ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీఆర్ఐ, బీహార్ పోలీస్ సంయుక్త దాడి.. భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో పశ్చి చంపారణ్‌లో 19 కిలోలకు పైగా ఏనుగు దంతాల స్వాధీనం.. నలుగురి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 1:19PM by PIB Hyderabad

వన్యప్రాణుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక పెద్ద చర్యలో భాగంగా, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో పశ్చి చంపారణ్‌లో 19 కిలోలకు పైగా ఏనుగు దంతాల స్వాధీనం చేసుకోవడమే కాకుండా దీనిలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ దాడికి బీహార్ రాష్ట్ర పోలీసు విభాగం కూడా సహకారాన్ని అందించింది.


రహస్య సమాచారాన్ని అందుకున్న మీదట, డీఆర్ఐ అధికారులు బీహార్ రాష్ట్ర పోలీస్ విభాగంతో సమన్వయాన్ని ఏర్పరుచుకొని, నిన్నటి రోజున రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను ఆపారు. అనుమానిత వ్యక్తులలో ఒకరి వద్ద ఒక సంచీ ఉంది. అందులో  ఏనుగు దంతాలు ఉండి ఉండవచ్చని భావించారు. అనుమానితులు పరారయ్యే ప్రయత్నం చేసి, అధికారులను ప్రతిఘటించారు. అయితే వారిని విజయవంతంగా పట్టుకున్నారు అధికారులు.  సోదా చేయగా, 19.39 కేజీల ఏనుగు దంతాలు దొరికాయి. వాటిని వన్యప్రాణుల (పరిరక్షణ) చట్టం-1972కు సంబంధించిన సెక్షన్ల ప్రకారం జప్తు చేశారు.

 


ఏనుగులను వన్యప్రాణుల (పరిరక్షణ) చట్టం-1972లోని ఒకటో షెడ్యూలులో భాగంగా కాపాడుతున్నారు. వాటిని కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజర్‌డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫాన అండ్ ఫ్లార (సీఐటీఈఎస్)లోని ఒకటో అనుబంధంలో కూడా చేర్చారు.
భారతీయ చట్టాలు చెబుతున్న ప్రకారం, ఏనుగు దంతాల వ్యాపారం నిషిద్ధం. ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేయడమన్నది ఏనుగుల సంరక్షణకు ముప్పుగా పరిణమిస్తుంది.
ఈ దాడి వన్యప్రాణుల అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా ప్రభావవంతమైన చర్యలను చేపట్టడంతో పాటు, సంరక్షిత ప్రజాతుల చట్టవిరుద్ధ వ్యాపారంలో పాల్గొంటున్న ముఠాలను అరికట్టడంలో డీఆర్ఐ చాటుకుంటున్న నిబద్ధతకు ఓ నిదర్శనంగా కూడా ఉంది. దీని కోసం రహస్య సమాచారం ఆధారంగా ఇతర నేర నియంత్రణ ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయాన్ని ఏర్పరుచుకొని మరీ  కార్యకలాపాలను చేపడుతున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2342030) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Assamese