నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 3:27PM by PIB Hyderabad
సిల్చార్ విమానాశ్రయంలో ప్రస్తుతమున్న రక్షణ శాఖ సివిల్ ఎన్క్లేవ్ ఎదుర్కొంటున్న కార్యకలాపాలు, స్థల పరిమితుల సమస్యను అధిగమించేందుకు, నిరంతరం పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని సిల్చార్ వద్ద డోలూలో రూ. 2,014 కోట్ల అంచనా వ్యయంతో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ద్వారా నూతన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
బరాక్ లోయకు అస్సాంలోని కచార్ జిల్లాలో ఉన్న డోలూ వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. విస్తారమైన తేయాకు తోటలు, వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు పర్యావరణ, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలున్న ప్రాంతంగా దీనికి పేరుంది.
ప్రతిపాదిత టెర్మినల్ భవనం మొత్తం 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రద్దీ సమయాల్లో 800 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించనున్నారు. దీన్ని ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, పర్యావరణ అనుకూల సూత్రాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు వీలుండే విధానంతో రూపొందించారు. దీనికి అదనంగా ఏ-320 విమానాల రాకపోకలకు వీలుగా 2,705 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో కోడ్-4సీ ప్రమాణాలతో రన్‌వేను అభివృద్ధి చేస్తారు. ఏ-320 విమానాలను నిలిపే సామర్థ్యం గల కొత్త పార్కింగ్ స్థలం, విమానాలను వేరుగా ఉంచేందుకు ప్రత్యేక ఐసోలేషన్ బే నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా డోలూ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం దక్షిణ అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న విమాన ప్రయాణ అవసరాలను తీరుస్తుంది. ఇది ప్రస్తుతమున్న విమానాశ్రయాలపై ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. వాణిజ్యం, పర్యాటక రంగాలను ప్రోత్సహించటం ద్వారా ప్రాంతీయ ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. ఈశాన్య భారతదేశాన్ని జాతీయ, అంతర్జాతీయ అభివృద్ధి కారిడార్లతో అనుసంధానించే ప్రపంచ స్థాయి ప్రవేశ ద్వారంగా నిలుస్తుంది.
***