గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా కళాఅకాడమీలో ‘నటుడిగా మారకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి?’ అనే అంశంపై మాస్టర్‌క్లాస్ నిర్వహించారు. నటుడు, యాక్టింగ్ కోచ్ అయిన శ్రీ సౌరభ్ సచ్‌దేవ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఔత్సాహిక యువ నటీనటులు పాల్గొన్నారు. నటనారంగంలోకి అడుగుపెట్టాలనుకొనే వారికి అడ్డంకిగా నిలుస్తున్న మానసికమైన, ఆచరణాత్మకమైన, వ్యక్తిగత అవరోధాల గురించి ఈ సెషన్లో వివరించారు.
చర్చలు, ఆచరణాత్మక ఉదాహరణల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శ్రీ సచ్‌దేవ అవగాహన కల్పించారు. నటులు కావాలనే కోరికకు అతీతంగా ఆలోచించి తమను వెనక్కి లాగుతున్న భయాలను, అలవాట్లను, వైఖరిని పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
_20261124191247_a90479.jpeg)
ఆడిషన్లు, తిరస్కరణల చుట్టూ నెలకొన్న అనిశ్చితి గురించి ఆయన వివరించారు. తాము ఎందుకు ఎంపికయ్యామో లేదా తిరస్కరణకు గురయ్యామో నటులకు అన్ని సందర్భాల్లోనూ తెలియకపోవచ్చన్నారు. నటీనటుల ఎంపికలో అనేక మంది భాగం పంచుకుంటారని తెలియజేశారు. వ్యక్తిగత ఆడిషన్లతో భావోద్వేగపరంగా అనుసంధానం కావొద్దని సూచించారు. “మీకు ఎప్పటికీ తెలియదు. మీరు చేయగలిగింది ఒక్కటే. వారికి ఎలా అనిపించిందో అడగడం, అంతే.” ఫలితాన్ని అంగీకరించడం, స్పందన కోసం ఎదురుచూడకుండా ఆడిషన్లు కొనసాగించడం గురించి ఆయన వివరించారు.
దేనినైనా ఇష్టపడటానికి, దాని పట్ల నిజమైన అంకితభావం కలిగి ఉండటానికి మధ్య ఉన్న తేడా... ఈ మాస్టర్ క్లాస్ ప్రధానాంశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ నిబద్ధతను ఆత్మపరిశీలన చేసుకోవాలని సచ్‌దేవ అన్నారు. ‘‘మీకు నటుడిగా మారాలనే ఇష్టం ఉందా లేదా నటునిగా ఎదగాలనే తపన ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇష్టమనేది ఆసక్తి స్థాయిలోనే ఆగిపోతుందన్నారు. దాని పట్ల శ్రద్ధ చూపాలంటే బాధ్యత, ఏకాగ్రత, నిరంతర శ్రమ అవసరమని తెలియజేశారు. ‘‘మనలో చాలామంది మన పనిని ఇష్టపడతాం, కానీ దాని పట్ల నిజమైన శ్రద్ధ వహించం’’ అని వ్యాఖ్యానించారు. తమ కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన నిబద్ధత తమ పనుల్లో కనిపిస్తోందో లేదో సరిచూసుకోవాలని ఔత్సాహిక నటులకు సూచించారు.
సమాజం నుంచి ఎదురయ్యే విమర్శల పట్ల ఉండే భయం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ విమర్శలను తట్టుకోవడం కూడా మరో ప్రధాన అడ్డంకిగా ఆయన వర్ణించారు. ‘‘సమాజం నుంచి ఎదురయ్యే విమర్శల ముప్పే అసలు సమస్య’’ అని అభిప్రాయపడ్డారు. నటనలో రాణించాలంటే ఇతరుల విమర్శలను ఎదుర్కొనేందుకు తగినట్టుగా తమను తాము సిద్ధం చేసుకోవాలని, ఎదుటివారు ఏమనుకుంటారో అని అతిగా ఆందోళన చెందకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉండాలని వివరించారు. కళాకారులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, ప్రజలతో మమేకం కావడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఆశయానికి అనుగుణంగా ఆచరణ ఉండాలని సచ్‌దేవ స్పష్టం చేశారు. తాము సాధించాలనుకుంటున్న ఉన్నత లక్ష్యాలకు తగినట్టుగా తమ రోజువారీ దినచర్య, అలవాట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సూచించారు. ఆశయాల స్థాయిని బట్టి దానికి తగిన సన్నద్ధత, క్రమశిక్షణ, నిబద్ధత అవసరమన్నారు. దీనికోసం శిక్షణ, శారీరక సన్నద్ధత, జీవనశైలితో పాటు రోజువారీ అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.
లక్ష్యానికి ఉన్న ప్రాధాన్యం గురించి సచ్‌దేవ వివరించారు. నటనా రంగాన్ని ఎంచుకొనేలా తమకు స్ఫూర్తినిచ్చిన కారణాలను ఓసారి గుర్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత అనుభవాలను బట్టి అవి మారుతూ ఉంటాయన్నారు. తన వ్యక్తిగత ప్రయాణం గురించి పంచుకున్నారు. ఆరంభంలో భావవ్యక్తీకరణ విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు... తన జీవిత లక్ష్యాన్ని ఎలా తీర్చిదిద్దాయో వివరించారు. ప్రజలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం, సృజనాత్మక శక్తిని అందించడమే తన లక్ష్యమని తెలియజేశారు. ‘ఎందుకు’ అనే ప్రశ్నతో ఔత్సాహిక కళాకారులు నిరంతరం అనుసంధానమై ఉండాలని సూచించారు. కేవలం ఆడిషన్లు, ఎంపికలు లేదా బయటి గుర్తింపుతోనే తమ ప్రయాణాన్ని అంచనా వేయకుండా కళ ద్వారా స్వీయ భావవ్యక్తీకరణపై దృష్టి పెట్టాలని ఆయన ప్రోత్సహించారు.

నటనలో రాణించడానికి అవసరమైన వాటి గురించి పునఃపరిశీలించుకోవాలని ఈ మాస్టర్ క్లాస్ ప్రోత్సహించింది. భయాలను అధిగమించడం, తిరస్కరణలను అంగీకరించడం, సవాళ్లను స్వీకరించడం, ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవడం, ఆశయాన్ని నిరంతర కార్యాచరణగా మార్చడం లాంటివి నటుడిగా మారడానికి మాత్రమే కాకుండా కళారంగంలో అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి కూడా అవసరమని శ్రీ సచ్‌దేవ తెలియజేశారు.
Read IFFILOID here:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***