57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫి-2026లో ప్రతిభావంతులైన వర్ధమాన చలనచిత్ర రూపకర్తలను సత్కరించిన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎమ్ఓటీ) 6వ సంచిక

48 గంటల పాటు చిత్ర రూపకల్పన సవాల్..
పోటీలో పాల్గొన్న 13 చిత్ర నిర్మాణ విభాగాలకు చెందిన 100 మంది యువ సృజనశీలురు

జట్టు స్ఫూర్తితో పనిచేయండి.. సీఎమ్ఓటీ ఆరంభం మాత్రమేనన్న ఇఫి ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ ఆశుతోష్ గొవారికర్

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 1:57PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341368Views: 2

ఒక కథను రాసుకొని, దానిని తెర మీద ఆవిష్కరించడానికి చేపట్టే క్రతువులో 100 మంది సృజనశీల వృత్తి నిపుణులు భుజం భుజం కలిపారు. 48 గంటల వ్యవధితో కూడిన సవాలును వారు స్వీకరించి తమ చిత్రనిర్మాణ నైపుణ్యాలను సాన పట్టారు. క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎమ్ఓటీ) 6వ సంచికను గోవాలోని 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫి’)లో ఈ రోజున ముగించారు. ఈ కార్యక్రమం దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వర్ధమాన కళాకారులను ఒక చోట సమావేశపరిచింది. అయిదు జట్లు రూపొందించిన చలనచిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడంతో పాటు, పదిహేను శ్రేణులలో పురస్కారాలను కూడా ప్రదానం చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి తెరపడింది.


ముగింపు కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిలో 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫి’) ఫెస్టివల్ డైరెక్టర్, చలన చిత్రాల రూపకర్త శ్రీ ఆశుతోష్ గొవారికర్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్, భారత చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్‌టీఐఐ) ఉప కులపతి శ్రీ ధీరజ్ సింగ్‌తో పాటు న్యాయనిర్ణేతల సంఘం సభ్యులు ఉన్నారు. ది గ్రేట్ గ్రాండ్ జ్యూరీ సభ్యులుగా శ్రీమతి ఐమీ బరువా, ప్రేంరాజ్, శ్రీ మధు అప్సర, శ్రీ రూమీ జాఫ్రి, మేధ ఖెర్‌డేకర్ రెడ్డిలు వ్యవహరించారు.
సీఎమ్‌ఓటీ-2026లో విజేతల వివరాలు
1. ఉత్తమ చిత్రం: ‘వన్ లాస్ట్ స్టాప్’కు రూ.5 లక్షల పురస్కారం. దీనికి దర్శకత్వం వహించింది శ్రీ మోహక్ గాంధీ (రెడ్ టీమ్).
2. రెండో స్థానంలో నిలిచిన చిత్రం: ‘ఎ లిటిల్ సమ్‌థింగ్’కు రూ.3 లక్షల పురస్కారం. దీనికి తమన్న ఠాకుర్ (గ్రీన్ టీమ్) దర్శకత్వం వహించారు.


3. ఉత్తమ దర్శకత్వం: తమన్న ఠాకుర్, ‘ఎ లిటిల్ సమ్‌థింగ్’ (గ్రీన్ టీమ్).
4. ఉత్తమ నటన: సిద్ధి పార్‌కర్, షెల్స్ (బ్లూ టీమ్).
5. ఉత్తమ సినిమాటోగ్రఫర్: త్రయాశా మన్న, ‘వన్ లాస్ట్ స్టాప్’ (రెడ్ టీమ్).
6. ఉత్తమ ఎడిటర్: నయన్ చొటాలియా, మానవ్ అగర్వాల్, ‘ఎ లిటిల్ సమ్‌థింగ్’ (గ్రీన్ టీమ్).
7. ఉత్తమ స్క్రిప్ట్ రచయిత: జితిన్ ఎస్, షెల్స్ (బ్లూ టీమ్).
8. ఉత్తమ సౌండ్ డిజైన్: అశ్విన్ అశోక్, టూ సన్‌సెట్స్ అండ్ జీరో సన్‌రైజెస్ (యెలో టీమ్)
9. ఉత్తమ నేపథ్య గాయని: శ్రీ పార్వతి ఎస్, షెల్స్ (బ్లూ టీమ్).
10. ఉత్తమ సంగీత రచన: అక్షయ్ అన్‌మోల్ కటోరే, నీల్ మఛ్‌లీ (బేజ్ టీమ్)
11. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సృష్టి వాఘ్, రూపాలిక పాల్, ‘వన్ లాస్ట్ స్టాప్’ (రెడ్ టీమ్).
12. ఉత్తమ హెయర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్: కశిశ్ జాయస్‌వాల్, షెల్స్ (బ్లూ టీమ్).
13. ఉత్తమ ఆర్ట్ డిజైన్: సృష్టి వాఘ్, రూపాలిక పాల్, ‘వన్ లాస్ట్ స్టాప్’ (రెడ్ టీమ్).
14. ఉత్తమ అనిమే అండ్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్: హర్ష్ సహాని, ప్రకాశ్ కుమార్ మెహ్‌తా, నీల్ మఛ్‌లీ (బేజ్ టీమ్)
15. ఉత్తమ వాయిస్-ఓవర్, డబ్బింగ్: సుదీక్ష సర్కార్, ‘ఎ లిటిల్ సమ్‌థింగ్’ (గ్రీన్ టీమ్).
పరిశ్రమకు ఒక వారధి
48 గంటల పాటు సాగిన చలనచిత్ర నిర్మాణ సవాలులో పోటీపడి, కార్యక్రమం ముగియడానికి తోడ్పడిన వారందరిని అదనపు కార్యదర్శి ప్రభాత్ అభినందించారు. ప్రతిభావంతులకు, చలనచిత్ర పరిశ్రమకు మధ్య ఒక వారధిగా సీఎమ్ఓటీ ఉందని ఆయన వర్ణించారు. ఈ కార్యక్రమం యువ సృజనశీలురికి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి, పరిశ్రమలోని వృత్తినిపుణులతో మమేకం అయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు.


ఈ సంవత్సరం ఇతివృత్తంగా ‘రూట్స్, వింగ్స్: ఆనరింగ్ అవర్ రూట్స్, ఎంబ్రేసింగ్ అవర్ ఫ్యూచర్’ను తీసుకున్న సంగతిని శ్రీ ప్రభాత్ ప్రస్తావించారు. దీనిని సాంస్కృతిక వారసత్వం, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞ‌ానాల కలబోతగా ఆయన వర్ణించారు. అనిమే, విజువల్ ఎఫెక్ట్‌స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్‌ఆర్) రంగంలో వర్ధిల్లుతున్న అవకాశాల గురించి కూడా శ్రీ ప్రభాత్ వివరించారు. ఈ రంగం సృజనాత్మక పరిశ్రమలలో యువ వృత్తినిపుణులకు కొత్త కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఆయన అన్నారు.
చిత్రోత్సవ డైరెక్టర్ శ్రీ ఆశుతోష్ గొవారికర్ శ్రమించిన అన్ని జట్లకు అభినందనలు తెలిపారు. చలనచిత్ర రూపకల్పన అంటేనే పరస్పరం కలిసికట్టుగా చేసే పని అని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క చలనచిత్రమూ ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కానే కాదని, అంతకన్నా అది అనేక సృజనాత్మక రంగాలను ఏకతాటి మీదకు వచ్చి పాటుపడిన దానికి దక్కే ఫలితమని పోటీలో పాలుపంచుకున్న వారికి ఆయన గుర్తుచేశారు. సవాలును స్వీకరించిన కాలంలో ఏర్పడిన బంధాలను కాపాడుకోవలసిందిగా వారిని ఆయన ప్రోత్సహించారు. యువ చలనచిత్ర రూపకర్తలు ఒకరితో మరొకరు అనుసంధానమై ఉండాలని, జట్టుగా పనిచేస్తుండాలని, అనుభవాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. సీఎమ్‌ఓటీ వారి యాత్రకు ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
48 గంటలు, అయిదు జట్లు, ఒక సృజనాత్మక సవాలు
చలనచిత్ర రూపకల్పన సవాలును నవంబర్ 21న మొదలుపెట్టారు. దీనిలో పాల్గొన్న వారిని ఒక్కొక్క జట్టులో 20 మంది వంతున మొత్తం అయిదు జట్లుగా ఏర్పరిచారు. ఆ జట్లకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు, బేజ్ అనే రంగుల పేర్లు పెట్టారు. ‘రూట్స్, వింగ్స్ : ఆనరింగ్ అవర్ రూట్స్, ఎంబ్రేసింగ్ అవర్ ఫ్యూచర్’ అన్న ఉమ్మడి ఇతివృత్తంలో భాగంగా పనిచేస్తూ, ప్రతి జట్టు  48 గంటల లోపల ఒక షార్ట్ ఫిల్మ్ భావనను ఊహించుకొని, చిత్రీకరించి, దానికి తుది రూపాన్ని ఇవ్వాలని నిర్దేశించారు.
ఈ చాలెంజ్‌లో చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన 13 విభాగాలకు చెందిన వారు భాగం పంచుకున్నారు. ఆ విభాగాలలో దర్శకత్వం, నటన, చలనచిత్ర కళ (సినిమాటోగ్రఫి), కూర్పు, సౌండ్ డిజైన్, స్క్రిప్ట్ రచన, కళా దర్శకత్వం, అనిమే, విజువల్ ఎఫెక్ట్‌స్, సంగీత రచన, నేపథ్య గానం, హెయర్ అండ్ మేకప్, కాస్ట్యూమ్ డిజైన్ ఉన్నాయి. గోవాలో వేరు వేరు చోట్ల చిత్రీకరణను చేపట్టిన తరువాత, జట్లు కళా అకాడమీకి చెందిన ప్రత్యేక నిర్మాణానంతర కూడలికి వెళ్లాయి. అక్కడ ఆ జట్లు తమకిచ్చిన గడువు లోగా కూర్పు, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఫినిషింగ్ దశలు పూర్తి చేయడానికి నడుం బిగించాయి.
తుది రూపును దిద్దిన చలనచిత్రాల్లో వాటి రూపకర్తలు తమకు ఇచ్చిన ఇతివృత్తాన్ని సృజనశీల రీతిన ఆకళింపు చేసుకొన్నారు. దీంతో పాటు వివిధ రంగాల వారితో కలిసి పనిచేసి, కష్టమైన పరిస్థితుల్లో తమను తాము నిరూపించుకోవాలన్న పట్టుదలను కనబరిచారు.
వర్ధమాన ప్రతిభావంతులకు బాటలను పరచడం
2021లో సీఎమ్ఓటీని మొదలుపెట్టినప్పటి నుంచి, ఇది వర్ధమాన సృజనశీలి ప్రతిభావంతులను ప్రసార మాధ్యమాలు, వినోద ప్రధాన పరిశ్రమతో కలిపే ఒక వేదికగా మారిపోయింది. దీని పాత విద్యార్థులు అంతర్జాతీయ సంస్థలలో పనిచేయసాగారు. వారు కాన్స్, బర్లినాలే, టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలోను, ఇంటర్నేషనల్ ఎమీ అవార్డుల వంటి వేదికలలోను, చలనచిత్రోత్సవాలలోను గుర్తింపును తెచ్చుకున్నారు.
పాత సంచికకు చెందిన ఒక ముఖ్య ఫలితంలో, ముకేశ్ ఛాబ్రా కాస్టింగ్ కంపెనీ (ఎమ్‌సీసీసీ) 18 మందిని ఎంపిక చేసుకుంది. దీంతో వర్ధమాన ప్రతిభావంతులకు వృత్తిసంబంధిత అవకాశాలను అందించడంలో ఈ కార్యక్రమానికి ఉన్న సత్తా బయటపడింది.
చిత్ర నిర్మాణ సవాలు కార్యక్రమాన్ని జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ)తో భారత చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్‌టీఐఐ) కలసి నిర్వహించింది. దీనిలో పాలుపంచుకున్న వారికి ఈ ప్రక్రియ ప్రతి మజిలీలోను ఎఫ్‌టీఐఐ ఫేకల్టీ సభ్యులు మార్గదర్శకత్వం వహించారు. గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌జీ) రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా చిత్రీకరణకు అవసరమైన అనుమతులను మంజూరు చేయించడంలో తోడ్పాటును అందించింది.
ఇఫిలాయిడ్‌ (IFFILOID) ను ఈ కింది వెబ్ చిరునామాలో చదవగలరు:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341368
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026