శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2026’ సన్నాహ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శ్రీకారం


యువతరానికి.. అంకుర సంస్థలకు సాధికారత దిశగా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి చేర్చాలని పిలుపు

“ఇండియాస్ సైన్స్-వరల్డ్స్ ఫ్యూచర్’ ఇతివృత్తంగా డిసెంబరు 19-22 తేదీల్లో 5 ప్రసిద్ధ పరిశోధన-విద్యా ప్రాంగణాల్లో 12వ ‘ఐఐఎస్‌ఎఫ్‌’కు పుణె ఆతిథ్యం

“ప్రధానమంత్రి మోదీ ప్రబోధిత ‘విశ్వబంధు భారత్’ కింద ‘ఐఎస్ఎస్’లో దేశీయ జీవశాస్త్ర ప్రయోగాల నుంచి అత్యాధునిక బయోటెక్ దాకా యావత్‌ మానవాళికీ పరిష్కారాల ఆవిష్కరణ”

న్యూఢిల్లీలో ‘ఈఎస్‌టీఐసీ విద్యా సదస్సు’.. దేశవ్యాప్తంగా ప్రజా కేంద్రక ‘ఐఐఎస్‌ఎఫ్‌’ల రూపంలో జాతీయ సైన్స్ కేలెండర్‌ను భారత్‌ రెండు విభిన్న కీలక పునాదులపై పునర్నవీకరించింది”

“పుణెలో భారీ సదస్సుకు ముందు విజ్ఞాన భారతి (వీఐబీహెచ్‌ఏ-విభా) ద్వారా దేశంలోని 13 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం”

“విద్యార్థులు.. మహిళలు.. రైతులు.. పారిశ్రామికవేత్తలను ప్రయోగశాలలతో అనుసంధానిస్తుంది”

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 6:00PM by PIB Hyderabad

  కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞాన శాస్త్ర (స్వతంత్ర బాధ్యత), సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖలు సహా ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో 12వ ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2026’ (ఐఐఎస్‌ఎఫ్‌) సన్నాహకాల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ వెబ్‌సైట్, కరదీపికలను కూడా ఆయన ఆవిష్కరించారు.

విజ్ఞాన భారతి (విభా) సహకారంతో శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ఈ ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ శ్రీ అజయ్ కుమార్ సూద్, డీబీటీ కార్యదర్శి డాక్టర్ శ్రీ రాజేష్ ఎస్.గోఖలే, ‘విభా’ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శ్రీ శివ్‌కుమార్ శర్మ వేదికనలంకరించారు.

శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన విభాగం (డీఎస్‌ఐఆర్‌) కార్యదర్శి-సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ శ్రీమతి ఎన్.కలైసెల్వి, డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీ ఉమేష్ వి.వాఘ్మారే, పుణెలోని బ్రిక్–నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్‌) కార్యదర్శి-డైరెక్టర్ డాక్టర్ శ్రీ థామస్ ప్యుకాడిల్ సహా సీనియర్ శాస్త్రవేత్తలు, సంస్థాగత డైరెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ- “భారత్‌ శాస్త్ర విజ్ఞానం-ప్రపంచ భవిష్యత్తు” ఇతివృత్తంగా డిసెంబరు 19-22 తేదీల్లో 12వ ‘ఐఐఎస్‌ఎఫ్‌-2026’కు పుణె ఆతిథ్యమిస్తుందని మంత్రి తెలిపారు. యావత్ మానవాళి సంక్షేమానికి దోహదం చేసే భారత శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రబోధిత ‘విశ్వ బంధు భారత్’ దార్శనికతకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. ఇది నినాదం స్థాయిలో మిగిలిపోకుండా ఇప్పటికే ఆచరణరూపం దాల్చిందని చెప్పారు. బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) రూపొందించిన దేశీయ పరిశోధన సరంజామాయే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు. ఈ సరంజామాను భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి కూడా తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్వర్తించిన ప్రయోగాత్మక ఫలితాలు యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. వికసిత భారత్-2047 దిశగా ప్రస్థానంలో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భారతీయ విజ్ఞానం ప్రపంచ శాస్త్ర విజ్ఞానవరణ వ్యవస్థను మరింత విస్తృతం చేయగలదని విశ్వాసం వెలిబుచ్చారు.

భారత శాస్త్ర విజ్ఞాన కార్యకలాపాల్లో కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న వ్యూహాత్మక రూపాంతరీకరణను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సహా చెల్లాచెదరుగా, పదేపదే సాగే సదస్సులు, సమావేశాల స్థానంలో విభిన్న గుర్తింపుగల రెండు ప్రధాన జాతీయ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ఒక విస్పష్ట నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కేంద్రంలోని 13కు పైగా మంత్రిత్వశాఖలు, నోబెల్ బహుమతి గ్రహీతల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ఆధ్వర్యాన న్యూఢిల్లీలో ఇప్పటికే నిర్వహిస్తున్న “ఎమర్జింగ్ సైన్స్-టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్’ (ఈఎస్‌టీఐసీ) సరికొత్త అంశాలను అన్వేషించే ఒక విద్యాపరమైన సదస్సుగా నిలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇక ‘ఐఐఎస్ఎఫ్’ అంతర్జాతీయ ప్రాధాన్యంతో ప్రజలందరినీ ఆకట్టుకునే ఉత్సవ వాతావరణాన్ని తెస్తుంది. దీని వేదికను చండీగఢ్, హైదరాబాద్, గోవా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు మార్చడాన్ని ఉటంకిస్తూ, తొలిసారిగా పుణె నగరాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. తద్వారా ఈ పశ్చిమ ప్రాంత కేంద్రంలోని చైతన్యవంతమైన విద్యా-పరిశోధన-పారిశ్రామిక వ్యవస్థ సద్వినియోగం కాగలదన్నారు.

జీన్ ఎడిటింగ్, యాంటీబాడీలు, ఇన్సులిన్ ఉత్పత్తి నుంచి భావితరం ఇంధన వనరులు, వాస్తవ పరిమాణాన్ని మించిన సంలీన 3డీ కణం దాకా విస్తరించిన సంక్లిష్ట, భవిష్యత్ రంగాలను విభిన్న భాగస్వాములకు అనుగుణంగా రూపొందించిన ఆకర్షణీయ రూపంలో వివరించడమే ‘ఐఐఎస్‌ఎఫ్‌-2026’ రూపకల్పన ఉద్దేశమన్నారు. విద్యాసంబంధ ప్రసంగాలకు అతీతంగా 2001 నోబెల్ గ్రహీత సర్ టిమ్ హంట్ ప్రత్యేక ఉపన్యాసం సహా  బీ2బీ సమావేశాలు, హ్యాకథాన్‌లు, సైన్స్ సఫారీల ద్వారా పిల్లలు, యువత, మహిళలు, ప్రస్తుత-వర్ధమాన అంకుర సంస్థలు, పరిశ్రమలకు ఈ వేడుక ప్రత్యేకంగా బాటలు వేస్తుంది. తద్వారా యువతరం తమ సామర్థ్యాలను వెలికితీసి, ఆలోచనలను వ్యవస్థలుగా మార్చగలరని పేర్కొన్నారు.

“ఏకోన్ముఖ ప్రభుత్వ, విజ్ఞాన, జాతీయ, సమగ్ర సమాజం” విధానాన్ని సమర్థించిన ‘విభా’తో పాటు డాక్టర్ శివకుమార్ శర్మను ప్రశంసించారు. పుణె ఉత్సవానికి ముందు చెన్నై, కోల్‌కతా, డెహ్రాడూన్, తిరువనంతపురం, పుణె, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఇంఫాల్, ఇండోర్, మొహాలీ, అహ్మదాబాద్ సహా 13 నగరాల్లో సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ దిశగా ‘విభా’ కీలక పాత్ర పోసించడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు. భారత విజ్ఞాన గాథను దేశం నలుమూలలకూ తీసుకెళ్లేందుకు మీడియా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా పుణె నగరానికి కూడా రావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ- ‘ఐఐఎస్‌ఎఫ్‌-2026’ను ఒక విశిష్ట విజ్ఞాన వేడుకగా అభివర్ణించారు. యువతను శాస్త్ర విజ్ఞాన రంగంలోకి తేవడం, పరిశోధన ప్రయోగశాలలకు అతీతంగా ప్రజల చైతన్యంలో శాస్త్రీయ దృక్పథాన్ని పాదుకొల్పడం లక్ష్యంగా నిర్వహించే సామూహిక జాతీయ  కృషికి ఇది ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. “భారత్‌ శాస్త్ర విజ్ఞానం-ప్రపంచ భవిష్యత్తు” ఇతివృత్తాన్ని, భారత ప్రాచీన ‘వసుధైవ కుటుంబకం’ తత్త్వంతో ప్రొఫెసర్ సూద్ అనుసంధానించారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ నుంచి సార్వజనీన డిజిటల్‌ మౌలిక సదుపాయాల (డీపీఐ) దాకా స్వదేశీ ఆవిష్కరణలను విస్తృతంగా పంచుకోవడానికి భారత్‌ పలుమార్లు సంసిద్ధత వెలిబుచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వికసిత భారత్ కోసం అత్యాధునిక, ప్రజోపయోగ ఆవిష్కరణలకు యువతరం ముందడుగు వేసే విధంగా ‘ఐఐఎస్ఎఫ్-2026’తో పెల్లుబికే ఉత్సాహం స్ఫూర్తినిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన డీబీటీ కార్యదర్శి డాక్టర్ శ్రీ రాజేష్ ఎస్.గోఖలే మాట్లాడుతూ- ‘ఐఐఎస్ఎఫ్’కు 2015లో శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇది ప్రజా కేంద్రకంగా నిలిచిందని పేర్కొన్నారు. జిజ్ఞాసపరులైన విద్యార్థులు, స్ఫూర్తిదాయకులైన ఉపాధ్యాయులు, చిన్న పట్టణాల ఆవిష్కర్తలు సహా నిత్యం భూసార ఇంజనీరింగ్ చేసే రైతులను ఇది మమేకం చేస్తోందని తెలిపారు. సమాజం, ప్రభుత్వం, విపణులను విజ్ఞాన శాస్త్రంతో ముడిపెట్టే వేదిక కావడం ‘ఐఐఎస్ఎఫ్’ మూల రూపమని చెప్పారు. ఇందులో సామాజిక అవసరాలు పరిశోధనకు మార్గనిర్దేశం చేస్తే, ఆవిష్కరణకు ప్రభుత్వం సాధికారత కల్పించడం ద్వారా వాటిని మార్కెట్లు ప్రజా ప్రయోజనాలుగా మారుస్తాయని వివరించారు. ప్రస్తుత 12వ ‘ఐఐఎస్ఎఫ్-2026’లో అణుశక్తి విభాగం, నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) సహా కీలక విజ్ఞానశాస్త్ర విభాగాలు కూడా పాలుపంచుకుంటున్నాయని డాక్టర్ గోఖలే తెలిపారు.

ఈ సందర్భంగా పుణె నగర సమీపంలోని ఐదు ప్రాంగణాల్లో “ఒకే దేశం-ఒకే విజ్ఞాన ఉత్సవం” నినాదంతో నిర్వహించనున్న ఐఐఎస్‌ఎఫ్‌-2026 సన్నాహక కార్యక్రమాల సమగ్ర బృహత్ప్రణాళికను ‘బ్రిక్స్‌-ఎన్‌సీసీఎస్’ డైరెక్టర్ డాక్టర్ శ్రీ థామస్ ప్యుకాడిల్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌సీసీఎస్‌, సీఎస్‌ఐఆర్‌–నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్‌సీఎల్‌), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌) పుణె, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), సీఓఈపీ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

‘ఐఐఎస్‌ఎఫ్‌-2026’ కింద 7 కేంద్ర మంత్రిత్వశాఖలు-విభాగాలు, 16 జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 17 కార్యక్షేత్రాలలో నాలుగు రోజుల పాటు 26 కార్యక్రమాలు నిర్వహిస్తారు. బయో-ఈ3 విధానానికి అనుగుణంగా బయో మాన్యుఫ్యాక్చరింగ్‌పై అంతర్జాతీయ సదస్సు, వైద్యులు-విద్యావేత్తల సదస్సు, 1,800 మంది విద్యార్థులతోపాటు 200 మంది ఉపాధ్యాయుల కోసం “ది న్యూ నలంద” ‘సైన్స్ అండ్ టెక్నాలజీ విలేజ్’, 1,200 మంది విద్యార్థుల కోసం విద్యార్థి-శాస్త్రవేత్తల గోష్ఠి, గురుకుల  ఉపాధ్యాయుల వర్క్‌షాప్, 8 జోన్ల సైన్స్ సఫారీ, చంద్రయాన్-3, గగన్‌యాన్, ఐఎన్ఎస్ విక్రాంత్, మిషన్ శక్తి సహా క్వాంటం, సెమీకండక్టర్లు, సముద్ర అగాధాన్వేషణ రంగాల జాతీయ మిషన్లను ప్రదర్శించే ‘పబ్లిక్ సైన్స్-టెక్నాలజీ-డిఫెన్స్-స్పేస్ ఎక్స్‌పో’ వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

పటిష్ట విధానం, ప్రపంచవ్యాప్త అవగాహన కార్యక్రమంలో ‘ఐఐఎస్ఎఫ్-2026’ వేడుక ముగుస్తుంది. ఈ క్రమంలో 150 సంస్థల అధిపతుల కోసం ‘విజన్ సంసద్’, సైన్స్ డిప్లొమసీ కాంక్లేవ్, మూడు ఖండాలకు విస్తరించిన గ్లోబల్ ఎస్ అండ్‌ టి అలయన్స్, 150 ఎన్జీవోలతో నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ మీట్ (ఎన్ఎస్ఓఐఎం), నారీశక్తి, వైజ్ఞానిక, మరాఠా కోటల ఇంజనీరింగ్ వారసత్వాన్ని చాటిచెప్పే శివ్-దుర్గ్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అటుపైన విజన్ సంసద్ డిక్లరేషన్-2026, ఎన్ఎస్ఓఐఎం డిక్లరేషన్, బయో-డిప్లొమసీ భవిష్యత్‌ ప్రణాళిక సహిత సైన్స్ డిప్లొమసీపై ‘ఐఐఎస్ఎఫ్-2026’ స్టేట్‌మెంట్, బయో మాన్యుఫ్యాక్చరింగ్ కోసం భవిష్యత్‌ ప్రణాళిక, వంటి నిర్దిష్ట జాతీయ స్థాయి పత్రాల ప్రకటనతో పాటు మెంటరింగ్, ఇంక్యుబేషన్ దిశగా ఆశావహ విద్యార్థి ఆవిష్కరణలకు గుర్తింపునిచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

****


(రిలీజ్ ఐడి: 2338252) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil