నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2026 4:10PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని 22 షెడ్యూల్డ్ భాషల్లో రూపొందించిన భారత రాజ్యాంగ సవరించిన నూతన ప్రతులను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భాన్ని భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి... దేశంలోని అన్ని షెడ్యూల్డ్ భాషల్లో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావడం భారత భాషా వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్య సమ్మిళితత్వాన్ని ఘనంగా చాటుతోందన్నారు. మాతృభాషలో రాజ్యాంగం అందుబాటులో ఉండటం వల్ల పౌరులకు పాలన మరింత చేరువవుతుందనీ... తద్వారా ప్రజలు తమ రాజ్యాంగ హక్కులు, విధులు, విలువలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలరని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్‌లోని ఇతర సభ్యులకు నివాళులర్పించిన శ్రీ సీపీ రాధాకృష్ణన్... రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన విధానం మాత్రమే కాదనీ, అది దేశపు సజీవ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆయన బృందం చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ ప్రయత్నాలు భారత భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశ భాషలు, జ్ఞాన సంప్రదాయాలను పరిరక్షించి ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాలనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'జ్ఞాన భారతం', 'కాశీ తమిళ సంగమం' వంటి కార్యక్రమాలు భారత నాగరికత వారసత్వ పరిరక్షణ సహా వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాల బలోపేతం పట్ల నిబద్ధతనూ ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
భారత్ బలం దాని వైవిధ్యంలోనే ఉందన్నారు. భాషలు కేవలం భావప్రసార మాధ్యమాలు మాత్రమే కాదు... సంస్కృతి, సంప్రదాయం, గుర్తింపునూ మోసుకెళ్లే వాహకాలు అని శ్రీ సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషల పట్ల పరస్పర గౌరవం కలిగి ఉండాలన్నారు. ప్రతి వ్యక్తికి తమ మాతృభాష పట్ల ప్రత్యేక అనుబంధం ఉన్నప్పటికీ... ఇతరుల భాషలను, మాతృభాషలనూ గౌరవించడం అంతే ముఖ్యమని శ్రీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పౌరులంతా తమ సొంత మాతృభాషలను వేడుకగా జరుపుకోవాలనీ, భారత్‌ను సామరస్యపూర్వక దేశంగా తీర్చిదిద్దుతున్న ఈ సుసంపన్న భాషా వైవిధ్యాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనీ ఆయన పిలుపునిచ్చారు.
మహాకవి సుబ్రమణ్య భారతి మాటలను గుర్తుచేసుకుంటూ... భారత్‌లో అనేక భాషలు మాట్లాడినప్పటికీ, దేశ సేవ విషయంలో అందరి ఆలోచనలు, ఆకాంక్షలు, కార్యాచరణ ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అన్ని 22 షెడ్యూల్డ్ భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేయడం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక అని, ఇది 'వికసిత్ భారత్@2047' దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని అన్ని భాషల పరిరక్షణ, అభ్యున్నతికి బలమైన, ఐక్య భారత్ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ‘దేశమే ప్రథమం’ అనే మార్గదర్శక సూత్రంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***