కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్టుబడిదారుల ఫిర్యాదులు, క్లెయిము చేయని డివిడెండ్ వ్యవహారాల పరిష్కారానికి న్యూ ఢిల్లీలో ‘‘నివేశక్ శివిర్’’ను నిర్వహించిన ఐఈపీఎఫ్ఏ, సెబి

శిబిరంలో పాల్గొన్న 310కి పైగా ఇన్వెస్టర్లు, క్లెయిందారులు.. పెట్టుబడిదారు సేవలను పౌరుల చెంతకు చేర్చడమే శిబిరం లక్ష్యం

క్లెయిము చేయని డివిడెండ్లు, షేర్లు, ఐఈపీఎఫ్ఏ అపరిష్కృత క్లెయిములకు సంబంధించిన సమస్యలను
ఒకే చోట పరిష్కరించిన సింగిల్ విండో వేదికగా ఉపయోగపడిన శిబిరం

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 1:29PM by PIB Hyderabad

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఈబీఐ..‘సెబీ’)తో పాటు మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎమ్ఐఐస్) సహకారంతో ‘‘నివేశక్ శివిర్’’ (పెట్టుబడిదారుల శిబిరం) ను 2026 నవంబర్ 17న న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో గల జకారాండా హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) ఏర్పాటు చేసింది.
రోజంతా సాగిన ఈ శిబిరంలో క్లెయిందారులకు ముఖాముఖి పద్ధతిలో ఫిర్యాదుల పరిష్కారం, క్లెయిములకు సంబంధించిన సహాయాన్ని అందించడమే కాకుండా పెట్టుబడి సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్ర ముఖ్య అతిథి పాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఈపీఎఫ్ఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ సుమిత్ గర్గ్‌తో పాటు సెబీ, ఎమ్ఐఐలు, రిజిస్ట్రార్లు, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్ (ఆర్‌టీఏస్)కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  
పెద్ద సంఖ్యలో క్లెయిము చేయని డివిడెండ్ ఖాతాలను కలిగివున్న కంపెనీలు ఆర్‌టీఏలతో కలిసి శిబిరంలో పాలుపంచుకున్నాయి. శిబిరంలో ఐఈపీఎఫ్ఏ, సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్‌డీఎల్, సీడీఎస్ఎల్, ఎమ్‌యూఉఎఫ్‌జీ ఇన్‌టైమ్, కేఫిన్ టెక్నాలజీస్, సీఏఎమ్ఎస్, బిగ్‌షేర్ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జేకే లక్ష్మీ సిమెంట్ సంస్థల ప్రతినిధులు క్లెయిందారులకు సహాయాన్ని అందించారు. శిబిరంలో ప్రత్యేకంగా నెలకొల్పిన సేవా కేంద్రాల ద్వారా 6 నుంచి 7 సంవత్సరాలుగా క్లెయిము చేయని డివిడెండ్లు, షేర్లకు సంబంధించిన వ్యవహారాలలో నేరుగా సహాయాన్ని అందించారు. దీనికి తోడు, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయడం, నామినేషన్ ప్రక్రియతో ముడిపడిన నవీన సమాచారాన్ని సేకరించడమే కాకుండా, అపరిష్కృత క్లెయిములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పూర్తి ప్రక్రియలో మధ్యవర్తుల అవసరం లేకుండా చూశారు.
శ్రీ హర్ష్ మల్హోత్ర కార్యక్రమంలో ప్రసంగిస్తూ, పౌరుల డబ్బును అసలైన హక్కుదారులకు తిరిగి ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సమాచార ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అన్ని సహాయ కేంద్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన అనేక మంది క్లెయిందారులతో సంభాషించారు. వారి ఫిర్యాదులను, సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తరఫు నుంచి నిరంతర సహకారం అందిస్తామంటూ హామీని ఇచ్చారు.
ఇన్వెస్టర్లలో ప్రతి వర్గం చెంతకు చేరుకోవాలని ఐఈపీఎఫ్‌ఏ చేస్తున్న ప్రయత్నాలను శ్రీ మల్హోత్ర ప్రశంసించారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం మాత్రమే కాక రాబోయే కాలంలోనూ కొనసాగుతుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 62,700 కన్నా ఎక్కువ క్లెయిములకు ఆమోదం తెలిపినట్లు, మునుపటి శిబిరాల్లో 2,500కు పైగా పెట్టుబడిదారులకు వ్యక్తిగత సహాయాన్ని అందించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఈ విధమైన శిబిరాలను దేశంలో మరిన్ని నగరాల్లో నిర్వహిస్తామన్నారు.
ఐఈపీఎఫ్ఏ మరో కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ‘నివేశక్ దీదీల’తో కూడా శ్రీ హర్ష్ మల్హోత్ర భేటీ అయ్యారు. ప్రాంతీయ స్థాయిలో పెట్టుబడిదారులలో చైతన్యాన్ని పెంపొందింప చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.  దీనిలో ప్రత్యేకించి మహిళలకు సాధికారత కల్పనపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులలో అవగాహనను పెంచడానికి ‘నివేశక్ దీదీలు’ అందిస్తున్న తోడ్పాటును గుర్తిస్తూ సహాయ మంత్రి వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.
నివేశక్ శివిర్ కార్యక్రమాన్ని పుణే, హైదరాబాద్, అమృత్‌సర్, జైపూర్, బెంగళూరు, భువనేశ్వర్, భోపాల్‌ల తరువాత ఎనిమిదో నగరం న్యూఢిల్లీలో నిర్వహించారు. నివేశక్ శివిర్‌ కార్యక్రమాన్ని మొదటిసారి 2025లో ఏర్పాటు చేశారు.
ఐఈపీఎఫ్ఏ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారు సంబంధాల కార్యక్రమాలలో ఢిల్లీ నివేశక్ శివిర్ ఒక భాగం. దీని ద్వారా ఆయా క్లెయిం చేయని పెట్టుబడులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నగరాలల్లో పౌరులకు నేరుగా సహాయాన్ని అందిస్తారు. ఈ శిబిరాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచడం, వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, దేశ ఆర్థిక విస్తారిత అనుబంధ వ్యవస్థలో పారదర్శకత్వాన్ని, నమ్మకాన్ని పెంచాలన్న ఐఈపీఎఫ్ఏ నిబద్ధతను చాటి చెబుతున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2337977) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil