అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

ప్రైవేటు రంగ భాగస్వామ్యం జోరుతో 40–45 బిలియన్ డాలర్ల దిశగా భారత అంతరిక్షరంగ ఆర్థిక వ్యవస్థ: డాక్టర్ జితేంద్ర సింగ్


పదిలోపు అంకురసంస్థల నుంచి ప్రస్తుతం 400-500 అంతరిక్ష రంగ కంపెనీల స్థాయికి...

అంతరిక్ష రంగంలో చేపట్టిన సంస్కరణలతో అపూర్వ పురోగతి సాధించిన భారత అంతరిక్ష వ్యవస్థ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన అంతరిక్ష సంస్కరణలతో ప్రైవేటు పెట్టుబడులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం... స్వదేశీ సాంకేతిక సామర్థ్యాల వృద్ధికి మార్గం సుగమం

పీఎం గతిశక్తితో మెరుగైన మౌలిక సదుపాయాలు, సకాలంలో పూర్తవుతున్న ప్రాజెక్టులు, ఖర్చులు ఆదా... వృథాలు, నిధుల లీకేజీలకు అడ్డుకట్ట

కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాలు, రైల్వేలు, రక్షణ రంగం, ప్రభుత్వ ప్రధాన పథకాలకూ ఊతమిస్తున్న అంతరిక్ష సాంకేతికత

పెట్టుబడులు మరింత పెంచాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా పరిశోధనాభివృద్ధికి తోడ్పడాలని, శాస్త్రీయ దాతృత్వాన్ని బలోపేతం చేయాలని పరిశ్రమలకు కేంద్ర మంత్రి పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 5:13PM by PIB Hyderabad

ప్రస్తుతం సుమారు 9 బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, రాబోయే దశాబ్ద కాలంలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని... కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. దేశ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ భారీ మార్పునకు ప్రైవేట్ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన ఐదో 'ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాన్‌క్లేవ్-2026' సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ... కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే భారత అంతరిక్ష రంగం పది లోపు అంకురసంస్థలు కలిగిన స్థాయి నుంచి దాదాపు 400 నుంచి 500 కంపెనీలకు విస్తరించిందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు దేశంలోని అపారమైన పారిశ్రామికవేత్తల ప్రతిభను, సాంకేతిక సామర్థ్యాలను ఏ విధంగా వెలికితీశాయో ఈ వృద్ధి నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సు... 'ఆవిష్కరణలు, పాలన, మానవ సామర్థ్యం, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అంతరిక్ష భవిష్యత్తుకు రూపకల్పన' అనే ఇతివృత్తంతో సాగింది. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న భారత్ పాత్రపై చర్చించేందుకు పరిశ్రమ దిగ్గజాలు, అంతరిక్షరంగ అంకురసంస్థలు, పరిశోధకులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ వేదికగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'స్పేస్ ఎకానమీ 2036: ది ఇండియా బ్లూప్రింట్' నివేదికనూ ఆవిష్కరించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ వి. నారాయణన్, ఇన్‌-స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ గోయెంకా, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్ భట్ (రిటైర్డ్), అరుణ్ టి. రామచందాని సహా అంతరిక్ష రంగం, సాంకేతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ఏర్పాటు, ఇన్‌-స్పేస్ రూపకల్పన, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం వంటి నిర్ణయాలు భారత అంతరిక్ష ప్రస్థానంలో కీలకంగా నిలిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇటీవలి దశాబ్దాల్లో తీసుకున్న అత్యంత పరివర్తనాత్మక విధాన నిర్ణయాల్లో ఈ సంస్కరణలూ ఒకటని అభివర్ణిస్తూ... ఇవి సంప్రదాయ యథాతథ స్థితిని మార్చాయనీ, ఇప్పటివరకు ప్రధానంగా ప్రభుత్వ పరిధిలోనే ఉన్న ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలూ భాగస్వాములు కావడానికి వీలు కల్పించాయని ఆయన అన్నారు.

భారతీయ అంతరిక్షరంగ అంకురసంస్థల పురోగతిని ప్రస్తావిస్తూ... జూలై 18, 2026న స్కైరూట్ సంస్థ నిర్వహించిన తొలి లాంచ్ వెహికల్ ఫ్లైట్, దాని బహుళ-మిషన్ లాంచ్ అగ్రిమెంట్, ఆ సంస్థ సాధించిన యూనికార్న్ హోదాను కీలక మైలురాళ్లుగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. అగ్నికుల్, ఇతర సంస్థలు అభివృద్ధి చేస్తున్న అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మించిన రాకెట్ ఇంజన్లు, భూ పరిశీలన సాంకేతికతలు, ఉపగ్రహ చిత్రీకరణ సామర్థ్యాలు దేశంలో పెరుగుతున్న సాంకేతిక బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇతర పారిశ్రామిక రంగాల కంపెనీల భాగస్వామ్యం మరింత పెరగడమే ఈ సంస్కరణల వల్ల పుట్టుకొస్తున్న వాణిజ్య అవకాశాలకు నిదర్శనమని ఆయన అన్నారు.

అంతరిక్ష సాంకేతికత అందించే ఆర్థిక తోడ్పాటును కేవలం రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాల తయారీ, వాణిజ్యపరమైన ఆదాయాల ద్వారా మాత్రమే కాకుండా... క్షేత్రస్థాయిలో వివిధ రంగాల్లో సాధించిన పొదుపు, సామర్థ్యం, మెరుగైన ఫలితాల ఆధారంగానూ అంచనా వేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

'పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' ఉదాహరణను ఉటంకిస్తూ... అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లు మౌలిక సదుపాయాల ప్రణాళికలను మెరుగుపరచడానికి, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి, వృథాలను-నిధుల లీకేజీలను అరికట్టడానికి ఎంతగానో తోడ్పడతాయని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు, నిర్మాణం, కమ్యూనికేషన్, విద్య, ఆరోగ్య సంరక్షణ, రైల్వేలు, రక్షణ రంగం సహా దాదాపు ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అంతరిక్ష సాంకేతికత వినియోగం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా... అంతరిక్ష పరిశ్రమకు మరింత డిమాండ్‌ను ఎలా సృష్టించాలన్న ప్రశ్నకు డాక్టర్ జితేంద్ర సింగ్ ఇలా సమాధానమిచ్చారు. అంతరిక్ష సాంకేతికత ఆచరణాత్మక ఉపయోగాలపై తగినంత అవగాహన లేకపోవడమే డిమాండ్ తక్కువగా ఉందనే భావనకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. దీని సామర్థ్యం కేవలం రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ మిషన్లకే పరిమితం కాకుండా... మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్, ప్రజా సేవల పంపిణీలోనూ అపారమైన అవకాశాలను కలిగి ఉందని ఆయన అన్నారు. వివిధ రంగాల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని విస్తరించడానికి ప్రధానమంత్రి అనుసరిస్తున్న 'సమగ్ర ప్రభుత్వ విధానం', అంతర్-మంత్రిత్వ శాఖల సమన్వయం కీలక చోదకాలుగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వ్యూహాత్మక సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ సహకారాన్ని సమతుల్యం చేసుకోవడంపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ జితేంద్ర సింగ్ బదులిస్తూ... సాంకేతిక సార్వభౌమాధికారం, అంతర్జాతీయ భాగస్వామ్యం పరస్పర విరుద్ధమైనవి కాదని స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనకరమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉంటూనే... స్వదేశీ వనరులు, స్వదేశీ సాంకేతికత, స్వదేశీ ప్రాజెక్టులకు పెద్దపీట వేసే మార్గదర్శక విధానంతో భారత్ తన దేశీయ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ల కాలపరిమితితో 2023లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన 'నేషనల్ క్వాంటం మిషన్' కింద భారత్ సాధించిన పురోగతినీ కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎనిమిదేళ్లలో 2,000 కిలోమీటర్ల సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ లక్ష్యం నిర్దేశించుకోగా... కేవలం మూడేళ్లలోనే 1,000 కిలోమీటర్ల మైలురాయిని భారత్ అధిగమించిందని ఆయన తెలిపారు. అంతరిక్షం, క్వాంటం సాంకేతికతలు, సెమీకండక్టర్లు, అణు విజ్ఞానం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న రంగాలనీ... ఇవి సాంకేతిక పురోగతికి, వాణిజ్య వృద్ధికి అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అంతరిక్ష రంగంలో దేశీయ ప్రైవేట్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత పెంచాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. వేగంగా ఎదుగుతున్న భారత అంతరిక్ష వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు మరింతగా వచ్చేలా పరిశ్రమ దిగ్గజాలు చొరవ చూపాలని ఆయన ప్రోత్సహించారు. దేశంలో పరిశోధన, ఆవిష్కరణల బలోపేతం లక్ష్యంగా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' (ఏఎన్ఆర్ఎఫ్), 'రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్' (ఆర్‌డీఐ) నిధి వంటి సహాయక వ్యవస్థలనూ ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.

పరిశ్రమల యాజమాన్యాలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను పరిశోధన, శాస్త్రీయ అభివృద్ధికి మరింతగా వెచ్చించాలని కేంద్ర మంత్రి కోరారు. సీఎస్ఆర్ నిధులు కేవలం యంత్రాలు, మౌలిక సదుపాయాల ఖర్చులకే పరిమితం కాకుండా విస్తృత ప్రజానీకానికీ ప్రయోజనం చేకూర్చాలని ఆయన అన్నారు. దేశంలో 'శాస్త్రీయ దాతృత్వ' సంస్కృతిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిస్తూ... పరిశోధనలపై పెట్టే పెట్టుబడిని సమాజానికి, మానవాళికి చేసే ఒక అర్థవంతమైన సేవగా భావించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సదస్సులో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష ఆవిష్కరణల కూటమి, అంకురసంస్థల కోసం గ్లోబల్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ గ్రాండ్ ఛాలెంజ్‌ల ఏర్పాటుపై వచ్చిన సూచనలపైనా ఆయన స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో తన పాత్రను బలోపేతం చేసుకోవడానికి భారత్... ప్రపంచస్థాయి వ్యూహాలను, ప్రమాణాలను అందిపుచ్చుకోవాలన్నారు.  విస్తృతమైన అంతర్జాతీయ అంతరిక్ష సహకారాన్ని సంస్థాగతీకరించే అవకాశాలనూ పరిశీలించవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

అంతరిక్ష వ్యవస్థను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడం... విద్యార్థులు, యువ ఆవిష్కర్తల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై పరిశ్రమ ప్రతినిధులు చేసిన సూచనలను డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతించారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడానికి నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి, అవసరమైన విధానపరమైన మెరుగుదలలు చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

విధానపరమైన సంస్కరణలు, స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలు, ప్రైవేట్ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కృషితో భారత అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ పరివర్తన... ప్రపంచ స్థాయిలో పోటీపడే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడానికి బలమైన పునాది వేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 2341051) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil