నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2026 4:50PM by PIB Hyderabad
అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ చర్యలో భాగంగా సముద్ర తీర మార్గం ద్వారా 71.24 కిలోల భారీ హెరాయిన్ నిల్వలను శ్రీలంకకు అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భగ్నం చేసింది. కచ్చితమైన సమాచారం ఆధారంగా డీఆర్ఐ అధికారులు నిఘాను ముమ్మరం చేసి, 2026 నవంబర్ 17 - 18 తేదీల్లో చెన్నైలో సమన్వయంతో కూడిన ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ చర్యలో అక్రమ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరిని అరెస్టు చేశారు. 2026లో ఇప్పటివరకు దేశంలో నమోదైన అతిపెద్ద హెరాయిన్ స్వాధీనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
చెన్నై నుంచి సముద్ర తీర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు భారీ మొత్తంలో హెరాయిన్‌ను రవాణా చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన డీఆర్ఐ అధికారులు చెన్నైలో అనుమానిత వాహనంతో పాటు, దానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు.
వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, తెల్లటి రంగులో ఉన్న పొడి పదార్థంతో కూడిన 69 ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి మొత్తం బరువు 71.24 కిలోలుగా నమోదైంది. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ హెరాయిన్ నిల్వలను చెన్నైని రవాణా కేంద్రంగా ఉపయోగించుకుని, తిరుచిరాపల్లి (తిరుచ్చి) మీదుగా సముద్ర తీర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు నిందితులు ప్రయత్నించారు.
నిషేధిత మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న ఇద్దరిని 1985 ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఈ ఆపరేషన్ ద్వారా భారీ మొత్తంలో హెరాయిన్‌ను అంతర్జాతీయ అక్రమ మాదకద్రవ్యాల మార్కెట్‌లోకి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సరిహద్దులు దాటి సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛేదించడంలో కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా చేపట్టే కార్యాచరణ ప్రాధాన్యతను ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఈ కీలక స్వాధీనం, ఇటీవల డీఆర్ఐ చేపట్టిన మరో ప్రధాన చర్యకు కొనసాగింపుగా నిలిచింది. 2026 అక్టోబర్‌లో నాగపట్నం సమీపంలోని ఓ తీర గ్రామం నుంచి శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్న 137 కిలోల మెథాంఫెటమిన్ నిల్వలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా చేపట్టిన ఈ ఆపరేషన్లు, అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని సేకరించడంలో డీఆర్ఐకున్న సామర్థ్యాన్ని, నిరంతర నిఘాను, భారీ మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యాల నిల్వలను గుర్తించి అడ్డుకునేందుకు సంస్థ కలిగి ఉన్న కార్యాచరణ సంసిద్ధతను స్పష్టం చేస్తున్నాయి.
***