నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 5:28PM by PIB Hyderabad
ఏదైనా రహదారి మార్గాన్ని ప్రారంభించడానికి ముందే ఆ మార్గంలో ‘అత్యవసర సంఘటనల సమయంలో నిర్వహణ సేవలు (ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ - ఐఎంఎస్)’ అందుబాటులో ఉండేలా చూడాల్సిందిగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై అత్యవసర సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రహదారి భద్రతను పటిష్టం చేయడమే కాకుండా.. ప్రమాదాలు, వాహనాల బ్రేక్‌డౌన్‌లు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో జాతీయ రహదారి వినియోగదారులకు సకాలంలో సాయమందించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఈ సేవల్లో భాగంగా జాతీయ రహదారులపై అంబులెన్సులు, రూట్ పేట్రోలింగ్ వాహనాలు, వాహనాలను తరలించే క్రేన్‌లు అందుబాటులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే బృందాలను ఎన్‌హెచ్‌ఏఐ ‘1033’ జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌తో అనుసంధానించడం ద్వారానూ, అలాగే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సేవలు, ఆస్పత్రులతో సమన్వయం చేయడం ద్వారానూ ఈ సేవలకు పూర్తి సహకారాన్ని అందించాలని నిర్ణయించారు.
జాతీయ రహదారులంతటా అందుబాటులో...
వివిధ రకాల జాతీయ రహదారి మార్గాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేవడానికి అవసరమైన ఏర్పాట్లను ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న జాతీయ రహదారి మార్గాల్లో ప్రమాదాల గణాంకాలు, ఆ మార్గంలో అవసరాల ఆధారంగా టోల్ ప్లాజాలు లేదా ఇతర అనువైన ప్రదేశాల్లో అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతారు.
ఎన్‌హెచ్ఏఐ క్షేత్రస్థాయి కార్యాలయాలకు దఖలు పరిచిన అధికారాలకు అనుగుణంగా.. ఎన్‌హెచ్‌ఏఐకి మంత్రిత్వశాఖ అప్పగించిన జాతీయ రహదారులపై ఒక కేంద్రీకృత ఏజెన్సీ ద్వారా అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూస్తారు. రూట్ పెట్రోలింగ్ వాహనాలు, వాహనాలను తరలించే క్రేన్‌లను ప్రత్యేక టెండర్ల ద్వారా లేదా రహదారుల నిర్వహణ, బలోపేత పనులలో భాగంగా ఏర్పాటు చేస్తారు.
అంతేకాకుండా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విధానం ప్రకారం... ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించకపోయినా, ఆ సంస్థ టోల్ వసూలు చేస్తున్న జాతీయ రహదారి మార్గాల్లో ‘అత్యవసర సంఘటనల సమయాల్లో నిర్వహణ సేవలు (ఐఎంఎస్)’ అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం/ ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌తో సమన్వయం ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ కేంద్రీకృత ఏజెన్సీ ద్వారా అంబులెన్సులను అందుబాటులో ఉంచుతారు. అయితే అలాంటి మార్గాల్లో రూట్ పెట్రోలింగ్ వాహనాలు, వాహనాలను తరలించే క్రేన్‌లను సంబంధిత యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా.. జాతీయ రహదారి వినియోగదారులకు సకాలంలో సాయమందించడం, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సమగ్ర భద్రతను పెంపొందించడం ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
***