్రువపత్రాలు కూడా వీటి పరిధిలోకి వస్తాయి.
- యాజమాన్య మార్పు: విమాన యాజమాన్యంలో మార్పు వచ్చినా, లీజుకు ఇచ్చేవారు మారినా వెంటనే తెలియజేయాలి. డీజీసీఏ రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప, నమోదు అవసరాలు తీరేవరకు విమానాన్ని మళ్లీ నడపడంపై ఆంక్షలు ఉంటాయి.
- నమోదు రద్దు: నిర్దేశిత పరిస్థితుల్లో విమానం నమోదును రద్దు చేయవచ్చు. ఐడీఈఆర్‌ఏ కలిగినవారు సమర్పించే అర్హమైన నమోదు రద్దు దరఖాస్తులపై, నిర్దేశిత అవసరాలకు లోబడి ఐదు పని దినాల్లో పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలి.
- ఎగుమతి, విమానాల రిజిస్టర్: నిర్దేశిత విధానంలో నమోదు రద్దు చేసిన అనంతరం విమానాల ఎగుమతికి నిబంధనలు వీలు కల్పిస్తాయి. భారత్‌లో నమోదైన విమానాల రిజిస్టర్‌ను డీజీసీఏ నిర్వహిస్తుంది. నిర్దేశిత షరతులకు లోబడి ప్రజలు దాన్ని పరిశీలించవచ్చు.
- నమోదు గుర్తులు: విమానంపై “వీటీ” అనే జాతీయత గుర్తు, దాని తర్వాత హైఫన్, కేటాయించిన మూడు పెద్ద ఆంగ్ల అక్షరాలను ప్రదర్శించాలి. నమోదు గుర్తులను నిర్దేశిత కాలానికి రిజర్వు చేయవచ్చు.
- స్టేట్ విమానాల గుర్తులు, జాతీయ పతాకం: స్టేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా గుర్తించిన విమానాలకు ప్రత్యేకించిన గుర్తులను ఇతర విమానాలు ప్రదర్శించరాదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం జాతీయ పతాకాలను ప్రదర్శించవచ్చు.
- మోడ్-ఎస్ చిరునామా: మోడ్-ఎస్ ట్రాన్స్‌పాండర్ ఉన్న విమానం భారత్‌లో నమోదై ఉంటే లేదా దాని నమోదుకు ప్రతిపాదన ఉంటే, నిర్దేశిత అవసరాలకు లోబడి డీజీసీఏ మోడ్-ఎస్ చిరునామాను జారీ చేయవచ్చు.
వర్తించే అంతర్జాతీయ విమానయాన ఏర్పాట్ల ప్రకారం విమానాల నమోదు, నమోదు రద్దుకు సంబంధించిన అంశాలను కూడా ఈ నిబంధనలు ప్రస్తావిస్తాయి.

సిబ్బంది లైసెన్సులు, అర్హతలు
లైసెన్సులు, రేటింగ్‌లు, ధ్రువపత్రాలకు సంబంధించి 23 వర్గాలను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. విమానయాన సిబ్బందికి అవసరమైన అర్హతలు, వైద్యపరమైన దృఢత్వం, శిక్షణ, అనుభవం, సామర్థ్య ప్రమాణాలను పేర్కొంటాయి. ప్రధాన నిబంధనలు నాలుగు రకాల సిబ్బందికి వర్తిస్తాయి:

1. పైలట్లు, ఫ్లైట్ ఇంజినీర్లు
- విద్యార్థి, ప్రైవేటు, వాణిజ్య, ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్లతోపాటు ఫ్లైట్ ఇంజినీర్లు, ఫ్లైట్ నావిగేటర్లకు లైసెన్సు అవసరాలు.
- కనీస వయసు, విద్యార్హతలు.
- వైద్యపరమైన దృఢత్వ ప్రమాణాలు, నిర్ణీత వ్యవధుల్లో మదింపు.
- విమానయాన అనుభవం, పరీక్షలు, సామర్థ్య మదింపు.
- విమాన రేటింగ్‌లు, లైసెన్సు చెల్లుబాటు, పునరుద్ధరణ.
- విదేశీ లైసెన్సుల ధ్రువీకరణ.
- ఫ్లైట్ క్రూ లాగ్‌బుక్‌లు, విమానయాన సమయం నమోదు.

2. విమాన నిర్వహణ ఇంజినీర్లు
- లైసెన్సులు, అర్హతలు, అధికార అనుమతులకు సంబంధించిన అవసరాలు.
- విదేశీ విమాన నిర్వహణ ఇంజినీర్ల లైసెన్సుల ధ్రువీకరణ.
- నిర్వహణ సిబ్బంది లాగ్‌బుక్‌లు, అనుభవ రికార్డులు.

3. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు
- లైసెన్సులు, ఆయా యూనిట్లకు ప్రత్యేకమైన రేటింగ్‌ల అవసరాలు.
- శిక్షణ, అనుభవం, సామర్థ్య మదింపు.
- వైద్యపరమైన దృఢత్వం, నిర్ణీత వ్యవధుల్లో మదింపు.
- లైసెన్సు చెల్లుబాటు, పునఃధ్రువీకరణ, పునరుద్ధరణ.
- నిర్దేశిత లైసెన్సులు, రేటింగ్‌ల మేరకు అనుమతించిన విధులను నిర్వర్తించేందుకు గరిష్ఠ వయసు 60 ఏళ్లు.
- అనుభవ రికార్డుల నిర్వహణ, సామర్థ్య ప్రమాణాల పాటింపు.

4. రేడియో-టెలిఫోన్ ఆపరేటర్లు
- విమాన రేడియో-టెలిఫోన్ పరికరాలను నడిపేందుకు అవసరమైన నిబంధనలు.
- పరిమిత రేడియో-టెలిఫోన్ కార్యకలాపాలకు అర్హతలు, పరీక్షలు, లైసెన్సులు.
- వర్తించే ధ్రువపత్రాలు, లైసెన్సుల గుర్తింపు, పునరుద్ధరణ.
విమాన సిబ్బందికి లైసెన్సుల జారీకి అవసరమైన నిబంధనలను మొదటి షెడ్యూల్ పేర్కొంటుంది. ఎయిర్ ట్రాఫిక్ సేవల సిబ్బందికి లైసెన్సులు, అర్హతలకు సంబంధించిన అవసరాలను రెండో షెడ్యూల్ నిర్దేశిస్తుంది.

క్యాబిన్ సిబ్బందికి సంబంధించిన నిబంధనలు
భారత్‌లో నమోదై, ప్రజా రవాణా సేవల్లో ప్రయాణికులను తరలించే విమానాల్లో సీట్ల సామర్థ్యాన్ని బట్టి నిర్దేశించిన సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది ఉండాలి. తయారీ సంస్థ అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది అవసరమని నిర్దేశిస్తే, ఆ సంఖ్యను పాటించాలి. సిబ్బంది ఆమోదం పొందిన భద్రతా శిక్షణ, రిఫ్రెషర్ కోర్సులను పూర్తి చేయాలి. ఒక్కొక్కరు మూడు రకాల విమానాలకు మించి విధులు నిర్వర్తించరాదు. 10–50 సీట్ల విమానాలు, 20–50 సీట్ల హెలికాప్టర్లలో కనీసం ఒక్క క్యాబిన్ సిబ్బంది సభ్యుడు, 50కిపైగా సీట్లు ఉన్న విమానాల్లో ఇద్దరు ఉండాలని ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. 99 సీట్లకు మించి ప్రతి 50 సీట్లకు ఒక్కో సభ్యుడు అదనంగా ఉండాలి. అలా లెక్కించిన తర్వాత 50కి తక్కువగా సీట్లు మిగిలినా, వాటికీ ఒక అదనపు సభ్యుడు ఉండాలి.



ఏరోడ్రోమ్‌లు, భూమిపై మౌలిక సదుపాయాలు
ఏరోడ్రోమ్ సదుపాయాలు, భద్రత, కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన అవసరాలను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. ముఖ్యమైన అంశాలు:
- దీపాల భద్రత: విమానయానానికి ఉపయోగించే దీపాలకు అనుమతి అవసరం. ఏరోడ్రోమ్‌లకు ఐదు నాటికల్ మైళ్ల పరిధిలో తప్పుదారి పట్టించే అవకాశం ఉన్న దీపాలపై నియంత్రణ ఉంటుంది. పది నాటికల్ మైళ్ల పరిధిలో లేజర్‌ను ఉపయోగించేందుకు ఏరోడ్రోమ్ నిర్వాహకుడి రాతపూర్వక అనుమతి అవసరం.
- ఏరోడ్రోమ్ లైసెన్సులు: ప్రజా లేదా ప్రైవేటు వినియోగం కోసం ఏరోడ్రోమ్‌లకు లైసెన్సులు ఇవ్వవచ్చు. భారత పౌరులు, అర్హతగల కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, నమోదైన సంఘాలు, ట్రస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏరోడ్రోమ్ మాన్యువల్: లైసెన్సుదారులు ఏరోడ్రోమ్ మాన్యువల్‌ను నిర్వహించాలి. సురక్షిత విమాన కార్యకలాపాలకు ఏరోడ్రోమ్ అనువుగా ఉండేలా చూసుకోవాలి.
- సదుపాయాల్లో మార్పులు: విమాన భద్రతపై ప్రభావం చూపేలా విమానాలు దిగే ప్రాంతాలు, భవనాలు లేదా నిర్మాణాల్లో మార్పులు చేయాలంటే డీజీసీఏ ముందస్తు ఆమోదం అవసరం.
- తనిఖీలు, ప్రవేశం: ఏరోడ్రోమ్ సదుపాయాలు, పరికరాలు, రికార్డులు, భద్రతా నిర్వహణ వ్యవస్థలను తనిఖీ చేసేందుకు డీజీసీఏ అనుమతి పొందిన సిబ్బందికి ఎలాంటి పరిమితులు లేకుండా ప్రవేశించే అధికారం ఉంటుంది.
- ఛార్జీలు, రుసుములు: ఏరోడ్రోమ్ టారిఫ్‌లపై నియంత్రణ ఉంటుంది. భారత విమానాలు, ఒప్పందంలో భాగమైన ఇతర దేశాల విమానాలను సమానంగా పరిగణిస్తారు. ప్రయాణికుల సేవల రుసుము, వినియోగదారు అభివృద్ధి రుసుమును నిర్దేశిత రేట్ల ప్రకారం వసూలు చేయవచ్చు.
- ప్రవేశం, విమానాల కదలిక ప్రాంతాలు: నిర్దేశిత మినహాయింపులకు లోబడి టెర్మినల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు ప్రవేశ టికెట్ లేదా అధీకృత పాస్ అవసరం. విమానాల కదలిక ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుమతి అవసరం.
- వన్యప్రాణుల వల్ల ముప్పు నియంత్రణ: నిర్దేశిత మినహాయింపులకు లోబడి ఏరోడ్రోమ్‌లకు పది కిలోమీటర్ల పరిధిలో జంతువుల వధ, చెత్త పారవేయడం, వన్యప్రాణులను ఆకర్షించే కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి.
- గ్రౌండ్ హ్యాండ్లింగ్: నిర్దేశిత ఆమోదాలు, భద్రతా అనుమతి, సురక్షిత కార్యకలాపాల అవసరాలకు లోబడి విమానయాన సంస్థలు అర్హతగల గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.

విమాన నావిగేషన్ సేవలు
ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, అనుబంధ సాంకేతిక సేవలతో సహా విమాన నావిగేషన్ సేవలకు ఈ నిబంధనలు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ముఖ్యమైన అంశాలు:
- ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ: సురక్షితమైన, సమర్థమైన, నిరంతర ఎయిర్ ట్రాఫిక్ సేవల అందజేత, గగనతల నిర్వహణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల విధి సమయం, కనీస విశ్రాంతికి సంబంధించిన అవసరాలు.
- సమాచార ప్రసారం, నావిగేషన్, నిఘా: నిర్దేశిత సదుపాయాలకు ధ్రువీకరణ, వాటి నిర్వహణతోపాటు సంభాషణలు, సందేశాలు, సంకేతాలు, డేటాను రికార్డు చేయడం.
- వాతావరణ సేవలు: విమానయానానికి అవసరమైన వాతావరణ సమాచారాన్ని అందించాలి. రికార్డులను కనీసం 30 రోజులపాటు భద్రపరచి, విచారణలు, దర్యాప్తులకు అందుబాటులో ఉంచాలి.
- పరికరాల ఆధారిత విమానయాన విధానాల రూపకల్పన: ఈ విధానాలు డీజీసీఏ ఆమోదించిన రూపకల్పన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాటిని ప్రచురించేందుకు, మార్చేందుకు లేదా ఉపసంహరించేందుకు డీజీసీఏ ముందస్తు ఆమోదం అవసరం.
- గాలింపు, రక్షణ చర్యలు: సమన్వయంతో గాలింపు, రక్షణ చర్యలు చేపట్టేందుకు పొరుగు దేశాలతో ఒప్పందాలు, రక్షణ సమన్వయ కేంద్రాల మధ్య పరస్పర సహకారం.
విమానయాన టెలికమ్యూనికేషన్ సదుపాయాలు, వాటికి సంబంధించిన మాన్యువళ్ల అవసరాలను మూడో షెడ్యూల్ నిర్దేశిస్తుంది.

విమాన కార్యకలాపాలు
షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ విమాన రవాణా సేవలు, ప్రైవేటు విమానాలు, ప్రత్యేక విమానయాన కార్యకలాపాలకు అవసరమైన నిబంధనలను ఇవి నిర్దేశిస్తాయి. ముఖ్యమైన అంశాలు:
- విమాన ప్రయాణ అనుమతులు, పాస్‌పోర్టులు: భారత్‌లో నమోదైన విమానాలకు అంతర్జాతీయ ప్రయాణాల కోసం నిర్దేశిత అనుమతులు అవసరం. విమానంలో భారత్‌లోకి ప్రవేశించేవారు వర్తించే ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టులను వెంట ఉంచుకోవాలి.
- సిబ్బంది అలసట, దృఢత్వం: విమానయాన సమయం, విధి సమయ పరిమితులు, కనీస విశ్రాంతి కాలం, అలసట నిర్వహణకు నిబంధనలు వర్తిస్తాయి. విమాన ప్రయాణానికి ముందున్న 12 గంటల్లో లేదా విమాన విధుల్లో ఉన్నప్పుడు సిబ్బంది మద్యం లేదా నిర్దేశిత మత్తు పదార్థాలను సేవించరాదు.
- విమానంలో భద్రత, ప్రవర్తన: విమానంపై తుది అధికారం పైలట్-ఇన్-కమాండ్‌కు ఉంటుంది. దేశీయ విమాన రవాణా సేవల్లో మద్యపానం నిషేధం. ధూమపానం, విమానంలో కొన్ని కార్యకలాపాలపై నిర్దేశిత ఆంక్షలు వర్తిస్తాయి.
- ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్లు: షెడ్యూల్డ్ విమాన రవాణా సేవలకు నిర్దేశిత అనుమతులు, ధ్రువీకరణ అవసరం. వర్తించే యాజమాన్య, నియంత్రణ, సురక్షిత కార్యకలాపాలు, భద్రతకు సంబంధించిన షరతులను పాటించాలి.
- చార్టర్ సేవలు, విమానాల ద్వారా చేసే పనులు, విదేశీ విమానయాన సంస్థలు: నాన్-షెడ్యూల్డ్ విమాన రవాణాకు, విమానాల ద్వారా చేపట్టే పనులకు నిర్దేశిత పర్మిట్లు లేదా అధికార అనుమతులు అవసరం. విదేశీ విమానయాన సంస్థలు వర్తించే అనుమతులు, ఒప్పందాలు, కార్యకలాపాలకు సంబంధించిన షరతులను పాటించాలి.
- విమాన ఛార్జీలు, టారిఫ్‌లు: కార్యకలాపాల వ్యయంతో సహా వివిధ అంశాల ఆధారంగా విమానయాన సంస్థలు టారిఫ్‌లను నిర్ణయించి, డిజిటల్ రూపంలో ప్రచురించాలి. షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు పర్యవేక్షణ కోసం టారిఫ్‌లను డీజీసీఏకు సమర్పించాలి. బుకింగ్ వెబ్‌సైట్లు, టికెట్లలో చెల్లించాల్సిన మొత్తం, విమాన ఛార్జీలు, పన్నులు, రుసుములు, ఇతర ఛార్జీల వివరాలను విడివిడిగా వెల్లడించాలి. అసాధారణ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పరిస్థితికి తగిన ఆదేశాలను నిర్ణీత కాలానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు.
- విమానాల యాజమాన్యం, దిగుమతులు: విమానాల దిగుమతులు, భాగస్వామ్య యాజమాన్య ఏర్పాట్లు, ప్రైవేటు విమాన కార్యకలాపాలపై నిబంధనలు వర్తిస్తాయి. నిబంధనల్లో అనుమతించిన సందర్భాల్లో తప్ప ప్రైవేటు విమానాలను అద్దెకు లేదా ప్రతిఫలం కోసం ఉపయోగించరాదు. భాగస్వామ్య యాజమాన్యాన్ని ఈ నిబంధనలు గుర్తిస్తాయి. విమాన కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు ఎవరివో స్పష్టంగా పేర్కొనే ఏర్పాట్ల కింద ఒక విమానంపై పలువురు కలిసి పెట్టుబడి పెట్టవచ్చు.
- ఇంజినీరింగ్, తనిఖీలు, మాన్యువళ్లు: విమానాల యజమానులు, ఆపరేటర్లు నిర్వహణ, తనిఖీలు, రికార్డుల నిర్వహణ, మాన్యువళ్లకు సంబంధించి వర్తించే అవసరాలను పాటించాలి.
- రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్: ప్రాంతీయ విమాన అనుసంధానానికి ఆర్థిక లోటును పూడ్చే సాయం (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయవచ్చు. దేశీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులపై సుంకం విధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర నిర్దేశిత వనరుల నుంచి కూడా ఈ నిధికి సాయం అందవచ్చు.
- రుసుములు, సుంకాలు: విమానయాన భద్రతా రుసుములను వసూలు చేసేందుకు నిబంధనలు వీలు కల్పిస్తాయి. నియంత్రణపరమైన పర్మిట్లు, అధికార అనుమతులు, ఆమోదాలు, ఇతర సేవలకు రుసుములను నిర్దేశిస్తాయి.

నియంత్రణ పర్యవేక్షణ, నిఘా, నిబంధనల అమలు
నియంత్రణ పర్యవేక్షణ, విమానయాన భద్రతా నిర్వహణ, నిబంధనల పాటింపు, అమలుకు సంబంధించిన అవసరాలను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. ముఖ్యమైన అంశాలు:
- అంతర్జాతీయ ప్రమాణాలు: చట్టం, నిబంధనలకు లోబడి చికాగో కన్వెన్షన్, దాని అనుబంధాలకు అనుగుణంగా డీజీసీఏ ప్రమాణాలు, విధానాలను నిర్దేశించవచ్చు.
- స్టేట్ సేఫ్టీ ప్రోగ్రామ్: విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు, కార్యకలాపాలతో కూడిన సమగ్ర కార్యక్రమాన్ని డీజీసీఏ రూపొందించి, పర్యవేక్షించాలి.
- నియంత్రణ ఆదేశాలు: నోటీసెస్ టు ఎయిర్‌మెన్ (నోటామ్‌లు), విమానయాన సమాచార ప్రచురణలు, విమానయాన సమాచార సర్క్యులర్లు, సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (సీఏఆర్‌లు) ద్వారా డీజీసీఏ ఆదేశాలు జారీ చేయవచ్చు.
- సంబంధిత వర్గాలతో సంప్రదింపులు: అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించేందుకు ముసాయిదా సీఏఆర్‌లను సాధారణంగా డీజీసీఏ వెబ్‌సైట్‌లో 30 రోజులపాటు ఉంచాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాతపూర్వక ఉత్తర్వు ద్వారా సంప్రదింపుల గడువును తగ్గించవచ్చు లేదా సంప్రదింపుల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు.
- భద్రతా నిర్వహణ వ్యవస్థలు: నిర్దేశిత విమాన ఆపరేటర్లు, ఏరోడ్రోమ్‌లు, రూపకల్పన, తయారీ సంస్థలు, నిర్వహణ సంస్థలు, శిక్షణ సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ సేవలు అందించే సంస్థలు భద్రతా నిర్వహణ వ్యవస్థలను నిర్వహించాలి.
- భద్రతా నివేదికలు: భద్రతా అంశాలను తప్పనిసరిగా నివేదించే వ్యవస్థను, స్వచ్ఛందంగా నివేదించే వ్యవస్థను డీజీసీఏ ఏర్పాటు చేయాలి. స్వచ్ఛంద నివేదన వ్యవస్థలో శిక్షలకు తావు ఉండకూడదు. నివేదికలు సమర్పించే వ్యక్తుల వివరాల గోప్యతను కాపాడాలి.
- తనిఖీలు, ప్రవేశం: డీజీసీఏ అనుమతి పొందిన సిబ్బంది నిర్దేశిత ప్రవేశ హక్కులతో విమానాలు, విమానయాన సదుపాయాలను తనిఖీ చేయవచ్చు. ముందస్తు సమాచారం లేకుండా కూడా తనిఖీలు చేపట్టవచ్చు.
- రికార్డుల విశ్వసనీయత: లాగ్‌బుక్‌లలో మోసపూరిత వివరాలను నమోదు చేయడం, లైసెన్సులు లేదా ఆమోద పత్రాలను ఇతరులకు వాడుకోనివ్వడం నిషేధం. అవసరమైనప్పుడు నిర్దేశిత పత్రాలను తనిఖీకి సమర్పించాలి.
- తాత్కాలిక నిలుపుదల, ఆంక్షలు: నిబంధనలను పాటించకపోవడం, భద్రతా సమస్యలు పరిష్కారం కాకపోవడం వంటి నిర్దేశిత పరిస్థితుల్లో లైసెన్సులు, ధ్రువపత్రాలు, అధికార అనుమతులు, ఆమోదాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, రద్దు చేయవచ్చు లేదా వాటిపై పరిమితులు విధించవచ్చు.
- అధికారాల అప్పగింత, మినహాయింపులు: భారతీయ వాయుయాన్ అధినియమ్-2024 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట అధికారాలను అప్పగించవచ్చు, మినహాయింపులు ఇవ్వవచ్చు.

నేరాలు, శిక్షలు, అప్పీళ్లు
కఠిన విమానయాన భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తూనే, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ఉల్లంఘనలకు తగిన చర్యలు తీసుకుంటూ నిబంధనల పాటింపునకు ప్రాధాన్యం ఇచ్చే నియంత్రణ వ్యవస్థను రూపొందించడంపై ప్రభుత్వ నిరంతర దృష్టిని ఈ నిబంధనలు ప్రతిబింబిస్తాయి. రెండేళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించగల 21 శిక్షార్హ నేరాలను, కాంపౌండింగ్ ద్వారా పరిష్కరించగల 18 నేరాలను ఇవి నిర్దేశిస్తాయి. నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలను నేరాల పరిధి నుంచి తప్పించే దిశగా అనుసరిస్తున్న సమతుల విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఉల్లంఘన స్వభావం, దానికి పాల్పడిన పక్షం వర్గం, పరిమాణాన్ని బట్టి తీవ్రత ఆధారంగా పది స్థాయిల జరిమానా విధానాన్ని కూడా ఈ నిబంధనలు ప్రవేశపెడుతున్నాయి. జరిమానాలు ₹10,000 నుంచి ₹1 కోటి వరకు ఉంటాయి. అప్పీళ్లు, వాదనలు వినిపించే అవకాశాలు, కారణాలను వివరించే ఉత్తర్వులకు సంబంధించిన నిబంధనలు ప్రక్రియలో న్యాయబద్ధతను, పారదర్శకతను బలోపేతం చేస్తాయి. భద్రత, జవాబుదారీతనంలో రాజీ లేకుండా నిబంధనల పాటింపును సులభతరం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇవి మరింత బలపరుస్తాయి.

భారత విమానయానంలో భద్రత, ప్రమాణాల మెరుగుదల
విమానాల యోగ్యత, నిర్వహణ, సిబ్బంది అర్హతలు, ఏరోడ్రోమ్‌ల భద్రత, విమాన నావిగేషన్ సేవలు, విమాన కార్యకలాపాలు వంటి పౌర విమానయానంలోని కీలక అంశాలను భారతీయ వాయుయాన్ నియమ్, 2026 ఒక ఆధునిక వ్యవస్థ పరిధిలోకి తెస్తాయి. భద్రతా నిర్వహణ వ్యవస్థలు, అలసట నిర్వహణ, తప్పనిసరి, స్వచ్ఛంద భద్రతా నివేదికలు, నియంత్రణ పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనలు కార్యకలాపాల్లో ముప్పులను గుర్తించి, వాటిని ఎదుర్కొనే యంత్రాంగాన్ని బలోపేతం చేస్తాయి. తీవ్రత ఆధారంగా జరిమానాలు, నిబంధనల అమలు చర్యలు, అప్పీళ్లకు వీలు కల్పించడం ద్వారా జవాబుదారీతనం, న్యాయబద్ధమైన నియంత్రణ ప్రక్రియలను ప్రోత్సహిస్తాయి. సురక్షితమైన, నమ్మకమైన విమాన ప్రయాణానికి తోడ్పడటం, ప్రయాణికుల విశ్వాసాన్ని పెంచడం, భారత పౌర విమానయాన రంగం మరింత విస్తరించేందుకు వీలు కల్పించడం ఈ నిబంధనల ఉమ్మడి లక్ష్యం.

 

 References

Ministry of Civil Aviation

Bharatiya Vayuyan Niyam, 2026: A Modern Rulebook for India’s Skies

 

***

(तथ्य सामग्री आईडी: 151165) आगंतुक पटल : 3


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Urdu , हिन्दी