Energy & Environment
భారతదేశంలో ఇథనాల్ మిశ్రమం
प्रविष्टि तिथि:
05 JUL 2026 15:39 PM
విధాన పరిణామం, కీలక మైలురాళ్లు మరియు తరచూ వ్యక్తమయ్యే ఆందోళనలు
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం గురించి
భారతదేశ ఇంధన పరివర్తన, జీవ ఇంధన వ్యూహంలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ) ఒక కీలక కార్యక్రమమైంది. ఇంధన భద్రతను మెరుగుపరచడం, రైతులకు మద్దతునివ్వడం, పర్యావరణం పై ప్రభావాలను తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. దేశీయంగా ఉత్పత్తి అయిన పునరుత్పాదక ఇంధనాన్ని మరింతగా వినియోగించడాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.
ఈబీపీ కార్యక్రమం ద్వారా, 2013-14లో 1.5 శాతం కన్నా తక్కువగా ఉన్న ఇథనాల్ మిశ్రమం 2025-26 నాటికి 20 శాతానికి పెరిగింది. భారతదేశం నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే 20 శాతం మిశ్రమ లక్ష్యాన్ని సాధించింది. ఇథనాల్ సేకరణ, ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్వై) 2013-14లో సుమారు 38 కోట్ల లీటర్ల ఉంటే 2025-26 నాటికి 1,200 కోట్ల లీటర్లకు (అంచనా) పైగా పెరిగింది. 2014లో 421 కోట్ల లీటర్లు గా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 2026 నాటికి సుమారు 2,000 కోట్ల లీటర్లకు పెరిగింది. అంటే దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల ముడి చమురు దిగుమతులను తగ్గించి, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించింది. దాంతో పాటుగా కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించి రైతుల ఆదాయాలను బలోపేతం చేసింది.
ఇథనాల్ మిశ్రమం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడం
భారతదేశం తాను వినియోగించే ముడి చమురులో దాదాపు 88.5 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ సంఖ్యే, విధానపరమైన అజెండాలో ఇథనాల్ మిశ్రమానికి ఎందుకింత ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉందో స్పష్టంగా వివరిస్తుంది. విదేశాల నుంచి కొనుగోలు చేసే ప్రతి బ్యారెల్ చమురు, దేశాన్ని పూర్తిగా నియంత్రణలో లేని ధరల హెచ్చుతగ్గులకు, సరఫరా అంతరాయాలకు గురి చేస్తుంది. దేశీయంగా పండించిన వనరులను ఉపయోగించి, భారతీయ చెరకు, మొక్కజొన్న మరియు వరి నుంచి ఉత్పత్తి చేసిప ఇథనాల్ ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.
ఈఎస్వై 2014-15 నుండి (మే 2026 వరకు), ఈ కార్యక్రమం పత్రాలపైపై ఉన్న విధాన లక్ష్యాన్నికి మించి అద్భుతమైన ఫలితాలను అందించింది.
|
రూ. 1.90+ లక్షల కోట్లు
2014-15 నుంచి విదేశీ మారక ద్రవ్యం ఆదా
|
310+ లక్షల మెట్రిక్ టన్నులు*
ముడి చమురు ప్రత్యామ్నాయం
|
~930 లక్షల మెట్రిక్ టన్నులు*
CO2 కార్భన్ ఉద్గారాలు తగ్గుదల
|
రూ. 1.60+ లక్షల కోట్లు
రైతులకు అదనపు ఆదాయం
|
వాస్తవాలను స్పష్టం చేయడం
ఇథనాల్ మిశ్రమానికి సంబంధించిన ప్రధాన ఆందోళనలపై వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయో, అలాగే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మరిన్ని అపోహలు దిగువన ఇవ్వబడ్డాయి.
|
వాదన
|
ది రికార్డ్
|
|
ఈ20 మైలేజీని 30 శాతం తగ్గిస్తుంది.
|
30 శాతం అనే అంకె పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్కు ఉండే తక్కువ కెలోరిఫిక్ విలువను మాత్రమే సూచిస్తుంది. అంతేగానీ వాస్తవ మైలేజీలో తగ్గుదలను కాదు. మైలేజీ అనేది ఇంధన రకం కంటే డ్రైవింగ్ అలవాట్లు, టైర్ ప్రెజర్, సర్వీసింగ్, ఏసీ లోడ్పై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
|
|
ఈ20 తో ఇంజన్లకు, ముఖ్యంగా పాతవాటిని నష్టం.
|
విడుదలైనప్పటి నుంచి ఈ20కి సంబంధించి ఎలాంటి ఇంజిన్ వైఫల్యాల నివేదించబడలేదు. వాహన తయారీదారులతో కలిసి ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ, ఐఓసిఎల్ విస్తృతమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ20కి ఆమోదం లభించింది.
|
|
ఇథనాల్ అధిక పనితీరు గల ఇంధనం కాదు. ఇంకా వాహన పనితీరును తగ్గిస్తుంది.
|
ఇథనాల్ ఒక అధిక-ఆక్టేన్ ఇంధనం, దీని పరిశోధన ఆక్టేన్ సంఖ్య సుమారు 108.5 కాగా, పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 84.4. ఈ20 భారతీయ పెట్రోల్ ప్రభావవంతమైన ఆక్టేన్ రేటింగ్ను సుమారు 95కి పెంచి, ఆధునిక ఇంజిన్లలో దహనాన్ని మెరుగుపరుస్తుంది. ఈ20 కోసం క్రమాంకనం చేయబడిన వాహనాలు మెరుగైన వేగం, సున్నితమైన పనితీరు, తక్కువ ఉద్గారాలను అందించగలవు.
|
|
ఈ20 నష్టానికి సంబంధించిన క్లెయిమ్లను భీమా కంపెనీలు తిరస్కరిస్తాయి.
|
భారతదేశంలో ఈ20 వల్ల బీమా లేదా వారంటీ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని బీమా సంస్థలు, ఓఈఎంలు స్పష్టం చేశాయి. నిర్దేశకాలకు అనుగుణంగా ఈ20 తో నడిచే వాహనాలకు వారంటీలు వర్తిస్తాయని ఎస్ఐఏఎం ధృవీకరించింది.
|
|
ఇథనాల్ కలిపిన ఇంధనం చౌక, కానీ ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం దాని ఖాతాలో వేసుకుంటోంది.
|
ఇందు కోసం 2020-21 నాటి నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో ఇథనాల్ వాస్తంగా పెట్రోల్ కంటే చౌకగా ఉండేది. అప్పటి నుంచి ఇథనాల్ సేకరణ ఖర్చులు శుద్ధి చేసిన పెట్రోల్ ఖర్చులను దాటింది. అయినప్పటికీ ఇది అందించే ఇంధన భద్రత, పర్యావరణ, వ్యవసాయ ఆదాయ ప్రయోజనాల కారణంచే ఇదే ఆదేశం కొనసాగుతూనే ఉంది.
|
|
ఈ20 కేవలం ఒక 'ప్రయోగం' మాత్రమేనని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
|
ఈ కేసు ఇథనాల్ సేకరణ ఒప్పందాలకు సంబంధించినది - ఈ20 అనుకూలతలు గురించి కాదు. 'ప్రయోగం' అనే వాదన సరికాదని అటార్నీ జనరల్ కార్యాలయం 30.06.2026 న స్పష్టం చేసింది.
|
|
చెరకు రసాన్ని పెట్రోల్లో పోస్తారు.
|
పెట్రోల్లో పచ్చి రసాన్ని కలిపినట్లు చూపించే వైరల్ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇథనాల్ను కిణ్వ ప్రక్రియ, పారిశ్రామిక ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియల్లో దాని లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. దీనిని ఇంధనంలో కలపే ముందు, కఠినమైన ఇంధన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
|
|
1 లీటరు ఇథనాల్ తయారీకి 10,000 లీటర్ల నీరు అవసరం.
|
ఇథనాల్ ప్లాంట్ ఒక లీటరు ఇథనాల్కు 3-5 లీటర్ల శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఆధునిక డిస్టిలరీలు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలను వాడుతున్నాయి. వరి సాగుకు వాడే మొత్తం వ్యవసాయ నీటి వినియోగాన్ని ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించడం సరికాదు. జాతీయ ఆహార భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత, డిఎఫ్పీడి ద్వారా నిర్ధారించి, అనుమతించిన మిగులు బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తారు.
|
|
ఈ20లో చక్కెర ఉండటం వల్ల చీమలు, తేనెటీగలు ఇంధన మూతల చుట్టూ మూగుతాయి.
|
ఫ్యూయల్ ఇథనాల్ను డిస్టిల్డ్ చేస్తారు. - ఇందులో మిగిలిపోయిన చక్కెరలను తొలగిస్తారు. ఇందులో కీటక వికర్షక కారకాలు ఉంటాయి. పెట్రోల్ వాసనే ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ కంటే ఈ20 తక్కువ ఆవిరిని ఏర్పరుస్తుంది.
|
|
ఇథనాల్కు నీటిని పీల్చుకునే స్వభావంచే ఇంధనాన్ని పాడుచేసి, ట్యాంకులను పాడు చేస్తుంది.
|
ఇథనాల్ కలిపిన, కలపకపోయిన ఏ ఇంధన ట్యాంక్లోకి నీరు చేరకుండా చూడటం ప్రాథమిక వాహన రూపకల్పన సూత్రం. ఆధునిక వాహనాలలోని డిజైన్లు, రక్షణ చర్యలు ఉండటం వల్ల ఇంధన ట్యాంకులలోకి నీరు ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
|
పరిశ్రమ విశ్వాస స్వరాలు
విస్తృతమైన పరీక్షలు, వాస్తవ ప్రపంచ సేవా డేటా ఆధారంగా, ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు మరియు ఇంధన రంగ నిపుణులు ఈ20 పై విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నారు.
పరిశ్రమ నేతల నుంచి వచ్చిన కొన్ని కీలక పరిశీలనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- విక్రమ్ గులాటి, కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టయోటా కిర్లోస్కర్ మోటార్: ప్రపంచవ్యాప్తంగా వాహనాలు కఠినమైన, స్వతంత్ర ధృవీకరణకు లోనవుతాయి. 1900ల ప్రారంభం నుంచి వాడుకలో ఉన్న, అధిక పనితీరు గల ఇంధనంగా ఇథనాల్ అనేది నిరూపితమైంది. పాత వాహనాలపై కఠినమైన పరీక్షలు జరిపిన తర్వాతే ఈ20కి మారాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
- రాహుల్ భారతి, మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: ఈ10 కోసం రూపొందించిన వాహనాలను ఈ20 ఇంధనంతో విస్తృతంగా పరీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల్లో, 1.5 కోట్లకు పైగా వాహనాలు మూడేళ్ల కంటే పాతవి, అందువల్ల వాటికి ఈ20 సర్టిఫికేషన్ లేదు. అయినప్పటికీ, ఈ20కి సంబంధించి ఎలాంటి నష్టం కనుగొనబడలేదు. మైలేజీపై దీని నిజమైన ప్రభావం చాలా తక్కువ. లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారుకు, మైలేజీలో తగ్గుదల సుమారుగా 0.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇంధన రకం కంటే డ్రైవింగ్ అలవాట్లు, నిర్వహణే మైలేజీని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మెరుగైన యాక్సిలరేషన్, తక్కువ కాలుష్యం వంటివి ఈ చిన్న వ్యత్యాసాన్ని భర్తీ చేస్తాయి.
- అశుతోష్ వర్మ, హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్: విస్తృతమైన సర్వీస్ డేటా విశ్లేషణలో, మునుపటి ఇంధనాలతో పోలిస్తే ఈ20తో నడిచే వాహనాల్లో అధిక నష్టం జరిగినట్లు కనుగొనబడలేదు.
- వర్తికా శుక్లా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్: సంబంధిత వర్గాలన్నిటితో విస్తృత సంప్రదింపులు అనరంతరం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు, కఠినమైన ఆటోమోటివ్ పరీక్షలు మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతులు మద్దతుగా ఉన్నాయి. ఈ20 ఇంధనం బీఐఎస్ ప్రమాణాలు మరియు బీఎస్-VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్లలో ఒకే విధంగా అందుబాటులో ఉంది.
తయారీ మరియు ఇంధన రంగాలన్నింటిలో, పరిశ్రమ నేతల నుంచి ఒకే సందేశం వస్తోంది. ఈ20 సురక్షితమైనది, చక్కగా పరీక్షించబడింది మరియు వాస్తవ ప్రపంచ డేటా మద్దతుతో ఉంది.
ఇథనాల్ మిశ్రమం ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన ఇంధన వ్యూహం
ఇథనాల్ మిశ్రమాన్ని అవలంబించడంలో భారతదేశం ఒక్కటే కాదు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన పద్ధతి. అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వాటి ఇంధన వ్యూహంలో ఇథనాల్ను పటిష్టంగా పొందుపరిచాయి.
- యునైటెడ్ స్టేట్స్: దేశవ్యాప్తంగా ఈ10 ప్రామాణిక ఇథనాల్ మిశ్రమ ఇంధనంగా ఉంది. అమెరికా ప్రభుత్వ మద్దతుతో ఈ15 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే లక్షలాది వాహనాలు ఫ్లెక్స్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఈ85 అంతటి అధిక మిశ్రమాలపై కూడా నడపగలవు.
- బ్రెజిల్: ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్ ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం ఈ27ను దాని ప్రామాణిక పెట్రోల్ మిశ్రమంగా చేసింది. దీనిని సుమారు 35 శాతానికి మరింత పెంచుతున్నారు. అమ్ముడయ్యే కొత్త కార్లలో 80 శాతానికి పైగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే. ఇవి ఈ27, ఈ30, లేదా స్వచ్ఛమైన హైడ్రస్ ఇథనాల్తో నడుస్తాయి.
- జపాన్: జపాన్ కూడా దాని ఇంధన మిశ్రమంలోకి ఇథనాల్ను చేర్చింది. దశలవారీగా ఈ10ను ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరిగింది.
కెనడా, థాయ్లాండ్ మరియు అనేక ఐరోపా దేశాలతో పాటుగా పలు దేశాలు వాటి స్వచ్ఛ ఇంధన వ్యూహాలలో భాగంగా ఇథనాల్ మిశ్రమాన్ని అవలంబించాయి.
భారతదేశ ఇంధన భవిష్యత్తును శక్తివంతం చేయడం
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం భారతదేశ ఇంధన వ్యూహంలో ఒక కీలక ముందడుగా ఉంది. దీని పురోగతి శాస్త్రీయ విశ్లేషణ, దశలవారీ అమలు, ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం ఇంధన భద్రతను బలోపేతం చేసింది, ఉద్గారాలను తగ్గించింది, రైతులకు కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించింది. ఇది ముడి చమురు దిగుమతులను కూడా తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయిన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించింది. ఈబీపీ కార్యక్రమం మరింత స్వచ్ఛమైన, పటిష్టమైన, మరియు స్వయం సమృద్ధిగల రవాణా ఇంధన వ్యవస్థకు దాని సహకారాన్ని కొనసాగిస్తుంది.
సూచనలు
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ
న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ
పిడిఎఫ్ ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(तथ्य सामग्री आईडी: 150788)
आगंतुक पटल : 3
Provide suggestions / comments