గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా అస్సామీ ఫీచర్ చిత్రం సూర్జ్యముఖి చిత్ర దర్శకురాలితో విలేకరుల సమావేశాన్ని పీఐబీ నిర్వహించింది. ఈ సమావేశంలో దర్శకురాలు అంతారా జీజీ చౌదరి మాట్లాడారు. ఆకట్టుకొనే కథలను విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు ప్రాంతీయ దర్శకులు అందిస్తుండటంతో అస్సామీ సినిమా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందన్నారు.
ఉత్పల్ అనే బాలుడి కథతో ఈ సినిమా కథ సాగుతుంది. అతని జీవితాన్ని తిరిగి 40 ఏళ్ల తర్వాత చూపిస్తుంది. వ్యక్తి తీసుకొనే నిర్ణయాలు జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో, అవి ఎలాంటి శాశ్వత పరిణామాలకు దారి తీస్తాయో ఈ చిత్రంలో చూపించారు. గోవాలో జరుగుతున్న ఉత్సవంలో సూర్జ్యముఖి సినిమా వరల్డ్ ప్రీమియర్ను నవంబర్ 22న ప్రదర్శించారు.

తాను చేసే కళాత్మక ప్రయత్నాలపై సూర్యుడిపై తనకున్న ఆసక్తి ఎల్లప్పుడూ ప్రభావం చూపిస్తుందని చిత్ర దర్శకురాలు తెలియజేశారు. సూర్జ్యముఖి కథలోని సరళత్వం, చిత్రంలోని ప్రధాన పాత్ర తనను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. ఈ చిత్రంలోని అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువ అవుతాయని చౌదరి ధీమా వ్యక్తం చేశారు. అస్సామీ సినిమా రంగంలో వస్తున్న మార్పుల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ప్రాంతీయ చిత్ర నిర్మాణంలో నూతన సృజనాత్మక ఉత్సాహం, అవకాశాలు పెరుగుతున్నాయన్నారు.
తమ సినిమాను ప్రదర్శించేందుకు వేదికను కల్పించినందుకు ఇఫీ నిర్వాహకులకు చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రోత్సవంలో తమ సినిమాను ప్రదర్శించడం ఓ గొప్ప అనుభూతి అని చెప్పారు.
ఈ పత్రికా సమావేశానికి సమన్వయకర్తగా ఆకాశ్ నీల్ శర్మ వ్యవహరించారు.

పూర్తి విలేకరుల సమావేశాన్ని వీక్షించండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48