Economy
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026
प्रविष्टि तिथि:
11 AUG 2026 18:01 PM
వృద్ధి చెందుతున్న ఎంఎస్ఎంఈ రంగానికి సంస్కరణలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను పార్లమెంట్ 2026 ఆగస్టులో ఆమోదించింది. ఎంఎస్ఎంఈ రంగ అవసరాలకు అనుగుణంగా 2006 నాటి ఎంఎస్ఎంఈడీ చట్టంలోని నిబంధనలను ఈ బిల్లు సవరిస్తుంది. చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించడం, వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం, నిబంధనల అనుసరణను సులభతరం చేయడం ఈ సవరణల లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఎంఎస్ఎంఈల వృద్ధి, అభివృద్ధి, పోటీతత్వానికి తోడ్పడటం వీటి విస్తృత లక్ష్యం.

పరిచయం
ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను పార్లమెంట్ 2026 ఆగస్టులో ఆమోదించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం పోషిస్తున్న పాత్ర విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సవరణకు ప్రాధాన్యం ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని (ఎంఎస్ఎంఈడీ చట్టం) 2006లో ప్రకటించారు. అప్పటి నుంచి ఎంఎస్ఎంఈ వ్యవస్థ పరిధి, వైవిధ్యం, డిజిటల్ విస్తృతి గణనీయంగా పెరిగాయి.
ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంఎస్ఎంఈల వాటా 31.1 శాతం, తయారీ ఉత్పత్తిలో 35.4 శాతం, ఎగుమతుల్లో 48.58 శాతం. 2026 ఆగస్టు నాటికి ఉద్యమ్ వేదికపై 9.16 కోట్ల ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయి. వీటి ద్వారా 40 కోట్లకు పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారు. సాంకేతిక పురోగతి, సమాచార సాంకేతిక ఆధారిత వ్యవస్థలు ఎంఎస్ఎంఈ రంగ స్వరూపాన్ని మరింతగా మార్చాయి. ఈ సంస్థలు ఇప్పుడు గ్రామీణ, పట్టణ శివారు, పట్టణ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వ్యవస్థీకృత సరఫరా గొలుసుల్లో మరింత చురుగ్గా పాల్గొంటున్నాయి.

ఈ పునాదిపై ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026 రూపొందింది. రంగంలో మారుతున్న అవసరాలు, పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యానికి అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను తీర్చిదిద్దడం దీని లక్ష్యం.
బిల్లులో ప్రవేశపెట్టిన మార్పులు
2006 నాటి ఎంఎస్ఎంఈడీ చట్టంలోని కొన్ని నిర్దిష్ట నిబంధనలను 2026 బిల్లు సవరిస్తుంది. కీలక సంస్కరణల వివరాలు ఇలా ఉన్నాయి:
|
సంస్కరణ అంశం
|
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం–2006
|
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026
|
|
ఎంఎస్ఎంఈల వర్గీకరణ
|
తయారీ రంగంలో ప్లాంటు–యంత్రాలు, సేవల రంగంలో పరికరాలకు నిర్దేశించిన పెట్టుబడి పరిమితుల ఆధారంగా ఎంఎస్ఎంఈలను వర్గీకరిస్తారు.
|
ప్లాంటు–యంత్రాలు లేదా పరికరాల్లో పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈలను వర్గీకరిస్తారు.
|
|
ఎంఎస్ఎంఈ నమోదు
|
తయారీ రంగంలోని మధ్య తరహా సంస్థలు నిర్దేశిత అధికార సంస్థకు మెమొరాండం దాఖలు చేయడం తప్పనిసరి. ఇతర ఎంఎస్ఎంఈలకు ఇది స్వచ్ఛందం.
|
మెమొరాండం దాఖలును అన్ని ఎంఎస్ఎంఈలకు ఉచితంగా, స్వచ్ఛందంగా బిల్లు మారుస్తోంది. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ వేదికను ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాష్ట్ర స్థాయి డిజిటల్ వేదికలను ప్రకటించవచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయి వేదికల్లో నమోదైన ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర పథకాల ప్రయోజనాలను విస్తరించవచ్చు.
|
|
ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (ట్రెడ్స్) ద్వారా చెల్లింపులు
|
బిల్లులో కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ అంశాన్ని చేర్చారు.
|
ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసిన వస్తువులు, సేవలకు సంబంధించిన ఇన్వాయిస్లను అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రెడ్స్ వేదిక ద్వారా పరిష్కరించడం తప్పనిసరి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న చెల్లింపు సమస్యల పరిష్కారం దీని లక్ష్యం. రాష్ట్రాలు తమ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాధికార సంస్థలు లేదా ఇతర సంస్థలకు ఇన్వాయిస్ల పరిష్కారం కోసం ట్రెడ్స్ వినియోగాన్ని తప్పనిసరి చేయవచ్చు.
|
|
సూక్ష్మ, చిన్న పరిశ్రమల సౌలభ్య మండళ్ల (ఎంఎస్ఈఎఫ్సీ) వ్యవస్థ
|
రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంఎస్ఈ సౌలభ్య మండళ్లను ఏర్పాటు చేయవచ్చు.
|
చెల్లింపు వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఎంఎస్ఈఎఫ్సీలను ఏర్పాటు చేయవచ్చు. భౌతిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, శిక్షణ పొందిన సిబ్బందితో సహా అవసరమైన మౌలిక వసతులు, వనరులను సమకూర్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
|
|
మధ్యవర్తిత్వం, మధ్యస్థ పరిష్కారం
|
ఎంఎస్ఈఎఫ్సీలు లేదా వాటికి సూచించిన మధ్యవర్తిత్వ సేవా సంస్థలు చెల్లింపు వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చు. మధ్యవర్తిత్వం విఫలమైతే వివాదాన్ని మధ్యస్థ పరిష్కారానికి పంపవచ్చు.
|
ఆన్లైన్ మధ్యవర్తిత్వం లేదా మధ్యస్థ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. మధ్యవర్తిత్వం, మధ్యస్థ పరిష్కారానికి నిర్దిష్ట గడువులను ప్రవేశపెట్టారు. తొలి హాజరుకు నిర్ణయించిన తేదీ నుంచి 90 రోజుల్లోగా మధ్యవర్తిత్వాన్ని పూర్తి చేయాలి. మధ్యవర్తిత్వ ప్రక్రియ ముగిస్తే 30 రోజుల్లోగా వివాదాన్ని మధ్యస్థ పరిష్కారానికి పంపాలి. వాదనలు పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోగా మధ్యస్థ తీర్పును వెలువరించాలి.
|
|
వివాద పరిష్కారం
|
మండలి ఉత్తర్వు లేదా తీర్పును రద్దు చేయాలని కోరుతూ, తీర్పు మొత్తంలో 75 శాతం జమ చేసిన తర్వాత న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
|
ఇటువంటి దరఖాస్తులకు బిల్లు అనుమతిస్తోంది. దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో జమ చేసిన మొత్తంలో సముచిత భాగాన్ని ఎంఎస్ఎంఈ సరఫరాదారుకు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించవచ్చు. డిక్రీ, తీర్పు లేదా ఉత్తర్వును రద్దు చేయాలన్న దరఖాస్తు ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంటే ఎంఎస్ఈ సరఫరాదారుకు చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించాలి. ఈ చెల్లింపు తీర్పు మొత్తంలో కనీసం 50 శాతం ఉండాలి.
|
|
బకాయిల వసూలు
|
బిల్లులో కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ అంశాన్ని చేర్చారు.
|
మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందం లేదా మధ్యస్థ తీర్పు మొత్తాన్ని భూ ఆదాయ బకాయిల తరహాలో వసూలు చేయవచ్చు. సెక్షన్ 18 కింద సౌలభ్య మండలి, మధ్యవర్తిత్వ సేవా సంస్థ లేదా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార సంస్థ కుదిర్చిన ఒప్పందాలు లేదా వెలువరించిన తీర్పులకు ఇది వర్తిస్తుంది. కొనుగోలుదారు ఆస్తులు ఉన్న ప్రాంతంపై అధికార పరిధి కలిగిన జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ లేదా ప్రకటిత అధికారి ద్వారా బకాయిలను వసూలు చేయవచ్చు.
|
|
నేరపూరిత నిబంధనల తొలగింపు
|
ఉద్దేశపూర్వకంగా తప్పుడు నమోదు సమాచారం అందిస్తే తొలి నేర నిర్ధారణకు ₹1,000 వరకు జరిమానా, ఆ తర్వాత ప్రతి నేర నిర్ధారణకు ₹1,000 నుంచి ₹10 వేల వరకు జరిమానా విధిస్తారు. వార్షిక ఖాతాల్లో ఎంఎస్ఎంఈ సరఫరాదారులకు చెల్లించని బకాయిలను వెల్లడించకపోతే కనీసం ₹10 వేల జరిమానా విధిస్తారు.
|
నమోదు దాఖలు చేయకపోవడం లేదా సమాచారం అందించకపోవడం: గతంలో ఈ ఉల్లంఘనలకు నేర నిర్ధారణ, జరిమానా విధించే అవకాశం ఉండేది. ఇప్పుడు శిక్షాపరమైన నిబంధనలను నేరపరిధి నుంచి తొలగించారు. తప్పుడు సమాచారం అందించడం: తొలి సందర్భంలో హెచ్చరిక జారీ చేస్తారు. రెండోసారి, ఆ తర్వాత సందర్భాల్లో అపరాధ రుసుము విధిస్తారు. కొనుగోలుదారులు చెల్లించని బకాయిలను వెల్లడించకపోవడం: తొలి సందర్భంలో హెచ్చరిక, రెండోసారి అపరాధ రుసుము, మూడోసారి నుంచి జరిమానా విధిస్తారు.
|
డిజిటల్, సంస్థాగత మద్దతు
ఎంఎస్ఎంఈ వ్యవస్థ వ్యాప్తంగా ఏర్పాటైన డిజిటల్ వేదికలు, సంస్థాగత యంత్రాంగాలు బిల్లులో ప్రవేశపెట్టిన సంస్కరణలకు మద్దతు ఇస్తున్నాయి.
అధికారిక గుర్తింపు విస్తరణ: ఉచిత, కాగిత రహిత, స్వీయ ధ్రువీకరణ ఆధారిత ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఉద్యమ్ నమోదు పోర్టల్ ఎంఎస్ఎంఈలకు అధికారిక గుర్తింపు కల్పిస్తుంది. ఉద్యమ్ అసిస్ట్ వేదిక అనధికారిక సూక్ష్మ పరిశ్రమలకు అధికారిక గుర్తింపు కల్పిస్తూ ఈ కార్యక్రమానికి అనుబంధంగా పనిచేస్తుంది. అధీకృత భాగస్వాములు ధ్రువీకరించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ నమోదు లేని లేదా ఆదాయపు పన్ను వ్యవస్థ పరిధిలోకి రాని సంస్థలను కూడా ఇది గుర్తిస్తుంది.
ఆర్థిక వనరుల లభ్యత మెరుగుదల: ట్రెడ్స్ అనేది ఎంఎస్ఎంఈలు తమ వాణిజ్య బకాయిలపై ఆర్థిక సహాయం పొందడానికి లేదా వాటిని డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పించే ఎలక్ట్రానిక్ వేదిక. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఈ వేదిక ద్వారా డిస్కౌంట్ చేసిన ఇన్వాయిస్ల విలువ 2022–23లో ₹40 వేల కోట్లుగా ఉండగా, 2025–26లో ₹3.47 లక్షల కోట్లకు పెరిగింది.
ఆన్లైన్ వివాద పరిష్కారానికి అవకాశం: ఆన్లైన్ వివాద పరిష్కార(ఓడీఆర్) పోర్టల్‌ను 2025 జూన్‌లో ప్రారంభించారు. తక్కువ విలువ కలిగిన క్లెయిమ్‌లతో సహా ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు తక్కువ వ్యయంతో ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిస్థాయి డిజిటల్ వ్యవస్థను ఇది అందిస్తుంది.
ఎంఎస్ఈఎఫ్సీ నెట్‌వర్క్‌కు మరింత బలం: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 161 ఎంఎస్ఈఎఫ్సీలను ఏర్పాటు చేశారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎదుర్కొనే చెల్లింపు జాప్యాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ఈ మండళ్లు పనిచేస్తాయి.
ముగింపు
చిన్న పరిశ్రమగా ప్రారంభమై, వృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థగా ఎదిగే ఎంఎస్ఎంఈ ప్రయాణానికి బలమైన పునాదులు వేయాలని ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026 లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న వ్యాపార వాతావరణంలో ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహించడానికి, విస్తరించడానికి సహాయపడే పటిష్ఠ నియంత్రణ వ్యవస్థను ఈ బిల్లు అందిస్తుంది.
References:
Rajya Sabha:
https://sansad.in/rs/legislation/bills
Ministry of Micro, Small & Medium Enterprises:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2296358®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209712&lang=1®=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284414®=3&lang=1
Ministry of Finance:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2219984®=48&lang=2
PIB Archives:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2278107®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260904&lang=1®=3
Others:
https://prsindia.org/billtrack/the-micro-small-and-medium-enterprises-development-amendment-bill-2026
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150867)
आगंतुक पटल : 7
Provide suggestions / comments