ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని వైశాలిలో సుమారు రూ. 34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

మరింత బలమైన, సుసంపన్నమైన, అవకాశాలతో నిండిన బీహార్‌ను మేం నిర్మిస్తున్నాం: ప్రధానమంత్రి

గంగా నదిపై నిర్మించిన ఆరు వరుసల దర్గా-బిదుపూర్ కేబుల్ వంతెనను ప్రజలకు అంకితం చేశాం.. నితీష్‌ గౌరవార్థం ఈ ఆధునిక వంతెనకు ‘నితీష్ సేతు’ అని నామకరణం చేశాం: ప్రధానమంత్రి

కోట్లాది మంది పేద ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, వారికి ప్రాథమిక సౌకర్యాలను కల్పించడానికి మేం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 5:09PM by PIB Hyderabad

బీహార్‌లోని వైశాలిలో సుమారు రూ. 34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఇందులో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా విశ్వాసానికి ప్రతీకైన మహత్తర పండుగ ఛత్ ఇప్పుడే ముగిసిందని.. ఆ సమయంలో తల్లులు, సోదరీమణులు తమ కుటుంబాలు, సమాజం, ప్రపంచ శ్రేయస్సు కోసం కఠినమైన నిర్జల ఉపవాసం ఆచరించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “ఇప్పుడు ఛఠీ మాత ఆశీస్సులతో ఇక్కడ మనం అభివృద్ధి పండుగను జరుపుకుంటున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య బలాన్ని ప్రజా సంక్షేమ మాధ్యమంగా మలుచుకుని ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ మంత్రంతో బీహార్ అభివృద్ధి ప్రస్థానం ముందుకు సాగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యానికి గొప్ప నెలవైన వైశాలిని సముచితంగా ఎంచుకున్నట్లు తెలిపారు. వైశాలితో పాటు బీహార్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తూ భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సుమారు మూడు దశాబ్దాల క్రితం బీహార్ ఆశ, విశ్వాసంతో కూడిన కొత్త మార్గాన్ని ఎలా ఎంచుకుందో గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనలో సుపరిపాలనకు సంబంధించిన కొత్త భరోసా ఏర్పడిందని, ప్రస్తుతం ఆయన ఆశీస్సులతో సామ్రాట్ చౌదరి ఆ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నితీష్ కుమార్ గౌరవార్థం ‘నితీష్ సేతు’ అని నామకరణం చేసిన గంగా ఆరు వరుసల దర్గా-బిదుపూర్ కేబుల్ వంతెనను జాతికి అంకితం చేయడంతో పాటు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ వంతెన పాట్నా, వైశాలి మధ్య దూరాన్ని, రాకపోకల ఇబ్బందులను తగ్గించడమే కాకుండా పంటలు, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగును ప్రధాన మార్కెట్లకు సులభంగా తరలించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంటూ దాని సామాజిక ప్రభావాన్ని ఆయన వివరించారు. “ఇక్కడి యువతకు విద్య సులభతరం అవుతుంది. వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ మరింత చేరువ అవుతుంది” అని ప్రధాని అన్నారు. 

బీహార్‌లో ఆధునిక రహదారి నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న తీరును ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని.. ఔరంగాబాద్-చోర్దాహా ఆరు వరుసల రహదారి ప్రారంభోత్సవంతో పాటు మరిన్ని ఇతర రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. “ఈ ప్రాజెక్టులపై వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

రహదారి నెట్‌వర్క్‌తో పాటు బక్సర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంతో పాటు పిర్‌పైంటి థర్మల్ విద్యుత్ కేంద్రం ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన, ఫుల్వారియా డ్యామ్ వద్ద సౌర విద్యుత్ కేంద్రం వంటి కీలక కార్యక్రమాల ద్వారా బీహార్ ఇంధన, పట్టణాభివృద్ధి ముఖచిత్రం వేగంగా మారుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర గతాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చిన ప్రధాని.. “ఒకప్పుడు బీహార్‌లోని వేలాది గ్రామాలకు విద్యుత్ చేరని రోజులు ఉన్నాయి. నేడు బీహార్ విద్యుత్ ఉత్పత్తికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది” అని అన్నారు.

పట్టణ రవాణాను సులభతరం చేయడానికి నేడు 100 ఆధునిక పీఎం ఈ-బస్సులను ప్రారంభించడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేలాది మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల తాళాలను అందజేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పురోగతిని ప్రధానమంత్రి స్వాగతించారు. “ఈ అభివృద్ధి పనులన్నింటికీ బీహార్ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

బీహార్ సుదీర్ఘ పరివర్తనా ప్రయాణాన్ని గుర్తుచేసిన ప్రధానమంత్రి.. నేడు దృష్టి పెట్టుబడులు, నేరస్థులపై కఠిన చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కోసం ఆరోగ్యకరమైన పోటీపై ఉందని పేర్కొన్నారు. “ఉత్తర బీహార్ కావచ్చు నలంద-గయా కావచ్చు షాహాబాద్-కైమూర్ కావచ్చు లేదా రాజధాని పాట్నా కావచ్చు.. ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ధికి సంబంధించిన కొత్త గాథ లిఖిస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్ వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా ప్రస్తుత ప్రభుత్వం కింద గత ఏడాది సాధించిన విజయాలను ఉదహరిస్తూ.. రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పెట్టుబడి ఒప్పందాలు, గయాలో రూ. 6,000 కోట్ల ఉక్కు ప్రాజెక్టు పనుల ప్రారంభం, మోతీహారి సహా మూతపడిన చక్కెర మిల్లుల పునరుద్ధరణకు కొత్త చెరకు ప్రోత్సాహక విధానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. వీటితో పాటు ప్రతి రైతు పొలానికి నీరు అందించడానికి 11,000 కొత్త ట్యూబ్‌వెల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం, సాగునీటికి 12 గంటల విద్యుత్‌ను ఖరారు చేసిన చారిత్రాత్మక నిర్ణయం, ఏడాదిలోనే 200కు పైగా కొత్త డిగ్రీ కళాశాలల ప్రారంభం, ఆడబిడ్డల కోసం మా సీతా మహిళా విశ్వవిద్యాలయానికి ఆమోదం వంటి అంశాలను ఆయన వివరించారు. “బీహార్ అభివృద్ధి జాబితా చాలా పెద్దది. ఏ వేదిక నుంచైనా దానిని పూర్తిగా లెక్కించలేం. ఇక్కడికి వస్తేనే బీహార్ అభివృద్ధిని అనుభూతి చెందగలరు” అని ఆయన పేర్కొన్నారు.

స్పష్టమైన సంకల్పం స్పష్టమైన ఫలితాలను ఇస్తుందన్న శ్రీ నరేంద్ర మోదీ.. తమ ప్రభుత్వం 12 ఏళ్లలో 50 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని తెలిపారు. “ఇది ప్రభుత్వ సంకల్పశక్తి ఫలితం..  పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలితం” అని ఆయన స్పష్టం చేశారు.

80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల ద్వారా కోట్లాది మంది బలహీన వర్గాల పౌరుల జీవన సౌలభ్యానికి, సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తోందని ప్రధానమంత్రి వివరించారు. కోట్లాది కుటుంబాలకు భద్రతా భావాన్ని కల్పిస్తున్న పక్కా ఇళ్లు, ఖరీదైన వైద్య చికిత్స భారాన్ని తొలగించే హామీతో కూడిన ఉచిత వైద్యం, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్న మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సదుపాయాల ద్వారా ఏర్పడిన పరివర్తనను ఆయన  ప్రముఖంగా ప్రస్తావించారు.  “దీని కారణంగా గతంలో పేదలుగా ఉన్న వారిలోనూ ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. వారు పేదరికాన్ని జయించి ముందుకు సాగారు” అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ చేరవేసి అమలు చేసిన తీరు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ కృషితో పేదరిక నిర్మూలనలో బీహార్ పోషించిన ప్రధాన పాత్రను శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్‌లో 43 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు అందాయని, ఆగస్టులో మరో 11 లక్షల ఇళ్లకు ఆమోదం లభించిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 75 లక్షల మంది రైతులకు వేల కోట్ల రూపాయలు అందాయని, స్వయం సహాయక బృందాలకు మద్దతు ద్వారా 50 లక్షల మంది గ్రామీణ మహిళలు లఖ్‌పతి దీదీలుగా సాధికారత సాధించారని ఆయన తెలిపారు. “ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే నేడు బీహార్‌లోని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దేశం కూడా ఈ విజయాన్ని సాధించింది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

బీహార్ అపూర్వమైన అభివృద్ధి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. మిత్రపక్షాలన్నింటి మధ్య నిరంతర సంబంధాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇప్పుడు మనం ఆగకూడదు అలసిపోకూడదు. సమర్థవంతమైన, సుసంపన్నమైన, స్వావలంబన బీహార్‌ను నిర్మించడానికి మనమందరం నిరంతరం కలిసి పనిచేయాలి” అని ఆయన స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2340165) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam