నాడు పోస్టు చేయడమైనది:
24 NOV 2026 10:49AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పాదనల ఎగుమతి ప్రాధికార సంస్థ (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫూడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ.. ఏపీఈడీఏ.. ‘అపెడా’) ‘ఆసక్తిదారు వర్గాలతో చర్చాకార్యక్రమా’న్ని 2026 నవంబర్ 20న వారణాసిలో నిర్వహించింది.
ఎగుమతిదారులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యావసాయిక, శుద్ధి చేసిన ఆహార ఉత్పాదనల ఎగుమతులతో ముడిపడిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎగుమతులకు మార్గాన్ని సుగమం చేయడం, ప్యాకేజింగ్, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), మార్కెట్టు లభ్యత, నియంత్రణ సంబంధిత అవసరాలు, సంస్థాగత సహాయం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. సమావేశంలో పాల్గొన్న వారు ప్రస్తావించిన అంశాలకు ‘అపెడా’ అధికారులు జవాబులిచ్చారు. ఎగుమతి సంబంధిత సమస్యలను వారు పరిష్కరించారు. ప్రాంతీయ ఎగుమతిదారు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ఎక్కువ భాగస్వామ్యాన్ని చేజిక్కించుకొనేటట్లు చూడటానికి సాధ్యమైన సహాయక చర్యలన్ననిటిని తీసుకుంటామంటూ అధికారులు హామీని ఇచ్చారు.
కార్యక్రమాన్ని ‘అపెడా’ చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఘనీభూత పచ్చి బఠానీలు, వివిధ రకాల కాయగూరలతో కూడిన సరకును ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి కతర్కు ఎగుమతి చేసే ప్రక్రియను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన ఘట్టం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. శ్రీ లక్ష్మీ ఫ్రోజెన్ ఫూడ్స్ ఎగుమతి చేసిన ఈ సరకులో, 63 మెట్రిక్ టన్నుల ఘనీభూత పచ్చి బఠానీలతో పాటు వివిధ రకాల కాయగూరలు కూడా ఉన్నాయి. ఈ సరకును ఫరూఖాబాద్ నుంచి పంపించారు. నావ సేవ ఓడరేవు మార్గం గుండా ఈ కన్సైన్మెంటును కతర్లోని దోహాకు తరలించారు.
తొలిసారి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన సరకును ఉత్తరప్రదేశ్ లోని వ్యవసాయ ఎగుమతుల రంగంలో, మరీ ముఖ్యంగా విలువను జోడించి, గడ్డ కట్టించిన ఆహార పదార్థాల రంగంలో.. మరింత వైవిధ్యాన్ని తీసుకువచ్చే దిశగా ఓ కీలక ముందంజను ఈ పరిణామం సూచించింది. ఫరూఖాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకుకూరల ఉత్పాదనకు, ఆహార శుద్ధికి అనేక అవకాశాలున్నాయి. ఈ ఎగుమతి ఘట్టం ప్రాంతీయ వ్యవసాయ, ఆహార శుద్ధి కేంద్రాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను సంధానించే సామర్థ్యాన్ని చాటిచెప్పింది. దీంతో రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓస్), ఆహార శుద్ధి సంస్థలు, ఎగుమతిదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందిరానున్నాయి.
కార్యక్రమంలో ‘అపెడా’ చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ప్రసంగిస్తూ వ్యావసాయిక ఎగుమతులు, శుద్ధిపరిచిన ఆహార వస్తువుల ఎగుమతిని ప్రోత్సహించడానికి సభ్యత్వం పొందిన ఎగుమతిదారు సంస్థలకు అవసరమైన సహాయాన్ని అందించే విషయంలో ‘అపెడా’ నిబద్ధతతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. వ్యావసాయిక ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను, కార్యకలాపాలను బలోపేతం చేసే ఉద్దేశంతో భారత్ కృషి నిర్యాత్ యోజన (బీకేఎన్వై)ని ఇటీవల ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ‘భారతి’ పేరిట మరో కార్యక్రమాన్ని కూడా తమ సంస్థ చేపట్టిందని, ఎఫ్పీఓలకు సాధికారతను కల్పించడం, అవి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకొనేటట్లు చూడటం ఈ పథకం ఉద్దేశమని ఆయన అన్నారు.
ప్రపంచ మార్కెట్లలో భారతీయ వ్యావసాయిక ఉత్పాదనల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఎగుమతిదారు సంస్థలు, ఎఫ్పీఓలు, ప్రభుత్వ విభాగాలు, తదితర ఆసక్తిదారు వర్గాలు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ‘అపెడా’ చైర్మన్ స్పష్టం చేశారు. ఎగుమతిదారు సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, సంస్థాగత సహాయాన్ని పటిష్టపరచడానికి, ఎగుమతికి మార్గాన్ని సుగమం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఒక అవకాశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ‘అపెడా’, ఉత్తరప్రదేశ్ వ్యవసాయ విభాగం, ఈసీజీసీ, డీపీపీక్యూఎస్, ఏఐసీఎల్ఏఎస్ఎస్, తదితర సంబంధిత సంస్థలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఎగుమతిదారు సంస్థలు, ఎఫ్పీఓలు, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల ప్రతినిధులు కూడా ఉన్నారు.
ఆసక్తిదారు వర్గాలతో చర్చలు, మార్కెట్టు అభివృద్ధికి అమలుచేయాల్సిన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన పరంగా అందజేయవలసిన సహాయం, సామర్థ్యాల పెంపు ద్వారా ‘అపెడా’ భారత వ్యావసాయిక ఉత్పాదనలు, శుద్ది చేసిన ఆహర పదార్థాల ఎగుమతులను విస్తరించడానికి నిరంతర ప్రాతిపదికన సహకారాన్ని అందిస్తోంది. ఘనీభూత పచ్చి బఠానీలు, అనేక రకాల కాయగూరలతో కూడిన తొలి ఎగుమతి సరకును ఫరూఖాబాద్ నుంచి కతర్కు పంపడంతో ఉత్తరప్రదేశ్ వ్యావసాయిక ఎగుమతుల్లో వివిధీకరణను, భౌగోళిక లభ్యతను ప్రోత్సహించే దిశగా ఓ ముఖ్యమైన అడుగు వేశారని స్పష్టమవుతోంది.
***