శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 5:03PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటలీలోని ట్రియెస్టేలో అంతర్జాతీయ జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధునాతన పరిశోధన సదుపాయాలను సమీక్షించడం తో పాటు, కేంద్రం ఉన్నతాధికారులు, భారతీయ పరిశోధకులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ బయోటెక్నాలజీ పరిశోధన, శాస్త్రీయ శిక్షణ, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో భారత్ భాగస్వామ్యం క్రమంగా విస్తరిస్తున్న తీరును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
భారత ప్రతినిధి బృందం సభ్యుల సమక్షంలో ఐసీజీఈబీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ లారెన్స్ బ్యాంక్స్ కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ బయోటెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ ఉత్పత్తి, శిక్షణ కేంద్రాన్ని, నూతన బయోసేఫ్టీ లెవల్ - 3 ప్రయోగశాలను, ఫంక్షనల్ సెల్ బయాలజీ ప్రయోగశాలలోని హై - త్రూపుట్ స్క్రీనింగ్ సదుపాయాన్ని సందర్శించారు. అనంతరం ఐసీజీఈబీ ఉన్నతాధికారులు, అక్కడ పనిచేస్తున్న భారతీయ పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ పర్యటన ద్వారా దేశంలోని బయోటెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణల వ్యవస్థకు ఐసీజీఈబీ భారత విభాగం అందిస్తున్న విశేష సేవలను ప్రస్తావించే అవకాశం లభించింది. ముఖ్యంగా భారత్ రూపొందించిన బయోఈ3 విధానానికి అనుగుణంగా చేపడుతున్న పరిశోధనలు, కార్యక్రమాలను వివరించారు. జీవ ఆధారిత రసాయనాలు, ఎంజైమ్‌లు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, కార్బన్ సంగ్రహణ, వినియోగం, నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేసే బయోథెరప్యూటిక్స్, సముద్ర, అంతరిక్ష రంగాల్లో జీవ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి కీలక అంశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
సందర్శనకు వచ్చిన ప్రతినిధి బృందానికి ప్రదర్శించిన పరిశోధన కార్యక్రమాల్లో, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన సూక్ష్మజీవుల ఆధారిత బయోమాన్యుఫ్యాక్చరింగ్ కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన బయోఫౌండ్రీ ప్రధానమైనది. ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగపడే ఎంజైమ్‌లు, ఈస్ట్ వ్యవస్థలపై పరిశోధన, జీవసంబంధ కార్బన్ సంగ్రహణ, జన్యు మార్పులు చేసిన పంటలు, అంటువ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి వంటి అంశాలను కూడా ప్రదర్శించారు. భారత్‌లోని ఐసీజీఈబీ నెట్‌వర్క్ ద్వారా విస్తృత స్థాయిలో జరుగుతున్న బయోటెక్నాలజీ పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి ఈ కార్యక్రమాలు అద్దం పడుతున్నాయి.
అంతర్జాతీయ జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కేంద్రం (ఐసీజీఈబీ) జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, జీవ విజ్ఞాన శాస్త్రాల్లో అధునాతన పరిశోధన, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని ప్రోత్సహించే అంతర్జాతీయ అంతర్ ప్రభుత్వ పరిశోధనా సంస్థ. ఇటలీలోని ట్రియెస్టే, న్యూఢిల్లీ, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లలో కేంద్రాలను కలిగి ఉన్న ఐసీజీఈబీ అంతర్జాతీయ నెట్‌వర్క్ ద్వారా పరిశోధన, శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలను అనుసంధానిస్తోంది.
ఐసీజీఈబీ కార్యకలాపాల్లో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. న్యూఢిల్లీలోని ఐసీజీఈబీ కేంద్రంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మానవ వనరుల అభివృద్ధికి భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) సహకారం అందిస్తోంది. భారత్‌లో ఈ కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల్లో మాలిక్యులర్ మెడిసిన్, టీకాలు, వ్యాధి నిర్ధారణ సాంకేతికతలు, వృక్ష బయోటెక్నాలజీ, జీవ ఇంధనం, జన్యు సవరణ సాంకేతికతలు వంటి అత్యాధునిక పరిశోధనా రంగాలు ఉన్నాయి.
అంతర్జాతీయ శాస్త్రీయ శిక్షణ, సహకారంలో కూడా ఐసీజీఈబీ న్యూఢిల్లీ కేంద్రం విశేషంగా కృషి చేస్తోంది. 2023 నుంచి 2026 మధ్య 22 దేశాలకు చెందిన 67మంది పరిశోధకులు ఈ కేంద్రంలో శిక్షణ పొందడం లేదా ప్రారంభించడం జరిగింది. జీవశాస్త్రంలో కృత్రిమ మేధ వినియోగం, ఔషధాల అభివృద్ధి, జన్యు సవరణ, కార్బన్ సంగ్రహణ, మైక్రోస్కోపీ, ఫ్లో సైటోమెట్రీ వంటి అంశాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లు, శాస్త్రీయ పరస్పర మార్పిడి కార్యక్రమాలు ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి.
పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల మధ్య శాస్త్రీయ సహకారానికి కూడా ఐసీజీఈబీ వేదికగా నిలుస్తోంది. ఉమ్మడి పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కార్యక్రమాల ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలతో కూడా ఈ సంస్థ సహకారాన్ని కొనసాగిస్తోంది.
బయోటెక్నాలజీ పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం, శాస్త్రీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం, పరిశోధన ఫలితాలను ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక ప్రక్రియలు, పర్యావరణ సుస్థిరత వంటి రంగాల్లో ఆచరణాత్మక సాధనాలుగా మలచడంలో భారత్ - ఐసీజీఈబీ భాగస్వామ్య ప్రాధాన్యతను ఈ పర్యటన స్పష్టం చేసింది.
ఐసీజీఈబీలో పనిచేస్తున్న భారతీయ పరిశోధకులతో కలిసి కేంద్ర మంత్రి వర్కింగ్ లంచ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, సీనియర్ శాస్త్రవేత్తలు, కేంద్రం పరిపాలనా అధికారులు పాల్గొన్నారు.
***