మంత్రిమండలి
azadi ka amrit mahotsav

16వ ఆర్థిక సంఘం కాలంలో (2026-27 నుంచి 2030-31 వరకు) రూ. 1,141 కోట్ల వ్యయంతో ‘తపాలా కార్యకలాపాల పథకం’ కొనసాగింపునకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

తపాలా నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడం, పార్శిల్- మెయిల్ కార్యకలాపాలను బలోపేతం చేయడం, గ్రామీణ అనుసంధానాన్ని పెంపొందించడం, పౌర-కేంద్రీకృత సేవలను మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం

ఇండియా పోస్ట్ సేవల ఈ-కామర్స్ లాజిస్టిక్స్, ఆర్థిక సమ్మిళితత్వం, అంతర్జాతీయ మెయిల్ కార్యకలాపాలు, డిజిటల్ పరివర్తనపై ప్రత్యేక దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 3:29PM by PIB Hyderabad

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 16వ ఆర్థిక సంఘం కాలంలో రూ. 1,141 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ‘తపాలా కార్యకలాపాల పథకం’ కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా తపాలా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్‌తో పాటు ఈ-కామర్స్, డిజిటల్ సేవల పంపిణీలో పెరుగుతున్న అవసరాలకు మద్దతు ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పథకం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,49,655 తపాలా కార్యాలయాలతో సహా మొత్తం 1.65 లక్షల తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోని అతిపెద్ద తపాలా వ్యవస్థలలో ఇండియా పోస్ట్ ఒకటిగా ఉంది. ముఖ్యంగా మారుమూల, సేవలు సరిగా అందని ప్రాంతాల్లో మెయిల్, పార్శిళ్లు, బ్యాంకింగ్, బీమా, ఇతర పౌర-కేంద్రీకృత సేవలను అందించే ఒక ముఖ్యమైన వేదికగా ఇది కొనసాగుతోంది.

తన ప్రధాన తపాలా కార్యకలాపాలతో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీఓఎస్‌బీ), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), ఆధార్ నమోదు- నవీకరణ, పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు, కేవైసీ ధ్రువీకరణ సేవలు, డాక్‌ఘర్ నిర్యాత్ కేంద్రాల (డీఎన్‌కేలు) ద్వారా గ్రామీణ కళాకారులకు మద్దతు వంటి కార్యక్రమాల ద్వారా ఇండియా పోస్ట్ విస్తృత శ్రేణి ప్రజా సేవలను అందిస్తోంది.

ఈ పథకం దేశవ్యాప్తంగా తపాలా మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు తోడ్పడుతోంది. ఇది చివరి మైలు వరకు డెలివరీని బలోపేతం చేయటంతో పాటు లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించటం, వినియోగదారు-కేంద్రీకృత సేవల పంపిణీని ఇది పెంపొందిస్తుంది. ఈ పథకం.. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ వంటి విస్తృత లక్ష్యాలకు కూడా అనుగుణంగా ఉంది.

ఈ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేయనున్నారు.

‘తపాలా కార్యకలాపాల పథకం’లో ఈ కింది ఆరు ఉప-పథకాలు ఉన్నాయి:

1. గ్రామీణ వ్యాపారంతో పాటు తపాలా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావటం- రూ. 120 కోట్లు: ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాలను సమర్థవంతమైన, పౌర-కేంద్రీకృత సేవా కేంద్రాలుగా మార్చడానికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, ప్రామాణిక బ్రాండింగ్, వనరుల మెరుగైన వినియోగంపై ఇది దృష్టి సారిస్తుంది. సేవలు సరిగా అందని ప్రాంతాల్లో చివరి మైలు డెలివరీని మెరుగుపరచడం ద్వారా తపాలా, పౌర-కేంద్రీకృత సేవల అందుబాటును పెంపొందించడంతో పాటు ఆర్థిక సమ్మిళితత్వం, డిజిటల్ అనుసంధానం, స్థానిక ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ విభాగం ఉంది. 

2. మెయిల్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ – రూ. 575 కోట్లు: కేంద్రీకృత డెలివరీ వ్యవస్థలు, యాంత్రీకరణ, అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ 2.0) కింద ఆధునిక ఐటీ పరిష్కారాలు, జీఐఎస్ ఆధారిత సేవలు, ఆధునికీకరించిన మౌలిక సదుపాయాల ద్వారా మెయిల్ కార్యకలాపాలను ఆధునికీకరించాలని ఇది భావిస్తోంది. నెట్‌వర్క్ అంతటా కార్యాచరణ సామర్థ్యం, పారదర్శకత, సేవా నాణ్యత, లాజిస్టికల్ విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు డెలివరీ పోస్టాఫీసులు, మెయిల్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, మెయిల్ మోటార్ సర్వీస్ (ఎంఎంఎస్) వర్క్‌షాప్‌లు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్, ఆధునిక స్మార్ట్ 24x7 లెటర్ బాక్స్‌లను బలోపేతం చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది.

3. పార్శిల్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్– రూ. 278 కోట్లు: పార్శిళ్ల రవాణాను క్రమబద్ధీకరించడానికి, హ్యాండ్లింగ్ కేంద్రాలను తగ్గించడానికి, సామర్థ్య పరిమితులను అధిగమించడానికి, రవాణా సమయాలను మెరుగుపరచడానికి పునఃరూపకల్పన చేసిన సార్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా పార్శిల్ హబ్‌ల నిర్మాణం, పార్శిల్ ప్యాకేజింగ్ యూనిట్ల (పీపీయూలు) విస్తరణ ఇందులో భాగంగా ఉన్నాయి. వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందిస్తూ, లాజిస్టిక్స్ రంగంలో ఇండియా పోస్ట్ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రత్యేకంగా నిర్మించిన సదుపాయాలు, ప్రామాణిక సురక్షిత ప్యాకేజింగ్, మెరుగైన కార్యాచరణ వెసులుబాటు ద్వారా ఈ-కామర్స్, గ్రామీణ మార్కెట్ల నుంచి పెరుగుతున్న పార్శిల్ పరిమాణాలకు మద్దతు ఇవ్వడం కూడా ఈ విభాగం లక్ష్యం.

4. అంతర్జాతీయ మెయిల్స్ కోసం మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, విస్తరణ– రూ. 8 కోట్లు: మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అంతర్జాతీయ సరుకుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి ఫారిన్ పోస్ట్ ఆఫీసులు (ఎఫ్‌పీఓలు), సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసులను (ఎస్ఎఫ్‌పీఓలు) ఆధునికీకరించడం ద్వారా అంతర్జాతీయ మెయిల్ సేవలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. నిబంధనల అమలు, సాంకేతిక ఏకీకరణ, ఎగుమతి లాజిస్టిక్స్ మద్దతును మెరుగుపరుస్తూనే పోస్టల్ లేదా ఆర్ఎంఎస్ విభాగం ద్వారా మార్కెటింగ్- ప్రకటనల నిర్వహణ, ఇండియా పోస్ట్‌ను ఒక విశ్వసనీయ అంతర్జాతీయ లాజిస్టిక్స్ ప్రొవైడర్‌గా నిలబెట్టడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

5. సేవా నాణ్యతతో కూడిన మార్కెటింగ్ విధులు – రూ. 100 కోట్లు: టెలివిజన్, డిజిటల్, రేడియో, ప్రింట్, అవుట్‌డోర్ వేదికలపై బహుళ-ఛానల్ ప్రచారాల ద్వారా అవగాహన, బ్రాండింగ్, ప్రజలకు చేరువ కావడం, వినియోగదారుల భాగస్వామ్యంపై ఇది దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, సేవలు సరిగా అందని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అనుసంధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు, ప్రదర్శనలలో పాల్గొనడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, ‘డాక్ చౌపాల్’ కార్యక్రమాల విస్తరణ కూడా ఈ విభాగంలో భాగంగా ఉన్నాయి. అదనంగా సేవా నాణ్యతను మెరుగుపరచడానికి, వినియోగదారు-కేంద్రీకృత విధానాన్ని బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, స్టూడియో సదుపాయాలు, ఐసీటీ మెరుగుదలలు, మార్కెట్ పరిశోధన, ఇన్‌ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం, తృతీయ పక్షం మదింపు యంత్రాంగాలను ఇది ప్రతిపాదిస్తోంది.

6. తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటలీ) కార్యకలాపాలు– రూ. 60 కోట్లు: ప్రదర్శనలు, సెమినార్లు, క్విజ్ పోటీలు, పాఠశాల ఫిలాటలీ క్లబ్‌లు..  సువాసన వెదజల్లే, హోలోగ్రాఫిక్, 3D తపాలా బిళ్లలతో సహా వినూత్న స్టాంప్ డిజైన్ల ద్వారా తపాలా బిళ్లల సేకరణను ప్రోత్సహించే కార్యక్రమాలను ఇది ప్రతిపాదిస్తుంది. కార్యాచరణ సామర్థ్యాన్ని, ఆదాయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూనే తపాలా బిళ్లల సేకరణను ఒక ఆకర్షణీయమైన విద్యా, సాంస్కృతిక కార్యకలాపంగా పునరుద్ధరించే లక్ష్యంతో డిజిటల్ ప్రచార కార్యకలాపాలు, ‘ఢాయీ అఖర్’ లేఖా రచన పోటీ, ‘స్పర్శ్’ ఉపకార వేతనం వంటి కార్యక్రమాలు, ఉత్పత్తి- సరఫరా కేంద్రాల ఆధునికీకరణ, మార్కెట్ పరిశోధన, అంతర్జాతీయ సహకారం కూడా ఈ విభాగంలో భాగంగా ఉన్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2341306) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Malayalam