Technology
సెమీకండక్టర్, కృత్రిమ మేధ రంగాల్లో విప్లవం
प्रविष्टि तिथि:
13 AUG 2026 13:34 PM
చిప్‌ల నుంచి కృత్రిమ మేధ వరకు: సాంకేతిక రంగంలో భారత నాయకత్వ నిర్మాణం
స్మార్ట్‌ఫోన్లు, వాహనాల నుంచి ఉపగ్రహాలు, కృత్రిమ మేధ వ్యవస్థల వరకు ఆధునిక సాంకేతికత అంతటికీ సెమీకండక్టర్లు పునాదిగా నిలుస్తున్నాయి. అధునాతన చిప్‌లు, ప్రత్యేక ప్రాసెసర్లు, అధిక పనితీరు గల కంప్యూటింగ్‌కు కృత్రిమ మేధ వేగంగా డిమాండ్‌ను పెంచుతోంది. దీంతో ఈ రెండు సాంకేతికతలను వేర్వేరుగా చూడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమ్మేళనం ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్ చిప్‌ల రూపకల్పన, తయారీ నుంచి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, స్వదేశీ కృత్రిమ మేధ నమూనాల వరకు సామర్థ్యాలను నిర్మిస్తోంది. రెండు రంగాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలు స్వావలంబన, సరఫరా గొలుసు స్థిరత్వం, ఆవిష్కరణలను బలోపేతం చేసే సమగ్ర సాంకేతిక వ్యవస్థను రూపొందిస్తున్నాయి. అధునాతన తయారీ, పరిశోధన, ఔత్సాహికత, అధిక విలువ కలిగిన ఉపాధిలోనూ ఈ సమ్మేళనం కొత్త అవకాశాలను తెరుస్తోంది. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ, ప్రపంచ సాంకేతిక నాయకత్వం, వికసిత్ భారత్ దిశగా ఈ సామర్థ్యాలు కీలక ముందడుగుగా నిలుస్తున్నాయి.
సెమీకండక్టర్లు: సాంకేతిక స్వావలంబనకు పునాది
చిప్‌ల రూపకల్పన, తయారీ నుంచి అధునాతన ప్యాకేజింగ్, పరికరాలు, సామగ్రి వరకు సెమీకండక్టర్ విలువ గొలుసు అంతటా భారత్ దేశీయ సామర్థ్యాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా రేపటి సాంకేతికతలకు రూపమిచ్చే స్థాయికి భారత్ చేరుకుంటోంది.
స్వావలంబనకు పునాది వేసిన ప్రత్యేక మిషన్
* భారత సెమీకండక్టర్ వ్యవస్థ నిర్మాణానికి ₹76 వేల కోట్ల కేటాయింపుతో సెమికాన్ 1.0 పునాది వేసింది.
* చిప్‌ల రూపకల్పన, తయారీ, ప్యాకేజింగ్, పరీక్షలు, పరికరాలు, సామగ్రి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితరాలతో కూడిన పూర్తి విలువ గొలుసుకు ఇది సహాయం అందిస్తోంది.
* 2026 జూలైలో ఆమోదించిన ₹1,27,500 కోట్ల కేటాయింపుతో సెమికాన్ 2.0 ఈ పునాదిని ప్రపంచస్థాయి వ్యవస్థ నాయకత్వం దిశగా విస్తరిస్తోంది.
* చిప్‌ల రూపకల్పన, సెమీకండక్టర్ పరికరాలు, సామగ్రి, తయారీ కేంద్రాలు, అధునాతన ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ధి, ప్రతిభా వికాసం అనే ఆరు వ్యూహాత్మక స్తంభాలు సెమికాన్ ఇండియా 2.0కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.
ఈ సమగ్ర విధానం సరఫరా గొలుసు స్థిరత్వాన్ని పటిష్ఠం చేస్తోంది. దేశీయ విలువ జోడింపును విస్తరిస్తూ భవిష్యత్ సెమీకండక్టర్ రంగంలో నాయకత్వం వహించే దిశగా భారత్‌ను నిలుపుతోంది.
విధాన రూపకల్పన నుంచి సెమీకండక్టర్ తయారీ వరకు
* ఆరు రాష్ట్రాల్లో 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. వీటి పెట్టుబడి హామీలు ₹1.64 లక్షల కోట్లు దాటాయి.
* సిలికాన్, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే తయారీ, అధునాతన ప్యాకేజింగ్ కేంద్రాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.
* మూడు కేంద్రాలు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. సెమీకండక్టర్ విధాన రూపకల్పన నుంచి తయారీ దిశగా భారత్ సాగుతున్న పరివర్తనకు ఇది నిదర్శనం.
ఆటోమొబైల్, టెలికమ్యూనికేషన్, ఏరోస్పేస్, పవర్ ఎలక్ట్రానిక్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన కీలక భాగాలను సెమీకండక్టర్ కేంద్రాలు సరఫరా చేస్తాయి
* ముడి సిలికాన్ పొరలను పనిచేసే సమీకృత వలయాలు, మైక్రోచిప్‌లుగా మార్చే కేంద్రాలే సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్లు.
* ఫోన్లు, కార్లు, ఇతర పరికరాల కోసం చదునైన, వంగే తెరలను తయారు చేసే కేంద్రాలే డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు.
* సున్నితమైన చిప్‌లకు రక్షణ కవచం అమర్చడం, తీగలతో అనుసంధానించడం, భద్రత కల్పించడం ద్వారా అవి వేగంగా పనిచేసేలా, ఎక్కువ కాలం మన్నేలా చేసే పద్ధతులే అధునాతన ప్యాకేజింగ్ విధానాలు.
స్వదేశీ సెమీకండక్టర్ రూపకల్పన సామర్థ్యాల అభివృద్ధి
* భవిష్యత్ మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు చిప్స్ టు స్టార్టప్ (సీ2ఎస్) వంటి కార్యక్రమాల ద్వారా సెమీకండక్టర్ నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దీని కింద—
* 320 విద్యాసంస్థల్లో ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
* 68 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. దీంతో అధునాతన చిప్ రూపకల్పన సామర్థ్యాలు మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి.
* ఆర్థిక సహాయం కోసం 24 సెమీకండక్టర్ రూపకల్పన ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఈడీఏ సాధనాల సహాయం కోసం 105 అంకుర సంస్థలు/ఎంఎస్‌ఎంఈలకు కూడా ఆమోదం ఇచ్చారు.
* దేశీయ రూపకల్పన సామర్థ్యాలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా 2026 ఏప్రిల్ నాటికి 75 సంస్థలు 211 చిప్‌ల టేప్-అవుట్‌ను పూర్తి చేశాయి.
* 12 నానోమీటర్ల వంటి అధునాతన నోడ్లతో సహా వివిధ నోడ్లలో ఏడు చిప్‌లను విజయవంతంగా తయారు చేశారు.
* సెమీకండక్టర్ మేధోహక్కులు, చిప్, వ్యవస్థల రూపకల్పనకు సెమికాన్ 2.0 మరింత సహాయం అందించనుంది. ప్రపంచ సెమీకండక్టర్ రూపకల్పన కేంద్రంగా భారత్ స్థానాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ)
సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పన, అనుకరణ, ధ్రువీకరణ, పనితీరు మెరుగుదలకు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ వేదికలే ఈడీఏ సాధనాలు. ఇవి సంక్లిష్టమైన చిప్ నమూనాలను నిర్వహిస్తాయి. తయారీకి ముందే లోపాలను గుర్తిస్తూ పనితీరు, విద్యుత్ సామర్థ్యం, విశ్వసనీయతను మెరుగుపరుస్తాయి. రూపకల్పన సమయం, ఖర్చులు, తయారీ నష్టభయాన్ని తగ్గించడం ద్వారా వివిధ అవసరాలకు ఉపయోగపడే అధునాతన చిప్‌లను వేగంగా అభివృద్ధి చేసేందుకు ఈడీఏ సాధనాలు వీలు కల్పిస్తాయి.
ప్రపంచ భాగస్వామ్యాలు
* అమెరికా, జపాన్, సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ, ఐరోపా సమాఖ్యతో ప్రపంచ భాగస్వామ్యాలు సాంకేతిక సహకారం, వ్యవస్థ అభివృద్ధిని పటిష్ఠం చేస్తున్నాయి.
* సెమికాన్ ఇండియా–2025లో 48 దేశాలు, ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో పాటు 350కుపైగా ప్రదర్శన సంస్థలు పాల్గొన్నాయి. ఇది ప్రపంచ సెమీకండక్టర్ రంగంతో భారత్ అనుసంధానాన్ని బలోపేతం చేసింది.
* ఈ కార్యక్రమానికి 35 వేల నమోదులు, 30 వేల ప్రత్యక్ష సందర్శనలు, 25 వేల ఆన్‌లైన్ వీక్షణలు నమోదయ్యాయి. సెమీకండక్టర్ రంగంలో భారత లక్ష్యాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికి ఇవి అద్దం పడుతున్నాయి.
* ఉత్పత్తుల అభివృద్ధి, సేవలు, సెమీకండక్టర్ నైపుణ్యాల వికాసాన్ని బలోపేతం చేసేందుకు 12 అవగాహన ఒప్పందాలను ప్రకటించారు.
భారత కంపెనీలు ప్రపంచ సెమీకండక్టర్ విలువ గొలుసుల్లో భాగస్వాములు కావడానికి, దేశీయ సామర్థ్యాలను వేగంగా విస్తరించడానికి ఈ భాగస్వామ్యాలు తోడ్పడుతున్నాయి.
ఇండియాఏఐ మిషన్: భారత్‌కు సార్వభౌమ, సమ్మిళిత కృత్రిమ మేధ వ్యవస్థ నిర్మాణం
దాదాపు ₹10,372 కోట్ల కేటాయింపుతో ఆమోదం పొందిన ఇండియాఏఐ మిషన్ గత ఏడాదిలో గణనీయ పురోగతి సాధించింది. సురక్షితమైన, సమ్మిళితమైన, భారత అవసరాలపై ఆధారపడిన సామర్థ్యాల నిర్మాణంపై ఈ మిషన్ దృష్టి సారిస్తోంది. ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, ప్రజా సేవల పంపిణీకి కృత్రిమ మేధను వ్యూహాత్మక సామర్థ్యంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం.
భారీ స్థాయిలో సార్వభౌమ కృత్రిమ మేధ కంప్యూటింగ్ సామర్థ్యం
* 2026 జూన్ నాటికి ఇండియాఏఐ మిషన్ ఉమ్మడి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని 45 వేలకుపైగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల(జీపీయూ)కు విస్తరించింది.
* 2026 ఆగస్టు నాటికి 237 ప్రాజెక్టులు రాయితీతో కూడిన కృత్రిమ మేధ కంప్యూటింగ్ సదుపాయాన్ని వినియోగించుకున్నాయి. వీటి వినియోగం 93.18 లక్షల జీపీయూ గంటలకు చేరింది. కృత్రిమ మేధ నమూనాల అభివృద్ధి, శిక్షణ, పరీక్షలు, పరిశోధన కోసం అందుబాటు ధరల్లో అధిక పనితీరు గల కంప్యూటింగ్‌ను ఇది అందిస్తోంది. భారత పరిశోధకులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి ఎదురయ్యే అడ్డంకులను తగ్గిస్తోంది.
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)
గ్రాఫిక్స్, చిత్రాల ప్రాసెసింగ్, అధిక డేటా వినియోగంతో కూడిన ఇతర కంప్యూటింగ్ పనులను వేగవంతం చేసేందుకు రూపొందించిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ ప్రాసెసర్‌ను జీపీయూ అంటారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, సర్వర్లు, ఇతర డిజిటల్ పరికరాల్లో జీపీయూలను విస్తృతంగా వినియోగిస్తారు.
మౌలిక కృత్రిమ మేధ నమూనాలు
* అందిన 506 దరఖాస్తుల్లో 12 భారీ బహుళ విధాన నమూనాలు, ఎనిమిది చిన్న భాషా నమూనాలతో కూడిన 20 స్వదేశీ మౌలిక నమూనాల ప్రతిపాదనలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
* భారతీయ భాషలు, అవసరాలు, సందర్భాలకు అనువైన కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేసే దేశ సామర్థ్యాన్ని ఇది బలోపేతం చేస్తోంది.
కృత్రిమ మేధ నమూనాలకు డిజిటల్ వెన్నెముక
* 2026 జూలై నాటికి ఏఐ కోశ్‌లో 14 వేలకుపైగా డేటాసెట్లు, 331 కృత్రిమ మేధ నమూనాలు ఉన్నాయి. కృత్రిమ మేధ పరిష్కారాల నిర్మాణం, విస్తరణకు అవసరమైన కీలక వనరులను పరిశోధకులు, అభివృద్ధిదారులు, ఆవిష్కర్తలకు ఈ వేదిక అందిస్తోంది.
ప్రయోగశాలల నుంచి వాస్తవ పాలన వరకు
* 2026 ఆగస్టు నాటికి ఇండియాఏఐ కార్యక్రమాల కింద 62 కృత్రిమ మేధ నమూనా పరిష్కారాలను అభివృద్ధి చేసి, ప్రభుత్వ రంగ సంస్థల్లో 20 కృత్రిమ మేధ పరిష్కారాలను అమలు చేశారు.
* 11 జాతీయస్థాయి హ్యాకథాన్‌లు, ఆవిష్కరణ సవాళ్లు ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చే ప్రక్రియను మరింత విస్తరిస్తున్నాయి.
ప్రతిభా కేంద్రాల ద్వారా ఆవిష్కరణలు
* 2026 ఆగస్టు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 కృత్రిమ మేధ ప్రతిభా కేంద్రాల(ఏఐ సీఓఈ)కు ఆమోదం ఇచ్చారు.
* 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 22 ప్రతిభా కేంద్రాల(సీఓఈ)కు ఆమోదం ఇచ్చి కార్యకలాపాలను ప్రారంభించారు.
* నిర్దిష్ట రంగాల పరిశోధన, ఆవిష్కరణలు, అనువర్తనాల అభివృద్ధిని ఈ కేంద్రాలు బలోపేతం చేస్తున్నాయి.
ప్రతిభ, డీప్‌టెక్ వ్యవస్థ నిర్మాణం
* ఇంటర్‌డిసిప్లీనరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్(ఎన్ఎం-ఐసీపీఎస్) జాతీయ మిషన్ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో 25 సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
* కృత్రిమ మేధ, రోబోటిక్స్, సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతికతలు, ఇతర వర్ధమాన రంగాల్లో పరిశోధన, నైపుణ్యాలు, అంకుర సంస్థలు, సాంకేతిక బదిలీకి ఈ కేంద్రాలు సహాయం అందిస్తున్నాయి.
వేగవంతమైన వినియోగంతో పాటు విశ్వసనీయ కృత్రిమ మేధ
* ఇండియాఏఐ మిషన్‌లోని సురక్షిత–విశ్వసనీయ కృత్రిమ మేధ విభాగం కింద 2026 జూలై నాటికి భారత ప్రభుత్వం 13 బాధ్యతాయుత కృత్రిమ మేధ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది. పక్షపాతాన్ని తగ్గించడం, యంత్ర అభ్యాస విస్మరణ, డీప్‌ఫేక్‌ల గుర్తింపు, గోప్యతను పరిరక్షించే కృత్రిమ మేధ, వివరణాత్మకత, కృత్రిమ మేధ నష్టభయ అంచనా వంటి కీలక సవాళ్లను ఈ ప్రాజెక్టులు పరిష్కరిస్తున్నాయి.
కృత్రిమ మేధ మౌలిక సదుపాయాల కోసం డేటా సెంటర్ల సామర్థ్య విస్తరణ
* ముంబయి, నవీ ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు ఉన్నాయి.
* వీటి స్థాపిత సామర్థ్యం 2020లో 375 మెగావాట్ల నుంచి ప్రస్తుతం దాదాపు 1,575 మెగావాట్లకు పెరిగింది.
* ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కొత్త పెట్టుబడి గమ్యస్థానాలుగా ముందుకొస్తుండటంతో డేటా సెంటర్ల పరిశ్రమ మరింత విస్తరిస్తోంది.
ప్రపంచ గుర్తింపు
* స్టాన్‌ఫర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ నివేదిక–2025 కృత్రిమ మేధ పోటీతత్వం, వ్యవస్థ చైతన్యంలో భారత్‌కు ప్రపంచంలో మూడో స్థానం ఇచ్చింది.
* గిట్‌హబ్ కృత్రిమ మేధ ప్రాజెక్టులకు సహకరించిన దేశాల్లో 2025లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని డెవలపర్లు, ఆవిష్కరణల సముదాయం బలానికి ఇది నిదర్శనం.
* ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026ను 2026 ఫిబ్రవరిలో నిర్వహించారు. 100కు పైగా దేశాలు, 20 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధి బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సదస్సు ప్రకటనను 92 దేశాలు, సంస్థలు ఆమోదించాయి.
* ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026లో భారత్.. పాక్స్ సిలికా కూటమిలో చేరింది. స్థిరమైన ప్రపంచ సిలికాన్ సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు అమెరికా, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.
* స్వావలంబనతో కూడిన, సమ్మిళితమైన, ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన కృత్రిమ మేధ వ్యవస్థను నిర్మించేందుకు భారత్ దేశీయంగా చేపడుతున్న ప్రయత్నాలకు ఇది తోడ్పడుతోంది.
చిప్‌లు, కృత్రిమ మేధలో ప్రగతి కొనసాగింపు
భారత సెమీకండక్టర్ కార్యక్రమం ప్రాజెక్టుల ఆమోదం, రూపకల్పన సహాయం దశ నుంచి వాణిజ్య ఉత్పత్తి దిశగా సాగుతోంది. తదుపరి దశ అయిన సెమికాన్ 2.0 పరికరాలు, సామగ్రి, అధునాతన ప్యాకేజింగ్, పరిశోధన, స్వదేశీ మేధోహక్కులు, ప్రతిభా వికాసంపై దృష్టిని విస్తరిస్తోంది. ఇండియాఏఐ మిషన్ ఉమ్మడి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నిర్మిస్తూ ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంకుర సంస్థల్లో కృత్రిమ మేధ అనువర్తనాలకు సహాయం అందిస్తోంది. ఈ సమగ్ర విధానం సాంకేతిక సామర్థ్యాలను పటిష్ఠం చేస్తూ బాధ్యతాయుత కృత్రిమ మేధ పాలనకు వీలు కల్పిస్తోంది. నిరంతర ఆవిష్కరణలకు మద్దతు ఇస్తోంది.
References
Ministry of Electronics & Information Technology
Ministry of Science and Technology
PIB Backgrounders
Click here to see PDF
PIB Research
***
(तथ्य सामग्री आईडी: 150944)
आगंतुक पटल : 27
Provide suggestions / comments